Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాట్య శాస్త్రం గురించి పిల్లల కోసం ఎటువంటి రచనా రాలేదు. ఆ లోటును పూడ్చేందుకు నటరాజు చేసిన కృషి ఇది. నిజానికి ఇతర ప్రక్రియల్లో రాసినట్టు నాట్యం గురించి రాయలేం. అందుకు అందులో అనుభవం ఉండాలి. బాలల మనస్తత్వం తెలియాలి. బాలలకు తెలిసిన భాష రావాలి. ఇవన్నీ తెలిసిన వారే ఇటువంటి శాస్త్ర విజ్ఞాన గ్రంథాలు రాయగలరు. నాట్యశాస్త్రాన్ని ఆపోసన పట్టారు గనుకనే నటరాజు పిల్లలకోసం నాట్యవేదాన్ని కూర్చారు.
'పద్మశ్రీ' పురస్కార సమ్మాన్యులు, భరత కళా ప్రపూర్ణ నటరాజ రామకృష్ణ పేరు వినగానే ప్రతి తెలుగువాడి కండ్ల ముందు నిలువెత్తు నాట్య సరస్వతీ మూర్తి సాక్షత్కరిస్తుంది. ప్రాచీన బౌద్ద కాలం నాటి నృత్య రీతిని పునరుద్దరించి 'ఆంధ్ర నాట్యం' పేర ఏడు దశాబ్దాల క్రితమే ప్రచారం చేశారు. ఆయన కృషితో అంత ర్జాతీయ ఆంధ్రనాట్యం ఖ్యాతిని సంపాదిం చుకుంది. తెలంగాణకే ప్రత్యేకమైన 'పేరిణి శివతాండవ' నృత్య రీతి ఆయన కరస్పర్శతో మళ్ళీ ఊపిరి పోసుకుంది. 10వ శతాబ్దంలో కాకతీయ జాయప సేనాని లక్ష్య, లక్షణం చేసిన రీతిలో రామప్ప రమణీయ శిల్పాలు ప్రేరణగా, నటరాజ రామకృష్ణ రూపంలో తిరిగి పునరుజ్జీవనం పొంది, పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
నాట్యనికి చిరునామాగా, భాష్యంగా నిలిచిన నటరాజ రామకృష్ణ మార్చి 31, 1933లో ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో పుట్టారు. తల్లి దమయంతి దేవిది నల్లగొండ, తండ్రి రామమోహన రావుది తూర్పు గోదావరి. నివాసం హైదరాబాద్. తండ్రికి ఇష్టంలేకున్నా నాట్యాన్ని అమితంగా ఇష్టపడి నేర్చు కున్నారు. మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, నాయుడుపేట రాజమ్మ, సత్యభామ వంటి ప్రసిద్ధ గురువుల వద్ద నృత్యాన్ని నేర్చుకున్నారు. పద్దెనమిదవ యేట నాగపూర్ రాజా గణపతిరావు పాండ్య వీరి నృత్యానికి మెచ్చి ఇచ్చిన బిరుదు 'నటరాజ'. ఆయన ఆ పేరుతోనే ప్రసిద్ధు డయ్యారు. నటరాజ రామకృష్ణ పరిశోధకులే కాదు రచయిత కూడా. దాదాపు నలభైకి పైగా వీరి రచనలు వచ్చాయి. వాటిలో 'దాక్షిణాత్యుల నాట్య కళా చరిత్ర', 'ఆంధ్రనాట్యం పరిశోధనా గ్రంథం', 'ఆంధ్ర నాట్య జానపద కళా నృత్యం', 'అర్ద శతాబ్ది-ఆంధ్రనాట్యం-ఆత్మకథ' మొదలగు పుస్తకాలు వీరి రచనలు. పిల్లలకు నాట్యవేదాన్ని వారికి అర్థమయ్యే రీతిలో అందించాలన్న తప నతో నటరాజ రామకృష్ణ బాలల కోసం మూడు పుస్తకాలు రాశారు. అవి 'నర్తన బాల', 'నర్తన కథ', 'నర్తన సీమ' గ్రంథాలు. 'నర్తన బాల' గ్రంథానికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారాన్ని ఇచ్చింది. 1967లో కేంద్ర ప్రభుత్వం బాలల సాహిత్యానికి ఇచ్చే పుర స్కారం లభించింది. తిరిగి 1962లో 'నర్తనబాల' గ్రంథానికి కూడా ఇదే పురస్కారాన్ని అందుకున్నారు.
బాలల కోసం అనేక వైజ్ఞానిక శాస్త్ర విషయాలను తొలితరం బాల సాహితీ వేత్తల్లో చాలా మంది పరిచయం చేయడం మనకు తెలుసు. ఈ కోవలోనే పిల్లలకు నాట్యశాస్త్రాన్ని పరిచయం చేయాలని రాసిన పుస్తకం 'నర్తనబాల'. అప్పటికే తెలుగులో వందలాది కథలు, గేయాలు, వ్యాసాల సంపుటాలు, నవ లలు, కొన్ని సైన్స్ విషయాలవంటివి పుస్తకాలుగా వచ్చాయి. కానీ నాట్య శాస్త్రం గురించి పిల్లల కోసం ఎటువంటి రచనా రాలేదు. ఆ లోటును పూడ్చేందుకు నటరాజు చేసిన కృషి ఇది. నిజానికి ఇతర ప్రక్రియల్లో రాసినట్టు నాట్యం గురించి రాయలేం. అందుకు అందులో అనుభవం ఉండాలి. బాలల మనస్తత్వం తెలియాలి. బాలలకు తెలిసిన భాష రావాలి. ఇవన్నీ తెలిసిన వారే ఇటువంటి శాస్త్ర విజ్ఞాన గ్రంథాలు రాయగలరు. నాట్యశాస్త్రాన్ని ఆపోసన పట్టారు గనుకనే నటరాజు పిల్లలకోసం నాట్యవేదాన్ని కూర్చారు. ఇందులో నాట్య శాస్త్రం అంటే ఏమిటి? నాట్యశాస్త్రం ఎలా పుట్టింది? దాని కథ ఏమిటి? నాట్యం నేర్చుకోవాలంటే పిల్లలు నేర్చుకోవాల్సిన తొలి పాఠాలు ఏమిటి? వంటివి వీటిలో చక్కగా చెబుతారు రచయిత. బాలన్నయ్య మాటల్లో చెప్పాలంటే నటరాజ రామకృష్ణ 'పిల్లలకు ఇచ్చిన అందాల బొమ్మ ఈ నర్తనబాల'.
ఈ పుస్తకం ఒకటి, రెండని కాదు అనేక విషయాలు తెలుపుతుంది. తెలుగువారి ఆంధ్రనాట్యం, కూచిపూడి, అస్సాములోని 'అంకియానట్', ఒడిశా 'ఒడిస్సీ', తమిళుల 'భరతనాట్యం', మలయాళ 'కథాకళి'బు, 'మణిపుర', ఉత్తర భారతంలోని 'కథక్', సిరై కేళా 'చౌ' వంటి అనేక నృత్యాలతో పాటుగా బాలి నృత్యం. సింహళ నృత్యం, థాయిలాండ్ నృత్యం, కంబోడియా నృత్యం వంటి అనేక రీతులను పరిచయం చేస్తుంది. అంతేకాదు నృత్య జగత్తుకు సేవలందించిన కళాకారులు, కవులు, కళాపోషకులైన అనేక మంది చక్రవర్తులు, రాజుల గురించి పిల్లలకు పరిచయం చేస్తారు. వారిలో తెలుగు, సంస్కృత, తమిళ, మలయాళ భాషల్లో పండితుడు, స్వయాన సంగీతజ్ఞుడైన తిరువాన్కూర్ ప్రభువు స్వాతి తిరునాళ్ మొదలుకుని అమిర్ కుస్రో, కుంభరాణా, విజయరాఘవ నాయకుడు, కొమరగిరి ప్రభువు, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు, జాయప సేనాని, చైతన్న మహా ప్రభువు, హరిదాస యోగి, మీరాదేవి, జయదేవుడు, నారాయణతీర్థులు, క్షేత్రయ్య వంటి అనేక మంది ఇందులో కనిపిస్తారు. ఇంతేకాదు బొమ్మలాట, పగటివేశాలు, భాగవతులు, సంధ్యా తాండవం వంటి వాటి గురించి కూడా పిల్లలకు సరళ సుందరభాషలో తెలుపుతారు నటరాజు. 'కళాప్రపూర్ణ', 'భరత కళా ప్రపూర్ణ' వంటి పురస్కారాలేకాక ఆంధ్రప్రదేశ్ అస్థాన నాట్యాచార్యుడుగా, సంగీతనాటక అకాడమి అధ్యక్షులుగా పని చేశారు. 'దాక్షిణాత్యుల నాట్య కళా చరిత్ర'కు రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. జూన్ 7, 2011లో కన్ను మూసారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548