Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజ్ఞానికి వేదికైన కేరళ రాష్ట్రం ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. భారతదేశానికి పశ్చిమ ముఖ ద్వారంగా ఉన్న కేరళలోని పాలక్కడ్ ఓ భూతల స్వర్గంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. పాలక్కడ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కైరాలి ఆయుర్వేద ఉద్యాన వనంలోని నీరు, గాలి, భూమి ఆయుర్వేద ఔషధాలు పులుముకుని ఆయిష్షును కాపాడే ప్రకతి ధామంగా విరాజిల్లుతుంది.
శతాబ్దాల తరబడి ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఉండటంతోనే క్రీస్తుపూర్వం 320లో సమద్ర గుప్తుడు జయించి అనేక కట్టడాలను నిర్మించి సముద్ర వ్యాపారానికి తెరలేపారని హరిసేనుడి శాసనాల్లో తెలుస్తోంది. కైరాలి ఆయుర్వేద పార్కు ప్రపంచంలోని టాప్ 50 వెల్నెస్ డిస్టినేషనల్ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలోని అనేక మంది ప్రముఖులు కైరాలి ఆయుర్వేద పార్కులో విశ్రాంతి, యోగా, మసాజ్, ఆయుర్వేద చికిత్స చేయించుకోవడం ఆనవాయితీగా మారింది. కైరాలి ఆయుర్వేద పార్కుకు అనుబంధంగా ప్రపంచంలోని తొమ్మిది దేశాల్లో 35 కేంద్రాలు ఉన్నాయి. సుధీర్ఘ రోగాలను తరిమివేసే మొక్కలు, మూలికల ఔషధాలతో తరతరాలనుంచి ఆయుర్వేద వత్తిలో ఉన్న అష్ట వైద్యాస్ రోగులకు చికిత్స చేస్తున్నారు.
కైరాలి ప్రత్యేకత
కైరాలి ఆయుర్వేద వైద్యులు సహజసిద్ధమైన పద్ధతులతో రోగి వాత, పిత్త, కఫ గుణాలను నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. ఆయుర్వేద దిగ్గజాలైన చరక, శుశ్రూష సంహిత విధాలు ఇక్కడ ప్రామాణికాలు. ఆయుర్వేద మందులను ఇక్కడ తైలం, భస్మం లేపనాలుగా వర్గీకరించి చికిత్స చేస్తున్నారు. వంశపరంపరగా ఆయుర్వేద చికిత్స చేస్తున్న వైద్యులు నియమ నిబంధనలతో చికిత్స చేస్తున్నారు. ఇక్కడ అనేక అద్భుతాలు ఆవిష్కరిస్తుంటాయి. సుధీర్ఘకాలంగా పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నవారు ఇక్కడ చికిత్స తీసుకుని నడుస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. నయం కాని వ్యాధులు దూరం కావడం, చెక్కర వ్యాధికి ప్రత్యేక చికిత్స, సోరియసిస్ తరిమి వేయడం.రుమటాయిడ్, ఆర్థరైటిస్‌కు ప్రత్యేక వైద్యం ఇక్కడ లభించడంతో విదేశాల నుంచి సైతం కైరాలికి వచ్చి సమస్యలను పరిష్కరించుకోవడం పరిపాటైంది.
పాలక్కడ్ కైరాలి పార్కు ప్రయాణం ఓ అనుభూతి
దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కొయంబత్తూరుకు విమాన, బస్సు, రైలు ప్రయాణానికి మార్గాలు ఉన్నాయి. కొయంబత్తూరు నుంచి కేరళలోని పాలక్కడ్ చేరుకునేందుకు అనేక ట్రావెల్స్ నుంచి సౌకర్యాలు ఉన్నాయి. 80 కిలోమీటర్ల దురంలో ఉన్న కైరాలికి చేరుకోవడం ఓ మరుపురాని అనుభూతి. పచ్చని రంగు పులుముకున్న ప్రకతిలోంచి ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది. దారిపొడగునా మిర్యాల వనాలు. అరటి తోటలు, కొబ్బరి వనాల సొగసులు మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. సహజ సిద్ధంగా పెరిగిన కూరగాయల మొక్కలు, పచ్చని పంట పొలాలు, అక్కడక్కడ ఇళ్లు. ఇళ్ల దగ్గర చిన్నచిన్న నీటి కొలనులు, పక్షుల కిలకిల రావాలు, మయూరాల నత్యాల మధ్యలో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది. ప్రకతి ఒడిలోంచి ప్రయాణించి కైరాలి ఆయుర్వేద పార్కు చేరకోగానే ఓ అనుభూతి ఒళ్లు పులకరింప చేస్తుంది. వేలాది ఔషధ మొక్కల వనాల మధ్య అనేక దేశాల నుంచి వచ్చిన వారు, దేశంలోని పలువురు ప్రముఖులు యోగా, ధ్యానంలో నిగమై కనిపిస్తారు. అయితే ఇక్కడ వైద్య చికిత్సతో పాటుగా వైద్యులు ఇచ్చిన ఆహారమే తీసుకునే కఠిన నిబంధన కూడా ఉంది.
యోగా, ధ్యానం, మసాజ్
కైరాలి ఆయుర్వేద పార్కులో దినసరి కార్యక్రమాలు, వైద్య చికిత్స ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమ వుతుంది. మొదట ధ్యానంతో పార్రంభమై ఆ తర్వాత సుప్రసిద్ధ యోగా మాస్టార్లతో యోగా చేయిస్తారు. ప్రత్యేకమైన పద్ధతులతో యోగా ఉంటుంది. ఒకేసారి సుమారు 500 మంది ధ్యానం, యోగా చేసేందుకు అవసరమైన కేంద్రాన్ని శాస్త్తీయంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయుర్వేద పండితులు వైద్యపరీక్షలు జరిపి ప్రత్యేక పద్ధతుల్లో మసాజ్ చేస్తారు. కైరాలి మసాజ్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఖరీదైన తైలాలతో ప్రత్యేక పద్ధతుల్లో ప్రక్రియ ఉంటుంది. వందలాది వనమూలికలతో తయారు చేసిన తైలం మసాజ్‌కు వినియోగిస్తుంటారు. ప్రత్యేక ఔషధాలతో పాటుగా తైలంలో ఆలివ్ ఆయిల్, బాదం, కొబ్బరి, క్యాస్ట్రో, నువ్వులు, పొద్దు తిరుగుడు పూల నూనెల మిశ్రమాలు ఉంటాయి. మసాజ్ తెరపిలో వాడే తైలాల మర్ధనతో అనేక రుగ్మతలు దూరం అవుతాయి. మసాజ్ మనస్సు,శరీరారన్ని ఉత్తేజ పరిచి శరీరంలో రక్త ప్రసారాలను పెంచడంతో పాటు సుక్ష్మ రంధ్రాల ద్వారా ఔషధాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ సందర్భంగా డాక్టర్ గీత మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహార అలవాట్లతో వస్తున్న శరీరక నొప్పులను శాశ్వతంగా మసాజ్ థెరఫితో తరిమి వేయవచ్చని చెప్పారు. అయితే మసాజ్‌తో పాటు ధ్యానం యోగా తప్పనిసరని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. చికిత్స అనంతరం ప్రత్యేకంగా నిర్మించిన కాటేజిల్లో విశ్రాంతి తీసుకుని సుర్యాస్తమయానికి ముందు చికిత్సకు సిద్ధం కావాలి. పొన్నానది తీరప్రాంతంలో ఉన్న కైరాలి ప్రయాణం, చికిత్స జీవితంలో మరిచిపోని ఓ అనుభూతి.
- వంగ భూమేశ్వర్,
7702770026