Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా తీసుకొని సివిల్ సర్వీసులకు ఎలా సన్నద్ధం కావాలో, సివిల్ సర్వీసులలో విజయం సాధించడానికి తెలుగు సాహిత్యం ఎలా ఉపకరిస్తుందో తెలియజేసే పుస్తకం... రచయిత సర్వీసులో వుంటూ, సివిల్ రాసే అభ్యర్థులకు ఉచితంగా బోధించి వార్ని ఐ.ఏ.ఎస్,.లకు ఎంపిక అయ్యేటట్లు తర్ఫీదు ఇచ్చారు.
జైశేఖర్ (2018), రాహుల్ బొంతా (2019) లాంటి వారు వీరి ద్వారా మంచి మార్కులు పొంది ఎంపికయ్యారు. సివిల్స్‌లో గత 5 సంవత్సరాల నాటి ప్రశ్నా పత్రాలు చివర్లో అనుబంధంగా ఇచ్చారు - అవి 2015, 2016, 2017, 2018, 2019 పేపర్లు. అభ్యర్థుల విజయానికి ఈ పుస్తకం చక్కటి దారి దీపం. 2016లో కన్నడ సాహిత్యంలో ఆలిండియా టాపర్‌గా నందిని, తెలుగుసాహిత్యంలో 3వ ర్యాంకర్‌గా రోహిణి గోపాలకృష్ణ, హిందీ సాహిత్యంలో 33వ ర్యాంకర్‌గా గంగాసింగ్ల ఎంపిక మనం విస్మరించరానిది.
ఒక్కసారి ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య అధ్యయనం ఎంతో ప్రయోజనకారి అంటారు రచయిత. సివిల్ సర్వీసుల పరీక్ష విధానంలో వ్యాసం పేపరు వుంది. దానికి 250 మార్కులు - 2 వ్యాసాలు రాయాలి. భాష - భావన - అలంకార శాస్త్రం - సాహిత్య చరిత్ర.. బాగా అధ్యయనం చేస్తే ఎంతైనా రాయొచ్చు అంటారు రచయిత. వ్యావహారిక తెలుగు భాష వికాసం - భాషా సాహిత్యోద్యమాలు - మాండలికాలు - క్రియాభ్యాసాలు - సాహిత్య - సాహిత్యేతర అనువాదాలు; ప్రజ్ఞన్నయ యుగం - నన్నయ యుగం - శివ కవులు - తిక్కన శైలి; ఎర్రన రచనలు... శ్రీనాథుడు - పోతన రచనలు... భక్త కవులు...ప్రబంధాల పరిణామం - కావ్యాలు - రఘునాథనాయక - చేమకూర వెంకట కవి; స్త్రీ కవయిత్రులు.. యక్షగాన - గద్య పద కవితలు - నేటి ఆధునిక తెలుగు సాహిత్యం - నవల - కథానిక - నాటకం - నాటిక - కవితా రూపాల వంటి సాహిత్య ప్రక్రియలన్నింటిపై పట్టు అభ్యర్థులకు ఉండాలి. అలాగే పేపర్ - 2లో దుష్యంత చరిత్ర (నన్నయ), శ్రీకృష్ణ రాయబారం (తిక్కన) గుణనిధి (శ్రీనాధుడు), సుగాత్రీశావీనుల కథ - (పింగళి సూరన కళాపూర్ణోదయం) మొల్ల రామాయణం (బాలకాండ) కాసుల వారి 'ఆంధ్రనాయక శతకం - సెక్షన్ ఎ'లో చదవాలి. అలాగే ఆణిముత్యాలు (గురజాడ), ఆంధ్రప్రశస్తి (విశ్వనాథ), కృష్ణపక్షం (దేవులపల్లి) మహా ప్రస్థానం (శ్రీశ్రీ) గబ్బిలం (జాషువా) కర్పూర వసంతరాయలు (సి.నా.రె) శారద లేఖలు (కనపర్తి వరలక్ష్మమ్మ) ఎన్.బి.వో (ఆత్రేయ) అల్పజీవి (రావి శాస్త్రి), సెక్షన్ - బి లో అధ్యయనం చేయాలి. నిఘంటువులు శబ్ధరత్నకాలు - బాలశిక్ష చదవాలి. భద్రరాజు కృష్ణమూర్తి - బూదరాజు రాధాకృష్ణ - చేరా - డా|| వేల్చేరు - డా|| కొర్లపాటి - ఆరుద్ర - డా|| జి.వి.సుబ్రహ్మణ్యం - డా|| జొన్నలగడ్డ మృత్యుంజయరావు, డా||పి. సుమతీ నరేంద్ర - ఆచార్య మలయవాసిని - డా|| రాచపాళెం - ఆర్.ఎస్.సుదర్శన్ - నిర్మలాదేవి - మిరియాల రామకృష్ణ గారలు రాసిన పై అంశాలు గ్రంథాలు అధ్యయనం చేస్తే విజయం మీదే. మొదటి పేపర్లో 165 - 180 మార్కులు, పేపర్ 2లో 160 6 180 మార్కులు సాధించడం ఎలానో చెప్పారు. భాషా శాస్త్రం 200, సాహిత్య చరిత్ర పరిణామం - 200, వ్యాఖ్యానాలు - 100, ఆధునిక సాహిత్యం - 150, సాంప్రదాయ సాహిత్యం - 150 మార్కులుంటాయి. యూపీఎస్సీ వారి పోటీ పరీక్షలకు ఎంతో ఉపయుక్తకర పుస్తకం. ఎస్ఆర్ శంకర్ అకాడమీ కృషి అభినందనీయం.
రచన : వై.సత్యనారాయణ ఎం.ఏ.,
పేజీలు : 298, వెల : రూ. 200/-,
ప్రతులకు : ఎస్.ఆర్. శంకరన్ ఐ.ఏ.ఎస్. అకాడమీ, ఇం.నెం. 1 - 1- 60/2, ఆర్.టి.సి. క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ప్రక్కన, ముషీరాబాద్, హైదరాబాద్ - 020.
- తంగిరాల చక్రవర్తి , 9393804472