Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక ప్రపంచం ఎన్ని అంగులు అద్దుకున్న ఈ జాతరలో మాత్రం పురాతన గిరిజన సంస్కృతి సంప్రదాయాన్నీ కండ్లకు కట్టినట్టు చూపించి 15 రోజుల పాటు జరిగే భారతదేశ అతిపెద్ద గిరిజనుల పండగ నాగోబా జాతర.
అది ప్రకృతిని కొలిచే పండగ, ఆదివాసీల ఆత్మీయులకు అది వేడుక, అడవితల్లి ఒడిలో చెట్ల నిడలలో సేద తీరే ఓ గిరిజన పండగ. ఆదివాసుల ఆత్మీయ పాలకరింపులకు, ఆచార్య వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రకృతి ని పూజించి పర్యావరణంను కాపాడి భవిష్యత్ తరాలకు సందేశం ఇచ్చే జాతర. ఆధునిక ప్రపంచం ఎన్ని అంగులు అద్దుకున్న ఈ జాతరలో మాత్రం పురాతన గిరిజన సంస్కృతి సంప్రదాయాన్నీ కండ్లకు కట్టినట్టు చూపించి 15 రోజుల పాటు జరిగే భారతదేశ అతిపెద్ద గిరిజనుల పండగ నాగోబా జాతర.
ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఉంది. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. అక్కడున్న ఏడుగురు దేవతలను కొలిచే మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గల వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు.
ఏడాదికి ఒక్కసారి బంధువులను కలుసుకోవడంతో పాటు కొత్త సంవత్సరంకు స్వాగతం పలకడం, పితృ దేవుళ్లను స్మరించుకోవడం మరో ప్రత్యేకత.
వందల ఏండ్లుగా అడవి బిడ్డల ఇలవేల్పుగా పూజలందు కుంటున్న నాగోబా దేవత జాతర ఏటా పుష్యమాసంలో 15 రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లాతోపాటు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి బంధు మిత్రులను కూడగట్టుకొని భారీ సంఖ్యలో గిరిజనులు వస్తారు. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర. పుష్య అమావాస్య రోజున ప్రత్యేక పూజలతో జాతర సందడి మొదలవుతుంది. ఈ పూజలు ఒకే వంశస్థుల చేతుల మీదుగా జరగడం అనాదిగా వస్తున్న ఆచారం.
జాతర విశిష్టత
జాతర ప్రారంభానికి ముందు పుష్య పౌర్ణమి రోజున మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలకు అవసరమయ్యే మట్టి కుండల్ని కూడా తరతరాలుగా ఒకే వంశస్థులు చెయ్యడం ఆచారంగా వస్తోంది. మెస్రం వంశస్థులు వారం రోజులపాటు జాతర ప్రచారం నిర్వహించి గంగాజలం కోసం కేస్లాపూర్ నుంచి బయలుదేరతారు. కాలినడకన 125 కి.మీ దూరం ప్రయాణించి జన్నారం మండలం కలమడుగు గ్రామసమీపంలోని హస్తిన మడుగులోని నీటిని ఓ కలశంలో నింపుకుని తీసుకొచ్చి గ్రామ శివారులోని మర్రిచెట్ల కింద బసచేస్తారు. అక్కడే మెస్రం వంశీయుల్లోని 22 తెగల్లో మృతిచెందిన పితృదేవతలకు తూం (కర్మకాండ) పూజలు నిర్వహిస్తారు. అనంతరం డోలు, సన్నాయిలు వాయిస్తూ నాగోబా ఆలయానికి వెళ్ళి నాగోబా విగ్రహాన్ని ఆ నీటితో శుభ్రపరిచి, ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజం వూతీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు 'పైకెత్తినట్లు' కనిపిస్తే పూజా కార్యక్షికమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం బలంగా నమ్ముతారు.
గిరిజన మహిళలకు ప్రత్యేకత
నాగోబా జాతర సమయంలో చేసే పూజల్లో మెస్రం వంశ ఆడపడుచులు, అల్లుళ్లకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఆలయంలో పుట్టలు తయారుచేసే మట్టిని టేకు కర్రలతో అల్లుళ్లు తవ్వితే, ఆడపడు చులు పురాతన బావినుంచి తీసుకొచ్చిన నీటితో మట్టిని మెత్తగా చేసి పుట్టలా తయారు చేస్తారు. వీటికి పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆడపడుచులు చేసిన పుట్ట ఐదురోజుల పాటు పగలకుండా ఉంటే ఆ ఏడాది పంటలు బాగా పండు తాయనీ, తల్లిదండ్రులూ తోడబుట్టినవారూ బాగుంటారనేది వారి నమ్మకం. జాతర సమయంలో 22 తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేసి, మొక్కులు తీర్చడం, కుల పెద్దలను పరిచయం చెయ్యడం మరో పద్దతి దీనినే బేటింగ్ విధానం అంటారు. చివరగా ఆటపాటలూ కర్రసాములూ సంప్రదాయ నృత్యాలతో వేడుకను ఘనంగా ముగిస్తారు.
గిరిజన దర్బార్
80 ఏండ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు వారిని శాంతి చేయడం కోసం గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండాఫ్ను అదీలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ 1942లో మొదట ఈ దర్భార్ నిర్వహించాడు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. అక్కడికి వచ్చిన గిరిజనులు వారి సమస్యలను దర్భార్ లో విన్నవించుకుంటారు.
జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.
తెలంగాణ ప్రభుత్వం తరుపున ఘనంగా ఏర్పాట్లు
నాగోబా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయి పండుగగా గుర్తించి అంగరంగ వైభోహంగా వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఆదివాసీయుల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే నాగోబా జాతర కు తగినంత భద్రత కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో వృద్ధులు, పసిపాప తల్లులు, వికలాంగులు వస్తారని వారికోసం ప్రథమ చికిత్స కేంద్రాలను, త్రాగే నీళ్లు, మొబైల్ బాత్రూం లను ఏర్పాటు చేసి, వృద్ధ భక్తులు , చిన్నపిల్లల తల్లులకు ప్రత్యేక భద్రత, భరోసా ను కల్పిస్తున్నారు. గిరిజనహేతరులు కూడా వేల సంఖ్యలో వచ్చి నాగోబా ను దర్శించుకుంటారు. రోజు రోజుకి కరోన, ఒమిక్రాం కేసులు విపరీతంగా పెరుగుతుండటం తో అందరిని దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తం అయ్యారు. సానిటీజర్ మాస్క్ లు తప్పనిసరి చేసి సామాజిక దూరాన్ని పాటించాలని వారి భాష లో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో భక్తులకు మన ప్రభుత్వం కరోన వేళలో పూర్తి భద్రత అందిస్తుండటం తో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుండి గిరిజనులు ఇప్పటికే వచ్చారు. ఈనెల 25 తేదీన తొలి పూజ కార్యక్రమం ఉంటుంది. 31 తేదీన పెద్ద జాతర ఉండటంతో ఆరోజు అధిక శాతం భక్తులు వస్తారు. ఏదేమైనా మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయం లో నాగోబా జాతర ముఖ్యమైంది అని చెప్పాలి.
- పీలి కృష్ణ, 7801004100