Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవమ్మ సిగలోన మెరిసే జమిలి పువ్వులు
కోయగోండు దొరల చెంచుల రాజ్యాలు
మూడేండ్ల కరువుతో అల్లాడే గిరిజనులు
శిస్తులు కట్టమని పీడించే రుద్రుడు
తిప్పికొట్టి 'రాజు' ఆజ్ఞలను అవలీల
కత్తిపట్టి కదనరంగాన శివమెత్తిన..
సమ్మక్క సారలమ్మల శౌర్యమే ఈనేల.....
తిరుగుబాటుకు ప్రతీకగా సాగించిన పోరాటగాథ ఈ నెలలో జరగబోయే ఆసియాలోనే అతి పెద్ద జాతర, వేదాలు దూరని కారడవి మేడారాం. విగ్రహాలు లేని వీర వనితలు 'కప్పం' కట్టమురా! అని ధిక్కారించే ఎవరికైనా, కత్తిలాంటి జ్ఞాపకం సమ్మక్క గిరిజన సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపం. కాకతీయుల పాలనకై తిరుగుబాటు నేపథ్యం అమాయక గిరిజన ఆరాధ్యదైవాలు ఈ వన వీరమాతలను కొలిచే జాతరే... మేడారం.
అరవై గుడిసెల సమాహారం జాతర సమయంలో నాలుగు రోజుల్లోనే మహానగరమవుతుంది. కోట్లాది ప్రజల గుండె చప్పుడవుతుంది. జనంతో జంపన్నవాగు జన సంద్రమవుతుంది. శివాలెత్తిన శివసత్తుల పూనకాలతో చెట్టూపుట్టా ఊగిపోతాయి. అడవిని ముద్దాడటంతో లక్షలాది అడుగులు దూలాడుతాయి. సామూహికత, సాక్షాత్కరిస్తుంది. రేల, దూల ఆటలతో దుమ్మురేగుతుంది. ఉన్నత సంప్రదాయం తిరుగాడుతుంది. ఇల్లు అంతా బంగారమై కొలువు తీరుతుంది. కుంకుమ భరిణె ఇంటింటి చుట్టమై పలకరిస్తుంది, దండకారణ్యం దండం పెడుతుంది.
పసుపు కుంకుమాలే పట్టు పితాంబర మవుతుంది. వీర వనితల రాక చీకటినీ చీల్చు కుంటూ వెలుగులు విర జిమ్ముతుంది. భావోద్వేగం కట్ట తెంచుకుంటుంది. ఒక్క పెట్టున సమ్మక్క సారక్కల జయ జయధ్వానాలు మార్మోగుతాయి. మమ్మూ సూడలేని పాలకుర్తి, పక్కకు దోసెసి అమ్మా! తల్లి... అంటూ శరుణూ ఘోషలతో దిక్కులు ఫిక్కటిల్లుతాయి. అమాయక జనం ఆవేదన ఆవేశం ఇలా మొక్కులతో చల్లార్చు కుంటారు. మేకలు, గొర్రెలు కోడి పుంజులతో కోరికల కొలువులు దీరుతారు. నిండు పున్నమిలా గూడెం గుండెలలో దాచు కుంటారు. అమ్మలను యాది చేసుకోవడం అంటే ఆత్మ విశ్వాస్వాన్ని నింపుకోవడం, వార్ని తలచు కోవడం అంటే ఒక నిరంతర పోరాటంగా మనల్ని మనం మలుచు కోవడం నమ్మిన జనం కోసం నమ్ముకున్న విలువకోసం, జాతి ఆత్మాభిమానం కోసం ప్రాణాల్ని త్యజించి మరణం తర్వాత కూడా జనం గుండెల్లో బతకొచ్చు అని నిరూ పించిన ధీర వనితలు సమక్క, సారలమ్మలు.
వీరత్వానికి ప్రతీకలు..
సమ్మక్క సారక్కలు ధిక్కారానికి ప్రతీకలు కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి (మొదటి ప్రతాపరుద్రుడు) పాలనా కాలం. వీరు తమ్ముడు మహాదేవరాజు కొడుకు గణపతిదేవుడు. ఆయన కూతురు రుద్రమదేవి. ఈమె కూతురి కొడుకు పేరు కూడా ప్రతాపరుద్రుడే ఈయనే కాకతీయ వంశానికి ఆఖరి చక్రవర్తి సమక్క పోరాటం ఈ ప్రతాపరుద్రుడి సైన్యంతో జరిగిందన్నట్టుగా అనేక కథనాలు వెలువడ్డాయి. మొదటి ప్రతాపరుద్రుడి (రుద్ర)దూవ మహారాజు పాలన కాలం (1159 నుంచి 1195) కాగా రెండవ ప్రతాపరుద్రుడి పాలనా కాలం (1289-1323) వరకు అంటే సమ్మక్క వీర మరణం ఇపుడు ప్రచారంలో ఉన్న కాలం కంటే 150 ఏండ్ల కిందటే జరిగినట్టు ఇది తప్పు, అని చరిత్ర పరిశోధన చెబుతుంది. సమక్క, సారక్క పోరాడింది. మొదటి ప్రతాపరుద్రుడి సైన్యంతో అయ్యుండొచ్చని కొందరు చరిత్ర కారులు అభిప్రాయానిక వచ్చారు. వారి నిజ చరిత్రలోకి వెళితే... మొదటి ప్రతాపరుద్రుడి పాలనలో పోలవాల ప్రాంతాన్ని మేడరాజు పాలిస్తుండేవారు. వరంగల్ జిల్లాను ఆనుకొని, కరీంనగర్ జిల్లా ప్రాంతాన్ని పొలవాస రాజ్యం అంటారు. మేడరాజు, కూతురు సమ్మక్కను మేడారం సామంత రాజు పగిడిద్దరాజు కిచ్చి వివాహం జరిపించాడు. పొలవాస ప్రాంతం, కరువు కాటకాలతో మూడేళ్లుగా ఇబ్బందుల్లో ఉన్నా సమయంలో పగిడిద్దరాజు కాకతీయ ప్రభువులకు 'కప్పం'' కట్టలేము. వచ్చేయేడు చెల్లిస్తాం అనగా... దీంతో ఆగ్రహించిన రుద్రదేవ మహారాజు తన సైన్యంతో యుద్ధానికి తరలివచ్చారు. పగిడిద్ద రాజుతో పాటు ఆయన కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మలు, కొడుకు జంపన్న యుద్ధ రంగంలోకి దూకి కాకతీయ సైన్యాలు సంపెంగ వాగును దాటకుండా నిలువరిస్తారు. కొంతపోరాటం తర్వాత పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మలు వీర మరణం పొందుతారు. శక్తివంతమైన ఆయుధ సామాగ్రి కలిగిన అరవీర భయంకర కాకతీయ సైన్యాల దాటికి సంప్రదాయ విల్లంబులు చేతబట్టి పోరడుతున్న కోయ సైన్యం నిలువలేకపోయింది. దీంతో జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత కాలం నుంచి సంపెంగ వాగును జంపన్న వాగును పిలుచుకుంటున్నారని చెబుతారు తన వాళ్ళు మరణించిని విషయం తెలుసుకున్న సమ్మక్క యుద్ధ రంగంలోకి దిగి కాకతీయ సైన్యాలతో తలపడుతోంది. ముఖాముఖి పోరాటంలో సమ్మక్కను ఎదుర్కోవడం అసాద్యమని కాకతీయ సైనికులు భావించి ఎట్టకేలకు సమ్మక్కను నిలువరించాలన్న యుద్ధ తంత్రం రచిస్తారు. వీరోచితంగా పోరాడుతున్న సమ్మక్కను వెనుక నుంచి వచ్చి ఒక కాకతీయ సైనకుడు బల్లెంతో పొడుస్తాడు. తీవ్రంగా గాయపడిన సమక్క రక్తం ఓడుతూ చిలుకల గుట్టవైపు వెళ్ళి మాయమవుతుంది. కోయ ప్రజలు తమ నాయకురాలి జాడ కోసం వెతకగా చిలుకల గుట్టలో కుంకుమ భరిణి లభిస్తుంది. దాన్నే సమ్మక్క ప్రతిరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, ''కుంకుమ భరిణె'' దేవతల ప్రతి రూపాలుగా కొలిచే గద్దెలు మాత్రమే... ఆలయం లేని అద్భుతం... విగ్రహాలు లేని విశ్వాసం, 'కొబ్బరి కాయ, గొర్రెపిల్ల, మేక పోతు, కోడిపిల్ల, కొబ్బరి కుడుక, పసుపు కుంకుమ నీ ఇష్టం, జాతర ప్రారంభమే సంబురం. ఇది మా అమ్మల కథ.
ప్రకృతి ఆధారణ ఆదివాసి సంస్కృతి, సామూహిక ఆట పాటల తెలంగాణ ప్రాంతానికే చారిత్రక పండుగ అపూర్వ చరిత్రకు జ్ఞాపకం అదొక ప్రాణమై ప్రవహించే శాశ్వత యాది సమాంతర సంస్కృతి, ప్రసిద్ద గిరిజన పండుగ చరిత్ర అంతా మహిళా ప్రతిఘటన విప్లవాత్మక ఆకర్షణ గురించి ఆసక్తికర విషయాలు కనపడుతాయి. పక్షం రోజులు జరిగిన పోరు, సమ్మక్క సారలక్కలు గెరిల్లా వార్ఫేర్ను పోలిఉండే వ్యూహాలు ఓడిపోయి కూడా గూడెం గుండెలలో గెలిచిన జనగాధ సమ్మక్క, సారక్క అమర్‌రహే.
తీరుమారుతున్న జాతర
కార్పొరేట్ల రంగప్రవేశం
ఆదివాసీ సంస్కృతిలో స్థిరాలయం లేదు. నిత్యం భజనలు, భక్తి గీతాలు, బ్రాహ్మణ మంత్రాలు, వేదాలు, యాగాలు, ఆదివాసులను అవరించి ఉండవు. ఒక నిర్ణీత వ్యవధిలో ప్రకృతినే దేవుళ్లుగా తెచ్చుకొని పూజించి సాగనంపడం వారి సంస్కృతి. దోపిడి, ఆధిపత్యం లేని స్వచ్ఛమైన సంస్కృతికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఏదో ఒక పేరుతో అడవి నుంచి అడవి బిడ్డల్ని వెళ్లగొట్టే కుట్రలు పాలకులు విధానాల్లోనే ఉన్నాయి. ఆద్యాత్మికత పేరుతో అభివృద్ధి పేరుతో ప్రశ్నించే తత్వాన్ని అణిచివేశారు. ప్రపంచంలో ప్రతిదీ సరుకుగా మార్చి లాభాలను కొల్లగొట్టుకునే బహుళజాతి కంపెనీల కన్ను ఈ జాతరపై పడింది. భక్తుల కంటే ముందే సంప్రదాయ మద్యం స్థానంలో ఐఎంఎఫ్ఎల్ విచ్చల విడిగా వచ్చేస్తుంది. ఇటీవల పాలకులు ఈ జాతరను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తానని బంగారు తెలంగాణలో సమ్మక్క సారక్కకు బంగారు గుడి కట్టిస్తానని దేవాదాయశాఖ ప్రతిపాదనలు తెచ్చారు. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. అభివృద్ది పేరుతో విధ్వంసమే, సంస్కృతి, ప్రకృతి, చరిత్ర అన్ని ధ్వంసం అవుతాయి. అక్కడొక వ్యాపార సామ్రాజ్యం నిర్మితమై బహుళ రాకాసి గద్దలు అడవిపై వాలు తారు. ఆదివాసీలను అవశేషాలుగా మిగు ల్చుతారు బ్రహ్మణోత్తముల వేదాలతో నిత్యం అడవి దద్దరిల్లుతోంది. పీఠాధి పతులు పుట్టుకొస్తారు. గర్భగుడిలో బంగారు విగ్రహాలు నట్టనడమ పూజారిని ప్రతిష్టించి దేవుడికి భక్తుడికి దూరం చేస్తారు. యాదాద్రీ, భద్రాద్రిలా మేడారం మేడాద్రీగా మారిపోయింది. యాదగిరి గుట్ట రాయికొండ్ల, గోలుకొండ చిలుకల గుట్ట, హన్మకొండ అన్నింటినీ ఆనకొండలు మింగుతాయి. నదులు వాగులు ఏరుల్లో ఇసుక మసకయై యామమవుతుంది. ఇప్పటికే కోర్కెలు తీర్చే కొమురెల్లి మల్లన్న అచార సాంప్రదాయాలు మార్చేసినారు. మనకు తెలియని దేవుళ్ళు, ఆశ్రమాలు ఎకరాల భూములు ఆకాశాన్నింటే విగ్ర హాలు పుట్టుకొచ్చాయి. జాతరకు ముందు తాత్కాలిక ఏర్పాట్ల పేరుతో అవినీతి, పేరుకు పోతుంది. కాంట్రాక్టర్లు ప్రజా ప్రతినిధులు దండుకుంటున్నారు. గిరిజ నుల మనోభావాల కణుగుణంగా కార్యా చరణ ఉండదు. ప్రజలు ఏమరపాటుగా చిలుకల గుట్ట, తిరుమల గుట్లగా వాణిజ్య కేంద్రగా మర్చాలనే కుట్రలు లేకపోలేదు. గుడిని గుడిలోని లింగాలను మింగేవాళ్ళు మన మధ్యే ఉన్నారు తస్మాత్ జాగ్రత్తా!
ఆదివాసీ ప్రజల దేవతలకు అణ గారిన సామాజిక సమూహాకు హిందుత్వ ప్రచారం యంత్రాంగంతో సారూప్యత ఏమి లేదని మనకు అర్థమవుతుంది. చరిత్రను చరిత్రగా చూడాలి. కానీ ఎప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి, కార్పొరేట్లు దృష్టి తప్పా! మేడారం జాతర నేపథ్యాన్ని సమగ్ర చరిత్రను వెలుగులోకి తేవాల్సిన బాద్యత గురించి ఆలోచించడం లేదు. చైతన్యాన్ని రగిలించే పోరాట చరిత్ర మేడారం అడవి బిడ్డలది. సమ్మక్క సారక్కల పోరాట స్ఫూర్తితో అటవీ హక్కుల కోసం సంస్కృతి పరిరక్షణ కోసం పోరుబాట రగిలిద్దాం! తుడుముమోత మోగిద్దాం! మేడాడంను రక్షిద్దాం!! సమ్మక్క సారలమ్మ అమ్మల చరిత్ర మేడారంలో పోటెత్తిన జనమంతా పెద్దది అంత ఉద్వేగ భరితమైనది కూడా....
- భూపతి వెంకటేశ్వర్లు, 9490098343