Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గేయకవిగా తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖతీల్ శిఫాయీ అసలు పేరు ఔరంగజేబ్ ఖాన్. ఇతను పాకిస్తాన్‌లోని హజారా జిల్లాలో 1919 డిసెంబర్ 24న జన్మించాడు. 1935లో తన తండ్రి మరణం తరువాత తన విద్యను ఆపాల్సి వచ్చింది. ఆ తరువాత జీవనం సాగించడం కోసం ఒక క్రీడా వస్తువుల దుకాణం ప్రారంభించిన ఖతీల్, వ్యాపారంలో నష్టం రావడంతో రావల్పిండికి మకాం మార్చాడు. 1947లో పాకిస్తాన్ ఫిల్మ్ ఇండిస్టీలోకి సినీగేయ రచయితగా ప్రవేశించిన ఇతను, స్వల్ప కాలంలో తన పాటలతో భారత్‌లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు.
ఖతీల్ హైయాలీ, గుఫ్తగూ, బర్గద్, మత్రబా మొదలుకొని 14 కవితా సంకలనాలు వెలువరించాడు. 1948లో 'తెరీ యాద్' అనే సినిమాలో ఖతీల్ తన మొదటి సినిమా పాటను రాసాడు. హిందీ, గుజరాతీ, రషియన్, చైనీస్ మొ|| భాషలలో అనువదించబడిన తన రచనలు, తనకి అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టాయి. ఖతీల్ 1946లో అదబ్-ఎ-లతీఫ్ పత్రికకు ఉపసంపాదకుడిగా కూడా వ్యవహరించాడు. తాను చేసిన అక్షర కషికి పాకిస్తాన్ ఫిల్మ్ ఇండిస్టీ నుండి నిగర్ జీవిత సాఫల్య పురస్కారం, భారత్ నుండి అమీర్ ఖుస్రో పురస్కారంతో పాటుగా ఎన్నో పురస్కారాలను అందుకున్నాడు. ఎటువంటి సాహిత్య నేపథ్యం లేని ఖతీల్ శిఫాయీ, 20వ శతాబ్దాపు ఉర్దూ మహాకవులలో ఒకడిగా పలువురి ప్రశంసలు అందుకున్నాడు. 11 జులై 2001, లాహౌర్‌లో ఖతీల్ తన చివరి శ్వాస విడిచాడు.
మూలం :
అప్నే హౌంటో పర్ సజానా చాహ్తా హూ
ఆ తుఝే మై గున్గునానా చాహ్తా హూ
కోఈ ఆన్సూ తెరే దామన్ పర్ గిరా కర్
బూంద్ కో మోతీ బనానా చాహ్తా హూ
థక్ గయా మై కర్తే కర్తే యాద్ తుర్a కో
అబ్ తుఝే మై యాద్ ఆనా చాహ్తా హూ
ఛాV్‌ా రహా హై సారీ బస్తీ మే అంధేరా
రౌశ్నీ కో, ఘర్ జలానా చాహ్తా హూ
ఆఖ్రీ హిచ్కీ తిరే జానూ పే ఆఏ
మౌత్ భీ మై షాఇరానా చాహ్తా హూ
అనువాదం :
నా పెదవులపై అలంకరించాలనుకుంటాను
ఇటురా! నిన్ను నేను పాడుకుంటాను
కన్నీరును నీ చున్నీ పైన రాల్చి
ప్రతి బిందువును ముత్యంలా మార్చాలనుకుంటాను
అలసిపోయాను పదే పదే నిన్ను గుర్తు చేసుకుంటూ
ఇపుడు నీకు నేను గుర్తురావాలని అనుకుంటాను
అంధకారం ఊరంతా అలుముకుంటోంది
ప్రకాశం కోసం ఇంటిని రగిలించాలనుకుంటాను
చివరి శ్వాస నీ ఒడిలో విడిచే వీలుంటే
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
ఖతీల్ ఒక సినీ గేయ రచయిత అవ్వడం వల్ల తన గజళ్ళలో సంగీతాత్మ తప్పకుండా ఉంటుంది. ఖతీల్ గజళ్ళు శ్రోతలను నిశ్శబ్దంగా కవ్విస్తాయి. చాలా సార్లు అవి మనసుకు హాయిని చేకురుస్తాయి. అలాంటి చక్కనైన గజళ్ళలో ఈ ఎపిసోడ్లో తీసుకున్న గజల్ ఒకటి. పెదాల పైన ప్రేయసిని అలంకరించా లనుకునే భావన ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తుంది. అలా అలంకరించుకున్న తనని పాడుకుంటాననడం మనసును ఉర్రూతలూగిస్తుంది. రెండవ షేర్లో, కన్నీటి బిందువులను ముత్యాలతో పోల్చిన తీరు, కన్నీరుకు కవి ఇచ్చిన స్థానమెంతటిదని అర్థమవుతుంది. ఆఖరి షేర్లో, కవి తన ప్రేయసి ఒడిలో మరణించే వీలుంటే మరణాన్ని సైతం కవిత్వం చేస్తాననడం ఒక గొప్ప వర్ణన అని చెప్పవచ్చు. మరణాన్ని కూడా కవితాత్మకం చేస్తాననడం, కవికి తన పైన తనకుండే చెక్కు చెదరని ఆత్మస్థైర్యాన్ని సూచిస్తుంది. అది అతి తక్కువ మంది కవిరాజులకు మాత్రమే సాధ్యమౌతుంది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256