Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో లంబాడీల పాత్ర వీరోచితమైనది, ఘనమైనది. సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలో రజాకార్లు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఉద్యమకారులు ఊరికి దూరంగా ఉన్న లంబాడీ తండాల్లో తలదాచుకునేవారు. తండావాసులు సైతం ఉద్యమకారులకు అండగా నిలిచి ఆశ్రయం కల్పించేవారు. ఉద్యమకారుల జాడ వెతుక్కుంటూ రజాకార్లు, పోలీసులు తండాలపై దాడులు చేసి, మహిళలను, పిల్లలను హింసించినా జాడ మాత్రం చెప్పేవారు కాదు. అటువంటి ఓ కుటుంబంలో జన్మించి, దేశ్‌ముఖ్‌లను ఎదురించే వీరమరణం పొందినవాడే జాటోత్ ఠాణునాయక్.
జీవితం
పోరాట యోధుడు జాటోత్ ఠాణునాయక్ నాటి ఉమ్మడి వరంగల్ (నేడు జనగామ జిల్లా)లోని విస్నూర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మాపురం పరిధిలోని పడమటి తండాలో జాటోత్ హాము-మంగ్లీబాయిలకు జోద్యా నాయక్, సోమ్లా నాయక్, సక్రు నాయక్, ఠాణు నాయక్, దర్గ్యా నాయక్, కిషన్ నాయక్ అని ఆరుగురు సంతానం. వారిలో నాల్గవ సంతానంగా ఠాణు నాయక్ జన్మించాడు. జనగామ తాలూకాలోని ధర్మాపురం, దేవరుప్పుల, రామావరం, మొండ్రాయి తదితర ప్రాంతాలు దట్టమైన అడవిగా ఉండేది. జాటోత్ హాము నాయక్ ఆధ్వర్యంలో పడమటి తండావాసులు దాదాపు 80 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు. ఈ భూముల్లో పంటలు బాగా పండుతుండడంతో ధర్మాపురం వెలమ దొర పుసుకూరి రాఘవరావు, ఈ భూమి తన పట్టా అని తండా వాసులను 1931 నుంచే వేధించసాగాడు. సాగు చేస్తున్న భూములను ఆక్రమించుకునేందుకు దొర అనేక సార్లు తన గుండాలను వారి మీదకు పంపించాడు. అయినా నెరవక దొరగుండాలను తరిమి కొట్టారు. 1944లో రాఘవరావు, విస్నూర్ దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి సహాయంతో అధిక సంఖ్యలో గూండాలను ధర్మాపురానికి పంపి వారిపై దాడి చేయించారు. లంబాడీలు సైతం కారం పొడి, రోకళ్లనే ఆయుధంగా వాడుకొని ఎదురు నిలబడి దొరలకు పెద్ద ఓటమిని చవిచూపించారు.
తెలంగాణ రైతాంగ పోరాటానికి ముందే విస్నూర్ దేశ్‌ముఖ్ దొరల భూముల ఆక్రమణ మొదలైంది. వారి అరాచకాలు, అన్యాయాలను జాటోత్ ఠాణునాయక్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఠాణు నాయక్ కుటుంబంలోని మహిళలు, చిన్న చిన్న పిల్లలు సైతం పోరాటంలో తమ వంతు పాత్ర పోషించారు. ఠాణు నాయక్ మాతమూర్తి ధీశాలి మంగ్లీ బాయి కారంపొడి, రోకళ్లను ఆయుధాలుగా చేసుకుని రజాకార్లను తండా నుంచి తరిమి తరిమికొట్టింది. ప్రతీకారంగా ఠాణు నాయక్ కుటుంబాన్ని అంతం చేయడానికి పోలీసులు, గూండాలు ఎంతో ప్రయత్నం చేశారు. చివరికి ఠాణు నాయక్ మూడో అన్న సక్రు నాయక్ గూండాలకు పట్టుబడ్డాడు. సక్రును చిత్రహింసలు పెట్టి, జైలులో వేసి నరకయాతనకు గురిచేశారు. తర్వాత పెద్దవాడైన జోద్యా నాయక్, కొన్నాళ్ళ తర్వాత రెండో అన్న సోమ్లా నాయక్‌ను సైతం రజాకార్లు వదల్లేదు. పోలీసుల చర్య అనంతరం ఠాణు నాయక్ కుటుంబ సభ్యులపై దాడులు ఉధతమయ్యాయి. అయినా ఠాణు నాయక్ కుటుంబం కష్ట నష్టాలను లెక్క చేయకుండా రైతాంగ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచింది. అత్యంత ధైర్యశాలి, ధడ శీలి ఠాణు నాయక్‌ను సజీవంగా బంధించేందుకు రజాకార్లు, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయినా అతని జాడ తెలుసుకోలేక పోయారు. చివరికి ఓ ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు జాటోత్ ఠాణునాయక్ మొండ్రాయి సమీపంలోని నీలిబండ తండాలో శత్రువుల చేతికి చిక్కాడు.
రామావరం దేశ్‌ముఖ్ కఠారు నర్సింగరావు ఎడ్లబండికి కట్టించి, ఈడ్చుకుంటూ వచ్చి తండా వాసులు చూస్తుండగా ఠాణు నాయక్‌ను 1950, మార్చి 20న కాల్చి చంపారు. అలా ఠాణునాయక్ ఓ గొప్ప వీరపోరాట యోధుడిగా వీర మరణం పొందాడు. ఠాణునాయక్ తమ్ముడు దర్గ్యా, మరో పోరాట యోధుడు నల్లా నరసింహులును ఓ కేసులో అరెస్టు చేసి మరణ శిక్ష విధించారు. తర్వాతి కాలంలో దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో దొరల దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా లంబాడీల్లో వచ్చిన చైతన్యం ఓ మరుపురాని ఘట్టం.
- ఇస్లావత్ దేవేందర్,
9652249371.