Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజాబీ భాషలో 2016లో వచ్చిన సినిమా ''గేలో''. రాం సరూప్ ఆంఖి పంజాబీలో పేరున్న గొప్ప రచయిత. వీరికి సాహిత్య అకాడమి బహుమతి కూడా లభించింది. పంజాబ్ ప్రాంతంలోని పల్లెటూరి జీవితాన్ని తన నవల ద్వారా ఎక్కువగా రాసిన రచయిత ఈయన. ''గెలో'' వీరు రాసిన నవల. దాని ఆధారంగా మన్ భావన్ సింఫ్ు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. పంజాబ్ ప్రాంతంలో మాల్వా పరిసరాలలోని గ్రామ జీవితాన్ని చూపించిన సినిమా ఇది. గుర్మిల్ కౌర్ అనే ఒక స్త్రీ ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఈ కథలో కులవివక్షతో పాటు గ్రామాలలో ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను చర్చించారు రచయిత.
గేలో అని ముద్దుగా పిలుచుకునే గుర్మిల్ కౌర్ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన యువతి. ఆమె అదే ఊరిలో పిండి మరలో పని చేస్తున్న రామా అనే యువకుడిని ప్రేమిస్తుంది. రామా ఆ ఊరిలో తక్కువ కులానికి చెందిన యువకుడు. తమ అగ్రజాతి కులస్తులు అసహ్యించుకునే కులస్తుడిని ప్రేమించిన గెలోకి తమ ప్రేమపై చాలా నమ్మకం ఉంటుంది. కాని వీరి సంగతి తెలుసుకున్న ఆమె అన్న రామాను క్రూరంగా హత్య చేసి జైలు పాలవుతాడు. జైలు నుండి విడుదల అయిన తరువాత అతను మామూలు మనిషి కాలేకపోతాడు. స్వతహాగా మంచి వాడయిన అతను కులం అనే మత్తులో క్రూరంగా మరో వ్యక్తిని హత్య చేసి తరువాత మామూలు జీవితం గడపలేక ఆత్మహత్య చేసుకుంటాడు. గేలోకి బలవంతంగా వారి కులానికే చెందిన మరో వ్యక్తితో పెళ్ళి జరిపించి చేతులు దులుపుకుంటారు పెద్దలు.
గేలో భర్త తాగుడిగి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటాడు. పంజాబ్ ప్రాంతంలో ప్రతి ఇంట ఈ సమస్య ఉంది. తాగుబోతయిన మగవారి మధ్య ఆ ఇళ్లలోని స్త్రీలు నలిగిపోతూ ఉంటారు. ఈ అలవాట్ల కారణంగా మగవారు పని చేయరు. చివరకు వారి వ్యవసాయ భూములు కూడా తనఖాలో ఉంటాయి. ఈ ఊరిలో కాస్త డబ్బున్న వారు ఇలాంటి వారి వద్ద నుండి అతి చవకగా పొలాన్ని రాయించుకుంటారు. గేలో భర్త అలవాట్ల కారణంగా ఇల్లు గడవక అతి హీనమైన స్థితిలో జీవిస్తూ ఉంటుంది. ఈ లోపు ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. వారసుడు కావాలని ఆమె అత్త కోరిక. కాని కొడుకు ఆరోగ్యం కారణంగా అతను ఇక ఎప్పటికీ తండ్రి అవలేడని ఆమెకు తెలిసి ఆ దుఖంతో మరణిస్తుంది. తల్లి చనిపోయిన తరువాత గేలో భర్తను ఆపేవారెవ్వరూ ఉండరు. విపరీతంగా మందుకు మత్తు పదార్ధాలకు అలవాటు పడతాడు.
ఆ ఊరి భూస్వామి కన్ను గేలోపై ఉంటుంది. కటిక పేదరికంలో బిడ్డను పోషించుకోవడానికి గేలో పక్క ఊరికి వెళ్ళి పడుపు వత్తి చేయడం మొదలెడుతుంది. ఆమె ఏం పని చేస్తుందో కూడా విచారించే పరిస్థితులలో ఆమె భర్త ఉండడు. ఆమె సంపాదించిన డబ్బుతో తాగడం మొదలెడతాడు. కాని అనుకోని పరిస్థితులలో ఒక నాడు గేలో పక్క ఊరిలో ఏ పని చేస్తుందో అతనికి తెలిసిపోతుంది. తన చేతకానితనం భార్యను ఏ స్థితికి తీసుకువచ్చిందో తెలిసి అతను ఆత్మహత్య చేసుకుంటాడు.
భర్త అనే వ్యక్తి గేలో జీవితం నుండి నిష్క్రమించాక ఇక ఆమె మరీ ఒంటరిదవుతుంది. ఊరిలో ఆమె పొందు కోసం తపించే మగవారు ఎక్కువవుతారు. పొలం భూస్వామి దగ్గర కుదవ పెట్టబడి ఉంటుంది. గేలో కూతురు స్కూలు చదువుకు వస్తుంది. ఆ బిడ్డ కోసం గేలో తన వత్తి చేసుకుంటూనే ఉంటుంది. కాని వత్తి దగ్గర ఆమె యజమానురాలు కూతురిని కూడా వ్యభిచారంలోకి దింపమని అన్నప్పుడు ఆమెలో ఆవేశం మొదలవుతుతుంది. యుక్తవయసులో ఉన్న కూతురి కోసం ఇంటి చుట్టూ కాపు కాసే తుంటరి వెధవల నుండి బిడ్డను రక్షించుకోవడం ఒక సమస్యగా మారుతుంది. తాను వత్తిలో సాగినన్నాళ్ళూ బిడ్డ గురించి ఈ బెంగే అనుక్షణం ఉంటుందని ఆమెకు అర్ధం అవుతుంది. వత్తి మానేసి భూస్వామికి ఎదురు తిరిగి తన భూమి తానే ఒంటి చేతితో సాగు చేసుకోవడం మొదలెడుతుంది గేలో. భూస్వామి ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా ప్రాణాలకు తెగించి సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ బిడ్డను పోషించుకుంటుంది. ఆమె వదిన ఆ పరిస్థితులలో ఆమెకు అండగా నిలబడుతుంది. భర్త చనిపోయి ఒంటరి జీవితాన్ని లాక్కు వస్తున్న ఆమె గేలోతో కలిసి పొలంలో కష్టించడం మొదలెడుతుంది.
ఈ పరిస్థితులలో ఆమె కూతిరిపై అత్యాచారం చేయబోతాడు ఆ ఊరి భూస్వామి. గేలో కూతురిని రక్షించే ప్రయత్నంలో అతన్ని హత్య చేసి జైలు పాలవుతుంది. వదిన దగ్గర పెరిగిన కూతురి వివాహం సమయంలో జైలు నుండి విడుదలయి ఆమె తిరిగి రావడంతో సినిమా ముగుస్తుంది.
పంజాబ్లోని పల్లేటూర్లలోని నేటి స్థితిని గమనిస్తే మద్యపానం, మత్తు పదార్ధాల కారణంగా నాశనమయిన ఎన్నో కుటుంబాలు కనిపిస్తాయి. ఆ కుటుంబాలలోని స్త్రీలు ఎన్నో కష్టాలను అనుభవించి ఇంటిని నడుపుకుంటూ జీవించడం ప్రతి ఇంటా ఉన్న కథే. ఇన్ని పరిస్థితుల మధ్య ఆ ఊర్లలో కులం పేరుతో జరుగుతున్న పరువు హత్యలకూ అంతే లేదు. వీటన్నిని కథగా మలిచి రాసిన ఈ నవలలో పంజాబ్ ప్రాంతంలో మద్యతరగతి, దిగువ తరగతికి చెందిన అగ్ర వర్ణాల స్త్రీల జీవితాలు కనిపిస్తాయి. వీరు కూలి పనికి వెళ్ళకూడదు. మరేదైనా కష్టపడే పని చేయకూడదు. వీరి భర్తలు మత్తులో పడి ఉన్నా ఇంట్లో ఆకలితో ముడుచుకుని పడుకోవడమే పరువు గల స్త్రీలు చేయవలసిన పని. అందుకే గేలో భర్త ఉన్నప్పుడూ పొలం పనికి వెళ్లాలని అనుకోదు. అది సహజమైన పనిగా అక్కడి సమాజం అంగీకరించదు. పడుపు వత్తిలో తనలాంటి ఎందరో స్త్రీలు ఉండడం చూసి తప్పని స్థితిలో మరో ఊరు వెళ్ళి ఆ పని చేయడం మొదలెడుతుంది. కూతురు వయసుకు వచ్చిన తరువాత ఆమె భవిష్యత్తు పట్ల భయం, భాద్యత ఆమెను ఆలోచింప జేస్తాయి. చివరకు ఒంటరిగా వ్యవసాయం మొదలెడుతుంది. ఎవరూ సహా యానికి రాని సమయంలో తనను అర్ధం చేసుకున్న వదినతో కలిసి తాను పొలాన్ని దున్నడం మొదలెడుతుంది. ఆమె చేసే ఈ పని వలన భూమిపై తన అధిపత్యాన్ని పోగొట్టుకుంటానని భయపడి ఆ భూస్వామి ఆమెను అక్కడ లేకుండా చేయాలని కుట్ర పన్నుతాడు. గేలో అతన్ని హత్య చేసి తన కూతురిని కాపాడుకుంటుంది కాని జైలుకు వెళ్ళవలసి వస్తుంది.
గేలో ప్రేమ కథలోని విషాదాన్ని గమనిస్తే హత్యకు గురయిన ఆమె ప్రియుడు జీవితాన్ని కోల్పోయినట్లే అతన్ని హత్య చేసి ఆమె అన్న కూడా అకారణంగా మరణిస్తాడు. పరువు పేరు మీద జరుగుతున్న హత్యలు ఎవరికి మంచి చేసాయన్నది ఎవరూ చెప్పలేరు. మన రాష్ట్రంలో జరిగిన పరువు హత్యలను పరిశిలించినా రెండు కుటుంబాలు నాశనం అవడం తప్ప ఎవరూ విజయంతో గర్వపడడం కనిపించదు. గేలో అన్న అతి కిరాతకంగా రామా తలను నరికి స్త్రీలు వంట చేస్తున్న ప్రాంతంలో పాతి పెడతాడు. రాత్రి పూట తన ఇంటికి వచ్చి చెల్లెలిని కలుసుకున్న రామాను చూసి అతను ఆవేశం ఆపుకోలేక పోతాడు. అతి కిరాతకంగా ఇంట్లో ఆడవారి ముందే అతన్ని హత్య చేస్తాడు. ఆ కిరాతకాన్ని చూస్తూ ఎదిరించలేని పరిస్థితి అతని భార్యది. పోలీసువారు కనపడని రామా కోసం గాలిస్తున్నప్పుడు భర్తను కాపాడుకోవలనే గేలో వదిన అనుకుంటుంది. కాని హత్య చేసిన పాపం అతన్ని మౌనంగా ఉండనివ్వదు. పోలీసుల ముందు తానే శవాన్ని పూడ్చిన స్థలాన్ని చూపించి అరెస్టు అవుతాడు గేలో అన్న. గేలో వదిన జీవితం కూడా ఏ అండ లేకుండా ఆదరణ లేకుండా మోడువారిపోతుంది.
పంజాబ్లో యువత మత్తు మందులకు బానిసలవడం, ఏ దారి లేక ఇంటిని నడిపించడం కోసం స్త్రీలు వీధిన పడడం, అగ్రకులం పేరుతో శ్రమ చేయనివ్వని సమాజం, చివరకు వారు చేయకూడని పనులు చేయడం గురించి చాలా మంది ప్రస్తావించారు. సినిమా కథను రచయిత ఏ ప్రలోభావాలను లక్ష్య పెట్టకుండా రాసుకున్నారు. రైతు కుటుంబంలో పుట్టి తప్పని పరిస్థితులలో శరీరాన్ని అమ్ముకోవలసిన స్థితిలో జీవించిన గేలోకి పడుపు వత్తి తప్ప జీవించడానికి మరో ప్రత్యాయమానం లేదా అన్న ప్రశ్న వేసుకోవలసి వస్తుంది కూడా. గేలో మానసిక స్థితి, స్త్రీగా ఆమెలోంచి క్రమంగా దూరమవుతున్న సున్నితత్వం, వీటన్నిటి మధ్యన ఆమె ఎంచుకున్న మార్గం పడుపు వత్తి తప్ప మరొకటి కాకపోవడం ఆ పరిస్థితిలలో తప్పనిపించదు.
తనను ప్రేమించిన కారణంగా ప్రేమికుడు తన కళ్ళ ముందే అసహాయంగా హత్యకు గురి అవడం దగ్గర నుండి, కులం పేరుతో జరిగిన వివాహంలో ఆమె ఎదుర్కుంటున్న సమస్యలు ఆమెలో ఒక తెలియని కసిని కూడా పేంచుతాయి. తన శరీరాన్ని అభిమానించిన ప్రియుని శరీరం చిధ్రం అయి తాను సర్వ రోగాలున్న వ్యక్తికి భార్యగా జీవిస్తున్నప్పుడే ఆమెకు తన శరీరంపై మమకారం కూడా నశిస్తుంది. తాను తన శరీరం నుండి వేరుపడిన భావన కూడా అమెకు కలిగే అవకాశం ఉంది. తాను ప్రేమించిన వ్యక్తిని ఆమె ఎప్పటికీ మరిచిపోలేకపోతుంది. ఎప్పుడూ అతను తన ఇంటి గుమ్మంలోకి వచ్చి నిలబడినట్లే ఆమెకు కనిపిస్తూ ఉంటుంది. మనిషిగా మనసు చంపుకుని జీవిస్తున్న ఆమె శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకోవడం గురించి పెద్దగా ఆలొచించదు. కూతురి భవిష్యత్తు ప్రశ్నగా మారినప్పుడే తిరిగి అందరిని ఎదిరించి శ్రామికురాలిగా ఆమె మారుతుంది. పెద్దింటి స్త్రీగా ఆమె పొలం పని తన జీవితానికి ఒక మార్గం అవగలదని ముందు అనుకోలేకపోతుంది. ఆమె పెరిగిన కులం ఆమెకు నలుగురి ముందు పొలంలో దిగడానికి అడ్డు వస్తుంది. సర్వం పోగొట్టుకున్నప్పుడే శ్రమను ఆమె గుర్తిస్తుంది. అప్పటి దాకా పురుషుని జీవితంలో ఒక వస్తువుగా ఉండడమే తన కర్తవ్యం అనే భావనలో ఆమె ఉండిపోతుంది. అగ్ర కులంలో జీవించే స్త్రీల మానసిక భావజాలాన్ని ఈ సినిమా ఎత్తి చూపించిందని చెప్పవచ్చు.
సినిమా టేకింగ్ చాలా మెల్లగా సాగుతుంది. కథను సినిమాగా మలచడంలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. కథాకాలం మనకు అర్థం కాదు. 2010లో మరణించిన రామ్ స్వరూప్ ఆంఖీ, ఈ నవలను ఢెబ్బైలలో రాసారు. కాని దీన్ని సినిమాగా మార్చే క్రమంలో దర్శకులు కథాకాలాన్ని ఎక్కడా ప్రకటించలేదు. సినిమా కొంత ఆ నాటి కాలంలో నడిచినట్లు కొంత ప్రస్తుత పరిస్థితులలో నడుస్తున్నట్లు ఉండి ప్రేక్షకులను కాస్త అయోమయనికి గురి చేస్తుంది. గేలో పాత్రలో గాంభీర్యాన్ని దర్శకుడు పూర్తిగా చూపించలేకపోయారని అనిపిస్తుంది. ఈ లోపాలను పక్కన పెడితే మనకెవరికీ తెలియని పంజాబ్ పల్లెటూరి స్త్రీల జీవన సంఘర్షణను ప్రస్తావించిన సినిమాగా గేలోని మనం పరిగణించవచ్చు.
గెలో గా జస్పిందర్ చీమా మంచి నటనను ప్రదర్శించారు. కొన్ని పాత్రలలో అపరిపక్వత కనిపించినా సమస్యను చర్చించిన విధానం బావుంది. పంజాబీ భాషా చిత్రాలలో 'గేలో' ఒక మంచి మహిళా ప్రధాన చిత్రంగా చర్చకు వస్తుంది.
- పి.జ్యోతి, 9885384740