Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరెన్ని ఉపద్రవాలను చూడలేదు !?
వాటన్నింటికీ తుది మొదలు ఉన్నాయి..!
అవన్నీ ప్రకతి ప్రకోపాలు మాత్రమే కాదు
కూలిపోతున్న జీవితాల ఆనవాలు!
కెరటం పడి లేచినట్టు
ప్రకోపాలు ఉపశమించాయి...
కానీ, మిత్రమా!
కొన్ని జీవితాలు విధివంచితాలు
మోడుబారడం..., చిగురించడం...
అటుంచితే..
ఏ మంటలలోనో ఎగిసిపడి
కూకటి వేళ్లతో సహా బూడిదైపోయాయి.
ఆకాశమే నాకు అండదండగా ఉన్నప్పుడు
నాకేమిటని ఎంతో ధీమాగా ఉండే నక్షత్రాలు, మేఘాలు, మంచు,
అనాథలై వెక్కివెక్కి ఏడ్చినట్లు,
ఆశావహమైన ఏ ఒక్క పరిణామమూ కనిపించక
వీర కిశోరులు సైతం విషాదంలో పడిపోతారు.
నిజమే కదా...!
సంతోషమైనా.. దుఃఖమైనా నీతోనే అనడం
అవతలి వ్యక్తి హదయపు నిబద్ధతను చెబుతుంది.
కానీ,
దుఃఖం తర్వాత సంతోషం వచ్చే అవకాశం
అసలే కనిపించనప్పుడు
ఎదుటివారిని నిరీక్షణలో ఉంచడం ఏ రకమైన నీతి?
అందుకే,
అంతేలేని ఈ దుఃఖ సాగరపు అంచున నిలబడి
జీవితాన్ని బలిచేసుకోవడం కన్నా,
ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించమని
ఏ హదయమున్న ప్రేమికుడైనా చెబుతాడు.
ఆ కొత్త సంసార జీవితానికి
అందరి కన్నా ముందే శుభాకాంక్షలు చెబుతాడు.
నీ కొత్త జీవితపు ఆనందాన్ని చూసి
ఆనందపడే అవకాశాన్నయినా
ఈ నిట్టూర్పుల మధ్య నాకు దక్కనీ అంటాడు.
నిజానికి సముద్రాన్ని చేతుల్లోకి తీసుకోలేనప్పుడు
తరంగాన్ని తాకి తన్మయం చెందడంలోనే
హదయ ఔన్నత్యం, ఒక గొప్ప జీవన పరిణతీ ఉన్నాయి.
- పొన్నం రవిచంద్ర,
9440077499.