Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత ముద్ర వేసుకున్న 'పాకీజా' చిత్రం విడుదలై యాబై సంవత్సరాలు గడచినా, బాలీవుడ్లో నేటికీ క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా వెలుగొందుతూనే వుంది. ''ఆప్కే పాన్ దేఖే, బహుత్ హసీన్ హై... ఇన్హేన్ జమీన్ పర్ మత్ ఉతరియేగా... మైలే హౌ జాయేంగే'' వంటి డైలాగ్‌లు ఇప్పటికీ మహిళల హదయాలను ద్రవింపజేస్తునే ఉన్నాయి. ఇన్హి లోగోన్ నే లే లీనా దుపట్టా మేరా..., చలో దిల్దార్ చలో చాంద్ కే పార్ చలో... వంటి గీతాలు నేటికీ ప్రతి సంగీత ప్రియుడి నోటా.. ప్రతి ఇంటా వినపడుతూనే ఉన్నాయి. వేశ్య ప్రేమ కథాంశం, అందమైన కాస్ట్యూమ్స్, మనోహరమైన సెట్లు, అద్భుతమైన సంగీతంతో పాకీజా చిత్రం అందంగా తయారయింది. ప్రముఖ కవి, రచయిత, దర్శకుడు 'కమల్ అమ్రోహి' ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు నిలచింది. 1956లో షూటింగ్ మొదలు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలైన కొద్దిరోజులకే మీనా కుమారి కన్నుమూశారు. దాంతో మీనాకుమారి అభిమానులు పాకీజాను చూడటానికి థియేటర్లకు పరుగులు తీశారు. సినిమా స్వర్ణోత్సవం జరుపుకుంది.
1972లో విడుదలైన చిత్రాలలో భారీ కలెక్షన్లు సాధించిన 'పాకీజా' కథ విషయానికి వస్తే... లక్నోలోని నర్తకీమణుల్లో ఒకరైన నర్గీస్‌ను (మీనాకుమారి) ఉన్నత వంశానికి చెందిన షాబుద్దీన్ (అశోక్ కుమార్) ప్రేమిస్తాడు. షాబుద్దీన్‌తో ప్రేమలో పడిన నర్గీస్ తానుండే వేశ్యాగహం నుండి పారిపోయి, షాబుద్దీన్‌తో జీవితం గడపాలనుకుంటుంది. అయితే షాబుద్దీన్ తండ్రి హకీమ్ సాబ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీక రించరు. దీంతో ఆమె పారిపోయి స్మశానవాటికలో ఆశ్రయం పొందుతుంది. తర్వాత షహబుద్దీన్ ఎంత వెతికినా నర్గీస్ ఆచూకీ తెలుసుకోలేకపోతాడు. అప్పటికే గర్భవతి అయిన నర్గీస్ స్మశానవాటికలో ఓ ఆడపిల్లకు జన్మనిచ్చి, షాబుద్దీన్‌కు ఓ లేఖ రాసి కన్ను మూస్తుంది. ఆ బిడ్డను ఆమె చెల్లెలు నవాబ్‌జాన్ (వీణా సప్రు) చూసుకుంటుంది. నర్గీస్ నగలు, వస్తువులు చాలా రోజుల తరువాత ఓ వ్యక్తికి లభిస్తాయి. అందులోనే షాబుద్దీన్‌కు నర్గీస్ రాసిన ఉత్తరం దొరుకుతుంది. అది షాబుద్దీన్‌కు చేరుతుంది. తరువాత కూతురు కోసం గాలిస్తాడు షాబుద్దీన్. ఫలితం ఉండదు. నర్గీస్ కూతురు సాహిబ్ జాన్ (ఈ పాత్రను కూడా మీనా కుమారి పోషించింది) పెరిగి పెద్దయి అచ్చు తల్లి పోలికలతో ఉంటుంది. సాహిబ్ జాన్ ఒక రోజు రైలు ప్రయాణం చేస్తూండగా, ఆ కంపార్ట్మెంట్లోకి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి, నిద్రిస్తున్న సాహిబ్ జాన్ అందానికి మోహితుడై, పారాణి పెట్టుకున్న పాదాలను చూసి ప్రేమలో పడతాడు. ఈ సందర్భంలో ''నేను నీ పాదాలను చూశాను.. చాలా మనోహరంగా ఉన్నాయి. వాటిని భూమిపై నిలబెట్టవద్దు అవి మలినమవుతాయి'' అంటూ రాసిన చీటిని నిద్రిస్తున్న సాహిబ్ జాన్ పాదాల వద్ద తన గుర్తుగా పెట్టి పోతాడు. ఆ చీటి చదివిన ఆమె ఆ అపరిచిత వ్యక్తి ప్రేమలో పడి, ఆయనని ఆరాధించడం మొదలు పెడుతుంది. అతను ఎవరో ఆమెకు తెలియదు, ఓ లేఖ రాసి, ఆమె అతని పేరు సలీమ్ (రాజ్ కుమార్) అని తెలుసుకుంటుంది. సాహిబ్ జాన్ అతనిపై మనసు పారేసుకుంటుంది. చివరకు సలీమ్, సాహిబ్ జాన్ కలుసుకుంటారు. ప్రేమించుకుంటారు. అయితే సలీమ్ ఉన్నత కుటుంబానికి చెందిన వాడు కాబట్టి, తనను పెళ్ళి చేసుకుంటే అతనికి అవమానం ఎదురవుతుందని భావిస్తుంది సాహిబ్ జాన్. దాంతో మళ్ళీ వెళ్ళి వేశ్యా వాటికలో పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఈ ఘటనతో భగ హదయుడైన సలీమ్ తన బంధువుల అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ వివాహానికి ముందు సాగే ఉత్సవంలో సాహిబ్ జాన్ పాటలు పాడటానికి వస్తుంది. ఆ పెళ్ళిలో నర్గీస్ చెల్లెలు నవాబ్‌జాన్, షాబుద్దీన్‌ను గుర్తిస్తుంది. షాబుద్దీన్‌కు సాహిబ్ జాన్ అతని కూతురేనని చెబుతుంది. షాబుద్దీన్ తండ్రి సాహిబ్‌జాన్ పిన్ని నవాబ్జాన్ని చంపాలనుకుంటాడు. ఆమెను కాపాడే క్రమంలో షాబుద్దీన్‌కు గుండు తగలుతుంది. చివరి నిమిషంలో తన కూతురైన సాహిబ్ జాన్‌ను పెళ్ళాడాలని సలీమ్‌ను కోరతాడు. దీంతో సలీమ్, సాహిబ్ జాన్ కోసం ఆమె ఉండే కోఠాకు పోవడంతో కథ ముగుస్తుంది.
ఇందులో నర్గీస్, సాహిబ్ జాన్ పాత్రల్లో మీనాకుమారి నటించగా, షాబుద్దీన్గా అశోక్ కుమార్, సలీమ్‌గా రాజ్ కుమార్ అభినయించారు. వీణ, నదిరా, డి.కె.సప్రూ, కమల్ కపూర్, విజయలక్ష్మి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కమల్ ఆమ్రోహి రచన చేసి, దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా పలు ఆటంకాలు ఎదుర్కొంటూ పూర్తయింది. అందువల్ల కొన్ని సీన్స్‌లో మీనా కుమారి వయసు మళ్లి కనిపిస్తారు. అయితే అందరూ కమల్ ఆమ్రోహిపై గౌరవంతో ఈ సినిమా పూర్తి కావడంలో సహకరించారు. ఈ చిత్రంలో అన్ని కలిపి 20 పాటల దాకా ఉంటాయి. వీటిలో 15 పాటలకు గులామ్ మొహ్మద్ సంగీతం సమకూర్చారు. వాటిలో కేవలం ఆరు పాటలనే సినిమాలో ఉపయోగించుకున్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే గులామ్ మొహ్మద్ కన్నుమూశారు. దాంతో కమల్ ఆమ్రోహి కోరిక మేరకు ప్రఖ్యాత సంగీత దర్శకులు నౌషద్ నాలుగు పాటలకు స్వరకల్పన చేశారు. నేపథ్య సంగీతాన్ని కూడా నౌషద్ అందించారు. ఇందులోని పాటలను మజ్రూ సుల్తాన్ పురి, ఖైఫీ అజ్మీ, ఖైఫ్ భోపాలి, కమల్ ఆమ్రోహి, మీర్ తకీ మీర్ రాశారు. గులామ్ స్వరాల్లో రూపొందిన ''ఇన్హి లోగోన్ నే లే లీనా దుపట్టా మేరా.., చలో దిల్దార్ చలో చాంద్ కే పార్ చలో.., తారే రహియో.., చల్ తే చల్ తే..., మోసం హై ఆషికానా...'' పాటలు సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. ఇక నౌషద్ బాణీల్లో రూపొందిన థీమ్ మ్యూజిక్, మోరా సాజన్..., కౌన్ గలీ గయో..., నజరియా కీ మారీ... వంటి పాటలు కూడా ప్రాచుర్యం పొందాయి. మొదట్లో అన్ని పాటల ఆడియో విడుదలై సంగీతాభిమానులను విశేషంగా అలరించాయి. సినిమాలోని పాటల చిత్రీకరణ సైతం ఆకట్టుకుంది.
పాకీజా చిత్రం షూటింగ్ మొదలైన దాదాపు 16 ఏళ్ళకు విడుదలైనా, ఈ సినిమా పెట్టుబడికి నాలుగింతలు రాబడి చూసింది. అద్భుతమైన కథ, సంగీతం, నత్యంతో పాటు, భావోద్వేగంతో కూడిన ''పాకీజా'' సెంట్రల్ ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో మొదటిసారి ఫిబ్రవరి 4, 1972న గ్రాండ్ ప్రీమియర్‌తో విడుదలైంది. విడుదలైన వెంటనే ఈ చిత్రం విజయం సాధించలేదు. అయితే అప్పటికే కమల్ ఆమ్రోహి, మీనా కుమారి విడిపోయారు. ఈ సినిమా విడుదలైన కొన్నాళ్ళకే మీనాకుమారి మరణించారు. ఆమె మరణం అభిమానులకు ఆవేదన కలిగించింది. దాంతో మీనా కుమారి అభిమానులు పాకీజాను పదే పదే చూసి ఆనందించారు. 1972లో విడుదలైన టాప్ గ్రాసర్స్‌లో పాకీజా చిత్రాన్ని ఒకటిగా నిలిపారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలన్న మీనాకుమారి అభిలాష నెరవేరినా, ఆ విజయోత్సవాన్ని చూడకుండానే ఆమె కన్ను మూసింది.
చిత్ర నిర్మాణం
''పాకీజా'' జూలై 16, 1956న ముహూర్తం షాట్‌తో ప్రారంభించబడి, ఫిబ్రవరి 4, 1972న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమా నిర్మాణం పూర్తి కావడానికి 16 ఏళ్లు పట్టింది. మీనాకుమారి హీరోయిన్గా తన కలల ప్రాజెక్ట్ 'పాకీజా' సినిమా తీయాలనుకున్నాడు కమల్ అమ్రోహి. 'విడాకులు ఇస్తేనే చేస్తాను' అంటూ కమల్‌కు చెప్పింది మీనాకుమారి. మానసికంగా మనమేమీ ఒకరికొకరం ముడిపడి లేమిప్పుడు నీ ఆత్మ సంతప్తి కోసం ఇచ్చేస్తానని, విడాకులు ఇచ్చేసాడు. దాంతో కమల్ అమ్రోహీ మీనా కుమారిని హీరోయిన్గా పెట్టి ''పాకీజా'' సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా మొదట నలుపు-తెలుపులో షూటింగ్ జరుపుకుంది. కానీ, ఆ సమయంలో కలర్ చిత్రాలు వాడుకలోకి రావడంతో.., అమ్రోహి అప్పటికే చిత్రీకరించిన ఆ భాగాలను తొలగించి, మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తరువాత, సినిమా స్కోప్ వాడుకలోకి వచ్చింది. అమ్రోహి ఎం.జి.ఎం నుండి సినిమా స్కోప్ లెన్స్‌ను కొనుగోలు చేసి, సాధారణ కలర్ భాగాలను కూడా తొలగించాడు. ఆ టైంలో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి, మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. చిత్రీకరణ నిరవధికంగా నిలిచిపోయింది. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరగడంతో మద్యానికి బానిసైన మీనా కుమారి ఆరోగ్యం దెబ్బతినడంతో చికిత్స కోసం విదేశాలకు వెళ్ళింది. విదేశాల్లో చికిత్స పొంది తిరిగి ముంబైకి వచ్చాక ఆమెకు కమల్ మళ్లీ చేరవయ్యాడు. 'నువ్వు లేక నా డ్రీమ్ ప్రాజెక్ట్ ''పాకీజా'' ఆగిపోయిందని' మీనాకు చెప్పడంతో, 'నన్ను మునుపటి అందంతో చూపిస్తాను.. అంటే, నీ ''పాకీజా'' నేనవుతాను' అని చెప్పింది మీనా. 'పాకీజా' సినిమాకు సన్నహాలు మొదలయ్యాయి. మీనాకుమారి హీరోయిన్గా. హీరోగా ధర్మేంద్రతో అంతకు ముందే సైన్ చేయించుకున్న ప్పటికి, మీనా కుమారితో ధర్మేంద్రకున్న స్నేహం కమల్ మనసును కలవరపెట్టాయి. అతనిలోని పొసెసివ్ నేచర్ మళ్లీ పడగ విప్పింది. ధర్మేంద్రను ఆ సినిమా నుంచి తొలగించి, ఆ పాత్రకు రాజ్‌కుమార్‌ను ఎంచుకున్నాడు. 'పాకీజా' మొదలైంది. అయితే అప్పటికి కమల్‌కు తెలియని నిజం ఏంటంటే రాజ్‌కుమార్ కూడా మీనా కుమారిని ఆరాధిస్తున్నాడని. విలక్షణమైన తన ఉచ్చారణ శైలితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ సెట్స్‌లో మీనా కుమారిని చూడగానే మైమరచి పోయేవాడట.., డైరెక్టర్ కమల్ 'కెమెరా.. యాక్షన్' అని చెప్పినా తాను చెప్పాల్సిన సంభాషణ లను మరచిపోయి మీనా కుమారినే చూస్తుండి పోయిన సందర్భాలెన్నో, రాజ్ కుమార్ తీరుతో చిర్రెత్తి పోయిన కమల్.. హీరోహీరోయిన్లు కలిసి నటించే సీన్లను సాధ్యమైనంత తక్కువ షూట్ చేశాడట. 'పాకీజా'లోని 'చలో దిల్దార్ చలో చాంద్‌కే పార్ చలో..' పాటను ప్రణయ గీతంగా నాయికా నాయకుల మధ్య సాన్నిహిత్యంతో చిత్రీకరించాలని అనుకున్నాడట. కాని ఎప్పుడైతే రాజ్‌కుమార్ కూడా మీనాకుమారి అంటే పడి చచ్చిపోతున్నాడని కమల్ గ్రహించాడో అప్పడు ఆ పాట చిత్రీకరణే మారిపోయింది. కళ్లతోనే ప్రేమను అభినయించ మని, ముఖ కవళికలతోనే సాన్నిహిత్యాన్ని ప్రదర్శించమని మీనా కుమారిని ఆదేశించాడు కమల్. అంతేకాదు చుట్టూ ఉన్న చెట్లు, లతలు, పూలు, చందమామాను ఎక్కువగా ఫోకస్ చేసి రొమాంటిక్ సాంగ్‌ను పూర్తి చేశాడు.
ఉత్తమ చిత్రాల జాబితాలలో పాకీజా
- 1992 లో పీటర్ వోలెన్ ప్రపంచ సినిమా పది ఉత్తమ చిత్రాల జాబితాలో ఐదవ స్థానంలో పాకీజాను చేర్చాడు.
- 2005లో రాచెల్ డ్వైర్ తన 100 బాలీవుడ్ ఫిల్మ్స్ పుస్తకం కోసం ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది.
- 2005 లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన రచనా కన్వర్ ''తప్పక చూడవలసిన 25 బాలీవుడ్ సినిమాల'' జాబితాలో పాకీజాను చేర్చింది.
- 2007లో ఇది బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యూజర్ పోల్‌లో పది అత్యుత్తమ భారతీయ చిత్రాలలో పాకీజా కనిపించింది.
- 2014లో అమెరికన్ ఇండాలజిస్ట్ ఫిలిప్ లుట్గెన్ డార్ఫ్ యూనివర్శిటీ ఆఫ్ అయోవా ''మిస్ చేయకూడని పది భారతీయ ప్రసిద్ధ చిత్రాల'' జాబితాను రూపొందించి, పాకీజాను మూడవ స్థానంలో ఉంచింది.
- 2016లో ఫిలింఫేర్ నుండి దేవేష్ శర్మ ''మీరు తప్పక చూడవలసిన ఏడు ముస్లిం సామాజికాంశాలు'' జాబితాలో పాకీజాను చేర్చారు.
- 2017లో వార్తా పత్రిక మింట్ ''70 ఐకానిక్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా'' జాబితాలో పాకీజాను ఎంపిక చేసింది.
- 2018లో రోహిత్ కె. దాస్‌గుప్తా, సంగీతా దత్తా సంకలనం చేసిన పుస్తకం 100 ఎసెన్షియల్ ఇండియన్ ఫిల్మ్స్‌లో పాకీజా కనిపించింది.
- 2020లో ది ఇండియన్ ఎక్స్ప్రెస్షేక్ అయాజ్ పాకీజాను ''1970లను నిర్వచించిన హిందీ క్లాసిక్‌లలో'' ఒకటిగా చేర్చారు.
-2021 లో ఈద్ అల్-ఫితర్ బాలీవుడ్ హంగామాకు చెందిన సుభాష్ కె. ఝా సెలవు దినాల్లో తప్పనిసరిగా చూడవలసిన జాబితాలో పాకీజాను చేర్చారు.
అవార్డులు
'పాకీజా' చిత్రం బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 1972 సంవత్సరానికి సంబంధించిన పలు విబాగాలాలో అవార్డులు పొందింది. ఉత్తమ భారతీయ నాల్గవ చిత్రంగా పాకీజా అవార్డు గెలుచుకోగా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జోసెఫ్ విర్షింగ్, ఉత్తమ కళా దర్శకుడుగా కులకర్ణి, ఉత్తమ నేపథ్య గాయనిగా లతా మంగేష్కర్, ఉత్తమ ఆడియో గ్రాఫర్‌గా పుషల్కర్ అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మీనకుమారికి ప్రత్యేక అవార్డు దక్కింది. 20 వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఉత్తమ కళా దర్శకుడుగా కులకర్ణి ఎంపికయ్యారు. షామా-సుష్మ ఫిల్మ్ అవార్డ్స్లలో ఉత్తమ నటిగా మీనకుమారి, ఉత్తమ సంగీత దర్శకుడుగా గులాం మహమ్మద్ అవార్డులు పొందారు. పాకీజా విడుద లైన దశాబ్దాల తర్వాత కూడా భారతీయ చిత్రాలలో ఒక గొప్ప క్లాసికల్ చిత్రంగా గుర్తింపు పొందడమే కాకుండా, ఈ సినిమా గురించి అనేక పుస్తకాలు, కథనాలు వ్రాయబడ్డాయి.
- పొన్నం రవిచంద్ర, 9440077499