Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాలానందం' తెలియని రేడియో ప్రేమికులు గానీ, ఎనభై, తొంభయ్యవ దశకాల్లో బడికి వెళ్ళిన పిల్లలు గానీ ఉండరనడం నిజం. బాలబాలికలకే కాదు పెద్దలకూ ఇష్టమైన రేడియో కార్యక్రమమది. 'బాలనందం' కార్యక్రమం వచ్చే ముందు కొంత కాలంపాటు ఒక పాట ప్రధానంగా వినిపించేది. అది, 'రారండోరు.. రారండోరు.. నవయువకుల్లార... యువ కర్షకుల్లార దేశ సమైక్యత కాపాడుటకు దీక్షతొ ఒకటై నిలవాలోరు'' అంటూ సాగేది. అందరిని బాలానందానికి ప్రేమగా స్వాగతం పలికేది. ఈ పాట రాసింది బుఱ్ఱకథలు, జానపదాలు, పల్లెపదాలతో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన పాలడుగు నాగయ్య.
ఖమ్మం జిల్లా రామాపురంలో పాలడుగు ఈరయ్య, తిర్పమ్మ దంపతులకు జులై 19, 1943న పాలడుగు నాగయ్య పుట్టాడు. బాల్యంలోనే తల్లి మరణించడంతో నల్లగొండ జిల్లా సూర్యాపేట దగ్గరి కుడకుడలో మేనత్తల ఇంట్లో పెరిగి, అక్కడే విద్యాబ్యాసం చేశాడు. పాఠశాల విద్యార్థిగా పాటల రచన ప్రారంభించిన నాగయ్య 1958లో పాఠశాల స్థాయిలో బహుమతి అందుకున్నాడు. నాగయ్య చేతిలో పాట వడిసెలలాగా రయ్యన సాగేది. అందుకు ఆయన రాసిన ప్రతిపాట అక్షర సత్యంగా నిలుస్తుంది. పుట్టిన ఊరు రామాపురం గురించి రాస్తూ, 'పాకాల ఏరు పక్కనుండే ఊరు / రామాపురమనే పేరు రాళ్ళకాడ ఉన్నది / గార్ల కాడ ఉండి ఊరు దార్లు చూపుతున్నది/ జొన్నశేల పంటలతో జోరుగ ఊరున్నది' అంటూ తన జన్మ భూమికి కావ్య గౌరవం కల్పించారాయన.
స్వయాన కవి, గాయుకుడు, కళాకారుడు అయిన నాగయ్య పిల్లల కోసం అను బుర్రకథలు రాసి స్వయంగా ప్రదర్శించారు. ఆయన ప్రదర్శల్లో ఇతర కళాకారులు ఆయన కుటుంబ సభ్యులు కావడం విశేషం. నాగయ్య రాసిన బుర్రకథల్లో మిక్కిలి ప్రసిద్ధి పొందినది 'డా.బి.ఆర్.అంబేద్కర్' బుర్రకథ. దీనిని 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శించి, 1973లో ప్రచురించాడు. బుర్రకథే కాక ఈయన రాసిన 'అంబేద్కర్' నృత్యనాటిక కూడా ప్రసిద్ది చెందింది. 'భక్తి జనపదాల భవనము', 'పాలడుగు పదాలు' మొదలగు రచనలు, 'సీతారామ కళ్యాణము', 'డి. సంజీవయ్య', 'ఝాన్నీ లక్ష్మీబాయి', 'వీర అభిమన్యు' బుర్రకథలు అచ్చయిన వాటిలో ఉన్నాయి. అంధ్రప్రదేశ్ బాలల అకాడమి కోసం బుర్రకథలను సంకలనం చేయగా 'తందాన తాన' పేరుతో ఆకాడమి దీనిని 1982లో ప్రచురించింది. ఇందులో నాగయ్య రాసిన 'బాల చంద్రుడు' బుర్రకథతో పాటు ఏడిద కామేశ్వరరావు 'బుద్ధ లీలలు', కవుల ఆంజనేయశర్మ 'వీర శివాజీ', రెడ్డి చినవెంకటరెడ్డి 'ఆంధ్రకేసరి', కోసూరు పున్నయ్య రాసిన 'జెగజెట్టి కోడిరామమూర్తి' వంటి బుర్ర కథలున్నాయి.
'పిల్ల పదే జాతరా పిల్లలమర్రి జాతరా/ పోరి పదే జాతరా పోదాము రాయె జాతరా', 'నడువే ఓ రాములమ్మ నడువే నీవు/ నరసిమ్మా సామికాడికి నడువే నీవు' వంటి అనేక పాటలు, భజనలు, కీర్తనలు రాసిన పాలడుగు నాగయ్య పాలబుగ్గల పసిపిల్లల కోసం రచనలు చేశారు. పిల్లల కోసం పాటలు, గీతాలు, ఏకపాత్రలు, బుర్రకథలు రాసి స్వయంగా తానే దగ్గరుండి నేర్పించి రేడియోలోనూ, రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ వంటి అనేక వేదికలపైన వారితో ప్రదర్శనలు ఇప్పించాడు. తాను కూడా పిల్లలతో కలిసి ప్రదర్శించి అనేక పోటీల్లో బహుమతులు కూడా అందుకున్నాడు. ఆయనకు పేరు తెచ్చిన ఎకపాత్రల్లో 'పిట్లలదొర', 'పకోడివాలా' వంటివి ప్రముఖమైనవి.
'పకపక నవ్వే పాపల్లార చకచక సాగే చిగురుల్లారా / వడివడి విద్యలు నేర్వండి / అడుగిడి ముందుకు సాగండి' అంటూ రాసినా, 'బాబులు బొమ్మలు బాలల బొమ్మలు / బలెబలె బొమ్మలు బలె మంచి బొమ్మలు / కా అంటూ పాడేటి కాకమ్మ బొమ్మలు / కూ అంటూ కూసేటి కోయిలమ్మ బొమ్మలు' అంటూ పాడినా లేదా జాతరల్లో, దుకాణాల్లో పిల్లలకు కనువిందు చేసి ఆకర్శించే బొమ్మల గురించి 'వైకుంఠం చూపిస్తం బాబు మేము వైకుంఠం చూపిస్తం బాబు / పైస మాకిస్తేను పట్నము చూపెడుతాం / పది పైసలిస్తేను పంజాబు చూపిస్తం / ఏబై పైసలిస్తేను ఎల్లోర చూపిస్తం / రూపాయి ఇస్తేను ఢిల్లీకోట చూపిస్తం' అంటూ పాడిన అది ఆయనకే చెల్లింది.
దేశం, ధర్మం, రాముదు, నరసింహస్వామి వంటి అంశాలు, గ్రామీణులు, గ్రామీణ జాతరలు, గ్రామ దేవతల గురించి కూడా పాటలు రాసిన పాలడుగు నాగయ్య బుర్రకథల ఎత్తుగడ విలక్షణంగా ఉంటుంది. అది ఆయన అన్ని కథల్లో కనిపిస్తుంది. 'అంబ భారతి/ ఆదుకొని మమ్మేలుకోవే / పాడి పంట లొసగి, భాగ్యాలు మాకొసగి / దీవించవే ముమ్మ దీనులము మేమోయమ్మ' అంటూ 'బాలచంద్రుడు' కథలో కథ ప్రారంభిస్తే, 'న్యాయధర్మమములు నాల్గుపాదముల నడిపించిన దేశం తందాన తాన/ కత్తి నిచ్చి యుద్దానికి పంపె కన్నతల్లులకును / కొదువలేనిది భారతదేశం' దేశశౌర్యవీర పరాక్రమాలను వర్ణిస్తాడు. 1982 ఏప్రిల్ 10న అనారోగ్యంతో అర్ధాంతరంగా తనువుచాలిచాడు ఈ పాటల బాటసారి.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548