Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యక్తి శక్తిగా పరిణమించినపుడు ఏ ప్రభుత్వాధికారమైనా తన దష్టినంతా ఆ శక్తి మీద పెట్టాల్సిందే. ఒకవేళ ఆ శక్తే గనక తనకున్న పరివారపు గణంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే అది పతనం కావాల్సిందే. ఇది స్వాతంత్య్రోద్యమ సూత్రం. దీనికి సూత్రధారి స్వామి రామానంద తీర్థ.
జననం, బాల్యం
హైదరాబాదు సంస్థానంలో భాగమైన గంగాపూర్ గ్రామంలో 1903 సం.లో జన్మించాడు. ఈ గ్రామం భీమా, అమరజా నదుల సంగమ స్థానం. ఇది గుల్బర్గా జిల్లాలో ఉన్న గ్రామం. బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టిన ఇతను చిన్నప్పటి నుండే సన్యాసులను ఆరాధించిన వ్యక్తి. స్వామి రామానంద తీర్థగా పేరు పొందిన ఈయన అసలు పేరు వెంకటేష్ భగవాన్ రావు ఖేద్కికర్. ఇతను షోలాపూర్‌లోని 'నార్త్ కోట్' ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యనభ్యసించాడు. అమల్నేర్లోని ఖాందేశ్ విద్యాసంఘం వారి కళాశాలలో ఉన్నత విద్య కొరకు చేరాడు. అటు తర్వాత పూనేలోని తిలక్ విద్యాపీట్ లోచరిత్ర, రాజనీతి శాస్త్రాలు అభ్యసించాడు.
నాయకుల ప్రభావం, స్వాతంత్య్రోద్యమం
పిల్లలకు గుర్తించుకునే లక్షణం సహజంగా అధికంగానే ఉంటుంది. కనుక వారి మనో ఫలకంపై ఏవైనా ప్రభావాలు పొరపాటున పడితే అవి ఆ పిల్లలను ప్రభావితం చేస్తాయి. ఈ లక్షణానికి వెంకటేష్ భగవాన్ దూరంగా ఉండలేడు. ఇతను పాఠశాల దశలో ఉన్నప్పుడు జాతీయోద్యమం దేశ వ్యాప్తంగా సాగుతుంది. మహారాష్ట్రలో తిలక్ దేశభక్తి ప్రపూరితమైన ఉత్సవాలను అప్పటికే ప్రారంభించి ప్రజలను జాతీయోద్యమం లో భాగం చేసేలా ప్రసంగాలిస్తున్నాడు. ఆ ప్రసంగాలు అప్పటికే బాలుడిగా ఉన్న రామానంద తీర్థ మేధ ఫలకంపై ముద్ర వేసాయి.
స్వీయ పరిపాలన సాగాలని తలిచిన తిలక్, అందుకు బ్రిటిషు వ్యతిరేకోద్యమం చేపట్టినాడు. ఈ దశలో రామానంద, మహాత్మాగాంధీ గురించి విన్నాడు. మెట్రిక్యులేషన్ చదువుతుం డగా అత్యంత గాడంగా అభిమానించిన తిలక్ కన్ను మూయ డంతో ప్రగాఢ భావోద్వేగానికి గురయ్యాడు. తిలక్ వేసిన ప్రసంగాల ప్రభావం వలన దేశ సేవ చేయాలని భావించి అందుకు ఇహపర సుఖాలను త్యజించి తనకు తాను బద్ధుడై నిలబడ్డాడు. ఇక అప్పటి నుంచే ఆయన పాఠశాలల బహిష్కరణ ఉద్యమమనే తోరణం గుండా జాతీయోద్యమంలోకి దూకి కాంగ్రెసు తీర్థం పుచ్చుకొని కార్యకర్తగా తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు.
1929లో ఉస్మానాబాద్ జిల్లాలోని హిప్పర్గి గ్రామంలో జాతీయ పాఠశాలలో టీచర్‌గా చేరాడు. ఇంతకంటే ముందు పలువురి నాయకులను కలుసుకున్నాడు. 1930లో సంక్రాంతి నాడు స్వామి నారాయణ్ వద్ద సన్యాస దీక్షను పుచ్చుకొని స్వామి రామానంద తీర్థగా మారాడు. ఆ తర్వాత హైదరాబాదులో వందేమాతర ఉద్యమం జరగడానికి కొన్ని నెలల ముందు హైదరాబాదు చేరుకొని పేరొందిన నాయకులతో పరిచయ మేర్పర్చుకున్నాడు. అంతలోనే ఉస్మానియా యూనివర్సిటిలో వందేమాతర ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో రామా నంద తీర్థ తొలిసారి అరెస్టయ్యారు. విడుదలయ్యాక కాంగ్రెసు నిషేధం గరించి తెలుసుకొని కాంగ్రెసుతో కూడిన పలు సంస్థల కూటమికి 'హైదరాబాద్ జాతీయ సంఘం' అని మార్చారు. దీన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది (1938 డిసెంబర్). నానాటికి విస్తరిస్తున్న నిజాం వ్యతిరేక స్వాతంత్య్రోద్యమంపై స్వామిజీకి మరింత అవగాహన పెరిగింది. జాతీయోద్యమ నాయకులను కలిసి వారితో చర్చలు జరిపాడు. అంతలోనే క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. హైదరాబాదు సంస్థానంలో కూడా జరిగిన ఈ ఉద్యమంలో స్వామీజీతో పాటు 400 మంది అరెస్టయ్యారు. ఇలా సంస్థానంలో అరెస్టులు, విడుదలల పర్వం సాగుతున్న సంక్లిష్ట సందర్భంలో ప్రముఖ ఉద్యమకారులతో పరిచయం కలిగింది.
ఒక మామూలు పాఠశాల ఉపాధ్యాయుడి నుండి స్వాతంత్య్రోద్యమంలో నాయకుడి వరకు ఎదిగిన స్వామి ఉద్యమంలో అనేక ఆటుపోట్లు చూసాడు. అవి అరెస్టులు కావొచ్చు, నిరసన వ్రతాలు కావొచ్చు, సత్యాగ్రహ దీక్షలు కావొచ్చు. ఏవి అయినా కానీ ఇలా క్రమంగా హైదరాబాదు స్వాతంత్య్రోద్యమంలో అనేక మందికి నాయకుడిగా, కొందరికి గురువుగా ఉండి స్ఫూర్తిగా నిలిచాడు. వారిలో పి.వి. నరసింహారావు, కాళోజి నారాయణరావు వంటి వారున్నారు.
పోలీసు చర్య నాటికి స్వామిజీ జైలులో ఉన్నాడు. ఈ చర్యలో భాగంగా నిజాం లొంగిపోయిన రోజునే స్వామిజీకి జైలు నుండి విముక్తి లభించింది. అలాగే హైదరాబాదు సంస్థాన ప్రజలకు నిజాం నుండి విముక్తి లభించింది. పోలీసు చర్య వలన నష్ట పోయిన గ్రామాలలో స్వామిజీ పర్యటించేందుకు 'శాంతి సందేశయాత్ర' సాగించాడు.
సాంఘిక సేవ, రాజకీయ జీవితం
మితవాద నాయకుడిగా ఉన్న స్వామి ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాడు. అందుకు భూదాన్, గ్రామదాన్ ఉద్యమాలకు అండగా నిలిచాడు. స్వాతంత్య్రానంతరం స్వామిజీ గుల్బర్గా, ఔరంగాబాద్ ల నుండి రెండు మార్లు కేంద్ర శాసన సభకు ఎన్నికయ్యాడు. కాని రాజకీయాలలో కొనసాగుతున్న అవినీతిని చూసి విచారపడి తప్పుకున్నాడు. ప్రశ్నించడానికి, కార్యచరణకు పూనుకోడానికి వెనకాడని రామానంద తీర్థ 1972 లో అస్తమించాడు.
- ఘనపురం సుదర్శన్,
9000470542