Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువక దశలో ఉన్నప్పుడు ఇతను పాడిన వందేమాతరం గీతానికి పర్యవసానంగా ఆక్రోషించిన ప్రభుత్వం అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించింది. జైలులో ఉన్నప్పటికీ తన శాంతియుత నిరసన వాదాన్ని తెలుపుతూ ఉండగా గమనించిన పోలీసులు అతన్ని పదే పదే కొడుతుండగా కొట్టిన ప్రతీ దెబ్బకు కూడా 'వందేమాతరం.. వందేమాతరం' అంటూ నినదించాడే తప్ప కొట్టవద్దని ప్రాధేయపడలేదు. ఒక దేశ భక్తుడికి, స్వాతంత్య్ర పిపాసికి ఉండాల్సిన దేశభక్తిని, స్వాతంత్య్ర కాంక్షను రామచంద్రరావులో చూసి అనేకమంది స్ఫూర్తి పొందారు.
ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులు స్మశానంలోకి వెళితే ఎవరికి నష్టం. ఎముకలు ఉరికే వయస్సు తరిమే యువకిశోరాలు పోరాటంలోకి వెళ్ళకుండా ఉంటే ఎవరికి నష్టం. సోమరులు ఎక్కడ ఉన్నా తమ చుట్టూరా ఉన్న ప్రజలకే నష్టం. కాని యువకిశోరాలు పోరాటానికి దూరంగా ఉంటే దేశానికే తీరని నష్టం. అందుకు రామచంద్రరావు అడుగు ముందుకేసి ఉద్యమానికి దగ్గర య్యారు. ఎందరికో ఆదర్శమై వందేమాతర మయ్యారు. జన జిహ్వలపై నిత్య నినాదమయ్యాడు.
పుట్టుక, విద్య: వందేమాతరం రామచం ద్రరావు 1917 ఏప్రిల్ 25 వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ తాలుకా క్యాతూరు గ్రామంలో రామారావు, రామలక్ష్మమ్మలకు జన్మిం చారు. గద్వాల్లో ప్రాథమిక విద్యనభ్యసించి ఉన్నత పాఠశాల విద్య కొరకు కర్నూలు వెళ్ళారు. ఇక్కడి నుంచి కళాశాల చదువు కోసం తన అన్న అయిన వీరభద్రరావుతో 1931లో హైదరాబాదుకు వెళ్ళారు. హైదరాబాదు సిటీ కాలేజిలో బ్యాచిలర్ డిగ్రీని అధ్యయనం చేశారు. ఆశ్చర్యమో, విచిత్రమో గాని విద్యార్థి దశ ముగియకముందే సమాజాన్ని అర్థం చేసుకొని, దాన్ని సంస్కరించాలని, ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని తపించి సీతారాంబాగ్లో ఆర్య సమాజం శాఖను ప్రారంభించి అక్కడి ప్రజల అభ్యుదయానికి పాటు పడారు.
ఆ రోజుల్లో అంటే స్వాతంత్య్రానికి ముందున్న కాలంలో న్యాయవాద వృత్తికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. ఆ ప్రాధాన్యం వల్ల విద్యా సువాసననెరిగిన ప్రతి ఒక్కరూ న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేయుటకు ఆసక్తి చూపేవారు. అలాగే వందే మాతరం రామచంద్రరావు కూడా సిటీ కాలేజిలో డిగ్రీని పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 'లా' లో చేరారు. హైదరాబాదు పలు భాషా ప్రజల సమ్మేళనం అయినందువల్ల నాటి ప్రజలకు కొద్దోగొప్పో మూడు భాషలు, చదువుకున్న వారికైతే ఇంకో రెండు భాషలు ఎక్కువే వచ్చేవి. అలా రామచంద్రరావుకు హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠి భాషలపై లోతైన పట్టు ఉండేది.
ఉద్యమం: బానిసత్వంలో, నియంతృత్వ పాలనలో దోపిడీకి గురైన నిజాం హైదరాబాదు రాష్ట్ర ప్రజలు 'ఈ రాజ్యంలో బతకడం కన్నా స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలర్పించడం ఉత్తమమ'ని భావించారు. దాంతో వైవిధ్యమైన భావాలతో, వైరుధ్యమైన కొన్ని సంస్థల సిద్ధాంతాలతో పలు సంస్థలు, పలువురు నాయకులు ప్రజల చైతన్యం కోసం శ్రమించారు. ఆ సంస్థలలో ఒకటి ఆర్యసమాజం. హిందూ మత, ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతూ ప్రజలను అందుకు సమాయత్తపరుస్తూ తనదైన భావజాలంలోంచి ఉద్యమాన్ని చేపట్టిన సంస్థ ఆర్యసమాజం. వందేమాతరం రామచంద్రరావు విద్య కోసం హైదరా బాదు వచ్చి ఆర్యసమాజం పట్ల ఆకర్షితుడైన పరంపరలో తెలంగాణ అంతటా పర్యటించి ఆర్యసమాజ శాఖల్ని ప్రారంభించి ప్రజాక్షేత్రంలో 'మేలుకొలుపు' అనే విత్తనాలను చల్లి ప్రజలను మేల్కొల్పేలా చేశారు. హైదరాబాదు వందేమాతర ఉద్య మంలో ఆర్యసమాజం తరపున వందేమాతరం రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. యువక దశలో ఉన్నప్పుడు ఇతను పాడిన వందేమాతరం గీతానికి పర్యవసానంగా ఆక్రోషించిన ప్రభుత్వం అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించింది. జైలులో ఉన్నప్పటికీ తన శాంతియుత నిరసన వాదాన్ని తెలుపుతూ ఉండగా గమనించిన పోలీసులు అతన్ని పదే పదే కొడుతుండగా కొట్టిన ప్రతీ దెబ్బకు కూడా 'వందేమాతరం.. వందేమాతరం' అంటూ నినదించాడే తప్ప కొట్టవద్దని ప్రాధేయపడలేదు. ఒక దేశ భక్తుడికి, స్వాతంత్య్ర పిపాసికి ఉండాల్సిన దేశభక్తిని, స్వాతంత్య్ర కాంక్షను రామచంద్రరావులో చూసి అనేకమంది స్ఫూర్తి పొందారు. ఈ విధంగా అనేక దెబ్బలకు తట్టుకొని, దేశ స్వాతంత్య్రం కోసం ఎక్కడా వెనక్కి తగ్గలేదని తెలుసుకొని, ధైర్యానికి, శౌర్యానికి మెచ్చుకొన్న వీర సావర్కర్ వావిలాల రామచంద్రరావును వందేమాతరం రామచంద్రరావుగా మార్చారు. ఇలా కోటానుకోట్ల జాతి ప్రజల జిహ్వలపై నినాదంలా మారిన వందేమాతరాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న ఇతను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. హైదరాబాదు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాక అజ్ఞాతంగా ఉద్యమాన్ని సాగించారు.
రచనలు, పదవులు: హిందూ సంఘటనే, వీర సావర్కర్ జీవిత చరిత్ర(ఆంగ్లం), హైదరాబాద్ పై పోలీస్ చర్య, చైనా దురాక్రమణ, స్వామి దయానంద జీవితంలోని కొన్ని ఘట్టాలు వంటివి రాశారు. 1962లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి కె.వి. రంగారెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. అధికార భాషా సంఘానికి మూడవ అధ్యక్షు లుగా 1978-1981 వరకు చేశారు. స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాలనలో తెలుగు భాషను అమలు చేయడానికి కృషి చేశారు. ఈ కృషిని గుర్తించిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాల యాలలో, సంస్థలలో తెలుగు భాషను ఉపయోగించాలని జీవో విడుదల చేసింది. 1981లో అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి కూడా అధ్యక్షుడిగా చేశారు. ఈ విధంగా తన యావజ్జీవితాన్ని ఉద్య మానికి, ప్రజా శ్రేయస్సుకు అర్పించిన వావిలాల రామచంద్రరావు 2001 నవంబర్ 27న చనిపోయారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542