Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలహాబాద్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్న కవితా పిపాసి, ప్రకృతి ప్రేయసి, స్వాతంత్య్ర సమర యోధురాలు సరోజినీదేవి. చాలా బలమైన ఊహాత్మక కవితల ధార ఆమె మేధ. ప్రకతి రామణీయకతకు వర్ణన రూపాన్నిచ్చి అక్షర పుటల్లోకి ఎక్కించిన సహజ కవయిత్రి, గాన కోకిల అయిన సరోజినీ 1879 ఫిబ్రవరి 13న 8వ సంతానంగా డా. అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరదసుందరీలకు జన్మించింది.
హైదరాబాదులో ఆడపిల్ల చదువుకోడానికి అనువైన పాఠశాల లేదని భావించిన తండ్రి మెట్రిక్యులేషన్ కోసం మద్రాసు పంపాడు. 17 సం.లలో కేంబ్రిడ్జిలోని గిర్టన్ కళాశాలలో చదువుకుంది. కానీ డిగ్రీ పొందకుండానే భారత్‌కు వచ్చింది. నిజాం ప్రభుత్వ స్కాలర్ షిప్‌తో ఉన్నత విద్య కొరకు 1895 సెప్టెంబర్‌లో లండన్ వెళ్ళింది. 1898లో స్వదేశానికి వచ్చింది. పలు భాషలలో దిట్ట అయిన అఘోరనాథ్, కూతురుని ఇంగ్లీషు నేర్చుకోమని చెప్పితే వినకపోగా, ఆంగ్లంలో మాట్లాడనని చెపితే తండ్రి ఆమెను ఒక రోజల్లా గదిలో పెట్టి తాళం వేసి కఠినంగా శిక్షించాడట.
స్వాతంత్రోద్యమం
మహాత్మాగాంధీ కంటే మునుపే దేశీయంగా ఉద్యమంలో పాల్గొని ప్రఖ్యాతి గాంచింది. స్వదేశీ ఉద్యమంలో పూర్తి కాలంగా పాల్గొన్నది. ఘోఖలేను ప్రథమ మిత్రునిగా, గురువుగా భావించి ఆయనను ''వీరరసైకమూర్తి'' గా అభివర్ణించింది. ఆనాడు దేశంలో అనేక సంఘాలు ఏర్పడి ప్రజలకు సేవ చేసేవి. అలా సరోజినీ ''లీసియం'' అనే ప్రసిద్ధ మహిళల క్లబ్బులో సభ్యురాలుగా ఉన్నది. మహాత్మాగాంధీతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నది. దేశమంతటా తన ఉపన్యాసాలతో ప్రజలలో బ్రిటిషు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచింది. ఒక కవయిత్రిగా, ఉద్యమకారిణిగా ఈమె ప్రభావం సంఘం మీద అధికంగానే ప్రసరించింది. 1916 లక్నో కాంగ్రెసు మహాసభలో నెహ్రు మొదటిసారిగా గాంధీని, సరోజినిని కలుసుకున్నాడు. ఆ తర్వాత సరోజినీ చేసిన ప్రసంగాలకు ఆయన ప్రభావితమయ్యాడు. 1922 తర్వాత గాంధీ అరెస్టయ్యాక ఆయన చేపట్టవలసిన కార్యక్రమాన్ని సరోజినీ నాయుడు చేపట్టి ఖద్దరు ధరించి దేశ వ్యాప్తంగా పర్యటించింది. 1925 డిసెంబరు కాన్పూరు కాంగ్రెసు మహాసభకు అధ్యక్షురా లైంది. భారత స్వేచ్ఛా సంగ్రామ సమయంలో ప్రపంచ ప్రసిద్ధ దేశాలను పర్యటించి అక్కడ అనేక మంది ప్రముఖుల మన్ననలం దుకుంది. 1930 ఉప్పు సత్యాగ్రహం దండి యాత్రలో స్త్రీలెవరు పాల్గొనకూడదని మోహన్‌దాస్ ఆజ్ఞాపించడంతో సరోజిని ఆ అజ్ఞను ధిక్కరించలేదు. దండికి పాదయాత్ర ముగిసే సమయానికి మహాత్మునికి స్వాగతం పలకటానికి సరోజినీ వేచి ఉంది. గాంధీ సముద్రపు ఉప్పు పట్టుకొని చెయ్యెత్తగానే ''స్వరాజ్య దేవతకు జేజేలు'' అని పలికింది.
లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీతో పాటు సరోజినీ కుడా వెళ్లి స్త్రీ హక్కుల సాధనకు కషి చేసింది. ఈ సేమావేశానంతరం ఇండియాకు రాగానే సరోజినీ అరెస్టు అయ్యింది. ఆమెకు అప్పటికే దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతి ఉండడంతో జైలులో ఆమెకు ఉన్నత స్థాయి సౌకర్యాలు కల్పించారు. హైదరాబాదులో ఆమె సేవకు గుర్తుగా బ్రిటిష్ సర్కార్ ''కైజర్-ఇ-హింద్'' అనే బంగారు పతాకాన్ని ఇచ్చింది.
కవితా పిపాసి
పదమూడేళ్ళలోనే పదమూడు వందల పంక్తుల గేయం రాసింది. ఇందుకు ఆరు రోజుల సమయం పట్టింది. ఆ గేయం ''సరస్సు కన్య''. 17ఏళ్ల ప్రాయంలో రాసిన గేయం 'ఇండియన్ లేడీస్ మేగజిన్' లో అచ్చైనది. 1902లో ''నీలాంబుజ'' అనే కావ్యం రాసింది. ఇది కూడా 'ఇండియన్ లేడీస్ మేగజిన్' లో అచ్చైనది. ఈ కావ్యంలో నాటి అందమైన హైదరాబాదు శోభను, మానవ బాధల వెనుక ఉన్న గాథలను సహజ సుందరంగా వర్ణించింది. ''గోల్డెన్ త్రెషోల్డ్'' అనే తొలి కవితా సంకలనాన్ని ప్రచురించింది. ఈమె రెండో కవితా సంపుటి ''కాల విహంగం'' (bఱతీస శీట ్‌ఱఎవ). ఘోఖలే మరణానికి స్మతిగా కవిత రాసింది. ఈమె ఆనేక పాటలు రాసినా వాటిలో 15 పాటలకు 'లిజా లెహమన్' అనే గాయని సంగీత స్వరకల్పన చేసింది. ''తెగిన రెక్క'' (ది బ్రోకెన్ వింగ్), ''సెప్టర్డ్ ప్లూట్'' (మురళీ దండం) అనే కవితా సంకలనాలు ప్రకటించింది.
సరోజినీదేవి కషికి అనేక యూనివర్సిటీలు డాక్టరేట్లను అందించాయి. తన కంటే పదేళ్ళు పెద్దవాడైన గోవిందరాజులు నాయుడును ప్రేమించి 1898 డిసెంబర్ 2న కులాంతర వివాహం చేసుకుంది. దీంతో సరోజినీనాయుడుగా మారింది. పెళ్లి సంప్రదాయంలో తోడపెళ్లి కూతురు, తోడపెళ్లి కొడుకు ఉండడం ఆనాటి నుండి సంప్రదాయంగా వస్తుంది. అయితే సరోజినీదేవి పెళ్ళిలో అప్పటికే ప్రసిద్ధ వ్యక్తయిన కందుకూరి వీరేశలింగం భార్య తోడపెళ్లి కూతురుగా ఉండి వధువుకు సపర్యలు చేసింది. సంఘసంస్కరణలో భాగంగా జరిగిన ఈ పెళ్ళికి వీరేశలింగం పంతులు పౌరోహిత్యం వహించారు.
స్వాతంత్య్రం వచ్చాక నాయుడు ఉత్తరప్రదేశ్ కి తొలి గవర్నర్‌గా వెళ్ళింది. సరోజినీనాయుడు చివరి రోజుల్లో అనారోగ్యం కారణంగా లక్నో ఆస్పత్రిలో చేరింది. 1949 మార్చి 1 న బెడ్ పై ఉండి కూడా నర్సును పిలిచి ఏదైనా పాట పాడమని కోరింది. అలా పాట వింటూనే రాత్రి నిద్రపోయింది. మర్నాడు ఉదయం 3.30 లకు శాశ్వతంగా నిద్రపోయింది.
- ఘనపురం సుదర్శన్,
9000470542