Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా|| రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, చక్కటి ముందుమాట రాసారు. ఈ సంపుటిలో 22 వ్యాసాలున్నాయి. భారతీయ సంస్కృతిలో మిళితమైన రంజాన్ పండగ- ప్రపంచీకరణ పై పోటెత్తిన కవితా సంద్రం- ప్రపంచీకరణలో కవిత్వం ధోరణలు- ప్రపంచీకరణ -పరాయికరణ, స్త్రీవాదం- ఒక పరిశీలన... సాహిత్యంలో మార్క్సిస్ట్ ఆలోచనా విధానం- తెలుగు కథానిక వికాసం- ఆత్మ గౌరవ కవితా గానం లాంటి వ్యాసాలు రచయితలోని విమర్శకుణ్ని చూడగలం.
ప్రపంచీకరణ- తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల మీద చూపిన ప్రభావాన్ని రెండు వ్యాసాల్లో విమర్శనాత్మక విశ్లేషణ బాగుంది. భారతీయ సమాజ జీవితంలోని భిన్నత్వాన్ని ప్రపంచీకరణ ద్వంసం చేసిన తీరును కుమారస్వామి లోతుగా వివరించిన తీరు బాగుంది. అందరికీ అర్థం అయ్యేలా రాయడం మంచి విషయం. అధ్యయన నిబద్ధత వల్లే ఇది సాధ్యం.
చారిత్రక దృష్టి- భౌతికవాద ధృక్పధం- మార్క్సిస్ట్ ఆలోచనలతో రాసిన ఈ వ్యాసాలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి. సూర్యకుటుంబ వయస్సు సుమారు 500 కోట్ల సంవత్సరాలు. హౌమోసిపియన్ ప్రారంభమైనప్పటి నుంచి శాస్త్రవేత్తలు కాలాన్ని యుగాలుగా విభజించారు. క్రీ.పూ. 1,50,000-5000 - సంవత్సరాలు రాతియుగంగా, కీ.పూ. 5000-3000 సంవత్సరాలు రాగి యుగంగా, కీ.పూ. 3000-1400 సంవత్సరాలు ఇత్తడి యుగంగా, కీ.పూ. 1400-500 సంవత్సరాలను ఇనుపయుగంగా మానవ ప్రస్థానాన్ని విభజించారు. అంటారు. (పేజీ 15)
''సమాజంలో సౌందర్యం'' అనే వ్యాసంలో మనిషిలో ఆనందాన్ని ఆయా ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆ అందం ఆనందాన్ని కలిగిస్తుంది- అంటారు రచయిత. భావుకత-ప్రేమ-సహజాతాలే కదా!! లియోనార్డో డావిన్సీ గీచిన మోనాలీసా చిరునవ్వు అందమైనదే కాని ఒక వ్యక్తి వలచిన ప్రేయసి నవ్వు అంతకన్నా అందంగా వుంటుంది. (పేజీ . 18) అంటారు రచయిత.
''దళితులకు నిజమైన రాజ్యాధికారం పొలంగట్ల దగ్గర వుందని నమ్మిన కమ్యూనిస్టులు దళితులకు భూమి పంచాలని ఎప్పటి నుండో పోరాటం చేస్తూనే ఉన్నారు'' అంటారు రచయిత. ''దున్నేవాడిదే భూమి'' నినాదం అదేకదా. క్రీపు. 3వ శతాబ్ధంలోనే పాశ్చాత్య సాహిత్య మీమాంస పుట్టింది. భారతీయ సాహిత్యంలో విమర్శ చాలా ప్రధానమైంది. అలంకారికులు ధ్వని- వక్రోక్తి - అలంకారాలు- శైలి- మొదలైన అంశాల పరంగా కావ్యాన్ని పరామర్శించారు. ఇది క్రీ. శ 1వ శతాబ్ధంలో భరతునితో ప్రారంభమైంది. అంటారు. (పేజీ 39)
క్రీ.పూ. 400 నాటికే అంధక భాష సాహిత్య భాషగా ఉంది. తెలుగు భాషకు ప్రాచీన రూపమే అంధక భాషట. బ్రాహ్మణాలు క్రీ.పూ. 900-700 మధ్య కాలం నాటివి (పేజీ .45) రామాయణ- మహాభారతాలలో ''మానవతా విలువలు'' వ్యాసం రచయిత ఎంపిక చేసుకున్న విజ్ఞానాంశాలకు భిన్నంగా అనిపించింది. మొత్తంగా చూసిన వారి కృషి అభినందనీయం.. ''భారతీయ సాహిత్యంలో సృష్టి పరిణామ వాదం' వ్యాసం (పేజీ, 87) చాలా విలువైనది. ఉపయుక్తకరమైనది. ప్రతి ఇంటా ప్రతి ప్రజాకార్యకర్త దగ్గర ఉండాల్సిన చక్కటి కరదీపిక- ఇది కుమారస్వామి కృషి అభినందనీయమైనది.
రచయిత: పిళ్ళా కుమారస్వామి
పేజీలు : 144 వెల రూ. 125/-
ప్రతులకు: పిళ్ళా లక్ష్మిదేవి
ఔ/శీ పి.వి. కుమార స్వామి రెడ్డి
సాహితీ స్రవంతి అనంతపురం, ఆంధ్రప్రదేశ్.
ఫోన్9490122229
- తంగిరాల చక్రవర్తి, 9393804472