Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజా జీవితాలకు చాలా దగ్గరగా ఉండే కథలతో సాగే చిత్రీకరణ, వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉంటూ సినిమా ద్వారా ప్రజా జీవితాలను రికార్డ్ చేసే ప్రయత్నం ఈ చిన్ని రాష్ట్రాలలో నిర్మించబడుతున్న సినిమాలలో ఎక్కువగా చూస్తాం. అందుకే మానవ జీవితంలోని సంఘర్షణలకు, సంస్కరణలకు దగ్గరగా ఉంటూ అక్కడి ప్రజా జీవితాన్ని అర్ధం చేసుకోవడాని ఉపయోగపడే సాహిత్యపు విలువలున్న కథల నుంచి అక్కడి సినిమా కథావస్తువును తీసుకుంటుంది. ఈ ప్రాంతపు సినిమాలు కళకు చేస్తున్న న్యాయం, సినిమాకిస్తున్న గౌరవం కమర్షియల్ సినిమాల వల్ల జరగదు అని ఖచ్చితంగా చెప్పగలం. దానికి ఉదాహరణగా చూపించడాని ఈ ఒక్క సినిమా చాలు.
''మణిపూర్'' ప్రాంతం నుంచి వచ్చిన సినిమాల గురించి మనకు పెద్దగా తెలియదు. మణిపురి భాషలో గొప్ప మహిళా రచయిత బినోదినీ దేవి. వీరు మణీపూర్ రజవంశానికి చెందిన వారు. రాచకరికపు జీవితాన్ని వదిలి సామాన్యురలిగా బ్రతుకుతూ ఎన్నో గొప్ప రచనలు చేసిన వ్యక్తి బినోదిని. మణిపూర్‌లో గ్రాడ్యుయేట్ అయిన మొదటి మహిళ కూడా ఈమె. వీరు రాసిన కథ ఆధారంగా తీసిన సినిమా ''ఇమాగి నింగ్థెమ్'' అరిబం శ్యాం శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మణిపూరి భాషలో ఒక గొప్ప చిత్రంగా చెప్తారు విశ్లేషకులు. మన దేశంలో అని భాషలలో వచ్చిన గొప్ప మహిళా చిత్రాలలో ఇది ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సినిమా కథ ముగ్గురు మహిళల చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు కూడా తమ జీవితాలను తమ ఆలోచనల అధారంగా జీవించారు తప్ప ఎక్కడా సమాజ ఒత్తిడికి లొంగరు. బలమైన వ్యక్తిత్వం ఉన్న ఈ ముగ్గురు స్త్రీలు ఎన్నో సాంప్రదాయపు ఒత్తిళ్ళను జయించి జీవించిన తీరును ఈ సినిమా కథగా మలచిన విధానం బావుంటుంది. సినిమా టెక్నికల్‌గా అంత గొప్పగా అనిపించదు. కాని విషయ పరంగా, పాత్రలను మలచిన తీరు అద్భుతంగా ఉంటుంది. 1981లో వచ్చిన ఈ సినిమా పేరుకి అర్ధం, ''నా కొడుకు నా వజ్రం'' ఇంగ్లీషులో వ్ీ ూఉచీ వ్ీ ూ=జుజ×ఉఖూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన మొదటి మణిపూరి చిత్రం కూడా ఇదే.
ధాని ఒక స్కూలు టీచర్‌గా ఉద్యగ భాధ్యతలు స్వీకరించడానికి చాలా దూరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరికి వెళుతుంది. తన ఊరికి దగ్గరగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే, లంచం అడిగారని, లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవడం తన ఆదర్శాలకు విరుద్దం అయిన కారణంగా దూరంగా ఏ సౌకర్యాలు లేని పల్లెటూరిలో ఉద్యోగాన్ని ఆనందంగా స్వీకరించి బైలుదేరుతుంది. అక్కడ గాంధార్ అనే వ్యక్తి ఆమెను కలుసుకుంటాడు. ఊరిలోకి తీసుకువెళ్ళి ఆమె ఉండడానికి చోటు చూపిస్తాడు. స్కూలుకి తీసుకుని వెళ్ళి పిల్లలకు ఆమెను పరిచయం చేస్తాడు. ఆ స్కూలులో థోయ్థోరు అనే ఒక చిన్న బక్కచిక్కిన పిల్లవాడు విద్యార్ధి. ఈ పిల్లవాని తాత ధాని ఇంటికి వచ్చి, అనారోగ్యం కారణంగా తన మనవడు ఎక్కువగా స్కూలుకు రాలేకపోవడంలో చదువులో చాలా వెనుకబడ్డాడని, అతనికి సాయత్రం పూట చదువు చెప్పి సహాయపడమని అడుగుతాడు. థానికి థోయ్థోరుని చూసినప్పటి నుంచి ప్రేమ కలుగుతుంది. ఆ అబ్బాయికి సాయంత్రం చదువు చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఆ పిల్లవానిపై ఆమెకు కలిగిన మమకారం ఆ అబ్బాయి కుటుంబ విషయాలను తెలుసుకోవలన్న కుతూ హాలాన్ని కలిగిస్తుంది. గాంధార్ని ఆ పిల్లవాని తల్లి తండ్రుల గురించి చెప్పమని అడుగుతుంది.
గాంధార్ థోయ్థోరు తల్లి మెంతొంబి తన బాల్య స్నేహితురాలని చెబుతూ ధానికి మెంతొంబి జీవిత కథ చెబుతాడు. థోయ్థోరు తండ్రి, ఆ పల్లెటూరిలోణి ఇన్స్పెక్షణ్ బంగళాలో అటెండెంట్‌గా పని చేస్తూ ఉంటాడు. అతని కూతురు మెంతొంబి అందమైనది, ధైర్య వంతురాలు, సొంత ఆలొచన ఉన్న అమ్మాయి. చిన్నప్పుడు గాంధార్, మెంతొంబి కలిసి ఊరంతా తిరిగేవారు. యుక్తవయసు వచ్చాక వారి మధ్య స్నేహం అలాగే ఉన్నా రోజూ కలవడం తగ్గిపోయింది. ఆ సమయంలో ఆ బంగళాలో కొన్నాళ్ళూ ఆఫీసు కోసం వచ్చి, అక్కడే ఉండిపోయిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మెంతొంబిని లోబర్చుకుంటాడు. అది ప్రేమని నమ్ముతుంది మెంతొంబి. అక్కడ నుండి ట్రాన్స్ ఫర్ అయ్యాక అతను వెళ్ళిపోతాడు. ఆమె గర్భవతి అని తెలిసి ఆ అఫీసర్ని కలిసి పరిస్థితి వివరిస్తాడు మెంతొంబి తండ్రి. బదులుగా అతను తన దగ్గర పని చేసే ఒక పేద ఉద్యోగిని మెంతొంబిని వివాహం చేసుకొమ్మని పంపిస్తాడు. మెంతొంబి దానికి నిరాకరిస్తుంది. బిడ్డను ప్రసవించి మరణిస్తుంది. అప్పటినుండి ఆ బిడ్డకు అన్నీ తానయి పెంచుతాడు మెంతోబి తండ్రి. ఈ కథ విని ధాని చాలా బాధపడుతుంది ఆ ఆఫీసర్ పేరు చెప్పమని గాంధార్ని అడుగుతుంది. ఎలాగ్ లేకారు ప్రాంతానికి చెందిన దీనాచంద్ర ఆ అఫీసర్ అని గాంధార్ చెబుతాడు. తన పినతల్లి కూతురు ఎకాషిని భర్తే ఆ ఆఫీసర్ అని తెలుసుకుంటుంది థాని. ఈ విషయం తెలిసి ఆమె ఊరుకోలేకపోతుంది. దీనాచంద్రను కలవడానికి అతని ఇంటికి వెళుతుంది. కాని దీనాచంద్ర ఏదో ట్రైనింగ్ కోసం వెళ్ళాడని, రావడానికి సమయం పడుతుందని చెబుతుంది ఏకాషిని. ధాని, ఏకాషినికి థోయ్థోరు గురించి చెబుతుంది. ఏకాషిని ముందు ఇది అబద్దం అంటుంది. ఈ కథను నమ్మదు. కాని ధాని వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా ఇది ధాని చెప్పిందంటే నిజం అయ్యే ఉంటుందని అర్ధం చేసుకుంటుంది.
థోయ్థోరుని కలవడానికి ఆ ఊరికి వస్తుంది ఏకాషిని. కాని థోయ్థోరు తాతతో ఎక్కడో వెళ్ళి ఉన్నందువలన కలవడం కుదరదు. గాంధార్ కూతురు కూడా చిన్నపిల్ల. ఏకాషిని ఎవరో తెలుసుకున్న గాంధార్ కుటుంబం ఆమెను థోయ్థోరు తల్లిగా ప్రస్తావించడంతో ఆ అమ్మాయి థోయ్థోరు ఊరు చేరగానే అతని తల్లి వచ్చి అతని కోసం వాకబు చేసిందని థోయ్థోరుకి చెబుతుంది. తల్లి కోసం కలవరిస్తున్న ఆ బిడ్డ వచ్చింది అమ్మే అని సంతోషిస్తాడు. తన తల్లి తనను తీసుకువెళ్ళడానికి మళ్ళీ వస్తుందని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రెండో సారి ఏకాషిని కొన్ని బట్టలు మిఠాయిలు తీసుకుని థోయ్థోరుని కలవడానికి వస్తుంది. ఆమె తల్లి అనే నమ్ముతాడు థోయ్థోరు. అమ్మ అని ఆమెను అల్లుకుపోతాడు. ఏకాషిని నగరాని బైలుదేరుతుంటే ఆమెను వెళ్ళోద్దని అడ్డుకుంటాడు. ఏకషినికి కూడా బిడ్డ బాధ అర్ధం అవుతుంది. కాని తప్పక తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నుండి థోయ్థోరు ఆ ఊరి రోడ్డు దగ్గర కూర్చుని తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. థోయ్థోరు తల్లి మీద బెంగతో జబ్బు పడతాడు. ఏకాషిని ఊరు వచ్చి బిడ్డ స్థితి చూసి అతన్ని తనతో తీసుకుని వెళుతుంది. డాక్టరుకి చూపించి థోయ్థోరుకి పూర్తిగా నయం అయ్యే దాకా సపర్యలు చెస్తుంది. థోయ్థోరు తాత తరువాత బిడ్డను తనతో తీసుకుని వెళ్లాలి అనుకున్నా పంపదు. బిడ్డను తనతో ఉంచుకుంటానని చెబుతుంది. ధాని కూడా ఇది సరైనపని కాదని చెప్పినా వినకుండా అక్కడే థోయ్థోరుని స్కూలు లో చేరుస్తుంది. ఆ తల్లి కొడుకులిద్దరి మధ్య బంధం గట్టిపడుతుంది.
ఈ లోగా దీనాచంద్ర ఇంటికి తిరిగి వస్తాడు. థోయ్థోరు ఎవరని ఏకాషిని అడుతుగాడు. ఆ బిడ్డపై ప్రేమతో తాను అతన్ని దత్తు తీసుకున్నానని చెబుతుంది ఏకాషిని, భార్యగా అన్ని సేవలు చేస్తూనే బిడ్డను తన దగ్గర నుంచి ఎవరూ దూరం చేయకుండా జాగ్రత్తపడుతూ ఉంటుంది. థోయ్థోరు జన్మ రహస్యం కూడా దీనాచంద్రకు చెప్పదు. థోయ్థోరు తాత ఒక సారి ఆ ఇంటికి వచ్చినప్పుడు దీనాచంద్రకు ఆ బిడ్డ ఎవరో తెలుస్తుంది. దీనాచంద్రకు థోయ్థోరు పట్ల విముఖత మాత్రమే ఉందని తెలుసుకున్న తాత తన మనవడిని తాను చూసుకోగలనని తండ్రిగా కూడా ప్రేమ చూపలేని వ్యక్తి ఇంట తన బిడ్డను ఉంచలేనని చెబుతాడు.
ఏకాషిని థోయ్థోరుకి కృష్ణుని వేషం వేసి గుడిలో నాట్యం చేయించాలని అనుకుంటుంది. థోయ్థోరుకి నాట్యం నేర్పించడానికి గుడికి తీసుకువెళుతుంది. థోయ్థోరు తాత బిడ్డను ఊరికి తీసుకువెళడానికి వచ్చాడని దీనాచంద్ర ఏకాషిని పిలవడానికి గుడికి వెళతాడు. ఇంటికి వచ్చిన ఏకాషిని భర్తపై విరుచుకు పడుతుంది. ఎట్టి పరిస్థితులలో తాను థోయ్థోరుని ఊరికి పంపనని, తన బిడ్డ, తనతోనే ఉంటాడని తెగేసి చెబుతుంది. ఆశ్చర్యంగా దీనాచంద్ర, థోయ్థోరు తాత చూస్తూ ఉండగానే తిరిగి థోయ్థోరుని గుడికి తీసుకువెళుతుంది. అక్కడ థోయ్థోరు నాట్యంలో, ఏకాషిని తప్పులు సవరిస్తూ ఉండటం దగ్గర సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో చూపించిన ముగ్గురు స్త్రీలు గొప్ప వ్యక్తిత్వం, ధైర్యం ఉన్న వాళ్ళు. ధాని లంచం ఇచ్చితన ఊరిలో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం వచ్చినా అది తన ఆదర్శాలకు విరుద్దం అని దూరంగా ఏ సౌకర్యాలు లేని పల్లెటూరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఆ చిన్న తాటాకు స్కూల్లో ఇష్టంగా పాఠాలు చెబుతుంది. తన అక్క భర్తే థోయ్థోరు తండ్రి అని తెలిసి ఊరుకోదు. అతన్ని ప్రశ్నించడానికి ఊరు వెళుతుంది. అక్కకు సంగతి చెబుతుంది. థోయ్థోరుకి అక్కకి మధ్య అనుబంధం గట్టిపడుతున్నప్పుడు ఇది ఎటువంటి సమస్యలకు దారి తీస్తుందో అని, చివరకు థోయ్థోరు మానసికంగా బాధపడవలసిన స్థితి వస్తుందేమో అని ఆందోళన చెందుతుంది. ఏకాషినిని అందుకే థోయ్థోరుని చేరదీసే ముందు ఆలొచించమని అడుగుతుంది. ఏకాషిని కొడుకు ఢిల్లీలో చదువుతున్నాడు, ఆ బిడ్డ పరంగా సమస్యలు రాకూడదని కోరుకుంటుంది. అందరి మంచి కోసం నిర్ణయాలు తీసుకోవాలని తపిస్తుంది.
మెంతొంబి దీనాచంద్రను ప్రేమిస్తుంది. ఇష్టపడే అతనికి లొంగిపోతుంది. కాని అతను తాను గర్భవతి అని తెలుసుకుని మరో మగాడిని తనతో పెళ్ళికి వప్పించి పంపించాడని విని అతన్ని పెళ్ళి చెసుకోవడాన్ని వ్యతిరేకిస్తుంది. అది అవమానంగా భావిస్తుంది. లోకం నిందకు భయపడి వివాహం చేసుకుంటానని వచ్చిన అతనితో జీవితం పంచుకోవడానికి సిద్దపడదు. బిడ్డను వివాహం కాని కన్యగానే కంటుంది. అలాగే మరణిస్తుంది.
ఏకాషిని కళా సాహిత్యాల పట్ల గౌరవం ఉన్న స్త్రీ. భర్త లేని సమయంలో నాట్యం, నాటకంతో సమయం గడుపుతూ ఉంటుంది. ధాని చెప్పినది ముందు నమ్మకపోయినా చివరకు ధాని వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తిగా తన భర్త వల్ల ఆ పొర పాటు జరిగే ఉంటుందని ఊహిస్తుంది. తన భాద్యతగా ఆ బిడ్డను చూడడానికి వస్తుంది. అమ్మా అని అమాయకంగా పిలిచిన ఆ బిడ్డ పిలుపు విన్నప్పుడు ఆమెకు తన కర్తవ్యం అర్ధం అవుతుంది. దీనాచంద్రకు భార్యగా ఆన్ని భాద్యతగా నెరవేరుస్తూనే ఒక తల్లిగా థోయ్థోరు భాద్యతను స్వీకరిస్తుంది. ఆ బిడ్డను తానే రక్షించుకోవాలని, ఆ బిడ్డ మనసు గాయపడకుండా చూసు కోవాలని, అవివాహితకు పుట్టిన సంతానంగా ఆ బిడ్డ సమాజంలో అవమానాలు పొందుతూ బ్రతికే స్థితి నుంచి రక్షించడం తన భాద్యత అని నిశ్చయించుకుంటుంది. భర్త చేయలేని పని తాను చేసి చూపిస్తుంది. ఆ బిడ్డకు అన్నీ తానయి మిగులుతుంది. ఆమె భాద్యతాయుతమైన స్త్రీతత్వం ముందు అందరూ ఓడిపోతాడు. అ తల్లీ బిడ్డల అనుబంధం చూసి తాత ఊరు వెళ్ళిపోతే, దీనాచంద్ర ఏం అనలేని స్థితిలో మౌనంగా చూస్తూ ఉండిపోతాడు.
29వ జాతీయ సినీ పురస్కారలలో ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు లభించింది. థోయ్థోరుగా నటించిన మాస్టర్ లేఖేంద్రకు ఉత్తమ బాల నటుడి పురస్కారం లభించింది. తల్లి ప్రేమ కోసం తపించిపోయే చిన్నవాడిగా లేఖేంద్ర అద్భుతమైన నటన కనబరిచాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా బినోదినీ రాసారు. భారతీయ సినిమాలో గొప్ప మహిళా పాత్రలలో ఏకాషిని ఒకటి. ఈ పాత్రలో నటించిన నటి పేరు రాషి. ఈమె మణీపూరి స్త్రీ నటీమణులలో గొప్ప పేరు పొందిన కళాకారిణి.
చిన్న రాష్ట్రాల నుంచి వచ్చే సినిమాల పట్ల అవగాహన లేక మనం వాటిని విస్మరిస్తాం కాని, ఈ ప్రాంతలలో నుంచి వచ్చే సినిమా అన్ని కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటుంది. ప్రజా జీవితాలకు చాలా దగ్గరగా ఉండే కథలతో సాగే చిత్రీకరణ, వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉంటూ సినిమా ద్వారా ప్రజా జీవితాలను రికార్డ్ చేసే ప్రయత్నం ఈ చిన్ని రాష్ట్రాలలో నిర్మించబడుతున్న సినిమాలలో ఎక్కువగా చూస్తాం. అందుకే మానవ జీవితంలోని సంఘర్షణలకు, సంస్కరణలకు దగ్గరగా ఉంటూ అక్కడి ప్రజా జీవితాన్ని అర్ధం చేసుకోవడాని ఉపయోగపడే సాహిత్యపు విలువలున్న కథల నుంచి అక్కడి సినిమా కథావస్తువును తీసుకుంటుంది. ఈ ప్రాంతపు సినిమాలు కళకు చేస్తున్న న్యాయం, సినిమాకిస్తున్న గౌరవం కమర్షియల్ సినిమాల వల్ల జరగదు అని ఖచ్చితంగా చెప్పగలం. దానికి ఉదాహరణగా చూపించడాని ఈ ఒక్క సినిమా చాలు.
- పి.జ్యోతి, 9885384740