Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మికుల కన్నీళ్లు తుడిచిన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు
మగ్దుం మొహియుద్దీన్ కష్టాలలో ఉన్న కార్మికుల కన్నీళ్లను తుడిచిన కార్మిక సమస్యల పరిష్కర్త. ఎక్కడ సమస్య ఉద్భవిస్తే అక్కడ పరిష్కారాన్ని రచించే శాసనకర్త. ఒక మనిషి తన జీవితాన్నే ఆదర్శంగా తీసుకొని జీవించినప్పుడు ఇతరుల జీవితాల లోతు ఏంటో తెలుస్తుంది. ఈ పై వాక్యానికి సరైన ఉదాహరణ కమ్యూనిస్టు నాయకుడైన మగ్దుం మొహియుద్దీనే.
జననం, విద్యాభ్యాసం
ఇతని జన్మదినాన్ని పలువురు పలు రకాలుగా ఉదాహరించడం వలన నిరాధారంగా ఏ తేదీ సరైనదనే నిర్ధారణకు రావడం అప్రమాణికత అవుతుంది. అందుకని జన్మదినాన్ని విస్మరించి పరిశీలించిన పిమ్మట అటు పుట్టిన సంవత్సరం 1908 అని సప్రమాణికంగా తెలుస్తుంది. ఇతను మెదక్ జిల్లాలోని ఆందోల్ గ్రామంలో గౌస్ మొహియుద్దీన్, ముంతాజ్ భేగంలకు జన్మించాడు. ఇతని నాలుగేళ్ల వయసులో తండ్రి పోవడంతో తల్లి మరొకరిని పెళ్ళాడి వెళ్ళింది. దీంతో కన్నవాళ్ళ ఆదరణ కరువైన మగ్దుం అనేక కష్టాలు పడ్డాడు. ఎవరి సాయం చేతనో హైదరాబాదు చేరి 'ధర్మవంత' పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాక సంగారెడ్డిలోని వసతి గహాలలో ఉంటూ మెట్రిక్ పూర్తి చేసాడు. జీవిక కోసం చిత్రాలలోని తారల బొమ్మలు, పెయిటింగులు వంటివి అమ్మాడు. ఆ తర్వాత 1929 లో ఉన్నత విద్యకై ఓయూలో చేరాడు. 1937లో మాస్టర్ డిగ్రీని పొందాడు.
సామాజిక ఉద్యమం
ఉన్నత విద్య అయ్యాక పూట గడపడానికి పాట్లు పడుతున్న సమయంలో ఒక నవాబు దగ్గర ప్రేమ లేఖలు రాసే పనిలో చేరాడు. అక్తర్ హుస్సేన్, సిబ్తేహసన్లతో అభ్యుదయ రచయితల సంఘం స్థాపించాడు. ఇక్కడి నుండే సమాజంలోని అసమాన పరిస్థితులను అవగాహన చేసుకో నారంభించాడు. హైదరాబాదు సంస్థానంలో కార్మికుల కడగండ్లను గురించి తెలుసుకున్నాడు. పాలనకు ఎదురులేదన్న ధోరణిలో సాగుతున్న నిజాం ప్రభుత్వాన్ని ఎదురించిన కమ్యూనిస్టు సిద్ధాంతం చేత ప్రభావిత మయ్యాడు. సంస్థాన ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ చేసిన ప్రసంగాలకు ఆగ్రహించిన ప్రభుత్వం అరెస్టులకు తెర లేపింది. దాంతో 1943 లో తొలిసారి మగ్దుంను అరెస్టు చేసింది. తాను విప్లవ కవిత్వాలు రాసి, వాటితో ప్రజలలో ప్రభావాన్ని కలిగిస్తుండని భయంతో బెదిరిన నిజాం సర్కార్ కనిపిస్తే కాల్చివేత అనే ఆదేశాన్ని జారీ చేసింది. కొంతకాలం ''జైలులో ఉన్నప్పుడు 'తెలంగన్' అనే ఉర్దూ కవిత రాశాడు. దానిని దాశరథి క్రష్ణామాచార్య 'తెలుగు పిల్ల' పేరుతో తెలుగులోకి అనువదించగా అది చాలా ప్రసిద్ధి పొందింది'' (పుట 115, తెలంగాణ వైతాళికులు-జన నేతలు).
నాడు అల్లకల్లోలంగా ఉన్న రాజకీయాల గురించి ఇతను పలుమార్లు పలువురితో చర్చించేవాడు. ఒకసారి సరోజినీ నాయుడు గారి గహం 'గోల్డెన్ త్రెషోల్డ్' లో అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి గులాం హైదర్, చండ్ర రామేశ్వరరావు, రాజ్ బహదూర్ గౌర్, హమీద్ ఆలీఖాన్లతో సమకాలీన అంశాలపై చర్చలు చేశాడు. నాటి సంస్థానంలో అనేక రకాల పరిశ్రమలు ఉండేవి. వాటిలో వేలకొద్దీ కార్మికులు శ్రమించేవారు. అలా వందకు పైగా ఉన్న కార్మిక సంఘాలకు ఒకే ఒక్కడు అధ్యక్షుడు అయ్యాడు. ఇది మగ్దుం మొహియుద్దీన్ పట్ల కార్మికులకు ఉన్న విశ్వాసం. తమ సమస్యలను ఇతనే పరిష్కరిస్తాడని అనుకున్న కార్మికులు మగ్దుంకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా నిరంతరం ప్రజల కోసం పోరాడిన ఇతనికి ప్రజలు ప్రజా స్వామ్యయుత అధికారం ఇచ్చి తొలి సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి అసెంబ్లీకి సాగనంపారు.
రచనలు
కష్టాలను, కన్నీళ్లను విరివిగా చూసిన వారికి, అనుభవించిన వారికి కష్టాలే కవిత్వపు అక్షరాలై పుట్టుకోస్తారు. ఆ అక్షరాలే ఆహారపు మెతుకులౌతారు. మగ్ధుం జీవితంలో ఇది రుజువైంది. తనకున్న రచనా శక్తిని గుర్తించి సినిమా వారే తన వద్దకు తరలి వచ్చినా, పేదలకు అండగా ఉండడం కోసం, వాళ్ళ కష్టాలను రూపు మాపటం కోసం తన బంగారు జీవితాన్ని త్యాగం చేశాడు. సినిమాలకు పాటలు రాసే అవకాశాన్ని వదులుకున్నాడు. ఇతను కార్మిక పక్షపాతి. కష్టాలకు శత్రుపతి.
ఉర్దూ కవిగా ప్రసిద్ధి పొందిన ఇతను ''సుర్క్ సవేరా (అరుణోదయం) 1944లో, లో గుల్ ఏ తర్ (తాబీపూవు) 1961 లో, బిసాతే రాక్స్ (నాట్య వేదిక) 1966 లో రాసాడు. ఇవి కవితా సంపుటాలు. 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. కవిత్వమన్నా, కవి సమ్మేళనమన్నా ఇష్టపడే మగ్దుంను తన మిత్రుడు, నాటి రాష్ట్రపతి అయిన వి.వి. గిరి ముషాయిరాకు దిల్లీకి ఆహ్వానించాడు. ఆ ముషాయిరాలో అందరిని ఆనందింపచేసి తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. ఆ మర్నాడు1969 ఆగస్టు 25 న గుండెపోటు రావడంతో దిల్లీలో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూనే ఆగస్టు 26 ఉదయం ఆఖరి శ్వాస వదిలాడు.
- ఘనపురం సుదర్శన్,
9000470542