Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగునాట టీవీ మీడియా రంగం విస్తరణతో వార్త ప్రసారం కొత్త పుంతలు తొక్కింది. నిరంతర వార్తా స్రవంతి వీక్షకుల దైనందిన ఆస్వాదనలో అంతర్భాగమయ్యింది. మీడియా సంస్థల మధ్య పోటీతో అది ఎప్పటికప్పుడు ప్రయోగాలకు కూడా ఊతమిస్తోంది. న్యూస్ ప్రెజంటర్స్, యాంకర్స్, వ్యాఖ్యాతల భిన్న పలుకుబడులకి నిలయంగా ఉంటోంది.
ఈ వ్యాసంలో ప్రధానంగా చర్చించబోతున్నది టీవీ తెరపై కనిపించే వ్యక్తుల, యాంకర్ల భాషా విన్యాసాల గురించి కాదు. వివిధ వార్తలకు నేపథ్యంలో వినిపించే వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల గురించి. ఈ వాక్యంలో పేర్కొన్నట్టు వాయిస్ ఓవర్ అనేది నిజంగా ఓ గొప్ప కళ! అదేమంత సులభమైన, తేలిక వ్యవహారం కాదు.
వాచకం సరిగా లేకపోతే, ఉచ్ఛారణ అర్ధవంతంగా లేకపోతే ఎంత గొప్ప వాక్యమైనా రససిద్ధి పొందదు. తెలుగు భాషకి ధ్వని చాలా ముఖ్యం. ఒకే పదాన్ని వార్తా సందర్భాన్ని బట్టి భిన్న లయలతో పలకాల్సి ఉంటుంది. సాధారణ వార్తని చదివేటప్పుడు, ఆనందకర విషయాన్ని చెప్పేటప్పుడు, విషాద ఘటన గురించి వివరించేటప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తన గొంతుని ఆయా వార్తలకు అనుగుణంగా సవరించుకోవాలి. అంటే కళాకారులు తెరపై కనిపిస్తూ తమ హావభావాల విన్యాసాలతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో అదే రీతిలో తెరపై కనిపించకుండానే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తన స్వర లయల విన్యాసాలతో ఆకట్టుకోవాలి. నిజానికి ఇది కనిపించే నటులకంటే కష్టమైన విద్య. ఇందులో రాణించి మెప్పు పొందాలంటే ఎంతో దీక్ష, సాధన, పట్టుదల వంటివి అవసరం.
తెలుగు ప్రసార మాధ్యమరంగం గత పాతికేళ్లుగా శాఖోప శాఖలుగా వర్ధిల్లుతోంది. ఎందరో మేల్-ఫిమేల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. అయితే ఇందులో కొందరు దానిని ఉపాధిగా స్వీకరిస్తే మరికొందరు ఒక కళగా ఆవాహాన చేసుకున్నారు. ఏ కోవకు చెందన వారైనా భాషకి సంబంధించిన మెళకువలు మాత్రం పాటించక తప్పదు..
తెలుగు పదానికి రంగు- రుచి- సువాసన ఉంటాయి. ప్రతి వాక్యానికీ ఒక పరమార్థం ఉంటుంది. వాక్యాల గొలుసు కట్టుతో కూడిన టెక్ట్స్ కి ఒక భావ సమున్నతి ఉంటుంది. ఇవన్ని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కి తెలిసి ఉండాలి. అందుకు తగ్గ అభ్యాసంతో కూడిన అభివ్యక్తిని తమ వాచకంలో పలికించ గలిగి ఉండాలి. అప్పుడే ఆయా వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకి వీక్షకుల ఆదరణ లభిస్తుంది. వ్యక్తుల స్వర ఫ్రీక్వెన్సీలో హెచ్చు తగ్గులు ఉండటం సహజం. కానీ ఒక పదాన్ని సందర్భోచిత శైలిలో ఉచ్చరించడం మాత్రం అవసరం. అది జరగకపోతే అర్ధ సమన్వయం కొరవడుతుంది. అంటే ఒక వాక్యం లేదా టెక్ట్స్ తాలుకు అర్థం సంపూర్తిగా వీక్షకులకు బట్వాడా కాదు. అందుకే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తన ప్రమాణానికి నిరంతరం పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక వార్తని అది రాజకీయ మైనదైనా, మానవీయ కథన మైనా దాన్ని ఇతరులకు చేర వేసేలా తనదైన భాషని మాధ్యమంగా చేసుకుని రిపోర్టర్ రాయాల్సి ఉంటుంది. దాన్ని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అర్ధవంతంగా చదవాలి. ఆ తర్వాత ఆ వాయిస్‌కి తగ్గట్టుగా విజువల్ పోస్టింగ్ చేస్తారు. సాంకేతికంగా ఇదీ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే వార్తల వెనుక జరిగే కసరత్తు. ఈ మొత్తం కూర్పులో కూడా వాయిస్ ఓవరే కీలకాంశం. అది తగిన భావాన్ని పరిపుష్టం చేసుకోకపోతే వార్త సంపూర్ణత దెబ్బతింటుంది.
తెలుగు వాక్యం కొన్ని పదాల సమ్మిళితంగా ఉంటుంది. అందులో ఏ పదం దగ్గర ఒత్తి పలకాలో, ఏ పదం దగ్గర కాస్త విరామమిచ్చి మళ్లీ కొనసాగించాలో తెలిసి ఉండాలి. లేదంటే అర్ధ పరమార్థాలు తలకిందులు అయ్యే ప్రమాదముంది. వాక్యంలో విరుపులు మారితే పెడార్ధం కూడా తలెత్తే అవకాశం ఉంది. కనుక ఒక వాక్యాన్ని శబ్దం సుందరంగానే కాదు.. అర్థవంతంగా కూడా పలకాల్సి ఉంటుంది.
తెలుగు భాషపై వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకి అవగాహన, పట్టు ఉండాలి. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోకపోతే మరింత ఇబ్బంది తలెత్తుతుంది. ఉదాహరణకి 'బాధ' అన్న పదాన్ని కొందరు 'భాద' అని ఉచ్చరిస్తారు. ''కతజ్ఞత'' అనే పదాన్ని ''కతఘ్నత''అని పలుకుతారు. అప్పుడు వీక్షకులు, శ్రోతల చెవుల్లోకి జోరీగలు ప్రవేసించినంత పనవుతుంది. అలాగే స, శ, ష లను పలకడంలో శ్రావ్యత చెడకుండా జాగ్రత్త పాటించాలి. సంయుక్త అక్షరాలు, వత్తులు, దీర్ఘాలు పలకడంలో కూడా తగిన అప్రమత్తత అవసరం.
తెలుగులో చమత్కారం పండుతుంది. ఎత్తిపొడుపులు, ఎకసెక్కాలు కూడా భావస్ఫూర్తిని నింపుకుని ఉంటాయి. విమర్శా ప్రతి విమర్శలప్పుడు నిందా సూచికలు ధ్వనిస్తాయి. పొగడ్తలు- ప్రశంసలప్పుడు ప్రతీకాత్మక పదాలు వరుస కడతాయి. వీటికి తోడు ప్రాస పదాల నడక సైతం పలుకుబడికి పస పెంచుతాయి. ఇలాంటి సమయాల్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా ఆ ధ్వనిని తన గొంతులో రంగరించి వీక్షకులు లేదా శ్రోతలకు అందించాలి. ఆనందకర వార్త చదివేటప్పుడు గొంతులో గాంభీర్యం పలికిస్తే ఏమాత్రం నప్పదు. అలాగే విషాద వార్తని సాధారణ శైలిలో చెప్పుకుపోతే సమయోచితంగా ఉండదు. ఎద్దేవా లేదా ఎత్తిపొడుపు పదాలు ఉన్న వాక్యంలో సదరు పదాలను అదే విరుపుతో పలకాలి. అప్పుడే భావం భాగ్యం సమకూరుతాయి.
వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఏదైనా వార్తని చదువుకుంటూ పోతే అసలు స్ఫూర్తి కొడిగడుతుంది. వార్తని చెప్పాలి. అది కూడా సూటిగా, స్పష్టంగా అర్ధంచేయించేలా ఉండాలి. అందువల్ల వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు భాషా నియమాలు, ఉచ్ఛారణ పద్ధతులను బాగా ఆకళింపు చేసుకుంటే వారి వాక్ శుద్ధి జనరంజకంగా మారుతుంది. ఇందుకోసం స్వీయ శిక్షణ ఎంతో అవసరం.
- మధురవాణి