Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రకరకాల సందర్భాల్లో నా ఎమోషన్ని ముద్దాడుతాడు. నాపై చిలిపి వెన్నెల కురిపించి నెమలి అందాలను చూస్తాడు. కిటికీ తెరిచినప్పుడు నా మనసు తెరిచినట్టే అనిపిస్తుంది. తెల్లవారు జామున పిల్ల గాలిలానో, మధ్యాహ్నం వేళ సూటి కిరణంలానో, సాయంత్రం పూట పచ్చని పకృతిలానో, రాత్రికి వెన్నెలలాపలకరిస్తాడు. వాడికి ద్వారాలు అవసరం లేదు. అన్నింటిలో కలిసిపోయి నాలోకి చేరిపోతాడు. కిటికీ ముందు కూర్చున్నప్పుడు సమయం ఓడిపోతుంది. ఎంతసేపటి నుంచి కూర్చున్నానో తెలియదు కాని ఆకాశం నక్షత్రాలను అక్కడక్కడ పొదుగుతోంది. ఒకవైపుగా చంద్రుడు ఆకాశానికి వెన్నెల ఊపిరిని ఊదుతున్నాడు. నా కిటికీ నుంచి గదిలోకి, మదిలోకి నక్షత్రమై, వెన్నలై విచ్చుకున్నాడు. వాడు విచ్చుకున్నప్పుడు నేను రెక్కలు రెక్కలుగా విడుగుతాను. వాడు నా మీద నుంచి పుప్పొడిని లాగేసుకుంటాడు. నేను ప్రేమగా సిగ్గుపడి ముడుచుకుపోతాను.
పని ముగించుకొని కాస్త అలా పడుకుందామని బెడ్‌పై వాలాను. ఏవేవో ఆలోచనలు తీగల్లా చుట్టుముట్టాయి. ఏ తీగను పట్టుకొని నడిచినా తన జ్ఞాపకాలు మేఘాలై కురుస్తున్నాయి. ఏమని చెప్పను? నా జీవితాన్ని చుట్టుముట్టిన అందమైన రాక్షసుడు వాడు. ప్రేమగా చూస్తాడు, ఉరుములా గర్జించి నా మార్గంలో వెలుతురు పిట్టలు వదులుతాడు. నేనొక చీకటినైతే కిరణమై వెలగమంటాడు, సముద్రమైతే కెరటంలా ఎగరడం నేర్పుతాడు. మా మధ్యన ఉన్నది ప్రేమ, ఆకర్షణ, శారీరక సంబంధమని చెప్పి మా బంధానికి పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు. మా బంధం అతీతమైనది. ఇద్దరు మనుషులు శారీరకంగా కలిస్తేనో, మానసికంగా ఏదైనా బంధం ఏర్పర్చుకుంటేనో అది ప్రేమ ఎలా అవుతుంది?. కొంతమంది వ్యక్తులకు బంధాలతో సంబంధం ఉండదు.
మేమిద్దరం ఒక ఇంట్లో కలసి లేకపోతే ఏమైంది? ఆకాశాన్ని కప్పుకునే కదా ఉన్నది. తను భూమి మీద అలా నడిచినప్పుడు నా గుండెల్లో సంగీతం మోగుతుంది. తను నా గురించి అలోచించినప్పుడు అప్రయత్నంగానే నా చేతుల్లో నక్షత్రాలు వెలుగుతాయి. ఇక నిద్ర పట్టదని అర్థమయ్యింది. లేచి కిటికీ తెరిచాను బయట ఎవరూ కనపడలేదు. దూరంగా ఏ తల్లి విసిరిందో తెలియదు కాని సూర్యుడు నిండుగా వెలుగు తున్నాడు. ఎన్ని యుగాలు దాటిందో!? చల్లని గాలి నా నుదుటిని తాకి అలా పరిగెత్తింది. తను కూడా అంతే నన్ను అలా స్పర్శించి వెళ్ళిపోతూ ఉంటాడు. గాలిని నా గదిలో సంకెళ్లు వేసి కూర్చోబెట్టడం ఇష్టం ఉండదు. అడవులను, నదులను, కుళ్ళిపోయిన మనసులను, జ్ఞాపకాలు తుడిచిపెట్టుకొని ఖాళీగా తిరుగుతున్న మనుషుల శరీరాల్లోకి ఇంకిపోయి శుభ్రపరచాలి. వాడు కూడా అంతే కాలం వంగిన చోటకు, సముద్రపు చివరి అంచు వరకు వెళ్లి ఏవో మాట్లాడుతుంటాడు, కొన్నిసార్లు పోట్లాడుతుంటాడు. గాలికి, నీరుకు మనకు ఏం సంబంధం ఉందని? వాడు కూడా అంతే సంబంధం లేకుండా నన్ను చీల్చుకొని నాలోకి ప్రవహిస్తాడు.
పంచభూతాలు మనతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. వాడు కూడా ఒక ఎమోషన్ మాత్రమే. రకరకాల సందర్భాల్లో నా ఎమోషన్ని ముద్దాడుతాడు. నాపై చిలిపి వెన్నెల కురిపించి నెమలి అందాలను చూస్తాడు. కిటికీ తెరిచినప్పుడు నా మనసు తెరిచినట్టే అనిపిస్తుంది. తెల్లవారు జామున పిల్ల గాలిలానో, మధ్యాహ్నం వేళ సూటి కిరణంలానో, సాయంత్రం పూట పచ్చని పకృతిలానో, రాత్రికి వెన్నెలలా పలకరిస్తాడు. వాడికి ద్వారాలు అవసరం లేదు. అన్నింటిలో కలిసిపోయి నాలోకి చేరిపోతాడు.
కిటికీ ముందు కూర్చున్నప్పుడు సమయం ఓడిపోతుంది. ఎంతసేపటి నుంచి కూర్చున్నానో తెలియదు కాని ఆకాశం నక్షత్రాలను అక్కడక్కడ పొదుగుతోంది. ఒకవైపుగా చంద్రుడు ఆకాశానికి వెన్నెల ఊపిరిని ఊదుతున్నాడు. నా కిటికీ నుంచి గదిలోకి, మదిలోకి నక్షత్రమై, వెన్నలై విచ్చుకున్నాడు. వాడు విచ్చుకున్నప్పుడు నేను రెక్కలు రెక్కలుగా విడుగుతాను. వాడు నా మీద నుంచి పుప్పొడిని లాగేసుకుంటాడు. నేను ప్రేమగా సిగ్గుపడి ముడుచుకుపోతాను. నన్ను ఆక్రమించుకొని పెదవులకు జీవాన్ని అద్దుతాడు. అప్పుడు తెలుస్తుంది నేను జీవం లేని శరీరాన్ని అని. గడ్డకట్టుకుపోయిన నా శరీరంలోకి తన ప్రాణాన్ని వదిలి శూన్యంలోకి జారుకుంటాడు.
ఎప్పుడు వస్తాడో! ఎప్పుడు వెళ్తాడో! తెలియదు. నాలో ఇంత తడిని నింపి రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాడు. నేనేమో శూన్యంలోకి చూపులను వదిలి తీక్షణంగా కూర్చుంటాను. తను నాకొక ఎమోషన్, క్యారీ ఫార్వర్డ్, చూపుడు వేలై దారి చూపుతాడు, బొటన వేలై విజయాన్ని మోసుకు వస్తాడు.
కింద ఏదో అలజడి, ఎవరో గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు, బంధాల గురించి, ప్రేమల గురించి శాతాలను నిర్ణయించుకొని గొడవపడుతున్నారు. వాళ్లు కిందే ఉంటారు. పైకి వచ్చే మార్గం, బుద్ధి లేదు. బుద్ధిని కోల్పోయారు. ప్రేమకు కొలతలు ఉండవని, బలవంతంగా ప్రేమ మొక్కలు వృక్షాలు అవ్వవని ఎప్పుడు తెలుసుకుంటారో!. జీవితాన్ని, బంధాలను కొలతలుగా లెక్కిస్తున్న వారికి, కొనాలని, కాజేయలని చూస్తున్న వారికి ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది? వాళ్లు యంత్రాలు, కపట దీపాలు, జీవం లేని వెండి గిన్నెలు, బంగారు గొలుసులు.
నేను మట్టి, వాడు తడి.
వాడు మేఘం, నేను వర్షం.
వాడు విత్తనం, నేను మొక్కను, చెట్టును, వృక్షాన్ని మళ్ళీ వాడిలో కలిసే వితనాన్ని.
- విరూపాక్షి