Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాత్మాగాంధీ మద్రాసు నుంచి వరంగల్ వచ్చినప్పుడు వరంగల్ స్టేషనులో వాలంటీర్‌గా ఉన్న నరసింహారావు గాంధీని దర్శించుకొని తన ఛిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. జాతిపితపై అభిమానాన్ని, స్వదేశీ వస్త్రాలపై మమకారాన్ని దేహం మొత్తం ఇనమడింప చేసుకొని కన్ను మూసెంత వరకు ఖద్దరు ధారణకే కంకణబద్ధుడయ్యారు.
''మనం రాజకీయాల ద్వారా దేశసేవ చేయాలనుకుంటే మనల్ని మనం కార్యకర్తలమనే భావించాలి. కానీ నాయకుల మనిపించుకోకూడదు'' అని పలికిన నరసింహారావు సమాజ శ్రేయస్సును కాంక్షించిన ఆశాజీవి. జీవిత చరిత్రల అక్షరమాలికను శ్వేత వర్ణపు పుటపై అందంగా కూర్చిన పదధారి. రచనలోనో, బాధ్యతలోనో తన జీవితాన్ని పూర్తిగా సారస్వత సేవకు సమర్పించిన సరస్వతి పుత్రుడు. దిగ్గజుల చేత ఔరా..అనిపించుకున్న అవిరామ అక్షర శ్రామికుడు. అందరి చేత మెప్పు పొందిన అందరివాడు.
జననం, విద్య: నరసింహారావు పూర్తిపేరు మాదిరాజు లక్ష్మీనరసింహారావు స్వాతంత్య్రమే శ్వాసగా బతికిన మహానుభావుడు. అందుకోసం చిన్న వయసులోనే స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షించబడ్డారు. ఇతను ఖమ్మం జిల్లా పండితాపురంలో 1928 నవంబర్ 7వ తేదీన మాదిరాజు నారాయణరావు, లక్ష్మీబాయమ్మ దంపతులకు జన్మించారు. ఖమ్మంలో మెట్రిక్ చదివారు. హైదరాబాదు చేరి ఛాదర్ ఘాట్ కాలేజీలో ఇంటర్ చదివాక, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ చదువుతున్నప్పుడు సురవరం ప్రారంభించిన ఆంధ్ర విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఇలా ఎమ్మే వరకు చదివారు. అందరూ ఆత్మీయంగా ఎం.ఎల్ అని పిలుచుకునే మాదిరాజుకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలపై పట్టు ఉంది.
ఉద్యమం : సాధారణంగా ఒక మనిషి మాట్లాడే ఆకర్షణీయమైన మాటలకు, చేసే చేతలకు కొద్దో గొప్పో ఎవరైనా ఆకర్షితులవుతారు. అలా స్వాతంత్య్రోద్యమ సమయంలో హైదరాబాదు రాష్ట్రంలో నాయకుడిగా వ్యవహరించిన స్వామి రామానంద తీర్థ ఎందరినో ఆకర్షించారు. హైదరాబాదు రాష్ట్రంలో నిజాం వ్యతిరేక పోరాటం జరుగుచున్నప్పుడే ఖమ్మంలో మెట్రిక్ చదువుతున్న ఒక నూనుగు మీసాల యువకుడు రామానంద తీర్థ పిలుపుతో ఉత్తేజం పొంది పాఠశాలను బహిష్కరణకు గురి చేసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఉద్యమం భీకర స్థాయిలో ఉండగా పోలీసుల కంట పడకుండా తప్పించుకొని అత్యంత ప్రమాదకర స్థితిలో మారు వేషాలు ధరించి విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. గాంధీ సిద్ధాంతాలను నిలువెల్లా ఆకళింపు చేసుకున్న గాంధీ భక్తుడు నరసింహారావు. పండిట్ నరేంద్ర జీ, వల్లూరి బసవరాజుల ప్రభావం విరివిగా ఉంది. చిన్నప్పటి నుంచే దేశ మహా జాతీయోద్యమ నాయకుడిని జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలని కోరుకున్నారు. ఆ కోరిక నెరవేరుతుందని చాలా త్వరగానే తెలిసింది. 1946 ఫిబ్రవరిలో మహాత్మాగాంధీ మద్రాసు నుంచి వరంగల్ వచ్చినప్పుడు వరంగల్ స్టేషనులో వాలంటీర్‌గా ఉన్న నరసింహారావు గాంధీని దర్శించుకొని తన ఛిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. జాతిపితపై అభిమానాన్ని, స్వదేశీ వస్త్రాలపై మమకారాన్ని దేహం మొత్తం ఇనమడింప చేసుకొని కన్ను మూసెంత వరకు ఖద్దరు ధారణకే కంకణబద్ధుడయ్యారు. స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న క్లిష్ట సమయాన 1945-48 మధ్యకాలంలో నరసింహారావు అజ్ఞాతంలో గడిపారు. అయినా ఉద్యమానికి తన వంతుగా సహకారం అందిస్తూనే వచ్చాడు. పోలీసుల కంట పడకుండా పలు రకాల దుస్తులలో వేషధారణలు మార్చినా, ఒకసారి రజాకార్ల బారి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. ఉద్యమం వీరి జీవితంతో ముడిపెట్టుకున్నట్టు ఇతని ఉద్యమమే జీవితం అయ్యింది.
ఉద్యోగం, ఇతర బాధ్యతలు : కొంతకాలం సమాచార శాఖలో ఉద్యోగం చేసి అది మానేసి, ఓయూ అనుబంధ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా చేశారు. ఆ తర్వాత తెలుగు అకాడమిలో దాదాపు 15 వత్సరాలు పరిశోధనాధి కారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇతను ఉస్మానియా యూనివర్సిటి సెనేట్ సభ్యుడిగా, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, మద్రాస్ దూరదర్శనుకు సలహా సభ్యుడిగా ఉన్నారు. 1901లో ఏర్పడిన శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి 1965 నుంచి 2015 వరకు గౌరవ కార్యదర్శిగా ఉండి, ఎవరూ నిర్వహించని విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. 1948లో యాక్షన్ జరిగాక గోలకొండ పత్రికలో కరస్పాండెంట్‌గా చేశారు.
రచనలు : జీవిత చరిత్రల రచనలు చేయడం ఏమంత సులువు కాదు. అది రాయదల్చుకున్న వారి జీవితాన్ని, రాసేందుకు అప్పటి సమాజంలో ఉన్న వారి స్థితిని విస్తృతంగా అధ్యయనం చేయాలి. సమాచార సేకరణలో ఎక్కడా లోపం లేకుండా ఆచితూచి అధ్యయన ప్రణాళికతో ఆరంభించాలి. ఇలా జీవిత చరిత్రను రాసేందుకు కావాల్సిన ప్రమాణాలన్నిటిని శ్రీ నరసింహారావు శ్రమకోర్చి రెండు పదుల వరకు జీవిత చరిత్రలు రాశారు. వారిలో స్వాతంత్య్ర సమరయోధులున్నారు. సమాజ సేవకులున్నారు. రాజకీయ నాయకులూ ఉన్నారు. దైవంగా పూజించబడే వాళ్ళు సైతం ఉన్నారు. ఈ జీవిత చరిత్ర రచన చేయడమంటే వ్యాసం రాయడమంత సులభేం కాదు. ఏదో ఒక ధర్మవృత్తిలో కొనసాగుతూ రాయడం అంతకన్నా సులభం అసలే కాదు. ఇదిగో అలాంటి సులభాలకు సుదూరంగా ఉంటూ సరైన ప్రణాళికతో, తనదైన శైలితో జాతి నిర్మాతల గురించి సమాజానికి అందించారు మాదిరాజు.
భారత జాతీయ కాంగ్రెసు నీడన అధిక భాగం సాగిన జాతీయోద్యమంలో, జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రణాళికబద్ధంగా సాగించారు. వారిలో ఉమేష్ చంద్ర బెనర్జీ నుంచి నిన్న, మొన్న అధ్యక్షులుగా ఉన్న సోనియాగాంధీ వరకు 48 మంది జీవితాల గురించి సంక్షిప్తంగా 'జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు' అనే గ్రంథం రాశారు. జీవిత చరిత్రల రచయితగా 1984లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డుతో మొదలై ఎన్నో అవార్డులు అందుకున్న మాదిరాజు ఫిబ్రవరి 12, 2016న కన్నుమూశారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542