Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు పంచతంత్ర కథలు బాగా తెలుసు. అందులోని పశుపక్షులు, క్రిమి కీటకాలు మాట్లాడడం, జంతువులు పోట్టాడడం పిల్లలకు బాగా నచ్చుతాయి కదా! ఇందులోనూ రావెళ్ళ 'చీమ-ఈగ' గేయ కథలో నమ్మిన స్నేహితుడైన చీమను ఈగ మోసం చేసి ఎలా శిక్షను అనుభవించిందో చెబుతారు. 'కార్య సాధన' మనకు తెలిసిన 'నాలుగు లడ్డూలు' వంటి కథే అయినా, కవి ఇందులో చెప్పిన పద్ధతి పిల్లలకు బాగా నచ్చడమే కాక సరదాను కలిగిస్తుంది.
అవును మరి బాల సాహిత్యం కేవలం ఆలోచనలు మాత్రమే కలిగించేవిగా ఉంటే సరిపోదు, దానితో పాటు పిల్లలను అలరించేవిగా కూడా ఉండాలని, ప్రభావితం చేయాలని నమ్మినవారిలో కవి ఒకరు.
ఆచార్య రావెళ్ళ కృష్ణారావు పేరు వినగానే కండ్ల ముందు నడయాడే అక్షరమూర్తి జ్ఞాపకం వస్తుంది. అయన తన చివరి శ్వాస వరకు 'నిరంతర విద్య, వయోజన విద్య'ల వికాసం కొరకు పనిచేసిన అక్షరస్ఫూర్తి. ఆయన ఆశ, ఆశయాల ఫలితాలే ఇవ్వాళ్ళ తెలుగునేల మీద ఫలవంతమై వికసించిన అనేక వయోజన విద్యా కేంద్రాలు. నిన్నమొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో, ఇవ్వాళ్ళ ముఖ్యంగా తెలంగాణలో నిరంతర, వయోజన విద్య కోసం పనిచేస్తున్న 'స్పేస్' సంస్థకు రావెళ్ళ వ్యవస్థాపకులు, ఆ సంస్థకు హైదరాబాద్లో ఒక శాశ్వత భవనాన్ని సంపాదించి పెట్టడమే కాక వందలాది పుస్తకాలు సంస్థ ద్వారా ప్రచురించిన మార్గదర్శి.
ఆచార్య రావెళ్ళ కృష్ణారావు నల్లగొండ జిల్లా మోతె మండలంలోని అన్నారి గూడెంలో సెప్టెంబర్ 25, 1936న పుట్టారు. బాల్యం విద్యాభ్యాసం అక్కడే పూర్తిచేసుకుని ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఆచార్యులు పనిచేశారు. వేలాది మందిని విద్యా విభాగంలో ఉత్తమ బోధకులుగా తీర్చిదిద్దిన వీరి పర్యవేక్షణలో వందమంది వరకు పరిశోధకులు ఎంఫిల్,. పిహెచ్.డిలు పూర్తి చేశారు. తొలి నుంచి వయోజన విద్యతో పాటు బాల సాహిత్యంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన రావెళ్ళ పిల్లల కోసం, దూర విద్య కోసం, వయోజనుల కోసం మంచి రచనలు చేశారు.
'ఆంధ్ర ప్రదేశ్లో వయోజన విద్య', 'వయోజన విద్య నేర్పడమెలా? పద్దతులు, వ్యూహాలు', 'నాగరికత-సంస్కృతి', 'పెరటితోట', 'దూరవిద్య' వంటివి వీరి రచనల్లో కొన్ని. పిల్లల కోసం రాసిన వాటిలో 'పిల్లల కథలు', 'సత్యమేవ జయతే'లను ప్రత్యేకంగా చెప్పాలి. ఈ 'సత్యమేవ జయతే' బాలల గేయ సంపుటికి 1992లో భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలలో బాల సాహిత్యానికి ఎన్.సి.ఈ.ఆర్.టి న్యూఢిల్లీ ద్వారా అందించే ఉత్తమ గ్రంథం పురస్కారం లభించింది. మన పిల్లలకు ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో తెలిసిన వాళ్ళలో ఆచార్య రావెళ్ళ ఒకరు. తన సత్యమేవ జయతే మొత్తం దీనికి ప్రతిరూపంగా నిలిచిందని చెప్పొచ్చు. ఇందులోని ప్రతి గేయం, గేయ కథ అందుకు అద్దం పడుతుంది. ఇది అచ్చంగా ఇరవై ఒక్క గేయ కథల సంపుటి. మాత్రా ఛందస్సులో సాగిన చక్కని గేయానికి 'పాప' బొమ్మలు మరింత అందాన్ని తెచ్చాయి.
తొలి గేయకథ 'సత్యమేవ జయతే', ఇందులోని అనాధబాలుడైన యూసఫ్ అత్యంత ప్రమాధస్థితిలోనూ సత్యాన్నే పలికి ఎలా విజయం సాధించాడో రావెళ్ళ ఈ గేయ కథలో చూపిస్తాడు. అంటే అచ్చంగా మహాత్మా గాంధీ లాగా మనకిందులో యూసఫ్ కనిపిస్తాడు. మాత్రా ఛందస్సుతోపాటు, కథా కథనం, క్లుప్తత వంటివి వీరి గేయ కథలో అంతటా కనిపిస్తాయి. కథ ప్రారంభించడం మొదలు చివరివరకు దానిని నడిపించడంలో చూడవచ్చు. 'గుట్ట మీద 'చిరుతు' బావ / చెట్టు కింద 'కోతి' బావ / ఒక్కదాని విడిచి ఒకటి ఉండవెప్పుడు' అంటూ నేరుగా చెప్పి కథ ప్రారంభించడం రావెళ్ళ మార్క్ స్టైల్. అన్ని గేయాల్లో ఈ పద్దతిని చూడవచ్చు.
కొన్ని కథలు మనకు తెలిసినవే అయినా కవి వాటిని అందంగా, చక్కగా ముస్తాబుచేసి కొత్తగా చెబుతారు. 'కుక్క కాటుకు చెప్పుదెబ్బ', 'పేరాస', 'నక్క-చిట్టెలుక' వంటి కథలు అటువంటివే. పిల్లలకు మంచి విషయాలు ఎలా చెప్పాలో బాగా తెలిసిన రావెళ్ళ 'మాధవసేవ'లో '... మానవ సేవయే / మాధవుని సేవ.. అనె / తలలు వంచకపోయి / రంతా -' అంటూ సాటి మనిషికి సేవ చేయడంలో భగవంతుడు ఉంటాడని తెలుపుతారు ప్ఫూర్తిని కలిగిస్తూ. 'బుద్ధిమతి' కథ రాజ్యాన్ని పాలించే రాజు నడవడి ఎలా ఉండాలో చెబితే, 'పట్టుదల' కృషిని గురించి చెబుతుంది. మనకు పంచతంత్ర కథలు బాగా తెలుసు. అందులోని పశుపక్షులు, క్రిమి కీటకాలు మాట్లాడడం, జంతువులు పోట్టాడడం పిల్లలకు బాగా నచ్చుతాయి కదా! ఇందులోనూ రావెళ్ళ 'చీమ-ఈగ' గేయ కథలో నమ్మిన స్నేహితుడైన చీమను ఈగ మోసం చేసి ఎలా శిక్షను అనుభవించిందో చెబుతారు. 'కార్య సాధన' మనకు తెలిసిన 'నాలుగు లడ్డూలు' వంటి కథే అయినా, కవి ఇందులో చెప్పిన పద్ధతి పిల్లలకు బాగా నచ్చడమే కాక సరదాను కలిగిస్తుంది. అవును మరి బాల సాహిత్యం కేవలం ఆలోచనలు మాత్రమే కలిగించేవిగా ఉంటే సరిపోదు, దానితో పాటు పిల్లలను అలరించేవిగా కూడా ఉండాలని, ప్రభావితం చేయాలని నమ్మినవారిలో కవి ఒకరు. పైన నేను చెప్పినట్టు రావెళ్ళ కథను ఎలా నేరుగా, సూటిగా మొదలు పెడతారో ముగింపును కూడా అంతే చక్కగా చేస్తారు. 'తెలివిలేని తులువకు-కడు / విలువ యిస్తిమి / ములగచెట్టు ఎక్కియిట్లు/ మోసపోతిమి' అంటూ చుబుతారు. ఇవేకాక 'నిజము పల్కు సజ్జనుండు/ నిఖిల లోకమందును / గెలుపొందును సౌఖ్యమొందు/ గౌెరవాల నందును!', 'చెడ్డ బుద్ది తోడ పరుల / చెరుపదలచి నిలిచినపుడు/ చేటువచ్చి చెడ్డవారి/ చెంతజేరును-', 'శక్తికంటె గొప్ప దెపుడు/ యుక్తియే అటన్న నీతి/ తెలియజెప్పు మనకీ కథ' అనే రావెళ్ళ 'మార్క్' అన్నిగేయాల్లో చూడొచ్చు. జాతీయ స్థాయి గౌరవాలతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఆచార్య రావెళ్ళ కృష్ణారావు 2012లో మనల్ని వీడి వెళ్ళిపోయారు.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548