Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడో పుట్టిన వ్యక్తి గురించి, ఎక్కడో ఎదిగిన గొప్ప మనిషి గురించి రాయడం విశేషమే కావచ్చును గాక, కాని మా ఊరు పక్కన ఉన్న ఆలూరు (చేవెళ్ళ) సమీపంలో పుట్టిన ఇంతటి అరుదైన గొప్ప మనిషి గురించి రాయడం సగర్వంగా ఉంది. ఆ గొప్ప మానవ మూర్తియే కాళోజి నారాయణరావు సోదరుడు రామేశ్వరరావు. వీరి పూర్వీకులు ఎక్కడి నుండో వచ్చి వరంగల్ మడికొండలో స్థిరపడినా వీరు మాత్రం మాకు సమీపాన పుట్టడం మా ప్రాంతానికి గర్వ కారణం.
రామేశ్వరరావు పేరు పొందిన కవి, స్వాతంత్య్ర సమర యోధుడికి సోదరుడు. ఇతను 1908 జూన్ 22 న కాళోజి రంగారావు, రమాబాయిలకు జన్మించాడు. వీరి కుటుంబం మడికొండలో స్థిరపడింది. దీంతో తండ్రి ఉద్యోగం రీత్యా పలు ప్రాంతాలకు వెళ్ళవలసి రావడంతో రామేశ్వరరావు విద్య హైదరాబాద్, మడికొండ, వరంగల్లులో సాగింది. ఇతనికి నటనలో ఆసక్తిగా ఉండడంతో తండ్రి ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహంతో పలు నాటకాలలో నటించాడు. ఎవరైనా తమకున్న కళను రెండు విధాలుగా సద్వినియోగం చేసుకుం టారు. ఒకటి తను ఆర్థికంగా మెరుగుపడడం కోసం, రెండు తనకున్న కళను ప్రదర్శించి చుట్టూరా ఉన్న సమాజంలో పేరు పొందడం కోసం. కాని కొందరు మాత్రమే ఈ రెండింటిని కాదని సంఘ శ్రేయస్సు కోసం ప్రదర్శిస్తారు. ఆ కొందరిలో రామేశ్వరరావు ఒకరు. ఇతను తనకున్న ఆసక్తితో నాట కాలు వేసి తద్ద్వారా వచ్చిన డబ్బును 'ప్రతాపరుద్ర గ్రంథాలయ' నిర్వహణకు అందించేవాడు. ఇలా ఇతను 'జయంత జయరామ పాపము, లంకా దహనం, ఉషాపరిణయం' వంటి నాటకాలలో నటించాడు. న్యాయవాదవత్తిపై తనకున్న అభిప్రా యాన్ని, అభీష్టాన్ని ''మా చిన్ననాటి రోజులు''లలో రాసుకున్నారు.
సేవా రంగం
1947 నాటికి, జాతీయోద్యమ శతాబ్దంలో అత్యంత ఆదరణ ఉన్న, విలువైన, గౌరవమైన విద్య న్యాయశాస్త్రం. స్వాతంత్య్ర పోరాట కాలంలో, అంతకు ముందు పుట్టిన వాళ్ళలో సామాజిక జీవనంలో కాస్త మెరుగైన జీవనాన్ని గడుపుతున్న వారు తమ పిల్లలను న్యాయశాస్త్రం వైపు మళ్ళించారు. అయితే నిజాం కాలంలో న్యాయస్థానాలే న్యాయవాద విద్యకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తుండేవి. దీనికి 7 వ తరగతి అర్హతగా ఉండడంతో రామేశ్వరరావు హనుమకొండలో 7 వరకు చదివి, న్యాయశాస్త్ర తరగతులలో చేరి పట్టా పొంది 1928 నాటికి న్యాయవాదిగా హనుమకొండలో స్థిరపడ్డాడు. నిజాం ప్రభుత్వ కాలంలోని సంక్లిష్ట పరిస్థితుల నడుమ తాను నిజాం వ్యతిరేక కేసులను కూడా చేపట్టి వాదించిన వ్యక్తి. నిరుపేదల పాలిట దయతో ఉండి, వారి జీవన స్థితిని అర్థం చేసుకొని ఖర్చు లేకుండా కోర్టులలో వాదించేవాడు.
ప్రజలను బెదిరింపులకు గురి చేసి, వారిపై దౌర్జన్యాలకు పాల్పడి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్న భూస్వాములకు ప్రతికూలంగా రైతుల పక్షాన కోర్టులలో పోరాటం చేశాడు. రామేశ్వరరావు తన న్యాయవాద వత్తిని చేపడుతూనే రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనే వాడు. నాడు ప్రజలను చైతన్య వంతులని చేయడానికి స్థాపించిన ప్రతి సంస్థతో ఇతనికి సంబంధం ఉండేది. అయితే ఇతను ప్రగతి శీల భావాలు గల వ్యక్తిగా ఉండి అక్రమ కార్యక్రమాలను ప్రశ్నించేవాడు.
వరంగల్ లోని పురపాలక సంఘంలో కౌన్సిలర్‌గా ఉన్నాడు. అలాగే ఒక పట్టణానికి కాంగ్రెసు అధ్యక్షునిగా పని చేసిన అనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన మార్గంలో ఉండడం లేదని భావించి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను చూసి విరక్తి చెంది కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. స్వాతంత్య్రోద్యమంలో కవిగా, నిజాయితీ గల న్యాయవాదిగా సమాజం పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తించాడు. మొదటి నుండి కాంగ్రెసు అభిమానిగా ఉంటున్న ఇతడు వయసులో చిన్నవాడైనప్పటికి నాటి ఉద్యమ నాయకులు అభిమానించేవారు. ''బందగి రక్తం, చిందిన నేత్రం, బలిదానాలకు వెరవని క్షేత్రం'' అని స్మతి గేయానికి కారణమైన పోరాటయోధుడు షేక్ బందగీకి, విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి మధ్య జరిగిన భూ వివాద కేసులో రామేశ్వరరావు వాదించి బందగీని గెలిపించాడు.
సాహిత్య అభిలాష
రామేశ్వరరావు ఉర్దూ కవిగా ప్రసిద్ధుడు. వరంగల్లులో వీరి ఇల్లు ఎప్పుడు సాహీతి మిత్రులతో, కవిత్వ సువాసనలతో విరాజిల్లేది. వీరి ఇంటికి ప్రముఖ సాహేతీవేత్తల రాకపోకలు నిరాటంకంగా ఉండేవి. ఒకసారి మన తొలి జ్ఞానపీఠాధిపతి అతిధిగా వెళ్ళిన విషయాన్ని వానమామలై వరదాచార్యుల గారి 'మణిమాల' పీఠికలో తెలిపారు. నిజాం రాజ్యంలో అధికార భాష ఉర్దూ అయినప్పటి నుండి ఆ భాష ప్రభావం, ఆ భాష తాలూకు సాహిత్యం వెలువడేది. అయితే ఇది ఎక్కువగా ఆంధ్రేతరులే రాసేవారు. కాని ఆంధ్రులుగా ఉర్దూలో సాహిత్యం రాసినవారు చాలా అరుదు. వారిలో రామేశ్వరరావు ప్రముఖుడు. ఇతను తెలుగుతో పాటు హైదరాబాద్‌లో ఉన్న ఇతర బాషలలో కూడా రచనలు చేయగల పాండిత్యమున్న ప్రతిభాశాలి. ఉర్దూలో కవిత్వంతో పాటు తెలుగులో 'ఫోటోగ్రాఫర్' వంటి పలు కథలు రాసిన రామేశ్వరరావు 1996 నవంబర్ 11 న కన్నుమూసాడు.
- ఘనపురం సుదర్శన్,
9000470542