Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిలుకయ్య, చిలుకమ్మ తమ కూతురికి పెండ్లి చేయాలనుకున్నారు. అబ్బాయిని కూడా చూశారు. తాము నివసించే మర్రి చెట్టు తొర్రలోని ఇంటికి నాలుగు ఇండ్ల అవతల వేపచెట్టు తొర్రలో తలిదండ్రులతో నివసిస్తున్నాడు. బుద్ధి మంతుడు. పరుషంగా ఎవరినీ ఒక మాట అనడు. ఎంత దూరమైనా వెళ్ళి తన వాళ్ళకు ఆహారం సంపాదించుకొచ్చే నేర్పు ఉంది. అబ్బాయి నచ్చి పెండ్లి నిశ్చయం చేసుకున్నారు,
''పెండ్లికి కేవలం మన చిలుకలనే పిలుద్దాం. మన బంధు వర్గమే వేలల్లో ఉంది. పరిమితంగా పిలిచి, సంతప్తిగా భోజనం పెడితే అందరూ మెచ్చుకుంటారు. వచ్చిన వారికి ఆహారం సరిపోకుంటే అడవంతా నానా యాగీ చేస్తారు. పెండ్లికి పిలిచి చిలుకమ్మ భోజనం పెట్టలేదని కలిసిన వారికల్లా చెపుతారు. మన పరువు తీస్తారు'' అన్నాడు చిలుకయ్య.
''లేదు. నేను విందు గురించి బాగా ఆలోచించాను. ఉన్నది ఒక్కతే కూతురు. మళ్ళీ పెండ్లి చేయము కదా. అడవిలో ఉన్న మన పక్షి జాతినంతా పిలవాల్సిందే. అందరికీ సరిపడే ఆహారాన్ని ఇప్పటినించే పోగు చేద్దాం. ముందు ఏడు తరాల వాళ్ళు మనం చేసిన పెండ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పటికే మా అన్నయ్యలనూ, తమ్ముళ్లనూ ఆహార సేకరణ కోసం పంపించాను. భయపడకు'' అంది చిలుకమ్మ.
''సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం'' అన్నాడు చిలుకయ్య. మామిడి ఆకుల మీద శుభలేఖలు రాయించి అడవిలోని పిచ్చుక మొదలు, రాబందు వరకు పంపిణీ చేశారు. శుభ గడియ రానే వచ్చింది. మర్రి చెట్టు కిందనే పెండ్లి. నేలంతా శుభ్రం చేసి రకరకాల ముగ్గులు వేసి, రంగవల్లులతో పెండ్లి మండ పాన్ని తీర్చి దిద్దారు అందంగా. చిలుకలు, గోరువంకలు, కాకులు, గద్దలు, డేగలు, పాలపిట్టలు, కొంగలు, బాతులు, అడవి కోళ్ళు, రాబందులు మొదలగు సమస్త పక్షులు పెండ్లికి అట్టహాసంగా వచ్చాయి. పెండ్లి ఆడంబరంగా జరిగింది. మాంగల్య ధారణ జరిగాక వధూ వరులకు తాము తెచ్చిన బహుమతులిచ్చి అభినందించాయి వచ్చిన పక్షులన్నీనూ. తరువాత విందు ప్రారంభమైంది.
వారం రోజుల ముందే, చిలుకలన్నీ కలిసి, అడవిలోనూ, దాని చుట్టుపక్కల తొటల్లోనూ సేకరించి తెచ్చిన పండ్లు మాగేసి, పండిన వాటిని వరుసగా రాశి పోశాయి. పక్షులు పండ్లను అందుకొని, చెట్టు కొమ్మల మీద కూర్చొని విలాసంగా తినసాగాయి. కాకులు, రాబందులు వాటిని ముట్టుకోకుండా ఒక మూలకు నిలబడ్డాయి కోపంతో.
చిలుకయ్య ఆందోళనగా దగ్గరకు వచ్చి ''ఎందుకిలా ఉన్నారు. అందరితో పాటు మీరూ తినొచ్చు కదా,'' అంది ప్రాధేయ పూర్వకంగా.
''మేము ఈ ఆకులు పండ్లు తినగా ఎప్పుడైనా చూసారా? మాకు మాంసం లేనిదే ముద్ద దిగదు'' అంది రాబందు.
''అవును మేము నల్లగా ఉన్నా, ఆహారం విషయంలో రాజీ పడం. మాంసం కావాల్సిందే'' అని విప్లవం లేవదీశాయి కాకులు.
''ఇప్పటికిప్పుడు ఎక్కడ తెచ్చేది? ఇవి తినకుండా అలిగి వెళ్ళి పోతే, చేసిన శ్రమంతా గంగలో కలిసిపోది'' అని తలపట్టుకు కూర్చున్నాడు చిలుకయ్య ఏమీ తోచక. పెండ్లి కూతురు తల్లి తన బిడ్డ అందానికి మురిసి పోతూ, మెడలోని నగలు, ఒంటిమీది చీరనూ సర్దుతోంది.
విందు ఏర్పాట్లు చూస్తున్న గద్ద , చిలుకయ్య దగ్గరకు వచ్చి ''ఎందుకు తమ్ముడూ దిగులుగా ఉన్నావు? కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుందనా...?'' అని అడిగింది ప్రేమగా.
'' లేదన్నా. పెండ్లి ఆనందంగానే ఉంది. కానీ..'' అని తన సమస్యను బాధగా ఏకరువు పెట్టింది.
''ఓష్... ఈ మాత్రానికే దిగులు పడుతున్నావా..? మేము లేము. నువు నిశ్చింతగా ఉండు.'' అని తన వారిని కేకేసింది.
వందలాది గద్దలు ఒకేసారి ఆకాశంలోకి లేచి, నది వైపు సాగాయి. నీళ్ళ మీద గిరికీలు కొడుతున్న పెద్ద చేపల్ని కాళ్లతో ఒడిసి పట్టుకొని వచ్చి విందు ప్రదేశంలో పడేయ సాగాయి. ఇంక, ఆవురావురుమంటూ కాకులు, రాబందులు వాటి మీద పడి చీల్చుకొని తినసాగాయి. 'ఇక చాలు' అనేంత వరకూ తెస్తూనే ఉన్నాయి గద్దలు. ''ఇక మా వల్ల కాదు బాబూ...'' అని చెట్టు నీడకు చేరిపోయాయి ఆయాసపడుతూ. చిలుకయ్య ఇచ్చిన విందు బ్రహ్మాండంగా ఉందని దంపతులకు కతజ్ఞతలు చెప్పాయి. పెండ్లి గురించి గొప్పగా చెప్పుకుంటూ బరువుగా ఇంటికి వెళ్లిపోసాగాయి.
ఆపదలో తనను ఆదుకున్నందుకు గద్దను కౌగలించుకొని కతజ్ఞతలు చెప్పాడు చిలుకయ్య.
''చూశావా? అందరితో ఉంటే, మనకు వచ్చిన ఆపదను ఎవరో ఒకరు పంచుకుంటారు. అందుకే నేను అందరినీ పిలువమంది. నలుగురితో ఉండాలంది'' అంది చిలుకమ్మ గొప్పగా - తన తెలివి తేటలకు తనే మురిసిపోతూ..
- పుప్పాల కష్ణమూర్తి