Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్పల సత్యనారాయణాచార్య రాసిన 'శ్రీకృష్ణ చంద్రోదయం'కు 2003లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. 'ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు', 'శతరూప', 'గజేంద్ర మోక్షం', 'వేణు గీత', 'కచదేవయాని', 'యశోదానందగేహిని' మొదలగునవి వీరి ఇతర ప్రసిద్ద కావ్యాలు. సినీగేయ రచయితగా 1976 'యవ్వనం కాటేసింది' అనే సినిమాతో 'తెరంగేట్రం' చేశారు. 'బొమ్మరిల్లు', 'విజయ' వంటి మరికొన్ని సినిమాలకు పాటలు రాశారు. కవిగా రచయితగా, పాఠ్య పుస్తక రచయితగా, వక్తగా ప్రసిద్ధులైన ఉత్పల పిల్లల కోసం గేయ గాథలను చందమామలో రాశారు.
'చందమామ' ఈ పేరు వినగానే నిన్న మొన్నటి తరాల తెలుగు పిల్లలకే కాదు పెద్దలకు అనేక అనుభవాలు, అనుభూతులు, మరెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. అది చందమామ గొప్పతనం. పదమూడు భారతీయ భాషల్లో, సింహళ భాషలో, గిరిజన భాష అయిన సంతాలిలో అచ్చయ్యింది. 'చందమామ' పాఠకులకు దాసరి సుబ్రహ్మణ్యం, విద్వాన్ విశ్వం, వసుంధర, గంగిశెట్టి, మాచిరాజు, బూర్లె, ఉత్పల సత్యనారాయణాచార్య వంటి పేర్లు చిరపరిచితాలు. మిగతా అందరు కథా రచయితలైతే చందమామలో గేయ చందమామగా వెలిగినవారు ఉత్పల సత్యనారాయణచార్య. ఈయన ప్రౌఢ పద్యకవి, సినీ గేయ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఉత్పల జూలై 24, 1927న ఖమ్మం జిల్లాలోని చింతకాని గ్రామంలో పుట్టారు.
ఉత్పల సత్యనారాయణాచార్య రాసిన 'శ్రీకృష్ణ చంద్రోదయం'కు 2003లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. 'ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు', 'శతరూప', 'గజేంద్ర మోక్షం', 'వేణు గీత', 'కచదేవయాని', 'యశోదానందగేహిని' మొదలగునవి వీరి ఇతర ప్రసిద్ద కావ్యాలు. సినీగేయ రచయితగా 1976 'యవ్వనం కాటేసింది' అనే సినిమాతో 'తెరంగేట్రం' చేశారు. 'బొమ్మరిల్లు', 'విజయ' వంటి మరికొన్ని సినిమాలకు పాటలు రాశారు. కవిగా రచయితగా, పాఠ్య పుస్తక రచయితగా, వక్తగా ప్రసిద్ధులైన ఉత్పల పిల్లల కోసం గేయ గాథలను చందమామలో రాశారు. ధారా వాహికంగా వచ్చిన వీరి గేయకథలతో చందమామ షోఢష కాంతులు చిమ్మింది. ఈ గేయకథలను చందమామ ప్రెస్ 1962లో 'ఉత్పలమాల' పేరుతో ప్రచు రించింది. దీనిని 'చందమామ ద్వారా తన బాలగేయ కావ్యాలను లోకానికి అందించి నందుకు' నాగిరెడ్డి - చక్రపాణిలకు అంకితం చేశారు. బాలల గేయకథ 'గంగావతరణం' పుస్తకానికి 1959లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం లభించింది. 1993లో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమి 'బాలబంధు' పురస్కారం అందుకున్నారు. బాలల రచనాలయం, హైదరాబాద్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
19670-90 ప్రాంతంలో వీరు రాసిన అనేక రచనలు ప్రాథమిక, మాధ్యమిక పాఠ్యపుస్తకాలలో చేర్చారు. విద్యార్థిగా నేను వీరి పాఠాలు చదువు కున్నాను. చందమామ అచ్చువేసిన వీరి 'ఉత్పలమాల' బాలల గేయ కథల పుస్తకంలో 'గంగావతరంణం', 'క్షీరసాగర మథనము', 'శమంతక మణి' కథా గేయాలు ఉన్నాయి. గంగావతరణం అయిదు ఆశ్వాసాల కావ్యం. భగీరథుడు గంగను భువిపైకి ప్రవహింపజేయడం ఇందులోని కథ. సగరుడు మొదలగు చక్రవర్తుల గురించిన చక్కని కథ ఇందులో ఉంది.
'సగరు డనెడి మహరాజు / చాల గొప్ప బలవంతుడు / అతనికి ఇద్దరు భార్యలు / అరవైవేల కుమారులు' అంటూ సాగిందీ కథ. సగరుడు అశ్వమేథ యాగాన్ని చేయ సంకల్పించడం, యాగాశ్వాన్ని దేవతలరాజు దేవేంద్రుడు బంధిస్తాడు. తరువాత అశ్వాన్ని వెతికి తేవాల్సిందిగా తన కుమారులను ఆదేశిస్తాడు సగరుడు. వెతకగా.. వెతకగా చివరకు ఒక గుహలో వారికి ఆశ్వం కని పిస్తుంది. అక్కడే తపస్సు చేసుకుంటున్న కపిలమహర్షి అశ్వాన్ని బంధించాడని సగరకుమారులు అతని గడ్డం గుంజి, అల్లరి చేస్తారు. ముని క్రోధంతో కళ్ళు తెరిచి చూసే సరికి మాడిమసైపోయి బుడిద కుప్పలుగా మారిపోతారు. 'రాకుమారులు ఏమయిరో / రాకుండిరి ఎన్నాళ్ళకు / యజ్ఞాశ్వము ఏమయినదో / ఆచూకి లేకున్నది'. అంతలోనే బటుడు సగర కుమారులు గుహలో బుడిదగా మారడం గురించి చెప్పగా, తన తండ్రులను, గుర్రాన్ని తేవడానికి మనమడు అంశుమంతుడుని పంపుతాడు. గుహలోకి ప్రవేశించిన అతనిని కపిల మహర్షి దీవించి, 'ఇట గంగను పారించిన / ఎల్లరకు శాంతికలుగును' అని సూచిస్తాడు. తరువాత తీవ్రమమన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 'మంగళకర జలతరంగ! / గంగా ఇటు ప్రవహింపుము' అని బ్రహ్మ ఆదేశించడంతో భువిపైకి గంగ వస్తుంది. ఇంతేకాదు మరో రెండు ఆశ్వాసాల్లో గంగావతరంలో జరిగిన అనేక విశేషాలను ఉత్పల ఇందులో చెబుతారు.
'క్షీరసాగర మథనం' కథ మనకు తెలిసిందే. దీనిని ఆరు ఆశ్వాసాల గేయకథగా మలిచాడు కవి. అందులోనూ గేయ ఛందస్సులో చేయితిరిగిన కవి చేతిలో ఈ కావ్యం మరింతగా శోభలు సంతరించుకుంది. '...ఈ కొండను కవ్వముగా / ఏర్పరించి చిలికినచో / అమృతమిందు పుట్టగలదు / అది త్రాగిన చావుండదు!'', 'హరహరహర మహదేవ! / కరుణింపుము సాంబశివా! పాలవెల్లిఓ పుట్టిన / హాలహలము మాన్పు, శివా!', 'అంత చంద్రుడుదయించెను / అమృతకాంతు లొలికించెను' వంటి గేయ పాదాలు ఉత్పవారి రచనా పటిమకు, బాలలకు నచ్చేవిధంగా చెప్పే గేయరీతికి తార్కాణాలు. 'శమంతకమణి' కూడా ఆరాశ్వాల బాలల గేయ కావ్యమే. ఈ కథ కూడా ప్రసిద్ధమే. ప్రౌఢ పద్యకవిగా సాహిత్య అకాడమి పురస్కారం అందుకుని, అదే కోవలో బాలల కోసం కూడా రాసి జాతీయ, రాష్ట్ర బాల సాహిత్య పురస్కారాలు అందుకున్న మాన్యులు ఉత్పల సత్యనారాయణాచార్య. వీరు 10 అక్టోబర్, 2007లో కన్ను మూశారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548