Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజావారు కొడుకుని రాజును చేస్తానన్నారు. ఇప్పటికాలం కాదు గదా, రాకుమారుడు 'అప్పుడేనా తొందరెందుకు నాన్నగారూ' అన్నాడు వినయంగా. ఇప్పుడప్పుడే రిటైరైపోయి కొడుకు తల మీద కిరీటం పెట్టటం రాజావారికీ ఇష్టం లేదు. మాటవరసకి అడగాలి కనక అడిగారంతే!జ 'రాజుల కర్తవ్యం కొడుకుల్ని రాజుల్ని చెయ్యడమే కదా కుమారా!' అందుకే అడిగాను. సరే నీ ఇష్టం. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడే ఇచ్చేస్తా సింహాసనం' అన్నాడు రాజు.
రాజావారి పర్మిషనుతో సంచుల్లో నాణాలు తీసుకుని దేశాలు తిరిగి వస్తామని బయల్దేరాడు రాజకుమారుడు తెల్లగుర్రం మీద. అతన్ని అనుసరించాడు మంత్రి కుమారుడు నల్లగుర్రం మీద.
ఎడారులూ, అడవులూ, కొండలూ, వాగులూ, వంకలూ దాటుతూ దారిలో వివిధ రాజ్యాల్నీ అక్కడి 'అడ్మినిస్ట్రేషన్'నీ తెల్సుకుంటూ బోలెడు 'ఎక్స్పీరియన్స్' మూటగట్టుకుంటూ ఉన్నారు తెల్లగుర్రం రాకుమారుడు నల్లగుర్రం మంత్రి కుమారుడు.
దొరికిన చోట పిజ్జాలు, బర్గర్లు, దొరకని చోట అన్నమూ కూరాచారూ తింటూ గుర్రాలకు గుగ్గిళ్ళూ దొరకని చోటుల వాటికిష్టమైన గడ్డీ తినిపిస్తూ రాకుమారుడూ మంత్రి కుమారుడు ఆ నగరం చేరుకున్నారు.
నగరంలోకి వెళ్దామా అన్నాడు రాకుమారుడు. ఈ నగరంలో ఏముందని పేదరికం తప్ప. ముందుకు వెళ్ళిపోదాం అన్నాడు మంత్రి కుమారుడు.
అలా అనకోరు. బండ్లు బోట్లవుతయి, బోట్లు బండ్లవుతయి అంటారు. అటు చూడు నగర స్వాగత తోరనం అన్నాడు రాకుమారుడు. చూశాడు మంత్రి కుమారుడు.
ధగధగా మెరిసిపోతున్నవి తోరణ స్తంభాలు. అవాక్కయ్యాడు మంత్రి కుమారుడు. 'బంగారం! అంతా బంగారం! చొక్కం బంగారం!' అని అరిచాడు.
'ఇంత మార్పు ఎలా వచ్చిందో, వెళ్ళి చూద్దాం!' అన్నాడు రాకుమారుడు. వీళ్ళ మాటల్ని బట్టి ఎటు వెళ్ళాలో అర్థం చేసుకున్న గుర్రాలు స్వర్ణ నగరం అని రాసున్న బంగారు తోరణం కిందుగా నగర ప్రవేశం చేశాయి.
గుర్రాల గిట్టల చప్పుడు మరో రకంగా వినపడ్డంతో కిందికి చూశాడు రాకుమారుడు. ఆశ్చర్యం! బాటంతా బంగారమే. బంగారం మీద గుర్రాలు హుశారుగా దౌడు తీస్తున్నవి. చుట్టుపకసర్కల చెట్ల మొదళ్ళన్నీ బంగారువే. అక్కడక్కడా కనపడే ఇళ్ళన్నీ బంగారు వాకిళ్ళున్నవే.
ఎటు చూసినా కనపడుతున్న బంగారాన్ని చూస్తూ పేదరాసి పెద్దమ్మ అని గోల్డెన్ లెటర్సు ఉన్న బోర్డును చూసి ఆ ఆవరణలోకి వెళ్ళి గుర్రాలు దిగారు.
లోపలికి పోబోతుంటే మెట్ల దగ్గర బంగారు గాబు దాన్నిండా నీళ్ళు , ఆ పక్కనే బంగారు చెంబూ కనిపించాయి. కాళ్ళు కడుక్కుంటూ మంత్రి కుమారుడు చెంబుతో గాబును కొట్టాడు. 'టంగ్'మంది. బంగారమే అనుకున్నాడు.
ఇద్దరూ తెరిచి ఉన్న బంగారు తలుపుదాటి హాల్లోకి ప్రవేశించారు. ఆసనాలన్నీ బంగారువే. గోడ గడియారము గోడమీది ఫొటో ఫ్రేంలూ అన్నీ బంగారువే.
ఆశ్చర్యంతో నోట మాటరాలేదు ఇద్దరికీ. పేదరాసి పెద్దమ్మ వచ్చింది. రండి రండి అంటూ. నవ్విన ఆమె నోటిలో దంతాల సెట్టు బంగారుదే.
అవ్వా ఇదివరకు వచ్చాం కానీ ఇలా లేదు ఇప్పుడెక్కడ చూసినా బంగారమే కన్పిస్తున్నది' అన్నాడు రాకుమారుడు.
అరవ్వయ్యేళ్ళ అవ్వ ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కిసుక్కున నవ్వింది బంగారం మెరిసేట్టు. 'ఇది వరకేమో గాని ఇప్పుడిది స్వర్ణ నగరం బాబూ. మా రాజావారు ఈ నగరాన్ని బంగారు నగరంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అన్న మాట ప్రకారం అంతా బంగారం చేసేశారు. మా నగరం ముందు సింగపూరూ, న్యూయార్కు పనికి రావు' అంది అవ్వ. ఆ రోజు అవ్వ దగ్గర వుండి మర్నాడు ఆ ఇద్దరూ మంత్రి కుమారునికి చుట్టమైన ఆ నగరపు మంత్రి కుమారుడ్ని కలిశారు.
అసలు విషయం చెప్పాడు ఆ నగరపు మంత్రి కుమారుడు. నగరాన్ని బంగారు నగరం చేస్తానని మాట యిచ్చి రాజయిన మా రాజుగారు ఎక్కడ్నించో ఒక మహా యోగిని తీసుకువచ్చారు. ఆయన మంత్ర మహిమ వల్ల నగరం అంతా బంగారు మయంగా కనిపిస్తున్నది. ఇదంతా ఒట్టి రంగే! బంగారమని ప్రజల్ని నమ్మిస్తున్నారు. రాజావారి భవనమూ వారి కుటుంబ సభ్యుల బంధుమిత్రుల భవనాలు వాటిలోని సామాగ్రి మాత్రం రాగి కవలని అచ్చమైన బంగారానివే. వాటి కారణంగానే నగరానికి స్వర్ణనగరం అని పేరు పెట్టారు అన్నాడు.
ఆ మాటలు విన్న రాకుమారుడు మంత్రి కుమారుడు ఇదా స్వర్ణ నగర రహస్యం అనుకుంటూ ముక్కల మీద వేళ్ళు వేసుకోవడం కూడా మరచి వెళ్ళిపోవడానికి గుర్రాలు ఎక్కారు!
-చింతపట్ల సుదర్శన్, 9299809212