Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2022వ సంవత్సరానికిగాను భారత ప్రభుత్వం 128 పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో 4 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీ అవార్డుల కోసం ఆయా రంగాల్లో సేవలందించిన వారిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో మన తెలుగువారికి రెండు పద్మభూషణ్‌లు, ఎనిమిది పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఇందులో కరోనా వైరస్ నిర్మూలన కోసం సంజీవనీ లాంటి వ్యాక్సిన్‌ను అందించిన శాస్త్రవేత్త జంటకు, సాంకేతిక రంగంలో ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను పెంచిన తెలుగువాడికి పద్మభూషణ్‌లు వరిస్తే, అంతరించిపోతున్న జానపదం, గిరిజన కళలను పునరుజ్జీవింపచేయడనాకి కృషి చేస్తున్న కళాకారులకు, పోలియో వ్యాధిపై యుద్ధం ప్రకటించి సేవలందిస్తున్న డాక్టర్‌కు, సంగీత ప్రపంచంలో తన ముద్రను చాటిన నాదస్వర విద్వాంసుడికి, అవధానిగా, ఆధ్మాత్మిక ప్రవచనకర్తగా అభ్యుదయ బావుటా ఎగురవేసిన సాహిత్యమూర్తికి, అలనాటి మేటి నటికీ పద్మశ్రీ పురస్కారాలు వరించడం తెలుగు జాతికి దక్కిన గొప్ప గౌరవం.
ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పద్మ అవార్డు లను భారత ప్రభుత్వం ప్రకటించడం సాంప్రదాయంగా వస్తున్నదే. ఈ అత్యున్నత పురస్కారాలను ఇవ్వడం 1954లో ప్రారంభమైంది. పట్టణాలు, పల్లెలు, గిరిజన తండాలు. ప్రతిభావం తులు ఎక్కడైనా ఉండవచ్చు. ప్రజల్లోనే సాధారణంగా ఉంటూ అసాధారణమైన పనులతో తోటివారి జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తేవడానికి కృషి చేస్తుంటారు. ఆయా రంగాల్లో కొందరు ప్రతిభావంతమైన పాత్ర పోషిస్తూనే ఉంటారు. వారు నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ గుర్తింపుకు ఆరాటపడకుండా ఆమడ దూరంలో ఉంటారు. వాస్తవానికి సమాజ గతిలో నిస్వార్ధ భావనతో నిర్మాణాత్మకమైన కృషి చేస్తూ, విస్తృతంగా కనిపించే ప్రతిభా వంతులను గుర్తించి పురస్కారాలు అందిస్తే మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
2022వ సంవత్సరానికిగాను భారత ప్రభుత్వం 128 పద్మ పురస్కారాలను ప్రకటించింది. అయితే, అందులో 4 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీ అవార్డుల కోసం ఆయా రంగాల్లో సేవలందించిన వారిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో మన తెలుగువారికి రెండు పద్మభూషణ్‌లు, ఎనిమిది పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఇందులో కరోనా వైరస్ నిర్మూలన కోసం సంజీవనీ లాంటి వ్యాక్సిన్‌ను అందించిన శాస్త్రవేత్త జంటకు, సాంకేతిక రంగంలో ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను పెంచిన తెలుగువాడికి పద్మభూషణ్‌లు వరిస్తే, అంతరించి పోతున్న జానపదం మరియు గిరిజన కళలను పునరుజ్జీవింపచేయడనాకి కృషి చేస్తున్న కళాకారులకు, పోలియో వ్యాధిపై యుద్ధం ప్రకటించి సేవలందిస్తున్న డాక్టర్‌కు, సంగీత ప్రపంచంలో తన ముద్రను చాటిన నాదస్వర విద్వాంసుడికి, అవధానిగా, ఆధ్మాత్మిక ప్రవచనకర్తగా అభ్యుదయ బావుటా ఎగురవేసిన సాహిత్యమూర్తికి, అలనాటి మేటి నటికీ పద్మశ్రీ పురస్కారాలు వరించడం తెలుగు జాతికి దక్కిన గొప్ప గౌరవం.
పద్మశ్రీ సకిని రామచంద్రయ్య
గత ఏడాది గోండు జాతిలోని కనకరాజుకు పద్మశ్రీ అవార్డు వరిస్తే, ఈ సంవత్సరం మరో గిరిజన కళాకారుడికి ఈ ప్రతిష్టాత్మక మైన పురస్కారం దక్కడం మరో విశేషం. కోయ తెగలో డోలి వాద్య కళ తెలిసిన ఏకైక కళాకారుడిగా గుర్తింపు పొందిన సకిని రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపి కయ్యారు. ఈ అరుదైన గుర్తింపుతో కోయగూడేలు సంబరాలు చేసుకుం టున్నాయి. దేశ రాజధానికి వేల కిలో మీటర్ల దూరంలో ఉండే ఓ కోయ కళాకారుడికి పురస్కారం ప్రకటించడం ఆ జాతికి దక్కిన అరుదైన గుర్తింపు.
సకిని రామచంద్రయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూన వరంలో ముసలయ్య దంపతులకు జన్మించారు. కోయ జాతిలో తలపతి, పటేలు వంశస్తులు ముందు వరుసలో ఉంటే, ఆ తర్వాత వచ్చే కోయ డోలి (ఆర్తి బిడ్డలు) వంశానికి చెందిన కళాకారుడు సకిని రామచంద్రయ్య. ఆయన తాత, ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న డోలి వాద్య కళను తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ''డోలి వాద్య కళ' కథాగాన ప్రక్రియకు చెందినది. కోయ వంశస్తులు వేల్పుల (పండుగ) సమయాల్లో, కర్మకాండల సందర్భాల్లో ప్రదర్శించే డోలి కళకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సకిని రామచంద్రయ్య డోలి వాయిద్యాన్ని వాయిస్తూ, కథాగానం చేయడంలో సాధికారత కలిగిన కళాకారుడు. అడవి బిడ్డల ఇలవేల్పుల చరిత్రను తన పాటతో పరవశింప చేస్తాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో విస్తరించిన కోయ జాతులతో మమేకమై కోయ, తెలుగు భాషల్లో ఆయన గానం చేస్తూ ప్రదర్శిస్తారు.
కోయ జాతులవారు మాఘమాసం నుంచి చైత్ర మాసం వరకు కోయ దేవతల వేల్పులను ఘనంగా జరుపుకుంటారు. రాత్రి వేళల్లో దేవతా ఘట్టాలను కీర్తిస్తూ డోలి కళాకారులచే కథాగానం చేయించడం వారి సాంప్రదాయం. వారి వారి స్థోమతను బట్టి నాలుగు రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు జరుపుకునే పండుగలో డోలి వాద్య కళాకారులు పగిడిద్దరాజు, గోవిందరాజు, కొండాయి వంటి వేల్పులను కీర్తిస్తారు. అయితే, సకిని రామచంద్రయ్య కోయ సాంప్రదాయ క్రతువుల్లో దేవతా బిర్దులను (బొమ్మలను) చూపుతూ ఆయా ఘట్టాలను కీర్తిస్తూ గానం చేయడంలో ప్రఖ్యాతి వహించారు. అదే విధంగా వేల్పుల సందర్భంలోనే కాకుండా, కర్మకాండల్లోను వంశ పురాణాలు చెప్పడం సకిని సిద్ధహస్తుడు. కోయ జాతిలో నాలుగవ గోత్రానికి (గట్టు) చెందిన సకిని రామచంద్రయ్య ఆ వంశ వృక్షానికి చెందిన ప్రాశస్త్యాన్ని డోలి వాయిద్యాన్ని వాయిస్తూ గానం చేయడంలో దిట్ట. అంతేకాకుండా, ఇతర వంశస్తుల ఆహ్వానం మేరకు వారి వంశ వృక్షానికి సంబంధించిన కథాగానం చేయగలిగిన అరుదైన కళాకారుడు ఆయన. తెల్లటి పంచె, లాల్చి, తలకు రుమాలు ధరించే రామచంద్రయ్య డోలి వాద్యాన్ని వాయిస్తూ ఏకధాటిగా రోజుల తరబడి కథాగానం చేయడంలో కళాకారుడిగా ఆయనకున్న ప్రత్యేకత.
ఆచారాలు, సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో కోయ గిరిజన తెగకు చెందిన డోలి కళ మనుగడకు కృషి చేస్తున్న ఆఖరి వ్యక్తి రామచంద్రయ్య. ఆయన కొత్త తరానికి వారధిగా మారి డోలీ ప్రక్రియను పునరుజ్జీవింప చేయడానికి పద్రశ్రీ అవార్డు ఆయనకు మరింత స్ఫూర్తినిస్తుంది.
శభాష్... మొగులయ్య
పంచెకట్టు.. జుల పాలజుట్టు.. మెడలో ఎర్రటి రుమాలు దరించి 12 మెట్ల కిన్నెరను మునివేళ్ళతో మీటు తూ, ''శబ్బాష్.. ఆడలేడు మియ్యాసావు... ఈడ లేడు మీయ్యాసావూ...'' అంటూ ఆయన గళమెత్తి పాడితే చూప రులకు సమ్మోహనాస్త్రమై కనిపిస్తాడు. ఆయనే పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్య. అంతరించిపోతున్న ఈ జానపద కళకు శాశ్వత గౌరవం తీసుకురావడానికి మొగులయ్య చేస్తున్న సుదీర్ఘ ప్రయాణానికి గుర్తింపుగా ఆయనకు పద్మశ్రీ అవార్డు వరించింది. మొగులయ్య పుట్టింది నాగర్ కర్నూల్ జిల్లా గట్టిరాయిపాకుల గ్రామం. అయితే, లింగాల మండలం అవుసలకుంట లో ఆయన బాల్యం గడిచింది. ఆయన పూర్వీకులు కాశిం, మొగులయ్య, రాములయ్యలతో పాటు, తండ్రి ఎల్లయ్య పన్నెండు మెట్ల కిన్నెరను అద్భుతంగా వాయించే ప్రతిభావంతులు. ఆయన పూర్వికులు వనపర్తి సంస్థానంలో సంస్థానాధీశుల వంశ వృత్తాంతాన్ని కిన్నెర వాయిస్తూ గానం చేసేవారట.
తండ్రి ఎల్లయ్య జానపద వీరుల గాథలను పాడుతుంటే చూసి నేర్చుకున్న మొగులయ్య 12 ఏండ్ల వయస్సులో 12 మెట్ల కిన్నెరను వాయించడం మొదలు పెట్టాడు. అంతేకాదు, తండ్రితోపాటు సంతలకు, జాతర్లకు వెళ్ళి జనం మధ్య కిన్నెర మీటుతూ గానం చేయడం అలవాటు చేసుకున్నాడు. క్రమంగా కిన్నెర కథా గానాలే ముగులయ్య జీవితానికి ఆధారమైంది. పూర్వికుల నుండి వారసత్వంగా వస్తున్న మౌఖిక సాహిత్యాన్ని ఆయన గొంతులో అద్భుతంగా పలికేలా సాధన చేశారు. పండుగ సాయన్న, పాన్ గల్ మియ్యాసావు, ఎండబెట్ల పకీరయ్యల వీరగాథలనే కాకుండా, కొల్లాపూర్, వనపర్తి సంస్థానాధీశుల చరిత్రలను, సిరసనగండ్ల రాములవారి కథలను పన్నెండు మెట్ల కిన్నెరను మీటుతూ మొగులయ్య గానం చేస్తారు. మౌఖిక సాహిత్యాన్ని కైకట్టుకుని పాటలు పాడటంలోనే కాదు, పన్నెండు మెట్ల కిన్నెరపై దేశీ సంగీతాన్ని పలికించడంలో ఆయన దిట్ట. పన్నెండు మెట్ల కిన్నెర వాద్యంపై 7 మెట్లపై మధ్యస్థాయిలో సంగీతాన్ని పలికిస్తే, మిగతా 5 మెట్లపై తారాస్థాయిని పలికిస్తాడు.
మొగులయ్య ఉపయోగించే పన్నెండు మెట్ల కిన్నెరను స్వయంగా ఆయనే తయారు చేస్తాడు. శ్రీశైలం అడవుల్లో అరుదుగా దొరికే ఆనపకాయ బుర్రలు సేకరించి, పొడవాటి వెదురు కర్రపై 12 సానపట్టిన ఎద్దు కొమ్ములను మైనం సహాయంతో అమర్చి, ఆ పై నుంచి సన్నని తీగను బిగించి కిన్నెరను తయారు చేస్తారు. కిన్నెరను తయారు చేసే పద్ధతిని తన తాత తండ్రుల నుంచి మొగులయ్య నేర్చుకున్నారు.
అంతరించిపోతున్న పన్నెండు మెట్ల కిన్నెర కళకు మొగులయ్య చివరి ఆశాకిరణం. దర్శనం మొగులయ్య జీవిత చరిత్రను, తెలంగాణ ప్రభుత్వం 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠంగా చేర్చింది. ఆయన కృషిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారంతో సత్కరించింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ నెలకు పదివేల పెన్షన్‌ను మంజూరు చేసి ఆయనను ప్రోత్సహిస్తున్నది. ప్రఖ్యాత తెలుగు సినీనటులు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ''భీమ్లా నాయక్'' సినిమాలో టైటిల్ సాంగ్‌ను పాడి బహుళ ప్రాచుర్యాన్ని పొందిన మొగులయ్య ఆయన నమ్ముకున్న కళకు మరింత గుర్తింపు కోసం కృషి చేయాలన్న ఆరాటం ఆయనలో కనిపిస్తుంది
నాదస్వరానికి 'పద్మశ్రీ'
భారతీయ సంస్కృ తిలో నాద స్వరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రక్రియలో షేక్ హసన్ సాహెబ్ విశేషంగా కృషి చేసి ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. ఆయన లోని అపార మైన ప్రతిభకు, చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు వరించింది. షేక్ హసన్ సాహెబ్ కృష్ణా జిల్లా గంపలగూడెం గోసవీడులో 1928 జనవరి 1న మీరా సాహెబ్, హసన్ బీ దంపతులకు జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో 8 ఏండ్ల వయస్సులోనే సంగీత సాధన మొదలుపెట్టారు. ఆ తర్వాత షేక్చిన మౌలానా సాహెబ్ దగ్గర, ప్రఖ్యాత సంగీత విద్వాంసులు బాల మురళీకృష్ణ తండ్రి పట్టాభి రామయ్యల దగ్గర సంగీతంలో శిక్షణ పొందారు. నేర్చుకున్న సంగీతాన్ని, సన్నాయి వాయిద్యానికి జోడించి సాధన చేయడం మొదలుపెట్టారు. భక్త రామదాసు కీర్తనలను తన నాదస్వరంలో హృద్యంగా పలికించి, సంగీత ప్రపం చంలో తన ఉనికిని చాటారు. ఆయనలోని అపారమైన ప్రతిభను గుర్తించిన ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం అనేక పర్యాయాలు నాదస్వర కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. తిరువయ్యూర్ త్యాగరాజస్వామి ఆరాధ నోత్సవాల్లో నాదస్వర సంగీత కచేరీని నిర్వహించి ఎందరో పండితుల ముందు శాస్త్రీయ సంగీతంలో తన పాండిత్యాన్ని పరిచయం చేశారు. 1950 నుంచి 1996 వరకు భద్రాచల రామచంద్ర స్వామి ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడిగా సేవలు అందించారు. ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని, పవళింపు సేవ వరకు తన నాద స్వరంతో రాముడి కీర్తనలను ఆలపించి, సంగీతానికి మతాలు అడ్డుకావని నిరూపించారు. 14 ఏండ్ల వయస్సులో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన స్వాతంత్య్ర సమరయోధుడు ఈయన. పూర్వ ప్రధాని పి.వి. నరసింహారావు ఢిల్లీకి పిలిపించుకుని నాదస్వరంలో ఆయన పాండిత్యాన్ని ప్రత్యక్షంగా చూసి అభినందించారు. షేక్ హసన్ ప్రతిభకు గుర్తింపుగా 1962లో గాన కళా సమితి స్వర్ణకంకణంతో సత్కరించింది. నాద స్వరంలో అపార పాండిత్యం కలిగిన ఆయన ఎందరికో నాదస్వరంలో శిక్షణ ఇచ్చారు. తన 93వ ఏట 2021 జూన్ 23న షేక్ హసన్ కన్నుమూశారు. మరణానంతరం ఆయనకు పద్మశ్రీ వరించింది.
నర్తన 'పద్మ'జా రెడ్డి
కూచిపూడి నృత్య కళాకారిణిగా నాలుగు దశాబ్దాలుగా పద్మజా రెడ్డి చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. కృష్ణా జిల్లాలో జన్మించిన పద్మజా రెడ్డి బాల్యం హైదరాబాద్ లో గడిచింది. నృత్యం పట్ల ఆసక్తిని పెంచుకున్న ఆమె ప్రఖ్యాత కూచి పూడి నాట్య గురు వులు వెంపటి చిన సత్యం, శోభా నాయుడుల దగ్గర శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. వారి శిష్యరీకంలో నృత్య సాధన చేస్తూ దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి, కళాకారిణిగా గుర్తింపు పొందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపి గడ్డం గంగారెడ్డి కుమారుడితో వివాహం జరిగిన తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సా హంతో నృత్యాన్ని కొనసాగిం చారు. ప్రణవ్ నాట్య అకాడ మీని స్థాపించి వంద లాది మంది శిష్యులకు కూచి పూడి నృత్యంలో శిక్షణను అందిస్తూ వస్తున్నారు. అంతేకాదు, కళాకారిణిగా అనేక నృత్య ప్రయోగాలను చేసి పద్మజారెడ్డి గుర్తింపు పొందారు. పురాణ, ఇతిహాసాలతోపాటు, సామా జిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆడపిల్లల భ్రూణ హత్యలు, ఎయిడ్స్ వంటి సామాజిక అంశాలతోపాటు, జాతీయ సమైక్యత ఇతివృత్తాలుగా 'నమస్తే ఇండియా', 'సీజన్ ఆఫ్ ఫ్లవర్' వంటి నృత్య ప్రయోగాలను చేశారు. కాకతీయుల పాలనలోని జాయపసేనాని రచించిన ''నృత్య రత్నావళి'' గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని రెండు భాగాలుగా ''కాకతీయం'' పేరుతో నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. మొదటి భాగాన్ని 2017లో ప్రదర్శిస్తే, రెండవ భాగాన్ని 2021 డిసెంబర్ 26న శిల్పకళా వేదికపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. 'నృత్య రత్నావళి'లో పేర్కొన్న పిండి, గొండలి, చాలన, పేరిణి, శివప్రియం, కందుక, లాస్యాంగం, రాసకం వంటి నృత్య శైలులను పరిశోదనాత్మకంగా వేదికపై ప్రదర్శించడం ఆమె చేసిన ప్రయోగంలో ఒకటి. నృత్య రంగంలో సుదీర్ఘ కాలంగా పద్మజా రెడ్డి చేస్తున్న కృషికి 'పద్మశ్రీ అవార్డు' గొప్ప గుర్తింపు.
ప్రవచన ప్రతిభా 'పద్మం'
గరికపాటి నరసింహారావు పండిత పామర రంజకమైన పద్యాన్ని హృద్యంగా చెప్పడం ఆయనలోని విలక్షణత. అవధానమనే సాహిత్య ప్రక్రియను తప స్సులా సాధన చేసి అనేక అవధానాలు చేసి తనదైన ప్రత్యే కతను చాటు కున్నారు. అంతే కాదు, తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రతి తెలుగువాడి మనసులో చెరగని ముద్ర వేసిన ఆయనకి 'పద్మశ్రీ అవార్డు' వరించింది. 1958 సెప్టెంబర్ 14న పశ్చిమ గోదావరి జిల్లా, బోడపాడు అగ్రహారంలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో ఎంఎ, ఎం.ఫిల్, పి.హెచ్ డి లను పూర్తి చేశారు.
తెలుగు సాహిత్యంలో సాధికారత కలిగిన గరికపాటి అనర్గళంగా మాట్లాడే తత్వం ఆయన సొంతం. ప్రవచనకర్తగా ఆధ్యాత్మికతను పంచుతూనే, సమాజం లోని చెడు ధోరణులపై చలోక్తులు విసురుతూ కొరడా ఝళిపిస్తారు. ఆయన చేసే ప్రసంగాలు వ్యక్తిత్వ వికాస అంశాలుగా నేటి తరానికి మార్గదర్శనం చేస్తాయి. 1992లో అవధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 300లకు పైగా అవధానాలు చేసి ప్రఖ్యాతి వహించారు. అష్టావధానం, అర్థ శత, శత, ద్విశ తావధానాలు, మహా సహస్రావధానం నిర్వహించారు. తెలుగు నేల పైనే కాకుండా అమెరికా, సింగపూర్, లండన్, మలేషియా, దుబారు వంటి అనేక దేశాల్లో అవధానాలు నిర్వహించారు. ఆయన సాంప్రదాయవాది మాత్రమే కాదు, అభ్యుదయవాది కూడా. తన ఇద్దరు కుమారులకు శ్రీశ్రీ, గురజాడ అని పేర్లు పెట్టుకున్నారు. 'తన కోసం బ్రతికింది బ్రతుకు కాదు, పది మంది కోసం బ్రతికిందే బ్రతుకు' అంటారు గరికపాటి. ఆయన 'ఓషన్ బ్లూ', 'వైకుంఠపాళి', 'సాగర ఘోష', 'అవధాన శతకం' వంటి గ్రంథాలు రచించారు. అవధాన కిరీటి, శతావధాన, కళాప్రపూర్ణ వంటి బిరుదులు పొందిన గరికపాటి రామినేని ఫౌండేషన్ పురస్కారం, గురజాడ విశిష్ట పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు.
పేదల డాక్టర్‌కు పురస్కారం
పోలియోరహిత సమా జానికి నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్న డాక్టర్ సుంకర వేంకట ఆదినారాయణరావుకు ఈ ఏడాది 'పద్మశ్రీ' అవార్డుకు అరÛత పొందారు. విశాఖపట్టణంలో పేదల వైద్యనారాయణుడిగా గుర్తింపు పొందిన ఆయన లక్షలాది పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి తన మానవీయతను చాటుకుంటున్నారు. 1939 జూన్ 30న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో కనకం, శేషమ్మ దంపతులకు జన్మించారు. 1966లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీని, 1970లో ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి ఆర్థోపెడిక్ సర్జరీలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. విశాఖపట్టణం కేంద్రంగా ఎముకల శస్త్ర చికిత్స వైద్యులుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా పోలియో వ్యాధికి గురైన దివ్యాంగుల జీవితాలను చూసి చలించిన ఆయన, ఉచితంగా పోలియో శస్త్ర చికిత్సలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. విశాఖపట్టణంలోనే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉచితంగా పోలియో శస్త్ర చికిత్స శిబిరాలు నిర్వహిస్తున్నారు. 2006 మార్చి 20న రాజస్థాన్ లోని దోసా జిల్లాలో ఒక్కరోజు 250 మందికి పోలియో ఆపరేషన్ లు చేసి రికార్డు సృష్టించారు.
ప్రాణదాతలకు 'పద్మభూషణం'
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలు ఓ ఆశాకిరణమై ''కోవాక్జిన్' అనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలను కాపాడారు. వారి కృషికి ప్రభుత్వం 'పద్మభూషణ్' అవార్డును ప్రకటించింది. కృష్ణ ఎల్లా సాధారణ తెలుగు రైతు కుటుంబంలో 1969లో జన్మించారు. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడ కొంత కాలం ప్రొఫెసర్ గా సేవలు అందించారు. 1996లో భారతదేశానికి తిరిగివచ్చి, భార్య సుచిత్ర ఎల్లా తో కలసి హైదరాబాద్ లో 'భారత్ బయోటెక్' సంస్థను ప్రారంభించారు. తొలుత హెపటైటిస్.బి, రోటా వైరస్, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులతోపాటు, చికన్ గున్యా, జైకా వంటి వైరస్ వ్యాధులకు టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
కోవిడ్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో యావత్తు ప్రపంచం అగ్రరాజ్యాల వైపు ఆశగా ఎదురు చూస్తున్న సమయం అది. ఆ తరుణంలో భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఐ.సి.ఎం.ఆర్ తో కలసి స్వదేశీ విజ్ఞానంతో ''కోవాక్జిన్' వ్యాక్సిన్ తయారు చేసింది. దీనితో తెలుగువారి సమర్ధత యావత్తు ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. 300 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసి, భారతదేశ పౌరులకే కాకుండా, ప్రపంచంలోని 123 పైగా దేశాలకు వ్యాక్సిన్ ను అందించింది. ప్రస్తుతం 15 నుండి 18 ఏళ్ళలోపు పిల్లల కోసం వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.
'పద్మభూషణ్' వరించిన సత్య నాదెళ్ళ
సాంకేతికత ప్రపంచాన్ని శాసిస్తున్న కాలంలో గ్లోబల్ టెక్నాలజీలో దిగ్గజంగా ఖ్యాతి పొందిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి మన తెలుగువాడైన సత్య నాదెళ్ళ చైర్మన్‌గా ఉండటం మన జాతికి దక్కిన గౌరవం. ప్రవాస భారతీయుడుగా ఉండడం ఆయన సాధించిన విజయాలకు ప్రభుత్వం 'పద్మభూషణ్ అవార్డు'ను ప్రకటించింది. సత్య నాదెళ్ళ 1967 ఆగస్టు 19న హైదరాబాద్ లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన ఆయన 1992లో మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగిగా చేరారు. కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి 2014లో మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఒ గా, ఆ తర్వాత చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ వ్యాపారాన్ని 30 వేల కోట్ల డాలర్ల నుండి లక్షల కోట్ల డాలర్లకు చేర్చి, తన అసాధారణ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు.
సాంకేతిక నిపుణుడిగా 'సర్వర్ టూల్ బిజినెస్', 'క్లౌడ్ టెక్నాలజీ'లో పట్టు ఉన్న సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను గుర్తించి మైక్రోసాఫ్ట్ సేవలను విస్తరించడంలో ఆయన గుర్తింపు పొందారు. ఆత్మవిశ్వాసం, దార్శనికత, నిజాయితీ కలిగిన ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఒక భారతీయుడిగా ఆయన అందుకున్న విజయాలు ఈ తరానికి స్ఫూర్తిని ఇస్తాయి.
కళలు, సాహిత్యం, సామాజిక సేవ వంటి మొదలైన రంగాల్లో భారత ప్రభుత్వం అందించే ఈ పురస్కారాలు, సత్కారాలు ఆయా రంగాల్లో పని చేసేవారికి ఎంతో ప్రేరణను కలిగిస్తాయి. దాంతో మరింత ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు సాగి తమ కృషిని కొనసాగిస్తారు. అంతేకాదంటూ తాము ఎంచుకున్న లక్ష్యాల కోసం శ్రమిస్తూ తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టి విజయతీరాలకు చేరుకుంటారనడంలో సందేహం లేదు.
వ్యాసకర్త : కేంద్ర ప్రభుత్వం రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఉద్యోగి
- డాక్టర్ జె. విజయ్ కుమార్ జీ, 9848078109