Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- (మార్చి 30, 1908 - మార్చి 9, 1994)
భారతీయ చిత్రపరిశ్రమలో తొలితరం హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సుప్రసిద్ధ భారతీయ నటి దేవికారాణి చౌదరి. నటిగా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమలో ఆమె చేసిన కషి మరువలేనిది. చాలా చిన్న వయస్సులోనే అనేక విజయాలు, కీర్తిని సాధించి, 1958లో ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని, 1970లో 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు నెలకొల్పిన తొలిసారే గెలుచుకుని రికార్డు సష్టించింది.
విశాఖపట్నంలో జన్మించిన దేవిక నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్‌కు బంధువు. సినీ పరిశ్రమలో దశాబ్ద సుదీర్ఘ కెరీర్లో, ఆమె బోల్డ్ సన్నివేశాలను మాత్రమే కాకుండా, సమాజ నిర్మాణాన్ని కూడా ప్రశ్నించే సంప్రదాయే తర సినిమాలలో నటించింది. ''అచ్చుత్ కన్యా'' చిత్రంలో, బ్రాహ్మణ అబ్బాయితో ప్రేమలో పడిన అంటరాని అమ్మాయి పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందింది.
దేవికారాణి 1908 మార్చి 30న విశాఖపట్టణంలోని వాల్తేరులో సంపన్న బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పేరు కల్నల్ మన్మథనాథ్ చౌదరి. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీకి మొదటి భారతీయ సర్జన్ జనరల్. నాన్నమ్మ సుకుమారి దేవి రవీంద్రనాథ్ టాగూర్ సోదరి కాగా, తల్లి లీలాదేవి చౌదరి ఈమె రవీంద్రనాథ్ టాగూర్‌కు మేనకోడలు. దేవికారాణి శాంతి నికేతన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం ఉపకారవేతనం మీద 9 ఏళ్లకే లండన్ వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్‌లో జాయిన్ అయి మ్యూజిక్, యాక్టింగ్‌లో శిక్షణ పొందారు. 1920 నాటికి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె తన బాల్యంలో ఎక్కువ భాగం లండన్‌లో గడిపారు. కొన్నాళ్ల తర్వాత ఈమెకు జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరుపొందిన 'హిమాంశురారు'తో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో వారి మధ్య ఆ పరిచయం ప్రేమగా మారింది. దేవికారాణి 15 సంవత్సరాలు తనకంటే పెద్దవాడై, అప్పటికే వివాహం చేసుకున్న హిమాంశు రారుని 1929లో పెళ్ళి చేసుకుంది. వివాహానంతరం రారు తన భార్య దేవికారాణిని బెర్లిన్‌లోని యు.ఎఫ్.ఎ. స్టూడియోలో చేర్పించి, అక్కడ మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగాల్లో శిక్షణ ఇప్పించారు. సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్‌ల అధ్యయనం తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి స్వంతంగా 1933 లో ఇంగ్షీషులో ''కర్మ'' చిత్రాన్ని నిర్మించారు. దేవికారాణి నాయికగా, హిమాంశురారు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని హిందీలోకి అనువదించి విడుదల చేయగా ఘన విజయం సాధించింది. ఈ యువ జంట భారతీయ సినిమాను సమూలంగా మార్చాలనే ఆలోచనతో బొంబాయిలో 1934లో 'బాంబే టాకీస్' అనే సంస్థను స్థాపించి, ఎందరో ఔత్సాహిక కళాకారుల్ని చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణనిచ్చారు. భారతీయ సినిమాకు మధుబాల, లీలా చిట్నీస్, ముంతాజ్, దిలీప్ కుమార్ వంటి గొప్ప నటులను 'బాంబే టాకీస్' పరిచయం చేసింది. దేవికా రాణి నటుడు దిలీప్ కుమార్‌కు 250 రూపాయలు జీతం ఆఫర్ చేస్తే అతను అది నెలకా సంవత్సరానికా తేల్చుకోలేక సతమతమయ్యాడు. కాని ఆమె ఇచ్చింది నెలకే! అప్పటికి రాజ్‌కపూర్‌కు సంవత్సరమంతా కలిపి ఆర్.కె. స్టూడియోలో 150 రూపాయల జీతం వచ్చేది. అలాంటి ప్రభావం దేవికారాణిది. బాంబే టాకీస్ తీసిన చిత్రాలలో దేవికారాణి, అశోక్ కుమార్ల జంట హిట్ పెయిర్ గా పేరు పొందారు. అశోక్ కుమార్‌తో కలిసి దేవికా 1936లో 'జీవన్ నయ్యా', 'అచూత్ కన్య' చిత్రంలో కలిసి నటించగా ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో కలిసి ఆమె దాదాపు పది సినిమాల్లో యాక్ట్ చేసింది. 1936 లో దేశభక్తి చిత్రం 'జన్మభూమి', 1937 లో ప్రేమకథ చిత్రం 'ఇజ్జత్', 1937 లో పౌరాణిక చిత్రం 'సావిత్రి' వంటి చిత్రాలలో కలసి నటించారు. 1941లో 'అంజాన్' చిత్రం వారు కలిసి నటించిన చివరి చిత్రం. దేవికారాణి నటించిన 16 చిత్రాలలోని చాలా పాత్రలు సంఘర్షణాత్మకమైనవి. 1936 లో సమాజ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా 'అచూత్ కన్య', 1937లో తల్లికాలేని గహిణిగా 'నిర్మల', తిరగబడిన మహిళగా 'సావిత్రి' చిత్రంలో, విధివంచితురాలైన బ్రాహ్మణ యువతిగా 'జీవన్ ప్రభాత్'లో, 1939 లో అనాధగా 'దుర్గ' చిత్రాలలో ఆమె నటన ప్రేక్షకుల మదిలో స్థిరస్థాయిగా నిలచిపోయింది.
దేవికారాణి 'జవానీ కి హవా' చిత్రం షూటింగ్ సమయంలో, ఆమె తన సహనటుడు 'నజ్ముల్ హుస్సేన్' తో ప్రేమలో పడి కలిసి పారిపోయింది. దీంతో 'బాంబే టాకీస్' తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూడడమే కాకుండా, బ్యాంకర్లలో క్రెడిట్ కోల్పోయింది. 'బాంబే టాకీస్' నష్టాలను పూడ్చుకు నేందుకు హిమాంశురారు దేవికారాణితో సోదర బంధం ఉన్న అసిస్టెంట్ సౌండ్-ఇంజనీర్ శశధర్ ముఖర్జీతో రాయభారం చేసి దేవికారాణి తిరిగి వచ్చేలా ఒప్పించడంలో విజయం సాధించాడు. అయితే దేవికారాణి భర్త హిమాంశుతో వైవాహిక బంధంలో ఉండకుండా కేవలం ప్రొఫెషనల్ బంధంలోనే ఉండిపోయింది. 1940 మే 19లో హిమాంశురారు హఠాన్మరణం పొందడంతో బాంబే టాకీస్ నిర్వహణ బాధ్యత దేవికారాణి చేతిలో పడింది. తర్వాత తీసిన ''బసంత్, నయా సన్సార్, అంజానా, కిస్మత్'' మొదలైన చిత్రాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టాయి. 1943లో వచ్చిన 'కిస్మత్' అన్ని రికార్డులను బద్దలుకొట్టి, కోల్‌కతాలోని రాక్సీలో మూడు సంవత్సరాలు నడిచింది. దేవికారాణి 1943లో 'హమారీ బాత్'లో చివరిసారిగా కనిపించింది. ఈ చిత్రంలో రాజ్ కపూర్ చిన్న పాత్ర పోషించారు. తర్వాత బాంబే టాకీస్ స్టుడియోను దర్శించడానికి వచ్చిన సుప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు 'స్వెతస్లోవ్ రోరిక్' తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి 1945లో వివాహానికి దారి తీసింది. ఈ వివాహం తర్వాత పరిశ్రమ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుని దేవికారాణి తన 36 వ ఏటా 1945లో సినీరంగానికి దూరమయ్యారు.
సినీ పరిశ్రమ నుండి నిష్క్రమించిన కొన్నాళ్ల తర్వాత దేవికారాణి 'స్వెతస్లోవ్ రోరిక్' తో కలిసి కులు హిల్-స్టేషన్లో గడిపారు. ఆ సమయంలో ఆమెకు నెహ్రూ కుటుంబం సన్నిహితమైంది. అక్కడ దేవికారాణి వన్యప్రాణి డాక్యుమెంటరీ లను రూపొందించింది, తరువాత బెంగుళూరు శివార్లలోని విశాలమైన తాతగుణి ఎస్టేట్‌లో 450 ఎకరాలు కొని అందులో రోరిచ్తో కలిసి ఎవరినీ కలవకుండా ఏకాంతంగా నివసించింది. ఆ సమయంలోనే వారి దగ్గర పని చేసిన మేనేజర్ ఒకామె ఆమె ఎస్టేట్ విషయాలు గోల్మాల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. దేవికారాణి బెంగుళూరులో గడుపుతూ 1994 మార్చి 9 తేదీన తుదిశ్వాస విడిచింది. 'ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా'గా కీర్తింపబడే దేవికారాణి తాను మరణించే నాటికి బెంగళూరులో ఉన్నటువంటి 450 ఎకరాల విలువైన ఎస్టేట్‌ను వారసులు లేకపోవడంతో ఆ ఆస్తి ఎవరికి చెందాలో తేల్చక వదిలిపెట్టింది. అయితే దేవిక మరణించాక ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేసింది. చివరకు సొంతం చేసుకుంది. వెండితెర గతిని మార్చిన దేవికారాణి ముంబైకి, వెండితెర వ్యక్తులకు దూరంగా జీవించడం ఒక విచిత్రం.
తొలి 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు పొందిన దేవిక
భారతీయ సినీ పితామహుడు 'దాదాసాహెబ్ ఫాల్కే' శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఏర్పాటు చేయగా, తొలిఏడాది సినిమా రంగానికి దేవికారాణి అందించిన సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డుతో సత్కరించింది. దీంతో తొలిసారి అవార్డు పొందిన నటిగా దేవికారాణి రికార్డు సష్టించింది. అంతకు ముందు 1958లో ఆమె సినిమా రంగానికి చేసిన కషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారం ఇచ్చి గౌరవించింది. 1990లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును సైతం దేవికా రాణి అందుకుంది. 2011 లో భారతీయ సినిమా వందేళ్ల ఉత్సావాల సందర్భంగా భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన తొలి వ్యక్తిగా, మొదటి మహిళా సినీ నటిగా పిలవబడే దేవికా రాణి గౌరవార్థం భారత ప్రభుత్వం 'పోస్టల్ స్టాంప్' ను విడుదల చేసింది.
88 ఏళ్ళ క్రితం మొదటి సారి ముద్దు సీన్లో...
దేవికా రాణి 1933లో మొదటి సారి వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి. దాదాపు 88 ఏళ్ల కింద ఇండియన్ సినిమాలో తొలి లిప్‌లాక్ సీన్ చిత్రీకరించారు. 1933లో 'కర్మ' అనే హిందీ సినిమా కోసం దేవికారాణి నాలుగు నిమిషాల పాటు ముద్దు పెట్టుకునే సన్నివేశంలో నటించింది. అయితే ఆ సీన్లో ఉన్నది ఆమె భర్త హిమాంశు. ముద్దు సీన్స్ అంటే బూతుతో సమానమని భావించే రోజుల్లోనే లిప్‌లాక్ సీన్లో నటించడం భారతీయ సినీపరిశ్రమలో ఇప్పటికీ కూడా ఇది రికార్డుగా నిలిచింది. కానీ ఈ సన్నివేశంపై అప్పట్లో దేవికాపై ఎన్నో విమర్శలు వచ్చాయి.. భారతీయ స్త్రీ అయ్యుండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా అంటూ విమర్శించారు. ఇండియా పరువు తీస్తున్నా వంటూ తిట్టిపోసారు. ఆచారాలను మంట కలుపుతున్నా రంటూ మండిపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం అదే లిప్‌లాక్ అంటే చాలా కామన్ అయిపోయింది.
పండ్లు అమ్మే దిలీప్ కుమార్ 'సూపర్ హీరో'గా...
దేవికారాణి ఒకరోజు పూణెలో రోడ్డు మీద వెళుతున్నపుడు రోడ్డు మీద పండ్లు అమ్మే ఒక యువకుడ్ని చూసి, అతడిలో హీరో లక్షణాలు గుర్తించి, తాను బాంబే టాకీస్ బ్యానర్లో తీసే సినిమాలో హీరోగా అవకాశం కల్పించింది. ఆ యువకుడే మహ్మద్ యూసఫ్ ఖాన్. అలియాస్ దిలీప్ కుమార్. ఇంతకీ అతడి పేరు మార్చటానికి కారణం.. అప్పట్లో అందరికి సులువుగా ఉండే పేరును పెడితే బాగుంటుందని సినిమా యూనిట్ అనుకుని పేరు మార్చరాట. ఆ రోజుల్లో సూపర్ స్టార్‌గా అశోక్ కుమార్ వెలుగొందుతూన్నందున కొత్తగా తాము పరిచయం చేస్తున్న యూసఫ్ ఖాన్ పేరుని దిలీప్ కుమార్ అని పెడితే బాగుంటుందని భావించడం, అందుకు యూసఫ్ ఖాన్ ఓకే చెప్పటంతో.. సినిమా ఇండిస్టీలో ఆయన పేరు అలా సుస్థిరమై ప్రముఖ నటుడిగా నిలిచిపోయారు.
- పొన్నం రవిచంద్ర,
9440077499