Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దశాబ్ద కాలంగా నిరంతర శ్రామికై, ఆత్మ విశ్వాసపు విజ్ఞాన ఇటుకలను పేరుస్తూ కొండలలో, గుట్టలలో అడవులలోని గిరిజన తెగల బిడ్డలకు, మహిళలకు విజ్ఞానం అందిస్తున్న కాంతి రేఖ రాధామణి''
కొట్టాయం పట్టణ ప్రాంతంలో చిన్న వజూర్ పల్లెటూరు ప్రాంతంలో మామూలు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పి. రాధామణి నలుగురు సంతానంలో ఒకరు. 1977 ప్రాంతంలో పెళ్లి కావడంతో, జీవనభతి కోసం ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేశారు. షెడ్యూల్ ట్రైబ్స్ అండర్ ది రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచే స్కీం కింద నడిచే పాఠశాలలో 24 సంవత్సరాల పాటు గిరిజన ప్రాంతంలో నివసించే బాలురకు ఉపాధ్యాయురాలిగా (బాల వాడి టీచర్) సేవలందించారు. ఆ సమయంలోనే రోజు సాయకాలం గ్రంథాలయంకు తరచుగా వెళ్లడం, నిత్యం పుస్తకాలు చదవడం వల్ల పుస్తకాలపై మక్కువ పెంచుకున్నారు.
''Libraries store the energy that fuels the imagination. They open up windows to the world and inspire us to explore and achieve, and contribute to improving our quality of life.'' -Sidney Sheldon చెప్పినట్లు పుస్తకాలను తనతో పాటు నలుగురు మహిళలకు అందిస్తే విజ్ఞానవంతులై ఇల్లు చక్కబడుతుందని, ఇల్లు చక్కబడితే గ్రామం, గ్రామంతో మండలం, జిల్లా, రాష్ట్రం చక్కబడతాయని వారి ఉద్దేశం.
తరువాత కుదుంబశ్రీ స్టేట్ పావర్టి ఎరాడికేశన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో కొంతకాలం, టూరిజం డిపార్ట్మెంట్లో కొంతకాలం గైడ్‌గా పనిచేశారు. పని చేస్తున్న కాలంలో ఆదివారం వచ్చిందంటే 25 నుంచి 30 పుస్తకాలు సంచులలో నింపుకొని నడుచుకుంటూ వెళ్ళి పచ్చటి అడవులలో కొండల, గుట్టల మధ్య ఉన్న గిరిజన బాలురకు, బాలికలకు మహిళలకు పుస్తకాలను అందించేవారు. వాటిలో చరిత్ర, ఇంగ్లీష్, నవలలు, టూరిజం, రాజకీయ శాస్త్రం, ప్రకతి శాస్త్రం, కథలు, చిన్న కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు ఉండేవి.
రాధామణి నివసించే ప్రాంతంలో పక్కనే మోతక్కరలో ఉన్న ప్రతిభా పౌర గ్రంథాలయానికి (దీనిని 1961లో ఏర్పాటు) నిత్యం పుస్తకాల కోసం వెళ్లేవారు. తర్వాత కాలంలో అదే గ్రంథాలయంలో విధుల్లో చేరారు. నేడు ఈ గ్రంథాలయంలో 11 వేల పుస్తక సంపద కలదు. ఈ గ్రంథాలయంలో మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 9 దినపత్రికలు మలయాళం, ఇంగ్లీష్ బాషలలో కలవు.
పచ్చని అడవులు కొండలు, గుట్టల మధ్య ఉన్న ఈ గ్రంథాలయం లోని పుస్తకాలను చాలా తక్కువ మంది ఉపయోగించుకునే వారు. ఇందుకు కారణం, ఈ ప్రాంతంలో నివశి స్తున్న వారు వ్యవసాయ పనులకు, కూలి పనులకు, చీ=జు+ూ పనులకు వెళ్తుండటమే. అందువల్ల గ్రంథాలయానికి వెళ్ళే సమయం వారికి దొరికేది కాదు. 2012లో ప్రతిభా గ్రంథాలయంలో రాధా మణి గ్రంథ పాలకురాలి గా రూ.3800 వేతనంతో పని చేయటం మొదలు పెట్టాక పుస్తకాల కోసం ప్రజలు గ్రంథాల యానికి రానవసరం లేకుండా పుస్త కాల్ని వారి వద్దకు తీసుకెళ్లే విన్నుత్న ప్రయత్నం చేశారు. అలా ఆ ప్రాంతంలో ఉన్న వద్దులు, మహిళలు, పిల్లలకు పుస్తకాలు చేరువయ్యాయి.
కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే మహిళ లకు విజ్ఞానం అందించేందుకు, గ్రంథాలయాల వైపు మళ్లించేం దుకు, చదివే అలవాటును పాదుకోలిపేందుకు, వనిత ప్రయోజక పుస్తక వితరణ పద్ధతి (బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ ఫర్ ఉమెన్ అండ్ ఎల్డర్ లీ) ద్వారా మానసిక ఉద్దీపన, ఒత్తిడి తగ్గింపు, భాషా జ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం, ఏకాగ్రత, సజనా త్మకతా, మానసిక ప్రశాంతత, వినోదం వంటి అంశాలకు తన వంతు కృషి చేస్తు న్నారు. వీరు చేస్తున్న సేవలు పరిగణలోకి తీసుకొని 2012లో లైబ్రేరియన్‌గా ఒక ఉద్యోగ బాధ్యతను రాధామణికి కల్పించారు. మహిళలకు రీడింగ్ హాబిట్‌ను పెంపొం దించేందుకు మహిళా సమాజం, మహిళా గ్రూపులతో సంబంధాలు ఏర్పరుచుకుని వారికి పుస్తకాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
అలా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి కొండ, గుట్టల ప్రాంతంలో నివసించే గిరిజన తెగల బాలురకు, మహిళలకు పుస్తకాలను అందించే వారు చదివిన తర్వాత వారం రోజులకి తిరిగి తీసుకునేవారు. కరోనా సమయంలో కూడా రోజుకు 10 లేదా 15 పుస్తకాలను అందించేవారు.
కరోనా కంటే ముందు కూడా నెలకి 500 నుండి 600 పై చిలుకు పుస్తకాలను మహిళలకు, గిరిజన బాలురకు అందించి చదివిన తర్వాత తిరిగి తీసుకునేవారు. ప్రతిరోజు పుస్తకాలు సంచులలో నింపుకొని ప్రతిభా గ్రంథాలయానికి 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న చిన్న గిరిజన ప్రాంతాలకు పెళ్లి పుస్తకం ఇవ్వడం ఒక ఎత్తయితే, ఎన్.ఆర్.ఇ.జి.పి లో పనిచేసే మహిళలు వారాంతమైన ఆదివారం రోజున ఇంటిపట్టున ఉంటారనే ఉద్దేశ్యంతో ఆ రోజున వారు చదివేందుకు మలయాళ మంగళం, మనోరమ వీక్లీ మ్యాగజైన్, దిన పత్రికలు, మాస, పక్ష, వార పత్రికలూ అందిస్తున్నారు. పుస్తకాలు చదవడం వలన జ్ఞానం, ధైర్యం, సమానత్వం, మానవత్వం, న్యాయం, నిగ్రహం సిద్ధిస్తాయని ప్రధానంగా నమ్మడం వలన వారికి పుస్తకాలను చదివే అలవాటును చొప్పించింది.
ప్రస్తుతం మోతక్కరలో ఉన్న ఈ ప్రతిభా గ్రంథాలయంలో 150 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే వారిలో 122 మంది మహిళలే సభ్యులుగా ఉండడం విశేషం. అవసరమైన పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో లేకపోతే, పట్టణానికి వెళ్లి కొని మరీ అవసరమైన వారికి అందిస్తున్నారు.
గ్రంథాలయంలో సభ్యులు కావాలంటే 25 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. నెలకి ఐదు రూపాయల చొప్పున ఫీజు చెల్లించి పుస్తకాలను ఇంటికి తీసుకుని వెళ్లి తిరిగి ఇవ్వాలి. వాటి ద్వారా వచ్చిన ఆర్థిక వనరులను గ్రంథాలయ అభివద్ధికి ఉపయోగిస్తారు. ఎవరికైతే ఆర్థిక స్థోమత లేక, చదవాలనే కుతూహలం ఉంటుందో, వారికి తనే సొంతంగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి గ్రంథాలయంలో పుస్తకాలను అందించేవారు. ముఖ్యంగా పోటీ పరిక్షలకు తయారయ్యే మహిళలకు గ్రంథాలయంలో పుస్తకాలే గాక సొంతగా పుస్తకాలని సేకరించిన పుస్తకాలను మహిళలకు అందించేవారు. కుట్టుమిషన్, వంటల పుస్తకాలు, మహిళా సాధకారత పుస్తకాలూ, గొప్ప మహిళా మనుల జీవిత చరిత్రలు, వ్యవసాయ పుస్తకాలను కొని వారికి అందించేవారు.
మామూలు మధ్యతరగతి కుటుంబం... భర్త కిరాణం షాపు, కొడుకు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నా, తనకు వచ్చిన జీతంలో 60 శాతం పుస్తకాలను కొని గిరిజన పిల్లలకూ ఉచితంగా అందిస్తున్నది. కొన్ని కొన్ని సార్లు మలయాళ కథల పుస్తకాలు చదివి వినిపిస్తారు. 10వ తరగతి మాత్రమే చదివిన రాధామణి చేస్తున్న కషికి గాను అందరూ ఆమెను వాకింగ్ లైబ్రేరియన్ అని పిలుస్తున్నారు.
- డా|| రవి కుమార్ చేగొని, 9866928327