Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా! పిల్లల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు!
మీ హాసంలో మెరుగులు తీరును!
వచ్చేనాళ్ల విభాప్రభాతములు!!
- శ్రీశ్రీ
బడి ఈడు పిల్లలు మొబైల్ ఫోన్లకు అలవాటుపడి, వ్యర్ధ మాధ్యమాల భ్రాంతుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారి కోసం 13 ఏండ్లుగా వేసవి శిబిరాలను నిర్వహిస్తూ పిల్లల నవ్వులతో ప్రభాత వెలుగులు మెరుగులు తీర్చేదిద్దే ప్రయత్నం జహీరాబాద్‌లో నిర్వహించారు మన లైబ్రరి, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో...
గడిచిన రెండు సంవత్సరాలుగా కోవిడ్ ప్రభావంతో నిర్వహించిన ఆన్లైన్ క్లాసులకు పరిమితమైన పిల్లలు అనేకరకాల శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. అసలు ఫోన్ లేకుండా పిల్లలు ఉండగలరా లేదా అన్న సందేహంతో ఈ సారి క్లాసులు నిర్వహించారు మన లైబ్రరి, జనవిజ్ఞానవేదిక నిర్వాహకులు. సందేహాల్ని పటాపంచలు చేస్తూ దాదాపు 80మందికి పైగా పిల్లలు అన్ని రోజులూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9గం. నుండి సాయంత్రం 4 గం.వరకు సాగిన ఈ శిబిరంలో ఉదయం పాటలు నేర్చుకోవడంతో ప్రారంభమై సాయంత్రం వివిధ ఆటలు ఆడుకోవడంతో ముగించేవారు.
ఈ శిబిరంలో పాల్గొన్న పిల్లలను రెండు గ్రూపులుగా (6, 7, 8, 9 తరగతులు చదివే పెద్దపిల్లలు ఒక గ్రూపుగా, 5వ తరగతిలోపు చిన్నపిల్లలు మరో గ్రూపుగా), ప్రతి గ్రూపులోనూ ఐదుగురు చొప్పున చిన్న గ్రూపులుగా చేసి యాక్టివిటీస్ చేయించారు. సమిష్టి బందం ఏర్పడడంతో చర్చలు జరుపుకునే వారంతట వారే సజనాత్మకంగా పాల్గొనగలిగారు. సి.ఏ.ప్రసాద్ తాతయ్య పిల్లలకు చాలా పాటలు నేర్పించారు. పదాలు చెప్పి కథలు రాయించడం, కథను డ్రామాగా చేయించడం, కొత్తకొత్త ఆటలు ఆడించడం వంటివి చేశారు. సి.ఏ. ప్రసాద్ దేశవ్యాప్తంగా పిల్లలకు సజనాత్మకంగా బోధిస్తున్న పలు విద్యాలయాలను నిరంతరం సందర్శిస్తూ, బోధనలో నూతనత్వాన్ని అన్వేషిస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. ఆయన 13 ఏళ్లుగా జహీరాబాద్‌లో జరుగుతున్న పిల్లల వేసవి శిబిరానికి కీలకమైన రిసోర్స్‌పర్సన్‌గా సేవలందిస్తున్నారు.
ఫయాజ్ వత్తిరీత్యా ఇంజనీరు అయినా, బహుముఖ ప్రజ్ఞాశాలి (చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, రోబోటిక్స్, వుడ్ వర్క్). ఆయన పిల్లలలో సెల్ఫ్ లెర్నింగ్‌ను ప్రోత్సహించే యాక్టివిటీస్ నేర్పించారు. గింజలు చల్లి మొక్కలు పెరిగే క్రమాన్ని పరిశీలించడం, బాడీ చార్ట్‌లో వివిధ శరీర భాగాలు తయారు చేయించి వాటి గురించి గ్రూపులుగా చర్చించడం, ఆదర్శ గ్రామంలో ఏముండాలి అని పిల్లలతో యాక్టివిటీ చేయించడం, పేపర్లతో బొమ్మలు చేయించడం (Origami) వంటివి చేయించారు.
అంతరిక్ష శాస్త్రజ్ఞులు రఘునందన్ పిల్లలకు ప్రాథమిక అంతరిక్ష పరిజ్ఞానాన్ని పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఆ మరుసటి రోజు వేకువ ఝామున టెలిస్కోపు ద్వారా ఆకాశంలో చంద్రుడినీ, గ్రహాలనూ చూపించి వాటి గురించి వివరించారు. ఈ అనంత విశ్వంలో భూగోళం, ఇతర గ్రహాలపై జీవం ఉనికి వంటి ఆసక్తికరమైన విషయాలను శాస్త్రీయంగా వివరించారు.
హైదరాబాద్‌లో ప్లేస్కూల్ నడుపుతున్న 'లక్ష్మి' అమ్మమ్మ ఎంతో ఉత్సాహంగా పిల్లలతో కలిసిపోయి వాళ్లను చెట్లెక్కించడం, పరిగెత్తించడం, కుందుళ్లు ఆడించడం, పెయింటింగ్ చేయించడం, కథలు చెప్పించడం లాంటివి చేయించారు.
మట్టితో బొమ్మలు చేయడంలో నిపుణులైన లక్ష్మణరావు పిల్లలకు ఎంతో ఆసక్తికరంగా పలురకాల బొమ్మలు... గిన్నెలు, గ్లాసులు, కుండలు, పువ్వులు, జంతువులు.. వంటి ఎన్నో వస్తువులు మట్టితో చేయడం(clay moulding) నేర్పించారు.
గణిత ఉపాధ్యాయులు వలి సార్ పిల్లలకు రోజువారి జీవితంలో గణితం ఉపయోగం ఎంతో ఆసక్తికరంగా వివరించి, సులభంగా లెక్కలు నేర్చుకునే పద్ధతులు (easy maths) నేర్పించారు. ప్రకాష్, సాయి, నితిన్‌సాయి, డా.విజయలక్ష్మి చేసిన మేజిక్స్ పిల్లలకు ఎంతో నచ్చాయి. ఆలోచింపజేసాయి.
గోలీలు, బొంగరాలు, తాడు ఆట, రింగు ఆట, చెట్లెక్కడం, ఉయ్యాల ఊగడం, రోప్ క్లైంబింగ్, టగ్ ఆఫ్ వార్... ఎన్ని ఆటలు ఆడుకున్నారో పిల్లలు.... నవ్వుతూ, తుళ్లుతూ, నవ్విస్తూ, కేరింతలు కొడుతూ.... పిల్లలు చివరి రోజు తాము నేర్చుకున్న అంశాల గురించి వివరిస్తూ లేఖలు రాశారు. వేసవి సెలవుల్లో టైం టేబుల్ వేసుకుని తాము నేర్చుకున్న అంశాలను సాధన చేస్తామనీ, తమ చుట్టుపక్కల పిల్లలకూ, స్నేహితులకూ అవి నేర్పిస్తామనీ చెప్పారు. ఈ శిబిరానికి మరో ప్రత్యేకత ఏమిటంటే... కోటీశ్వరుల పిల్లల నుండి నిరుపేదల పిల్లల వరకూ కలిసిమెలిసి ఆడుకోవడం, పాడుకోవడం, తినడం, నేర్చుకోవడం... ఒకరితోనొకరు స్నేహం పెంచుకోవడం.. కాళిదాసు-జయమ్మ దంపతుల ఆధ్వర్యంలో వాలంటీర్స్ టీమ్ తమ సేవలందించారు. వాలంటీర్స్‌గా మేఘన, సంజన, ప్రజ్ఞ, రాజేష్, దుర్గాప్రసాద్, మల్లేశ్, వేణు, సుకుమార్, సురేష్, ఎలిజబెత్‌రాణి, చంద్రలీల, జయలక్ష్మి, ఎస్తేర్ రాణి, ఫణీంద్ర, సాయి, ప్రకాష్, డా.శివబాబు, డా.ప్రతాప్‌కుమార్ తమ సేవలందించారు.
చివరగా చిన్ని ఆశ... సమ్మర్ క్యాంపుకు వచ్చిన పిల్లలు ఎన్నో విషయాలు ఆడుతూ, పాడుతూ నేర్చుకున్నట్లే... బడిలో పాఠాలు కూడా పిల్లలందరూ హాయిగా నేర్చుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా ఆలోచించి ప్రయత్నిస్తే ఎంత బావుంటుందో కదా...
- డా. విజయలక్ష్మి (''మన లైబ్రరి'' వ్యవస్ధాపకురాలు),
- డా.శివబాబు ప్రగతి నర్సింగ్ హోమ్, జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా, తెలంగాణ