Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతులేని అనురాగం అమ్మ. అలుపెరగని ఓరిమి అమ్మ. భువిలో వెలసిన దేవత అమ్మ. మాలిన్యం లేని మనసున్న అమ్మ. ప్రాణాలకు తెగించి పురిటినొప్పులు పడి బిడ్డకు జన్మనిచ్చి పునర్జన్మను పొందుతుంది. బిడ్డకు తొలి గురువు అమ్మ. తొలి స్నేహితురాలు అమ్మ. మాట, బాట, నడక, నడత నేర్పుతుంది అమ్మ. గురువు మార్గదర్శకుడు, శ్రేయోభిలాషి అన్నీ అమ్మే అవుతుంది. గోరుముద్దలు తినిపించి కొండంత ఎదగాలని ఆశిస్తుంది అమ్మ. సమాజంలోని మంచి చెడులను విశ్లేషించి చూపుతుంది. ధైర్యం సాహసాలు రంగరించి ఉగ్గు పాలలోనే తాగిస్తుంది అమ్మ. అమ్మ ప్రేమ ఉన్నతం, అమ్మ ప్రేమ అద్భుతం, అపూర్వం.
మాతృమూర్తులను దైవంగా భావించి పూజించే సాంప్రదాయం భారతదేశంలో ఉన్నప్పటికీ విదేశీ ప్రభావం ఎక్కువగా పడుతున్నది. ఫలితంగానే భారతీయ యువత కూడా మాతృ దినోత్సవాలపై మక్కువ పెంచుకుంటున్నది. పాశ్చాత్య దేశాలలో పిల్లలు కొద్దిగా పెరగగానే స్వతంత్రంగా బతకడం ఆరంభిస్తారు. ఆ క్రమంలో తల్లి ప్రేమను, త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఒక రోజును ఎన్నుకున్నారు. అందుకే మాతృదినోత్సవాలు ఏర్పడ్డాయి.
అమెరికాలో బాలియావర్డ్ హోవే అనే మహిళ ప్రపంచ శాంతి కోసం తొలిసారిగా మాతృదినోత్సవాలు జరపాలని నిశ్చయించింది. 1872లో బోస్టన్‌లో సమావేశాలు కూడా నిర్వహించింది. అలాగే అన్నామేరీ జెర్విన్ అనే మహిళ 'మదర్స్ ఫ్రెండ్షిప్ డే' లను ఏర్పాటు చేసింది. ఆమె సివిల్ వార్ గాయాల తాలూకు జ్ఞాపకాలను చెదరగొట్టేందుకు ఇలాంటి దినోత్సవాలను నిర్వహించింది. ఆ తర్వాత మేరీ బెర్విన్ కూతురైన మిస్జెర్విన్ మాతృదినోత్సవాలను ప్రోత్సహించింది. అంతేకాకుండా తన తల్లి రెండవ వర్థంతి నాడు మాతృ దినోత్సవాన్ని నిర్వహించింది. ఆ రోజు మే నెలలోని రెండవ ఆదివారం అయింది. 1910వ సంవత్సరంలో వర్జీనియా రాష్ట్రంలో తొలిసారిగా మాతృదినోత్సవాన్ని జరిపారు. ఆ తర్వాత 1911వ సంవత్సరం నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో మాతృదినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. ఇదంతా మిస్ జెర్విన్ విపరీతంగా చేసిన ప్రచారం మూలంగా జరిగింది. ఆ తర్వాతి కాలలో అమెరికా అధ్యక్షుడు 'ఉడ్రోవిల్సన్' మాతృదినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నిర్ణయించాడు. దాంతో 1914 నుండి మాతృదినోత్సవం అధికారికంగా జరుగుతున్నది. అంతేకాక ఆ రోజు మాతృదినోత్సవం అధికారికంగా జరుగుతున్నది. అంతేకాక ఆ రోజు సెలవుగా కూడా ప్రకటించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలూ పాటించడం మొదలుపెట్టాయి.
ప్రపంచంలోని దాదాపు నలభై దేశాలు తల్లుల గౌరవార్థంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం మే నెలలో రెండవ ఆదివారాన్ని మాతృదినంగా జరుపుకుంటున్నారు. మొదటి సారి గ్రీస్ దేశంలో ఈ దినోత్సవం నిర్వహించారు. 'మథర్ ఆఫ్ గాడ్స్' అని పిలుచుకునే రియా దేవతకు నివాళిగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఇంగ్లండ్‌లో 17వ శతాబ్దంలో మాతృ మూర్తుల్ని గౌరవించే క్రమంలో 'మదరింగ్ సండే' పేరుతో ఉత్సవాలు నిర్వహించేవారు.
అమ్మ ప్రాణాలకు వెరవకుండా బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్ళలో బిడ్డను చూసీ చూడగానే పురిటి నొప్పులన్నీ మరిచిపోతుంది. బిడ్డ ఎందుకేడుస్తుందో తల్లికి మాత్రమే తెలుసు. బాధతో ఏడుస్తుందో, ఆకలితో ఏడుస్తుందో, ఏదైనా చీమ కుట్టి ఏడుస్తుందో తల్లి మాత్రమే చెప్పగలుగుతుంది. తన శరీరం నుంచి బయటపడ్డ శిశువును, తాను మరణించేంత వరకూ బిడ్డను ప్రేమించేది తల్లి మాత్రమే. అటువంటి త్యాగమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కనీసం ఆమె బతికి ఉన్నంత వరకూ కడుపునిండా తిండి కూడా పెట్టడం లేదు.
భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓల్డేజ్ హోంలలో ఎందరో మాతృమూర్తులు ఉంటున్నారు. ఏమీ తెలియని వయసులో మల మూత్రాదులు ఎత్తిపోసి, తన నెత్తురును పాలధారగా మార్చి బిడ్డల కడుపు నింపేది అమ్మ. అమ్మను ఉన్నత శిఖరాలకై విదేశాలకు పోతున్నామంటూ వృద్ధాశ్రమాల్లో సునాయాసంగా చేర్చేస్తున్నారు. అదేమంటే మేమే కదా డబ్బులు కడుతున్నాం అంటూ, సమాధానమిస్తున్నారు. మరికొంతమంది అన్నం కూడా పెట్టక ఏడిపిస్తున్నారు. దీనిని ఒక కవి ఎంతో చక్కగా రాశారు. ''చిన్నప్పుడు అన్నం తినక ఏడిపించాడు... పెద్దప్పుడు అన్నం పెట్టక ఏడిపిస్తున్నాడు''
కుటుంబానికి కేంద్ర బిందువు అయిన అమ్మ పిల్లల కోసం తన భవిష్యత్తునే త్యాగం చేస్తుంది. సంసార నావను నడిపించడమంటే సముద్రాన్ని ఈదడం కన్నా కష్టం అని భావిస్తారు. అటువంటి కుటుంబాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తొణకక బెణకక లాక్కొచ్చేది అమ్మ మాత్రమే. మన కోసం అనంతమైన ప్రమనూ, అపూర్వమైన త్యాగాన్ని ఇచ్చిన అమ్మకు మనం మాతృదినోత్సవ బహుమతిగా వృద్ధాశ్రమాల్లో చేర్చవద్దని ప్రతినబూనుదాం. అదే మనం అమ్మకు ఇచ్చే అద్భుత బహుమతి. మనలోనే ఉంచుకుని ఆమె అనుభవాలను తెలుసుకుంటూ మన బిడ్డలకు నానమ్మల అమ్మమ్మల ప్రేమ అందిద్దాం.
- డా|| కందేపి రాణీప్రసాద్