Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్రం అతని చిరకాల వాంఛ.
పరిశోధన ఆయన మేలైన గ్రంథం.
అధ్యాపకత్వం ఆయన ఉత్తమ ధర్మం.
సాహితీ రచన ఆయన చైతన్య వాహిక.
ఆయనే ఆచార్య ఇరివెంటి కృష్ణమూర్తి.
పుట్టుక, విద్య
ఇరివెంటి కృష్ణమూర్తి జూలై 12, 1930 సం.లో మహబూబునగర్ లోని కల్వకుర్తి తాలుకా రఘునాథపల్లి అనే గ్రామంలో పుట్టాడు. తల్లి రాములమ్మ, తండ్రి రాఘవ శాస్త్రి. కష్ణమూర్తి నిక్కచ్చిగా అన్యాయాన్ని ప్రశ్నించేటి వ్యక్తి. చక్కటి వక్త. దేనినైనా నిర్మొహమాటంగా భేషజాలకు తావు లేకుండా అడుగుతూ పెత్తనాన్ని ఎదుర్కొన్న వాడు. బానిస జీవనాన్ని సమాధి చేస్తూ స్వాతంత్య్రం కావాలని కోరుకున్న వ్యక్తి. సౌజన్యశీలి. సంస్కతాంధ్ర భాషలతో పాటు ఉర్దూలో పండితుడిగా పేరు గడించి ఆ భాషా, సాహిత్య అధ్యయనాలకు కృషి చేశాడు. ఈ క్రమంలోనే హిందీ, ఇంగ్లీషు భాషలను నేర్చుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఉస్మానియాలో బి.ఏ. ఎం.ఏ. లలో పట్టభద్రుడయ్యాడు.
స్వాతంత్య్రోద్యమం
దేశమంతా స్వాతంత్య్ర ఉద్యమం ఒక త్రోవన వెళ్తే, హైదరాబాదులో మాత్రం రెండు త్రోవలలోనూ వెళ్ళేది. వ్యాపార కాంక్షతో వలస వచ్చి భారతీయుడిపై పెత్తనం చేసి బానిస పాలనకు తెర లేపిన బ్రిటిషు వారు ఎంతటి క్రూరులో నిజాం కూడా అంతటి క్రూరుడు. కాకపోతే తరతరాల పాలకుల చేత రాజ్యాధికారిగా ఉంటూ బానిసత్వాన్ని పెంచి పోషించిన వారు నిజాం రాజ్య వంశస్తులు. ఇది చివరి నిజాం కాలంలో పరాకాష్టకు చేరుకుంది. ఇటువంటి సమయంలోనే అశాంతిని, అలుముకున్న అలజడిని అంతం చేసేందుకు పౌరులు పుట్టుకొచ్చారు. స్వేచ్చా జీవితాన్ని పొందాలని భావించిన ప్రతీ భారతీయుడు బానిస రాజ్య నిర్మూలనకు బాసటగా నిలిచాడు. అనేక మంది పాటలు రాశారు. ప్రజలను ప్రభోధాలతో చైతన్యపరిచారు. అలాంటి వారు హైదరాబాదు సంస్థానంలో అనేకులు ఉన్నారు. కొందరు కేవలం నిజాం ప్రభుత్వంతో పోరాడితే, కొందరు బ్రిటిషు వారితో పోరాడారు. అలా చిన్న వయసులోనే నిజాం ప్రభుత్వంతో పోరాడుతూ హైదరాబాదుకు స్వాతంత్య్రం రావాలని, అందుకు స్వతంత్ర భారతంలో హైదరాబాదు చేరాలని జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు ఇరివెంటి కష్ణమూర్తి.
అడ్డు అదుపు లేని నిజాం రజాకార్ల సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో చేయెత్తి స్వాతంత్య్ర తెలంగాణను కోరుతూ అరెస్టయినాడు. జైలు శిక్షకు గురయ్యాడు.
రచనలు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాడు. అనేక సందర్భాల్లో రచించిన అనేక వ్యాసాలను సారస్వత పరిషత్ 1990లో 'ఇరువెంటి వ్యాసాలు' పేరుతో ప్రచురించింది. కష్ణమూర్తి రాసిన కవిత్వం అధిక శాతం యువ భారతి ప్రోత్సాహంతోనే రాయబడింది. చాలా మటుకు కవితా సంకలనాలను అనగా 'వీచిక,(1968), అక్షరాలూ (1971), స్వరాలు(1973), ఉషస్సు (1973), వేడి వెలుగులు (1980), రేఖలు (1981) వంటి వాటిని యువభారతి ప్రచురించింది. అలాగే 'పఠనీయం', ఇది 39 గ్రంథాల పరిచయ వ్యాసాల గ్రంథం. దాదాపు ఏడేళ్ళ పాటు యువభారతి వారి 'నందిని' త్రైమాసిక పత్రికలో ధారావాహికంగా రాసిన వ్యాసాల సంకలనం ఈ గ్రంథం. ఇరివెంటి కవిత్వంతో పాటు వ్యాసాలూ, కథలూ రాశాడు. కథలు యాభై దశకంలో 'వర్ధిని పత్రికలో, ఆరవై దశకంలో భారతిలో, యువభారతి ప్రచురించిన 'ఉదయం' పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇరివెంటి బాల సాహితీ వేత్త కూడా. స్ఫూర్తివంతమైన అంశాలను తీసుకుని వారిలో పరివర్తన కలిగేలా బాల సాహిత్యం రాశాడు. జాతి గర్వించదగిన మహనీయుల గాథల గురించి, జాతికి అవసరమయ్యే ప్రభోదాల గురించి అనేక అంశాలు ఆరు పుస్తకాలలో రాశాడు.
1993 లో 'వాగ్భూషణం భూషణం' అనే పుస్తకాన్ని రాశాడు. ప్రసంగం ఎలా చేయాలి, అందరిని ఆకట్టుకునేలా ఎలా ప్రసంగించాలి, దానిలో ఉన్న మెళకువలు ఏమిటి? వంటి తదితర అంశాలతో వెలువడ్డ చిన్న పుస్తకమే 'వాగ్భూషణం భూషణం'. వీరు పరిశోధన చేసిన 'కవి సమయాలు' అన్న సిద్ధాంత గ్రంథం ఉత్తమ పరిశోధనా విలువలు గలిగి అనేకుల ప్రశంసలు పొందింది. కష్ణమూర్తి కొన్ని కథలు కూడా రాశాడు. అవి: 'రంగుల లంగయ్య, పట్నపోల్లు, పంచయతి నెంబరు, కనువిప్పు.
కృషి
ఇరివెంటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి, ఆంధ్ర సారస్వత పరిషత్తుకు కార్యదర్శిగా వ్యవహరించాడు. యువ భారతి సంస్థకు చాలా ఏళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగాడు. చదువుకున్న చోటనే, సమాజం అంటే ఏంటో తెలియచెప్పిన విద్యాలయంలోనే ప్రొఫెసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు. ఇతను ధ్వన్యనుకరణ (మిమిక్రి) కళకారుడు. ఒక్కసారి ఎవరి స్వరాన్నైనా వింటే వారి స్వర శబ్దం ఎలాగున్నా దానినే యధారీతిగా మిమిక్రి చేసేటటువంటి ప్రతిభ ఉన్న వ్యక్తి.
ఇరివెంటి వారి సంస్మరణ సభలో సినారె గారు తమ 'ప్రపంచ పదులు' అన్న పుస్తకాన్ని ఇరివెంటి వారికి అంకితం ఇస్తానని ప్రకటించారు. అలాగే వారిరువురి మధ్య స్నేహ బంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
మదు స్వభావశీలి అయిన ఇరివెంటి పలు ప్రక్రియలలో సాహిత్యం సష్టించి పరిశోధనతో గుర్తింపును పొందాడు. యువభారతిలో కీలక బాధ్యత పోషించి సంస్థకు మంచి పేరును తీసుకొచ్చిన ఇతను ఏప్రిల్ 26, 1989 లో మరణించాడు.
- ఘనపురం సుదర్శన్,
9000470542