Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేశ్వరరావు 1923 ఆగస్టు 31 న కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలం మారుపాక గ్రామంలో జన్మించాడు. రాజేశ్వరరావు చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీ.ఎస్సి, ఎల్.ఎల్.బి, లను అభ్యసించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే జరుగుతున్న రాజకీయ పరిణామాలను, నిజాం ప్రభుత్వ నిరంకుశ ధోరణులను అత్యంత సమీపంగా చూశాడు. ఆ ఘటనలు తనపై బలమైన ప్రభావాన్ని చూపాయి. విద్యార్థిగా ఉన్నప్పుడే జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై పోరాటంలో పాల్గొన్నాడు.
స్వాతంత్య్రోద్యమం
నిజాం ప్రభుత్వం తనకున్న అన్ని శక్తులతో సంస్థాన ప్రజలపై దాడులు చేస్తూ, స్వాతంత్య్రోద్యమాన్ని అడ్డుకుంటూ తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకునే దిశలో ఉంది. అందుకు అణచడానికి వేయాల్సిన ఎత్తులు, వ్యూహాలు, ప్రత్యక్షదాడులు అన్నిటిని కొనసాగించాడు నిజాం సంస్థాన రాజు. ఇదే సమయంలో తన ప్రగతిశీల భావాలతో చైతన్యం పొంది నిరంకుశ ప్రభుత్వాన్ని ఎలాగైనా యునియన్లో విలీనం చేయాలని తలిచి జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947 ఆగస్టు 15న బ్రిటిషు వారి కబంధ హస్తాల నుండి భారతదేశం విముక్తి అయిన పర్వదినం సందర్భంగా హైదరాబాదులో ప్రముఖులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారిలో రాజేశ్వరరావు ఒకరు. అనంతరం సాయుధ పోరాటంలో పాల్గొనగా అరెస్టయి జైలుకు వెళ్ళాడు.
రాజకీయ జీవితం
నాడు జాతీయోద్యమంలో పాల్గొన్న అగ్ర నాయకుల నుండి మధ్యస్థ నాయకుల వరకు దాదాపు అందరు చట్టసభలలో సభ్యులయ్యారు. అలాగే రాజేశ్వరరావు కూడా నిజాం భారతదేశంలో కలిసిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. పి.డి.ఎఫ్ తరపున ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. రాజకీయాలలో ప్రవేశించక పూర్వం సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తిని కనబర్చినా రాజకీయ రంగంలోకి వెళ్ళాక సాహిత్యానికి దూరమయ్యాడు. బాధ్యతాయుతమైన స్థానం కావడంతో సాహిత్య సష్టికి సమయం లేదని భావించి ఉండవచ్చు. 1957లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1999లో రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరి 2004లో శాసనసభకు ఆరవసారి ఎన్నికయ్యాడు. తన మొత్తం రాజకీయ జీవితంలో సిరిసిల్ల నియోజక వర్గం నుండి ఐదు సార్లు, మెట్పల్లి నుండి ఒకసారి గెలిచాడు. నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యహరించారు.
సాహిత్యం
రాజేశ్వరరావు ప్రాథమికంగా సాహిత్య అభిమాని. అనంతరం సాహిత్య సష్టికర్త. ఆ తర్వాతనే ఆయన రాజకీయ నాయకుడు. స్వాతంత్య్ర పోరాటకాలంలో జైలులో ఎందరో నిర్భంధించబడ్డారు. అలాంటి వారు జైలులో కేవలం శిక్షకు గురై జీవితాన్ని గడపడమో, జైలుకు వచ్చినందుకు బాధపడుతూ కాలాన్ని తిట్టుకుంటూ నిరీక్షించడమో చేయలేదు. అక్షరాస్యత గల్గిన ప్రతీ స్వాతంత్య్ర సమరయోధుడు ప్రజలను రచనల ద్వారా చైతన్యవంతులను చేయడంలోనో, స్వాతంత్య్ర సాధనకు వ్యూహాలను రచించడంలోనో, జీవిత సారాన్ని తెలుసుకొని ప్రబోధ రచనలను సష్టించడంలోనో ఉండిపోయారు. అలాంటి స్వాతంత్య్ర సమరులలో రాజేశ్వరరావు కూడా ఉన్నాడు. ఆయన 1948లో సాయుధ పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తర్వాత ''పిట్ట బ్రతుకు'' అనే కథ రాశాడు. ఇది 1954 నాటి 'సారస్వత జ్యోతి' పత్రికలో ప్రచురించబడింది. ఈ కథలో అగ్రకులస్తులమని పెత్తనంతో దొర సాగించిన దుశ్చర్యలు, పాలేరుతో పరిమితి లేని పనిని చేయించుకోవడం వంటి సాంఘిక అసమానత గల అంశాలు ఉన్నాయి.
చెన్నమనేని రాజేశ్వరరావు తొలుత స్వాతంత్య సమరయోధుడిగా వామపక్ష భావాలతో రాజకీయ రంగంలోకి దిగి దశాబ్దాలు చట్టసభలలో ఉండి మరల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కషి చేశాడు. అంటే ఉద్యమంతో మొదలైన ఆయన జీవితం కన్నుమూసే వరకు ఉద్యమాన్ని, ఉద్యమ ఫలాల్ని కాంక్షించింది. రాజకీయ రంగంలో చెన్నమనేని కుటుంబం ఎంతగానో పేరు పొందినది. మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహించిన విద్యాసాగర్ రావు వీరికి సోదరుడు. వీరి తర్వాతి తరం వారు కూడా రాజకీయ రంగంలో స్థిరపడ్డారు.
రాజేశ్వరరావు ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, అపారమైన సేవలు అందించాడు. ఈయన పేరుతో ప్రస్తుతం హైదరాబాదులోని కొండాపూర్లో ఒక వద్దాశ్రమం నిర్వహించబడుతుంది. సంక్లిష్ట జీవితం నుండి శేష జీవితం వరకు ఎంతో ఉదారంగా ఉంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన రాజేశ్వరరావు మే, 9, 2016 లో మరణించాడు.
- ఘనపురం సుదర్శన్,
9000470542