Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన కుటుంబ వ్యవస్థలో వంటింటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లోని సభ్యుల ఆనందం అంతా కూడా వంటింటి నుండి మొదలవుతుంది అనే మాట చాలా సందర్భాలలో విన్నాం. కుటుంబ సౌఖ్యానికి, ఆర్ధిక వ్యవస్థకు మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పవలసిన సందర్భంలో నవ ధాన్యాలతో నిండి ఉన్న ఇల్లు, నిత్యం మండే పొయ్యి ఉన్న ఇల్లు ఆనందానికి చిహ్నం అని అనడం సహేతుకమే. కాని పితస్వామ్య వ్యవస్థ గురించి చర్చించవలసిన సందర్భంలో వంటిల్లు ఎన్నో కన్నీళ్ళను తనలో దాచుకున్న గది అని, సమాజంలోని అన్ని రకాల అహంకారాలకు, ఆధిపత్య భావజాలానికి ప్రాతినిద్యం వహించిన స్థలం ఈ వంట గది అని చెప్పుకోవాలి.
ఒకప్పుడు వితంతువులు ఈ గది దాటి వచ్చేవారు కాదు. దాని కోసం వారిని అర్ధ నగంగా మార్చి పొయ్యి ముందు కూర్చోబెట్టేవారు. వండిన పదార్ధాల మీద హక్కు ఆ ఇంటి యజమానికి దగ్గరయిన స్త్రీకే సొంతం. అంటే యజమానికి ఎందరు భార్యలున్నా అతను మెచ్చిన భార్యకు వంటింటి ఆధిపత్యం వచ్చేది. అందువలన ఆ వంటింటిపై ఆధిపత్యం కోసం స్త్రీల మధ్య ఎన్నో రాజకీయాలు ఆ నాలుగు గోడల మధ్యనే మొదలయ్యేవి. ఆ వంటిల్లే తన సామ్రాజ్యం అనే భావనను స్త్రీల మనసుల్లోకి పూర్తిగా ఎక్కించింది పితస్వామ్య వ్యవస్థ. వండిన పదార్థాలను, ఇంట్లో నిలువ ఉంచిన దినుసులను, పిండి, పచ్చళ్ళను ఒక గదిలో పెట్టి తాళం చెవి బొడ్డున దోపుకున్న స్త్రీ తానో రాజ్యానికి రాణీ అనే భావించుకునేది. ఆ అందమైన తాళాల గుత్తులకు రంగు రంగు డిజైన్లలో తాళపు చెవులు వెండితో బంగారంతో ఉంటే ఆ స్త్రీని మించిన అదష్టవంతులు మరెవ్వరూ లేరన్నంత అసూయగా ఇతర స్త్రీలు చూసేవారు. ఆ పెద్ద తాళపు గుత్తులను గర్వంగా కనిపించేటట్లు చీరకు చుట్టుకుని లేదా నడుముకు కట్టుకుని జీవితాలని గడిపేసారు కొన్ని తరాలు. ఇప్పటికీ, వంటింటీ ఆధిపత్యం కోసం అత్తా కోడళ్ళు కుమ్ములాడుకుంటూ, చివరకు తమకో వేరు వంట గదిని ఏర్పాటు చేసుకుని వర్జీనియా వుల్ప్ ''ఏ రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్'' అంటే ''నా సొంత వంటగది'' అనే భావనతో జీవిస్తుంది ప్రస్తుత ఆధునిక సమాజంలో నాగరిక యువతి.
2021 లో మళయాళంలో 'ది గ్రేట్ ఇండియన్ కిచన్'' అనే ఈ సినిమా రావడం ఆనందకరమే అయినా ఇప్పటికీ స్త్రీ భావజాలంలో రాని మార్పుకి ఇది ప్రతీక కూడా అని చెప్పవచ్చు. తన వారికి తాను ప్రేమిస్తున్న వారికి తప్తిగా భోజనం తయారు చేసి పెట్టడంలో స్త్రీ ఆనందాన్ని అనుభవిస్తుంది. కాని ఆనందం స్థానంలో ఆ పనిలో ఆధిపత్యం ప్రవేశించినప్పుడే ఆమె ఆలోచించవలసిన సమయం వచ్చినట్లు గుర్తించాలి. వంట ఇంటిలో స్త్రీ ఉండరాదని, తన వారికి వండ రాదని, ఇక్కడ ఉద్దేశం కాదు. కాని ప్రేమ, భాద్యత స్థానంలో స్వార్ధం, ఆధిపత్యం, అహంకారం, వివక్ష ఎదుర్కుంటున్నప్పుడు ఆ పరిస్థితిని ఎదిరించవలసిన అవసరం ఉంది.
శుభ్రంగా ఆరోగ్యంగా వంట చేసుకోవడం ఇంట్లో అందరి భాద్యత. అది ప్రతి మనిషికి అవసరమైన విద్య. కాని కేవలం ఇంట్లోని మగవారికి ఆ వంటతో ఆనందం, స్త్రీకి జుగుప్స, అసహ్యం, చిరాకు కలిగే విధంగా ఇంటి వంటింటి వాతావరణం ఉండడం ఆలోచించ వలసిన విషయం. భాద్యత పేరుతో వండుకున్న తిండిని కడుపారా, మనసారా తినే దారిలేని విధంగా స్త్రీ జీవితం మారడం మాత్రం ఆమెకు జరిగే అతి పెద్ద అన్యాయం. ఆమె చేసిన పనికి విలువ లేకపోగా ఆమె పని హేళనకు గురి అవడం అతి కిరాతకం.
ఈ సినిమాలో పాత్రలకు దర్శకులు పేర్లు పెట్టలేదు. అందువలన అది ప్రతి ఒక్క భారతీయ స్త్రీ, పురుషుని కథ. ఒక చదువుకున్న యువతి, నాట్యంలో ప్రవీణురాలు పెళ్ళయ్యి అత్తవారింటికి వస్తుంది. పుట్టింట అలవడిన సంస్కారం, స్త్రీ భాద్యత వీటన్నిటి నడుమ పెరిగిన యువతి ఆమె. అందుకే ఆ ఇంట్లో మంచి కోడలు అనిపించుకోవడానికి సిద్దపడుతుంది. ఆ ఇంట్లోని వ్యక్తుల అవసరాలు తీరుస్తూ అందరినీ సంతోష పెడుతూ ఆనందంగా కాపురం చేసుకోవాలనుకుంటుంది. అదో మధ్య తరగతి ఇల్లు. ఇంటి వారికేదో పూర్వికుల నుంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిసి వచ్చాయి. కాబట్టి సమాజంలో గౌరవమైన కుటుంబం అనే పేరు వారి సొంతం. ఆ ఇంట్లో అత్తగారు ప్రొద్దునే లేచి టూత్ బ్రష్ పై పేస్ట్ వేసి భర్తకు ఇచ్చి, ఆయన కాళ్లకు వేసుకునే చెప్పులు తుడిచి ఆయన దగ్గరకు తీసుకువచ్చే గొప్ప పతివ్రత. ఈ కోడలు కూడా అలా పతివ్రతా విలువలతో జీవించాలని నిశ్చయించుకుంటుంది.
ఇంటి యజమాని కుక్కర్లో వండిన అన్నం తినడు. అవసరానికి ఒక చిన్న పనికి కూడా సహాయం రాడు. ఆయన కోసం కుంపటిపై అన్నం వార్చి వడ్డించాలి. భర్తగారికి సమయానికి అన్నీ అందించాలి. ఇక ఆ ఇంటి మగవారు అన్నం తినేటప్పూడు చూస్తే నానా భీభత్స రసాలు పొంగి పొరలుతాయి. వాళ్ళు తిన్నాక మిగిల్చిన పదార్దాలు కంచం చుట్టూ, ఎంగిలి మెతుకులు టేబుల్ చుట్టు, సాంబార్లో మునక్కాయలు పిప్పి చేసి ఊసినవి టేబుల్‌పైన పడి ఉంటాయి. ముందు మగవారు తప్తిగా తిన్న తరువాత కాని ఆ ఇంటి అత్తా కోడళ్ళూ భోజనం చేయరు. అంత భయంకరంగా ఇంట్లో భోంచేసే ఆ భర్త సమాజంలో ఒక బాధ్యత గల టీచరు. ఇతనే బైట హౌటల్‌కు వెళ్ళినప్పుడు చాలా స్టైల్‌గా మెతుకు కింద పడకుండా డీసెంట్‌గా తినే తీరు చూసి ఆ కోడలే ఆశ్చర్యపోతుంది. ఇలా ఇంట ఎందుకు తినరు అని ప్రశ్నించినందుకు ఆ భర్తగారి కోపానికి గురి అవుతుంది.
బైట హౌటల్లో వెయిటర్లను ఇంప్రెస్ చేయడానికి చూపిన ఆ జాగ్రత్త ఇంట్లో తల్లి కోసం లేదా భార్య కోసం ఈ మగవారు ఎందుకు చూపరు. వారు తిని వదిలేసే ఆ ఎంగిలి పళ్ళేళ్లను ఎత్తేటప్పుడు ఆ స్త్రీలకు ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈ చిన్న విషయం వారికి అర్థం కాదెందుకు. పైగా వీరి జంతు ప్రవర్తనను సహించడం స్త్రీల భాధ్యత అనడం ఎంత వరకు సబబు?. మన దేశంలో ఎక్కువ శాతం పురుషులు ఈ టేబుల్ మానెర్స్ అస్సలు ప్రదర్శించరు. ఇంకా అసహ్యంగా ఆ ఎంగిలి పల్లేళ్ళలో వారి తరువాత భార్యలు అన్నం తినే సాంప్రదాయాన్ని కూడా పాటించిన కుటుంబాలు ఉన్నాయి.
వంట చేయడం అంటే కేవలం గరిట తిప్పడం కాదు. దానికి సంబంధించిన చాలా పనులు ఉంటాయి. ఆ గిన్నెలు కడగడం, ఎంగిళ్ళూ ఎత్తేయడం, సింక్ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ ఒక రకంగా రోత పనులే. ఇంట్లో ప్రతి ఒక్కరు కొంచెం పరిశుభ్రత పాటిస్తే ఈ పనులు స్త్రీలకు కష్టం అనిపించవు. కాని చాలా మంది పురుషులు ఇంట్లో లెక్కలేనితనంతోనే ప్రవర్తిస్తారు. ఇక వంటగదిలో ఏదన్నా పైపు పగిలినా, ప్లంబింగ్ పని పడినా తమకు పట్టనట్లు అది కేవలం స్త్రీల పని అన్నట్లుగా ప్రవర్తిస్తారు మగవారు. సింక్ లో పైప్ పాడయి ఆ చెత్తనీటిని బకెట్లతో నింపుకుంటూ క్లీన్ చేసుకుంటూ, మళ్ళీ సమయానికి భర్త అవసరాలన్నీ తీర్చుతూ రోజులు గడుపుతుంది ఆ ఇంటి కోడలు. పడక పై ఆమె స్పందించట్లేదన్నది భర్త కంప్లైంట్. అప్పటి దాకా చేసిన ఆ రోత పనితో ఆ వాసన ఒంటి నిండ పట్టేసి పడక మీదకు చేరిన ఆమె ఏ రకమైన స్పందనలు ప్రదర్శించగలదు అన్న కనీస ఆలోచన లేని పురుష సమాజానికి ప్రతినిధి అతను. పోని ఆమెకు కావలసిన విధంగా అతను పడకపై ప్రవర్తించడు. పైగా ఆ విషయంలో స్త్రీలకు ఇష్టాలుండ కూడదన్నని అతని వాదన.
ఇక నెలసరి సమయంలో ఆ కోడలిని ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉంచడం ఆ ఇంట ఆచారంగా ఇంకా నడుస్తూ ఉంటుంది. ఆ ఇంటికి వచ్చిన చుట్టాల అవసరాలు తీర్చడం ఆమె భాద్యత. ఇక్కడా ఆమెకు ఇంటి మగవారి సహకారం దొరకదు. పైగా సహాయం చేస్తాం అంటూ వచ్చిన వారు ఆ వంట గదిని ఒక యుద్ద భూమిగా మార్చి, దాన్ని శుభ్రపరిచే భాద్యత ఆమెదే అన్నట్లు అదో పెద్ద పని కాదన్నట్లు ప్రవర్తించడం కొసరు.
ఈ నిస్సారమైన జీవితం నుండి కొంత ఉపశమనం కోసం ఆ కోడలు ఉద్యోగానికి అప్లై చేస్తుంది. దానికి ఆమెను తప్పు పడతారు మగవారు. ఇంటి కోడలికి ఇల్లు చక్కదిద్దుకోవడమే భాధ్యత అని ఆ ఇంటి స్త్రీలు ఉద్యోగం చేయరని, తన భార్య కూడా ఎం.ఏ., పాస్ అయ్యి చక్కగా అన్ని సంవత్సరాలుగా ఇల్లు దిద్దుకుంటూ తన భాద్యతలు నెరవేర్చిందని గర్వంగా చెబుతాడు ఆమె మామ. కూతురు గర్భవతి అని ఆమెకు సహాయంగా అత్తగారు వెళితే అన్ని పనులు ఒక్కతే చేస్తున్న ఆ కొత్త కోడిలికి సున్నితంగా తన అలవాట్లు చెబుతూ ఆమెతో పనులు చేయించుకుంటూ ఇటు పుల్ల అటు తీసి పెట్టడం తన పని కాదన్నట్లుగా మామ గారు ప్రవర్తించడం కోడలు గమనిస్తూనే ఉంటుంది. వాషింగ్ మెషీన్లో బట్టలు వేస్తే అలా ఉతికిన బట్టలు తాను వేసుకోనని చెప్పి అవన్నీ చేతితో ఉతికించుకుంటాడు ఆ మామగారు.
ఒక రోజు ఆ భర్త, మామగార్ల మీద ఆ సీంక్లోని నీరు పడేసి ఆ ఇల్లు వదిలేస్తుంది కోడలు. ఒక డాన్స్ స్కూల్లో టీచర్‌గా తనకు నచ్చిన జీవితం గడుతుంది. ఆమె వెళ్ళిన తరువాత మరో వివాహం చేసుకున్న ఆమె భర్త ఆ భార్యను కూడా అదే వంట ఇంటికి కట్టేయడం సినిమా ముగింపు.
ఈ సినిమా రిలీజ్ కొంత కష్టమయిందట. కారణం శబరిమళై గుడిలో స్త్రీల ప్రవేశానికి జరుగుతున్న పోరాటానికి బాసటగా ఈ ఇంటి కోడలు నిలిచినట్లు దర్శకులు ఈ సినిమాలో చూపిస్తున్న సమయంలో, కేరళ రాష్ట్రంలో ఈ విషయంపై వివాదం నడుస్తుంది. కాని ఓటీటీలో సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం చాలా ప్రశంసలు అందుకుంది.
మళయాళంలో వచ్చిన ఈ సినిమా చూస్తున్నంత సేపు తెలుగు సాహిత్యంలో విమల గారు రాసిన 'వంటిల్లు' కవిత గుర్తుకు వస్తూనే ఉంది. ''ఇక్కడే నన్ను తీర్చిదిద్దడం మొదలైంది, ఇంట్లో అమ్మలంతా ఇక్కడే 'స్త్రీ' లయ్యారట, రకరకాల శవాలు నిండిన శ్మశానంలా.... మా వంటిల్లు .... తడి కట్టేల పొగమేఘాల మధ్య మా వంటిల్లు వేలాడుతూ ఉంటుంది., భయం భయంగా నిశ్శబ్దంగా, నిరాశగా, మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ''.... అంటూ ఈ కవితలో రాస్తారు విమల గారు. సినిమాలో కోడలు పాత్ర పోషించిన నిమిష కోటీ ఆశలతో ఆ ఇంట ప్రవేశించిన పెళ్ళికూతురు స్థాయి నుండి ప్రేతంలా మారడం స్క్రీన్‌పై కనిపిస్తూ ఉంటుంది. అచ్చంగా విమల గారి కవితను స్క్రీన్ పైన చూస్తాం ఈ సినిమాలో. భర్తకి మంచంపై సుఖాన్నిస్తూ, ఆ సమయంలో కూడా చేతి వేళ్లకు అంటిన ఆ వంటింటి వాసన చూసుకుంటూ ఇబ్బంది పడే ఆ కోడలిని చూసిన తరువాత ''అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఊంటుంది'' అన్న విమల గారి కవిత లోని వాక్యం అర్థం అవుతుంది. ''వడ్డిస్తూ, ఎంగిళ్ళేత్తేసుకుంటూ... చివరకు నా కలల్లోనూ వంటిల్లే - కళాత్మకమైన వంటింటి కలలు, మల్లెపూవుల్లోనూ పోపు వాసనలే'' అంటూ సాగే ఈ కవితలోని బాధను అర్థం చేసుకోగలిగే సమాజం ఇప్పటికీ లభించకపోవడం గురించి ఆలోచించకుండా ఉండలేం.
ఇప్పుడు సమాజం మారింది. ఆధునిక స్త్రీ పరిస్థితి మారింది కాని ఈ మార్పు కూడా ఆరోగ్యకరమైనది కాదు. వంటింటి పనికి ఇప్పుడు కూడా గౌరవం లేదు. స్త్రీ నేను ఆ పని చేయను అని కొన్ని సందర్భాలలో చెబుతున్నప్పుడు ఆ పని కుటుంబం నుండి వేరవుతుంది తప్ప కలిసి కుటుంబీ కులందరూ పంచుకునే పనిగా మాత్రం మారలేదు. ఇంట్లో వంట చేయలేని పక్షంలో బైట నుండి తెప్పించుకునే కుటుంబాల సంఖ్య పెరుతుగుంది తప్ప కుటుంబం మొత్తం ఆ పనిని తమదిగా భావించి చేసుకునే ఆలోచన ఇప్పటి సమాజంలోనూ కలగట్లేదు. అందువలన సమాజం ఏర్పర్చిన భాద్యత తప్పించుకుంటున్న స్త్రీల సంఖ్య పెరుగుతుంది కాని ఆ భాద్యతను తమ పనిగా పంచుకునే కుటుంబాల సంఖ్య పెరగట్లేదు.
కార్పరేట్ భాషలో చెప్పాలంటే మనం చేసుకోలేని పనిని బైటవారికిచ్చి చేయించుకుంటున్నాం. ఔట్ సోర్సింగ్ పద్దతిలో. ఇది ఆర్ధికంగా వెసలుబాటు ఉన్న స్త్రీలకు తాత్కాలికంగా ఉపయోగపడే ప్రత్యాయమానం. ఔట్ సోర్సింగ్ వలన ఎవరికి ఎంతవరకు ఉపయోగం? మన పనులపై, జీవితాలపై మార్కెట్ నియంత్రణ తప్ప ఇక్కడ జరుగుతున్నది సామాజికమైన మార్పు వైపుకి పయనం కాదు. ఆర్ధిక వనరులు లేని స్త్రీల పరిస్థితి ఏంటి? వంటింటి పట్ల సమాజంలో దష్టి మారలేదు. అది స్త్రీ పని అనే ఆలోచన ఇంకా పోలేదు. వంటిల్లు కుటుంబంలోని అందరి భాద్యత అన్న ఆలోచన దిశగా సమాజం మార్పు చెందినప్పుడే వంటింటి ఆధిపత్యం నుండి స్త్రీకి ముక్తి కాని, ఒక స్త్రీ తాను చేయదలచుకోని వంట పనిని సమాజంలో ఆర్ధికంగా దిగువ స్థాయి వారితో చేయించుకుంటూ డబ్బుతో ఆ సమస్యను పరిష్కరించుకోవడం, స్త్రీ జాతికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. దానికి కావల్సిన వనరుల కోసం స్త్రీ ఆర్ధికంగా తనను తానో బలోపేతం చేసుకోవలసిన అవసరం పెరిగింది. ఇక్కడ స్త్రీ అర్ధిక స్వావలంబన ఆమె తనను తాను వంటింటి నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకోవలసి వస్తుంది. ఇక్కడా వంటిల్లే ఆధిపత్యం వహిస్తుంది, కాని వ్యక్తిగా స్త్రీ ఎదుగుదల కోసం సహాయపడే వాతావరణం మాత్రం సమాజంలో ఇప్పటికీ ఏర్పడలేదు.
వంటింటి చుట్టూ ఉన్న ఆధిపత్య భావజాలం పై, పురుషాధిక్యత పై స్త్రీ సాధించవలసిన పోరు ఆర్ధికపరమైన పోరుగా మారుతుంది తప్ప పురుషాధిక్యత పై దీని ప్రభావం ఏమీ లేదు. తాను వంటింటికి దూరమయి స్త్రీ కార్పరేట్ ప్రపంచానికి, మార్కెటీకరణకు బలవుతుంది. ఆర్ధికంగా తనను తాను బలోపేతం చేసుకుని ఈ సమస్య నుండి విముక్తి పొందాలనుకుంటుంది తప్ప పురుష భావజాలంలో మార్పుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు సహకరించట్లేదన్నది ఆధునిక యువతి ఆలోచించుకోవలసిన ముఖ్యమైన విషయం.
ఈ విషయాలన్నిటిని ఈ తరం అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడే మంచి చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'' ఎందరో స్త్రీలు చెప్పాలనుకుని చెప్పలేక పోయిన విషయాలను ఈ సినిమా వ్యక్తీకరిస్తుంది. ఇది కూడా ఆలోచించవల్సిన విషయమేనా అంటూ అపహాస్యం చేసిన వారందరూ, ఇప్పటిదాకా వంటింట్లో మసి బారిపోయిన కొన్ని తరాల స్త్రీల కన్నీళ్ళ వైపుకు చూపు మరల్చుకునేలా ఈ సినిమా చేయగలదు అని నిస్సందేహంగా చెప్పుకోవాలి. ఈ కథావస్తువును ఎన్నుకున్నందుకు దర్శకులు, రచయిత జియో బేబి గారిని అభినందించాలి.
- పి.జ్యోతి, 9885384740