Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయోద్యమం, ఆంధ్ర జనసంఘం,
ఆంధ్ర మహాసభ వంటి సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగిన శాయిరెడ్డి మహాత్మా గాంధీ, భాగ్యరెడ్డి వర్మల ప్రభావంతో అస్పృశ్యత నిర్మూలనకు మిక్కిలి ఆచరణాత్మకంగా కృషి చేశారు. ఉచిత పాఠశాలలు, హాస్టళ్లు నెలకొల్పాడు. వయోజనులను చైతన్య పరచడానికి విద్య నేర్పి వారి కోసం 'తెలుగు పలుకు' పేరుతో నాలుగు వాచకాలు రాశారు. మద్యపానాన్ని రూపుమాపేందుకు, స్త్రీ విద్యను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేశాడు.
'రెక్కలు వచ్చిన పిట్ట - లెక్కలు వచ్చిన దిట్ట / లక్కసమానము - చిక్కరెవరికి' అంటూ లెక్కల అవసరాన్ని అత్యంత అందంగా చెప్పిన కవి గంగుల శాయిరెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా, మాడపాటి హనుమంతరావు పంతులు నేతృత్వంలో బాల సాహిత్య వికాసం కోసం పనిచేసిన సంస్థ బాల సాహిత్య రచనాలయం. ఈ రచనాలయంతో సన్నిహిత సంబంధాలు కలిగి పిల్లల కోసం రచనలు చేసినవారిలో బి.ఎన్.శాస్త్రి, తిగుళ్ళ వేంకటేశ్వరశర్మ, ఉత్పల సత్యనారాయణాచార్య, రాఘవా చారి (జ్వాలాముఖి), గంగుల శాయిరెడ్డి వంటి అనేకమంది మనకు కనిపిస్తారు. తెలంగాణలో గంగుల శాయిరెడ్ది 'కాపుబిడ్ద' గురించి తెలియని, లేదా చదవని పద్య ప్రేమికుడు ఉండడు. అంతటి గొప్ప కావ్యమది. దీని తెలంగాణ ఆధునిక 'ఎపిక్' అంటారు డా|| సుంకిరెడ్డి.
పద్యాన్ని అత్యంత ప్రౌఢంగా రాసి మెప్పించిన కవి గంగుల శాయిరెడ్డి పిల్లల కోసం అంతే సున్నితంగా గేయాలు రాసి పిల్లలతో తలలూపింపజేశారు. నేటి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం జీడికల్లు శివారు గ్రామమైన రామచంద్ర గూడెంలో విజయనామ సంవత్సర మార్గశిర మాసంలో (1890)లో గంగుల శాయిరెడ్డి వెంకటరెడ్డి, వెంకమ్మ దంపతులకు జన్మించగా ఆయనను చిన్నాన్న సీతారాంరెడ్డి దత్తత తీసుకున్నాడు. జాతీయోద్యమం, ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ వంటి సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగిన శాయిరెడ్డి మహాత్మా గాంధీ, భాగ్యరెడ్డి వర్మల ప్రభావంతో అస్పృశ్యత నిర్మూలనకు మిక్కిలి ఆచరణాత్మకంగా కృషి చేశారు. ఉచిత పాఠశాలలు, హాస్టళ్లు నెలకొల్పాడు. వయోజనులను చైతన్య పరచడానికి విద్య నేర్పి వారి కోసం 'తెలుగు పలుకు' పేరుతో నాలుగు వాచకాలు రాశారు. మద్యపానాన్ని రూపుమాపేందుకు, స్త్రీ విద్యను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేశాడు.
సామాజిక జీవితంలో భాగంగా తన రచనలు చేసిన శాయిరెడ్డి 1943లో పిల్లల కోసం రాసిన గేయాల సంపుటి 'మా వూరు'. ఇది 1959లో 'బాల సాహిత్య రచనాలయం, హైదరాబాదు' ద్వారా ప్రచురించబడింది. దీనిని బాల సాహిత్య ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రచురించింది. శాయిరెడ్డి వ్యవసాయ దారుడు. పంటల గురించి, పైరుల గురించి తెలిసినవారు. తన బాల గేయాల్లోనూ పిల్లల కోసం వీటిని అనేకం చెప్పారు. అందులోనూ పల్లెటూరుకు చెందిన వారు కాబట్టి ఆ పల్లె వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయో తన 'మా పల్లెటూళ్లవారి కోరిక' గేయంలో చెబుతారు. 'వనముల బెంచిన-వానలు కురియును / వానలు కురిసిన-వాగులు బారును' అంటారు. ఇంకా- 'కడపులు నిండిన - కండలు పెరుగును/కుంటలు నిండిన పంటలు పండును' అంటా తన కోరికను గేయంలో చెబుతారు.
మనకు పళ్ళు తోముకోవడం అనగానే పేస్ట్, బ్రష్లు గురుకు వస్తాయి. మనకంటే ముందుతరం వాళ్లకు వేపపుల్లతో తోమిన జ్ఞాపకం ఉంది. కానీ 'పండ్లుతోము సాధనములు' అనే శాయి రెడ్డి బాల గేయం చదివితే ఆశ్చర్యపోవడంతో పాటు ఆయనకు ప్రకృతిలోని వివిధ చెట్లపై వున్న జ్ఞానానికి ఫిదా అవ్వాల్సిందే.
'వేపపుల్లలో కానుగుపుల్లో- వేకువ జామున పట్టండి / పొట్టు దీసితె, పోవును సుగుణం - పొట్టే పండ్లకు గట్టి పట్టురా'
'తుమ్మపుల్లలో సండ్ర పుల్లలో-దొరికినప్పుడే తోమండి', 'పాలకొడిసెవీ, మేడివి, జువ్వివి-పాలున్నప్పుడు తోమండి'
ఉత్తరుణిద ఉత్తమమనిరి, మామిడిపుల్ల మధ్యరకంబు' అంటూ ఇంకా అనేక చెట్ల పుల్లల గురించి చెబుతారు. చిన్నప్పుడు మనం చదివిన 'వంకర టింకర ఓ' వంటి గేయాలు కూడా ఇలాంటివే కదా! పిల్లలకు, పెద్దలకు తన బాల గేయాల్లో చేయాల్సిన పనులను గురించి చెప్పిన శాయిరెడ్డి 'తెల్లవార ముందె లేవాలె' అని, తరువాత ఇంట్లో, బడిలో ఏమేమ చేయాలో సరళ సుందరంగా చెబుతారు. ఒక గేయంలో తన పల్లెటూరులోని చెట్లను, వాటి ఎదుగుదలను, అవిచ్చే పండ్లను గొప్పగా చెబుతారు. ఇంకా గ్రామీణ సంస్కృతికి పట్టుగొమ్మైన చేతి వృత్తులు గురించి కూడా చెబుతూ 'పనిముట్లన్నియె చెట్టేగా' అంటారాయన.
'తొలకరి విందులు' గేయంలో 'తొలకరించెను వానలే-పిలుపు వచ్చెను పెండ్లికీ/ఉరుములే వాయిద్యముల్ మెరుపులే దివిటీలురా' అంటాడు. మరో గేయం 'ఇల్లు, తల్లి, పిల్లలు'లో 'ఆవుల మందలు ఉన్నవి చూడు-అంబాయను ఆలేగల చూడు/ పాలు పిందెడు వారిని చూడు- పటువలు బుడ్లూ నింపిరి చూడు' అని వర్ణిస్తారు. 'మా కూరగాయలు'లో 'అమ్మమ్మా, మీ వూరికి వస్త / కమ్మని కూరలు పెడుతవా/ పులుసు కారమే పోస్తావా?'', 'చింత చిగురురా లేత పువ్వురా/చిన్నంగి ఆకుంటదిరా/సన్న పాయిలి గంగ పాయిలి/చక్కని కొయిగూరంటదిరా' అంటారు. 'కాపుబిడ్డ'తో అత్యంత ప్రతిభావంతంగా నిలిచిన శాయిరెడ్డి, బాలల కోసం చక్కని గేయాలు రాయడం అభినందనీయమే కాదు, బాలలకు అందించిన కానుక, తాయిలం.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548