Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. ఏ రాజు ఏ రాజ్యాన్ని ఏ సంవత్సరంలో ఎంత కాలం పరరిపాలించారు అంటే... కొందరికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా లభ్యమయినా... మరికొందరివి మాత్రం ఇంకా లభ్యమవుతూనే ఉన్నాయి.. అలాంటి వాటిలో కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందిన కొన్ని శిలలు ఈ మధ్య బయల్పడినవి..
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త తెలంగాణ చరిత్ర బందం పరిశోధకుడు బలగం రామ్మోహన్ స్థానికులు భూమేష్, సాయినాథుల సహకారంతో పెద్దసంఖ్యలో సతిశిలలను గుర్తించారు. కొన్నింటిని గుడులలో పూజిస్తుండగా, మరికొన్నింటిని ఒక దగ్గర కుప్పపోసారు. దొరికిన శిల్పాలు, ఇతర నిర్మాణాల శైలుల ఆధారంగా ఈ సతిశిలలు కల్యాణి చాళుక్యుల కాలానికి చెందినట్లుగా తెలుస్తున్నది. సాధారణంగా గుజరాత్, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపించే సతి శిలలు ముధోల్, పరిసర ప్రాంతాలైన బాసర, చుచుంద్, కల్లూరు గ్రామాల్లో కూడా కనిపించాయి. బాసర, ముధోల్లలో ఇవి పెద్ద సంఖ్యలో లభించడం గమనార్హం. అయితే స్థానికులు పదుల సంఖ్యలో సతిశిలలను ఊరిచెరువులో పారవేసినట్లు పేర్కొంటున్నారు. దీన్ని బట్టి ఈ ప్రాంతంలో సతి ఆచారం విశేషంగా వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.
ముధోల్ ఒకప్పటి జైన కేంద్రం
ముధోల్లో వర్ధమాన మహావీరుని విగ్రహం ఒకచోట, దాని అధిష్ఠానపీఠం మరోచోట లభించాయి. ఆ అధిష్ఠాన పీఠం మీద ప్రస్తుతం గణపతి విగ్రహం ఉంది. దీని సమీపంలో భూమి లోపల సున్నపు పొర, భారీగా ఇటుకలు లభించాయి. వీటితో పాటు జైన బసదులలో కనిపించే మెట్టు వంటి ఒక శంఖలతాతోరణ శిల్పాన్ని గుర్తించడం జరిగింది. ఇవి అంతకు ముందు ఇక్కడ ఒక నిర్మాణం ఉన్న ఆధారాన్ని ఇస్తున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ జైన మతం బాగా అభివద్ధి చెందినట్లు, జైనబసది నిర్మించబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటుకల పరిమాణాన్ని బట్టి ఇవి శాతవాహన కాలానికి చెందినవి.
- చారిత్రకక్షేత్ర పరిశోధన :
బలగం రామ్మోహన్,
9989040655, కొత్త తెలంగాణ చరిత్ర బందం
పర్యవేక్షణ : శ్రీరామోజు హరగోపాల్