Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పందొమ్మిదో శతాబ్ది మద్యకాలంలో హైదరాబాద్‌లో ఏ సాహిత్య సమావేశం జరిగినా, గ్రంథాలయ సభ జరిగినా, అక్కడ ఒక పొడవాటి, బక్కపలచని, నిరాడంబరమైన వ్యక్తి తాపీగా పాన్ నములుతూ కనిపించేవాడని, తెరిచిన పుస్తం లాంటి ఆయన తెలుగు సాహిత్యంలో పరిశోధన మొదలు పరిష్కరణ వరకు, కవిత్వం మొదలు జీవిత చరిత్రల వరకు చేపట్టి సుసంపన్నం చేయని ప్రక్రియ లేదంటారు ప్రముఖ పాత్రికేయులు టి.ఉడయవర్లు. ఆయన మహా పండితులు పండిత ఆదిరాజు వీరభద్రరావు పంతులు.
1880వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని దెందుకూరులో పుట్టారు. తండ్రి ఆదిరాజు లింగయ్య పంతులు, తల్లి వేంకమాంబ. బాల్యం నుంచే తెలుగు భాష పట్ల ఆదిరాజుకు అపారమైన మక్కువ ఉండేది.
తెలుగు భాషాభివృద్ది కోసం హైదరాబాద్‌లో ఏర్పాటైన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి రావిచెట్టు రంగా రావు కోరికపై కొంత కాలం గ్రంథాలయాధికా రిగా పనిచేశారు ఆదిరాజు. తరువాత 1908లో మద్రాసు చేరి విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలితో ఉన్నారు. ఈ సమయంలోనే 'రమేశచంద్ర దత్తు' 'ఉమేశ చంద్ర బెనర్జీ', 'రావిచెట్టు రంగారావు జీవిత చరిత్ర' లను 'జీవిత చరితావళి' పేరుతో ప్రచురించాడు. తిరిగి హైదరాబాద్‌కు మకాం మార్చి 1914-21 మధ్య మహబూబ్ కాలేజీలో, 1921 నుండి 1948 వరకు చాదర్‌ఘాట్ పాఠశాలలో, ఉద్యోగ విరమణానంతరం కూడా 1953 వరకు నారాయణగూడ బాలికోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.
గ్రంథాలయోద్యమం, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర పరిశోధక మండలి, లక్ష్మణరాయ పరిశోధక మండలి, విజ్ఞానవర్ధనీ పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వంటి అనేక సంస్థలకు సన్నిహితునిగా, స్థాపక సభ్యునిగా, వివిధ పధవుల్లో సేవలందించారు. 'చిత్రశాకున్తలము', 'చారిత్రక పరిశోధక వ్యాసములు', 'ప్రాచీనాంధ్ర నగరములు', 'తెలంగాణము', 'మన తెలంగాణము', 'గ్రీకు పురాణ గాథలు' వీరి రచనల్లో కొన్ని.
భాషా సాహిత్య సేవకునిగా, పరిశోధకునిగా అనేక ప్రామాణిక గ్రంథాలు రాసిన ఆదిరాజు వీరభద్రరావు బాలబాలికల మనోప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని 1920 ప్రాంతంలోనే బాలల కోసం రచనలు చేసినా బాల సాహిత్య చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు. పిల్లలకు విజ్ఞానం, వినోదం కలిగించే రచనలు, వీరగాథలు, చారిత్రక పౌరాణిక గాథలు, కల్పనా కథలను పేమ, ఉత్తమ శౌశీల్యం పెంపొందే దిశగా పిల్లల కోసం అందించాలన్నది వీరి తపన. వీరి బాల సాహిత్యంలో 'చైతన్యము', 'లలిత కథావళి', 'రత్న ప్రభ', 'నవ్వుల పువ్వులు', 'జీవిత చరిత్రలు', 'మిఠాయి చెట్టు' వంటివి ప్రముఖమైనవి.
వీరి బాల సాహిత్యంలో అన్ని పేరుపొందినా 'మిఠాయిచెట్టు' పేరుతో వచ్చిన కథల సంపుటి ఎక్కువగా ఖ్యాతి చెందింది. ఇది మూడు కథల సంపుటి. ఇందులో 'మిఠాయిచెట్టు', 'తామర కొలను', 'నలుగురు పాటకులు' అనే వినోదాత్మక కథలున్నాయి. మిఠాయి చెట్టు కథ అనేక కథా సంకలనాల్లోనూ, పాఠ్యపుస్తకం లోనూ చేర్చబడింది. 'చైతన్యము' పిల్లల కోసం రాయబడిన రచన. ఇందులో చైతన్య ప్రభువు, యులిస్సీజ్, మధుకైటభులు, జేమ్స్ రాల్ఫీల్డ్ మొదలగు మహనీయుల గురించి రాయబడింది. 'లలిత కథావళి' ఇది చరిత్ర, కళలకు సంబంధించిన అజంతా ఎల్లోరా, రమేశ్చంద్ర దత్తు, పెరుస్యుస్, శ్రావణి వంటి వ్యాసాలు పిల్లలకు ఆయా విషయాలపట్ల అవగాహన కలిగించేందుకు రాయడం జరిగింది. పాఠ్య పుస్తకాల్లో వీరి అనేక రచనలు చేర్చబడ్డాయి.
ఆదిరాజు బాలల రచనల్లో చేసిన గొప్పపని కూడా ఉంది. అరేబియన్ నైట్స్ వంటి కథలను అలాగే రాస్తే ఇక్కడి పిల్లలకు అది ఎలా చేరుతుందని భావించి 'అల్లావుద్దీన్ విచిత్ర దీపం' కథకు తెలుగుపేర్లు పెట్టి, తెలుగు వాతావరణాన్ని చేర్చి 'రత్నప్రభ' పేరుతో రచించాడు. ఇంగ్లీష్‌లో వివిధ విషయాలను 'టిట్‌బిట్స్'గా రాయడం మనకు తెలుసు. అదే కోవలో తెలుగులో అలా రాస్తే ఎలా ఉంటుందని ఆలోచించి కొన్ని ఆంగ్ల సంఘటనలకు తెలుగువేషం కట్టి వాటిని 'నవ్వుల పువ్వులు' పేరుతో పిల్లలకు అందేట్టు కూర్చారు. మరో మంచి గ్రంథం 'జీవిత చరిత్రలు', దీనిని పిల్లలకు ఉత్తమ సారస్వతం అందించాలన్న ప్రభుత్వంవారి ఆదేశానన్ననుసరించి సారస్వత పరిషత్తు ప్రచురించింది. ఇందులో శ్రీకృష్ణ దేవరాయలు, మార్కొపోలో, మీరాబాయి, శ్రీహర్షుని జీవత కథలున్నాయి. వీరి బాల సాహిత్యాన్నంతా నేటి 'ఆంధ్ర సారస్వత పరిషత్తు' (తెలంగాణ సారస్వత పరిషత్తు) బాల సారస్వతం శీర్షికన ప్రచురించడం విశేషం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సారస్వత పరిషత్తు బాల సాహిత్యానికి చేసిన కృషి ఎక్కడా నమోదు కాక పోవడం బాధాకరం. మహా పండితుడు, తెలంగాణ బాల వాజ్ఞయబ్రహ్మ ఆదిరాజు వీరభద్రరావు పంతులు సెప్టెంబర్ 29, 1973న కన్ను మూశారు.
- డా|| పత్తిపాక మోహన్,
9966229548.