Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్.వేణుగోపాల్ ముందుమాటలో కవి కలం వేగాన్ని పరిచయం చేసారు. 50కి పైగా వున్న ఈ కవితల్లో కదిలించేవి ఎన్నో వున్నాయి. మానవ జీవనసారంగా ఉన్నాయి. వేణుగోపాల్ అన్నట్లుగా సకల పీడిత అస్తిత్వాల దు:ఖాన్ని తన స్వరంలో వ్యక్తీకరిస్తూ; మూర్తీభవిస్తూ... ఒక ముస్లింగా; తెలంగాణ బిడ్డగా; ఒక కార్మికునిగా; అడవి అంచు గ్రామవాసిగా; ఒక చైతన్యవంతమైన బుద్ధిజీవిగా; కార్మికోద్యమ, విప్లవోద్యమ ఆవరణలోని వ్యక్తిగా; హనీఫ్ అద్భుత కవిత్వం అందించారు.
'నాది దు:ఖం లేని; దు:ఖం వీడిన దేశం కావాలి' అనే ఆర్తినీ, ఆక్రోశాన్ని, ఆకాంక్షనూ వ్యక్తం చేస్తూ రాసిన ఈ కవిత్వంలోని ప్రతివాక్యం ఆలోచింపజేస్తుంది. అలజడి రేకెత్తిస్తుంది. కవి జీవన వేదన నుంచి పెల్లుబికిన తాత్త్వికతే, భావస్ఫోరకమైన కవిత్వమైంది. ఆదివాసులు, దళిత బహుజనులు, స్త్రీలు, ముస్లింలు, ఇతర మైనారిటీ మతస్థులు అణిచివేతకూ పీడనకు గురవుతున్న ప్రాంతీయ, భాషా సమూహాలు; ఈ దేశంలోని సమస్త పీడిత అస్తిత్వాలూ తమలో తాము అనుకోదగిన మాట ''నాది దు:ఖం వీడని దేశం''- అని. ఇది నిజమే కదా! భిన్నమైన వ్యక్తీకరణలో సామాజిక కోణాన్ని నేరుగా పాఠకులకు కవిత్వం ద్వారా పరిచయం చేస్తారు. షేక్‌లకు బలి పశువులుగా తరలి వెళ్తున్న చిన్నారి ఫాతిమాలు.. ఏ వర్గాల పిల్లలో చెపుతారు. రిక్షా కార్మికుల; పారిశుధ్య కార్మి కులు, దర్జీల, పాచిపనులు చేసే శ్రామిక అట్టడుగు వర్గాల పేద పిల్లలంటారు. మచ్చుకు రెండు, మూడు కవితలు చూద్దాం!
''చేదు జ్ఞాపకాలు వ్రణాల్లా పుష్పిస్తాయి / తడి దేహాలు కదా! మొక్కలు, మొక్కలుగానే మొలుస్తూనే వుంటాయి. నా దేశం నిండా / దు:ఖపు రిజర్వాయర్లు''- (పేజీ : 24) అంటారు కవి హనీఫ్...
''అబ్బా ఎసట్లోకి తెచ్చేటోడే గాని / ఎస రులా వుడికేటోడు కాదు -అమ్మీని ఏమన్నా అంటే వూకుండ / బుద్ద వదు / దూరపోడైతే... కత్తి దీస్కోని నరకబుద్దౌద్ధి'' (పేజీ : 37) అంటారు 'అమ్మీజాన్' కవితలో... ఇటీవల నస్రీంఖాన్ రాసిన కవిత గుర్తుకొస్తుంది...
'పది దృశ్యాలు' (పేజీ : 95) కవితలో ఇలా అంటారు కవి...
''పూలు / పరిసరాలకు సుగంధాన్ని పూస్తారు / డ్రైనేజీలు దుర్గంధాన్ని విరచిస్తారు / మతాలు రక్తాన్ని విరచిమ్ముతాయి'' అంటారు నేటి పాలకుల పని తీరు - రెచ్చగొట్టి మతోన్మాదం కనిపిస్తూనే ఉన్నాయి.
''కుతుబ్‌షాహీల సౌందర్యలాలసే / ఎందరో నీరోలు తమ ఉత్చ్వాసే అని వాపోతుంటారు. రోజూ వారి కూలీ కార్మికుల రెక్కల కష్టమే / అలసిన వారి కండల వీరత్వమే / నగరం మా హృదయ సుందరి / కలల రాణి / మింగలేక మేం గుటకలు వేస్తున్న వేదన...'' అంటారు. తలుపు దగ్గర అమ్మ ప్రతిముంటది. తుడుం మోగింది. అకలి మిన్నంటిన దేహౄలు - మా నాయన తాను నడిచిన దార్లు- ఓ ఉదయం - రంగుల నది... లాంటివి గొప్ప కవితలు... మంచి కవితాసంపుటి అందించిన హనీఫ్‌కు అభినందనలు.
- తంగిరాల చక్రవర్తి ,
9393804472.
(కవి : హనీఫ్, పేజీలు : 124, వెల : రూ.120/-, ప్రతులకు : నవోదయ బుకహేౌస్, కాచిగూడ, హైదరాబాద్. సెల్ : 92475 80946)