Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్య, దాని ఫలితాల కోసం తపించిన రంగారావు, నల్గొండలో నాగార్జున ప్రభుత్వ కళాశాల స్థాపనకు కృషి చేశారు. సమాజం మారాల్సిన అవసరం అనివార్యమని తలిచి తన కలం ద్వారా దారిద్య్రం గురించి, ప్రజలకు తక్షణమే కావాల్సిన స్వేచ్చా, స్వాతంత్య్రాల గురించి పలు పద్యాలు రాశారు. అవి గోలకొండ కవుల సంచికలో ప్రచురితమైనాయి. తెలంగాణ ప్రజలను నిజాం ఎన్ని విధాలుగా దోచుకొని సంపదను దాచుకుంటున్నారో తన లోతైన దృష్టి ద్వారా గ్రహించి ప్రజలను సమాయత్తం చేయబునినారు. వైధవ్యం, బాల్య వివాహాలు, మూడనమ్మకాలు, వరకట్నం వంటి సామాజిక సమస్యల గురించి ప్రశ్నిస్తూ సంఘాన్ని సంస్కరించాలని భావించి అందుకు కృషి చేశారు.
కొంతమంది పుట్టుక సమాజ నిర్మాణానికి పునాది అవుతుంది. మరికొంత మంది పుట్టుక సంఘ ఉన్నతిని బలపరుస్తుంది. ఇంకొందరి పుట్టుక రెండింటినీ మేళవిస్తూ సామాజిక చీకటికి వెలుగౌతుంది. ఆ వెలుగే పులిజాల రంగారావు..
జననం, విద్యాభ్యాసం
ఇతను 1901 ఫిబ్రవరి 1న జన్మించారు. ప్రాథమిక విద్య 1912 వరకు హన్మకొండలో, 1912 నుంచి 1916 వరకు ఛాదర్ ఘాట్ హైస్కూలు హైదరాబాద్లోను, అనంతరం మళ్ళీ హన్మకొండలోను విద్యను కొనసాగించారు. విద్యాభ్యాసం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగి మరల హైదరాబాదుకు వచ్చి 1921లో న్యాయవాద పట్టాను స్వీకరించారు.
రంగారావుకు గ్రంథపఠనం ఎంత మక్కువనో, సంగీతమూ అంతే మక్కువ, ఆ రోజుల్లో వీధినాటకాలు బహు ఆదరణ పొందేవి. ఆ వీధి నాటకాలలోనూ నటించి తనకున్న నటనా కౌశలాన్ని నిరూపించుకున్నారు.
ఉద్యమం, సంఘసేవ
ఉద్యమానికి సాంస్కృతికంగా దారి వేసి స్వాతంత్య్రోద్య మాన్ని బలపరిచిన ఆంధ్ర మహాసభల స్థాపకుల్లో ఒకరు. ఏటేటా నిర్వహిస్తున్న సభల ద్వారా ప్రజావళిని సాంస్కృతికంగా సమాయత్తపరుస్తూ ఒక్కో ప్రాంతంలో సభలు జరుపుతూ చైతన్యవంతంగా సాగిస్తున్న మూడవ ఆంధ్ర మహాసభకు (ఖమ్మం) అధ్యక్షులుగా ఉన్నారు. ముస్లిం రాజ్యంలో మూడు ప్రాంతాల ప్రజలున్నా విభిన్న రకాల సంస్కృతులు కలిగి ఉన్న ప్రజల మిశ్రమ సంప్రదాయానికి పులిజాల వారు ప్రతినిధి. తాను నివసిస్తున్న సంఘాన్ని సంస్కరించాలని పరితపిస్తూ సాధ్యమైనంత మేరకు కల్లోల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేశారు. తెలంగాణ స్వాతంత్య్రానికి అడ్డుగా ఉన్న రజాకార్లతో పోరాడుతుండగా కాంగ్రెసు నాయకుడిగా ఉన్నారు. 1931లో మార్చి 3న దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, సభను ఏర్పాటు చేయడానికి ఎన్ని ఇబ్బందులను, ఇక్కట్లను ఎదుర్కొన్నారో చెప్తూ తెలంగాణ ప్రాంత వైశిష్ట్యాన్ని వెల్లడించారు.
సామాజిక నిర్మాణం కోసం ఎంత పరితపించినా, ఆత్మ సంతృప్తి కోసం ఏదో ఒక అభిలాషను ఏర్పరచుకుంటారు. రంగారావు కూడా తను సాహిత్య వ్యాసాలూ రాస్తూనే ఇతర శాస్త్రాలను స్వంతంగా అధ్యయనం చేసి వాటిలో నిపుణతను సాధించారు. హోమియో, హిప్నాటిజం, మెస్మరిజం, న్యాచురోపతి వంటి వైద్య విద్యలను స్వయంగా నేర్చుకొన్నారు. 1928 నుంచి రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిని నిర్వహిస్తూ ప్రజలకు తనకున్న వైద్య విజ్ఞానం ద్వారా చికిత్స చేసేవారు.
విద్య, దాని ఫలితాల కోసం తపించిన రంగారావు, నల్గొండలో నాగార్జున ప్రభుత్వ కళాశాల స్థాపనకు కృషి చేశారు. సమాజం మారాల్సిన అవసరం అనివార్యమని తలిచి తన కలం ద్వారా దారిద్య్రం గురించి, ప్రజలకు తక్షణమే కావాల్సిన స్వేచ్చా, స్వాతంత్య్రాల గురించి పలు పద్యాలు రాశారు. అవి గోలకొండ కవుల సంచికలో ప్రచురితమైనాయి. తెలంగాణ ప్రజలను నిజాం ఎన్ని విధాలుగా దోచుకొని సంపదను దాచుకుంటున్నారో తన లోతైన దృష్టి ద్వారా గ్రహించి ప్రజలను సమాయత్తం చేయబునినారు. వైధవ్యం, బాల్య వివాహాలు, మూడనమ్మకాలు, వరకట్నం వంటి సామాజిక సమస్యల గురించి ప్రశ్నిస్తూ సంఘాన్ని సంస్కరించాలని భావించి అందుకు కృషి చేశారు. ప్రజలు కేవలం విద్య ద్వారా మాత్రమే సామాజిక నడవడికను సక్రమంగా తెలుసుకుంటారని గ్రహించి ఆ విద్యను ప్రజలకు అందించడానికి గ్రంథాలయాలు, పుస్తక పఠనాలయాలు వంటివి ఏర్పాటు చేయాలని తలిచి అందుకు కార్య రూపం అమలు చేశారు. విద్య ద్వారానే ఏదైనా సాధ్యమని విశ్వసించి ఆ విద్య ప్రాధాన్యతను తెలిపాడు. ''ప్రేమ, త్యాగము, దేశసేవాసక్తి, స్వభావ ప్రకటనకు ఆలవాలమగు స్వయం వక్తిత్వం, ఆరోగ్యం, శాంతి, సౌశీల్యం, వినయము, వివేకము, పౌరధర్మముల యందు నైపుణ్యం, స్వయం, సహాయక శక్తి, జాతీయత మొదలైనవన్నీ విద్య వలేనే ఉత్పత్తి జెందును'' (చూ. పులిజాల రంగారావు మోనోగ్రాఫ్, పుట 43). ఈ విధంగా విద్యకున్న అతి ప్రాముఖ్యతను గుర్తించి నిత్యం సంఘ ఉన్నతి కోసం ఆలోచించారు.
అవిశ్రాంతంగా తాను నమ్మిన సిద్ధాంతానికి దూరం కాకుండా పది మంది క్షేమాన్ని కోరి తన జీవితాన్ని సంఘ అభివృద్ధి కోసం అంకితం చేసిన మహోన్నతమూర్తి అయిన రంగారావు శత వసంతాలకు సమీపంగా జీవించి అక్టోబర్ 30, 1999న కన్నుమూశారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542