Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరి పుట్టుక కొందరి జీవితాలకు వెలుగునిస్తుంది. తనకు ఎంత సంపద ఉన్నా, లేనివారి కోసం పంచుతుంది. తన చుట్టూరా ఉన్న వాళ్ళు చీకటి నీడ నుండి వెలుగులోకి రావాలని, అందరికిమల్లె జీవితం ఉండాలని పరితపిస్తుంది. ఈ పై పదాలకు సరిగ్గా పోలే వ్యక్తి బి.ఎన్. రెడ్డి.
జననం, విద్య
బి.ఎన్. రెడ్డి. పేరు పొట్టిగానే ఉంది. కాని వివరంగా చెపితే ఆయనకున్న ధైర్యం, శౌర్యం, వీరత్వం లాగా పొడుగ్గా భీమిరెడ్డి నరసింహరెడ్డిలా ఉంటుంది. కొందరి గురించి మాట్లాడుకునేప్పుడు మనకు తెలియకుండానే ధీరత్వానికి గురవుతూ ఉంటాం. కారణం, వారికున్న కీర్తి, వారు భవిష్యత్తరాలకు అందించిన స్ఫూర్తి. ఆ స్ఫూర్తికి కారణమైన బి.ఎన్. రెడ్డి నల్గొండ జిల్లా, తుంగతుర్తి మండలంలోని కర్విరాల కొత్తగూడెంలో జన్మించాడు. తల్లిదండ్రులు భీమిరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ.
వీరు స్వగ్రామంలోనే 4 వ తరగతి చదివి పై విద్య కొరకు సూర్యాపేట వెళ్ళారు. ఆపై నల్గొండలో, హైదరాబాదులో రెడ్డి హాస్టల్ సహాయంతో పదవ తరగతి వరకు అభ్యసించారు. ఈయన హైదరాబాదుకు రావడం వలన అప్పటికే ఉన్న రాజకీయ పరిస్థితిని దగ్గరగా చూసి అవగాహన చేసుకున్నాడు.
ఉద్యమం
జాతీయోద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో సాధారణ ప్రజలపై రాజకీయ నాయకుల ప్రభావం ఎంత ప్రబలంగా పడిందో అంతకు మించి సాహిత్యం, ఇతర పుస్తక రచనల ప్రభావం పడింది. బి.ఎన్. రెడ్డికి ఇతరుల ఆకలి కష్టాలు తెలుస్తున్న సమయంలో దేవులపల్లి వెంకటేశ్వరరావు 'అక్టోబర్ విప్లవ సంచిక'ను పంపాడు. ఇది కమ్యూనిస్టు సాహిత్యం. అప్పటికే వామపక్ష భావాలను అలవర్చుకున్న రెడ్డి లెనిన్, మార్క్సిం గోర్కీల పుస్తకాలు చదివి వాటి ప్రభావానికి గురయ్యాడు. అప్పటికే ఆంధ్రమహాసభ లేవదీస్తున్న చైతన్యాన్ని గురించి తెలుసుకొని నిజాం పతనానికి ఇదే సరైన వేదిక అని తనకున్న భావజాలంలోంచి అభిప్రాయపడ్డాడు. ఇలా 1942 వరంగల్లులో జరిగిన సభకు హాజరై అక్కడ నాయకుల ప్రసంగాలను విని వెట్టిచాకిరికి వ్యతిరేకంగా నినదిస్తూ 'నిజాం ప్రభుత్వం నశించాలి' అని ప్రజలకు హితవు పలికాడు. ఆనాడున్న ప్రతీ ప్రజా వ్యతిరేక చర్యను నిరశిస్తూ, నాయకత్వం వహిస్తూ భూస్వాముల ఆగడాలను ఎదుర్కొన్నాడు.
చాకలి ఐలమ్మ పంటపొలంపై విసునూరు భూస్వామి రాపాక రామచంద్రారెడ్డి గూండాలు విరుచుకపడినప్పుడు ఐలమ్మ వైపు అండగా నిలబడి గూండాలను ఎదుర్కొన్నాడు. నానాటికి విస్తరిస్తున్న ఫ్యూడల్ శక్తుల ఆగడాలను, నిజాం పోలీసుల దౌర్జన్యాలను, మిలటరీ దొంగచాటు చర్యలకు ఎదురొడ్డి ప్రజాసైన్యం చేత తరిమేలా చేశాడు. అప్పటి నల్గొండ, వరంగల్లులో అనేక గ్రామాలపై నిజాం రజాకార్ల దాడులు భీకరంగా జరిగేవి. ఆ దాడులను ప్రతిఘటించేందుకు గ్రామ దళాల సహకారంతో, కమ్యూనిస్టు గెరిల్లాలతో తిరగబడేలా చేశాడు. ''పాత సూర్యాపేటలో ప్రజల సాహసోపేతమైన సంఘటన స్ఫూర్తితోనే దేవరుప్పలలో కూడా 1946 అక్టోబర్లో వడిసెల రాళ్ళతో నిజాం మిల టరీని ప్రజలు తరిమికొట్టారు'' (స్వాతంత్య్ర సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, పుట 115). ఈ నిజాం వ్యతిరేక స్వాతంత్య్రోద్యమంలో బి.ఎన్. రెడ్డితో పాటు తన భార్య, ఇద్దరు చెల్లెలు శశిరేఖ, స్వరాజ్యంలు కూడా పాల్గొన్నారు.
చట్టసభల సభ్యుడిగా
తను దేశ పరిస్థితులని అర్థం చేసుకున్న మొదలు రాజకీయ నాయకుడిగా చట్టసభలలోకి వెళ్ళేంత వరకు ప్రజలకు మిత్రునిలా ఉంటూ వారి క్షేమం కోరి అందుకు కషి చేశాడు. ప్రజా సేవయే ధ్యేయంగా పెట్టుకున్న భీమిరెడ్డి మొదటి సాధారణ ఎన్నికల సమయంలో అజ్ఞాతంలో ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన 1957, 1967 ఎన్నికలలో సూర్యాపేట స్థానం నుండి అసెంబ్లీకి, 1971, 1984, 1991 ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. ఏ భూస్వామ్య శక్తుల అంతం కోసం ఆయన శ్రమించాలనుకున్నాడో ఆ శక్తులు పూర్తిగా అంతమయ్యే వరకు ప్రజా నాయకునిగా ఉన్నాడు.
భీమిరెడ్డి తన పోరాటం నాటి వ్యూహాలను, స్థితిగతులను, తన వ్యతిరేక శక్తులపై పోరాట విధానాలను, ఆంధ్రమహాసభ పనితీరును తెలుపుతూ ''ఆయువుపట్టు'' అనే కథను రచించాడు. దీన్ని విప్లవ మార్గంలో నమోదైన 'తెలంగాణ జాతీయోద్యమ కథ'గా భావించవచ్చు.
కమ్యూనిస్టు నాయకునిగా, నిజాం సంస్థానం నుండి స్వాతంత్య్రం కోరిన పోరాట యోధునిగా, కథకుడిగా, రాజకీయ నాయకునిగా ఎదిగి ప్రజల మన్ననలందుకొన్న నరసింహారెడ్డి మే 9, 2008 లో కన్ను మూశాడు.
- ఘనపురం సుదర్శన్,
9000470542