Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చూస్తూ ఉండగానే ఏడాది పూర్తి అయ్యింది. అప్పుడే పరీక్షా సమయం రానే వచ్చింది. ఇప్పటికే ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల తేదీలను కూడా విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. అయితే సరైన ప్రణాళిక తలిదండ్రుల పర్యవేక్షణ ప్రోత్సాహం ఉంటే పిల్లలు తప్పకుండా అన్ని పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. పరీక్ష సమయంలో తలిదండ్రులు పిల్లలపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి... ఏ విధంగా వ్యవహరించాలో ఇప్పుడు తెలుసుకుందాం...
పరీక్ష సమయం రాగానే ముఖ్యంగా పిల్లలు ఒకొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు తక్కువ ఆత్మ విశ్వాసంతో ఉంటారు. మరికొంత మంది ఆత్మ విశ్వాసంతో ఉంటారు. మరికొంత మంది పిల్లలు అతి ఆత్మ విశ్వాసంతో ఉంటారు. కాబట్టి తలిదండ్రులు మీ పిల్లల ప్రవర్తన ఏవిధంగా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. కాస్త భయం బెరుకుగా ఉన్నా లేదా నేను ఏ సబ్జెక్టు అయినా చిత్తు చేయగలను అని ప్రగల్భాలు పలుకుతున్నా కూడా తలిదండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వారితో మదువుగా ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి.
ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి
పిల్లలు ఎక్కువగా ఇంట్లోని ప్రతి విషయానికి ఎక్కువగా స్పందిస్తారు కాబట్టి పరీక్షల సమయంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పిల్లలు తొందరగా మనసు పాడుచేసుకోవడం, ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుందో అని వాటిపైనే ఎక్కువగా దృష్టి ఉంచడం వల్ల పరీక్షలలో తప్పే ప్రమాదం ఉంది. ఎన్ని ఇబ్బంది కరమైన పరిస్థితులు వచ్చిన పిల్లలకు చెప్ప కుండా ఉండడం ముఖ్యం.
పిల్లలతో పాటు మీరు కూడా...
పిల్లలను ఉదయాన్నే నిద్రలేపి మీరు కూడా లేచి వారితో పాటు ఏదో ఒక పుస్తకం తీసుకుని చదువుతూ ఉండడం వల్ల వారికి ఉత్సాహం వస్తుంది. అలా కాకుండా మీరు గురక పెట్టి నిద్ర పోయిన లేదా ఇంట్లో వారితో మాట్లాడుతూ ఉన్నా ఆ శబ్దాలకు పిల్లల మనసు మరలే అవకాశం ఎక్కువ. కాబట్టి ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండాలి.
పరీక్షలు ముగిసే వరకు టీ.వి, సెల్‌ఫోన్ వద్దు...
చాలామంది తల్లిదండ్రులు ఇండ్లలో... వాడు పక్కగదిలో చదువుకుంటాడు మేము ఈ గదిలో టీ.వి చూస్తాము, ఏమవుతుందిలే అని టీ.వీ చూస్తూ ఉంటారు. పక్క గదిలో వుండే పిల్లవానికి ఆలోచన సినిమాపై మరలి పుస్తకం ముందు కూర్చుని కూడా సినిమాని తలుచుకుంటూ శ్రద్ధగా చదవలేక పోతారు. ఫలితంగా పరీక్షలో తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి టీ.వీ, సెల్ఫోన్లు సాధ్యం అయినంత వరకూ సైలెంట్లో ఉంచడం లేదా తక్కువగా ఉపయోగించడం ముఖ్యం.
వారికి నచ్చిన ఆహారం పెట్టడం...
పిల్లలు చదివేటప్పుడు ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. కాబట్టి వారికి ఏదో ఒక ఆహారం పెడితే సరిగా తినకపోవడం వల్ల శారీరకంగా బలహీనం అవడం ఫలితంగా ఏకాగ్రత లోపం, మెమోరీ లాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కాబట్టి వారికి నచ్చిన ఆహారం చేసిపెట్టడం ఎంతో ముఖ్యం.
ఆటలకు కొంత సమయం...
ఇక పరీక్షలు కదా అని ప్రతిసారీ చదువు చదువు అని వేధించకుండా వారికి నచ్చిన ఆటలకు కొంత సమయం కేటాయించేలా చూడడం ఎంతో ముఖ్యం. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక ఆరోగ్యాన్ని కలుగ జేస్తాయి. కాబట్టి ఆటలకు కొంత సమయం కేటాయించేలా చూడడం ముఖ్యం.
ఇతరులతో పోలిక వద్దు...
ఫలానా పిల్లవాడు ఎక్కువ మార్కులు సాధిం చాడు, ఫలానా పిల్లవాడు నీ కన్నా బాగా చదువు తున్నాడు, నువ్వు పరీక్ష సరిగా రాయకపోతే నా పరువు పోతుంది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల పిల్లల్లో ఆందోళన, వ్యాకులత ఎక్కువ అవుతాయి. వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. అందువల్ల ఇతరులతో పోలిక వద్దు.
పూర్తి సిలబస్ కంప్లీట్ అయ్యేలా ప్రోత్సహించడం...
పిల్లలు అన్ని సబ్జెక్టుల పూర్తి సిలబస్ కంప్లీట్ చేసారా లేదా అని అడుగుతూ ఉండాలి. వీలైతే అన్ని సబ్జెక్టుల్లో వారితో పూర్తి సిలబస్ పూర్తిగా చదివేలా ప్రోత్సహించడం ముఖ్యం.
పిల్లలతో పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉండడం
నువ్వు బాగా చదువుతున్నావు కాబట్టి బాగా రాస్తావు, నువ్వు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తావు, నీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది అని పాజిటివ్‌గా మాట్లాడడం వల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
పిల్లలు విజయం సాధించడానికి సాధించకపోవడానికి తలిదండ్రుల ప్రోత్సాహం, పాత్ర ఎంతో కీలకం. అందువల్ల పిల్లలకు సరైన సహకారం, ప్రోత్సాహం తలిదండ్రుల నుండి లభిస్తే వారు అన్నింటిలో విజయం సాధించగలరు.
- ధర్మారపు జ్ఞానేష్,
8367572018 మానసిక నిపుణులు, తొర్రూరు.