Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలల కోసం చక్కని గేయాలను 'విద్యార్థి గేయాలు' పేరుతో అందించిన బాలల కవి, పండితులు, బుర్రకథా రచయిత, నాటకకర్త, నిబద్ధత గలిగిన భాషోపాధ్యాయులు సేనాపతి భాష్యకాచార్యులు.
నేటి జగిత్యాల జిల్లా కోరుట్లలో 24 డిసెంబర్, 1938లో శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు-నరసమ్మ దంపతులకు పండిత కుటుంబంలో జన్మించిన భాష్యకాచార్యులు హెచ్.యస్.సి వరకు స్వగ్రామం కోరుట్లలో చదువుకున్నారు. తరువాత బి.ఎ., బి.ఒ.ఎల్. పూర్తిచేసి నిజామాబాద్ పట్టణంలోని ఖలీల్వాడి ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రథమశ్రేణి భాషా పండితులుగా ఉద్యోగం చేశారు. తెలుగు భాషతో పాటు హిందీలో కూడా వీరికి చక్కని పట్టువుంది. హిందీ భూషణ్ పరీక్షల్లొ ఉత్తీర్ణులవ్వడమే కాక హిందీ భాషాభివృద్ధి కోసం దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి హిందీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టి ఇటు తెలుగు, అటు హిందీ భాషల కోసం కృషి చేశారు. సంస్కృతాన్ని అధ్యయనం చేసి అందులోనూ పాండిత్యం సంపాదించారు.
విద్యార్థి దశలోనే పాటలు, పద్యాలు రాసి కవిగా, రచయితగా పేరుతెచ్చుకున్న వీరు నాటక రచయితయే కాక రంగస్థల నటులు, బుర్ర కథలు అత్యంత అద్భుతంగా, ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేట్లు చెప్పేవారు. 1965లో భాష్యకాచార్యులు రాసిన 'ఉపాధ్యాయుడు' బుర్రకథ వీరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. 'వినాయక చరిత్ర', 'కురుక్షేత్రము', 'సీతారామ కళ్యాణము', 'స్వతంత్ర భారతము' వీరి ఇతర బుర్ర కథలు. 'కవితా రసాలము' వీరి పద్య కావ్యము.
పద్యం, గేయం ఎంత ప్రౌడంగా రాస్తారో హాస్యాన్ని కూడా అదే పాలులో రాయడంలో భాష్యకాచార్యులు దిట్ట. వీరి హాస్య కౌశలం వీరికి 1976లో 'హాస్యకవి' బిరుదును సాధించి పెట్టింది.ఇవేకాక 'ఐదు హాస్య నాటికలు'తో పాటు అనేక ఏకపాత్రాభినయాల స్క్రిప్టులను రాశారు. పద్యం, గేయం ఎంత ప్రౌడంగా రాస్తారో హాస్యాన్ని కూడా అదే పాలులో రాయడంలో భాష్యకాచార్యులు దిట్ట. వీరి హాస్య రచనా కౌశలం వీరికి 1976లో 'హాస్యకవి' బిరుదును సాధించి పెట్టింది. 1977 నుండి 1981 వరకు ఆంధ్రభూమి ఆదివారం అనుబంధాల్లో వీరి హాస్య రచనలు ప్రచురించబడడమే కాక హాస్యకవిగా ఖ్యాతిని సంపాదించి పెట్టాయి.
పిల్లల కోసం పైన పేర్కొన్న రచనలే కాక 'విద్యార్థి గేయాలు' గేయ సంపుటి రచించి 1987లో ప్రచురించారు. సాధారణంగా పుస్తకం కాపీరైటు పేజీలో 'ఇందులోని రచనలు ఏ విధంగా ఉపయోగించరాదు' అని ఉండడం చూస్తుంటాం. కానీ భాషకాచార్యులు 'ఇందులోని గేయాలను యథేచ్చగా' కవి పేరు చెప్పి ఉపయోగించుకోవచ్చని రాయడం విశేషం. కవి ఇందులోని బాల గేయాలను కేవలం సరదాగా పాడుకొని మరిచిపోవడానికి రాయలేదన్నది ఆయన మాటలవల్ల తెలుస్తుంది. విద్యార్థులకు చెందినవి, తెలుగు జాతికి చెందినవి, భారత జాతికి చెందినవి, ఋతువుల వర్ణన, ఇతర అనేక సామాజిక అంశాలకు చెందిన అనేక గేయాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. అయనే ముందుమాటలో చెప్పినట్టు ఇవన్నీ భాష్యకాచార్యులు పనిచేససిన ఖలీల్వాడి బడి పిల్లల కోసం రాసినవి, తొలుత వాళ్ళే పాడుకున్నవి. అటు తరువాత ఇతర పిల్లల కోసం పుస్తకంగా తెచ్చారు కవి.
కోరుట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో, అందులోనూ ఉభయ వేదాంత వర్ధిని పాఠశాల స్థాపించిన శ్రీమాన్ నృసింహాచార్యుల కుటుంబంలో జన్మించిన వీరు బాలల కోసం అవసరమైన చోటు ఆధునిక దృష్టితో, వాళ్ళకు నచ్చే విధంగా గేయాలు రాశారు. ప్రార్థనా గేయంలో గణపతిని వర్ణిస్తూ రాసిన గేయం పిల్లలకు నచ్చడమేకాక ఆసక్తిని కూడా కలిగిస్తుంది. 'వ్యాస మహర్షి కీవు రైటర్ / ఎలుకయే నీ బెస్ట్ స్కూటర్ / విద్యలన్నీ నీకు వాటర్ / సురలందరకు నీవె ట్యూటర్' అంటారు కవి.
గేయంపై, పద్యంపై మిక్కిలి పట్టుకలిగిన వీరి ప్రతి గేయం ఆద్యంతం ప్రాసంలతో కూడి ఉండడం వల్ల అవి విద్యార్థులను మిక్కిలి ఆకర్శించడమే కాక అందాన్ని కలిగించాయి. 'అంతా ఒకటే వర్గము / మనదంగా ఒకటే మార్గము / హిందూ ముస్లిం సిక్కు యిసాయి / మన మందరము భాయి భాయి' అన్న కవి 'అసతోమా సద్గమయా! విద్యార్థి పాడుమయా!' అంటారు. ఇంకా మరికొన్ని గేయాల్లో 'జాతిపిత మన గాంధీ / శాంతి పథానికి నాంది', 'మన మాట తెలుగు / చూపించును వెలుగు', 'మానవునకు ధనము ఉన్న / ధనము కన్న చదువు మిన్న' అంటారు. 'హైదరాబాద్ మహా నగరం / ఎటు చూసినా గరం గరం' అన్న భాష్యకాచార్యులు ఆటల గురించి చెబుతూ 'ఆటలు ఆటలు ఆటలు / ఆరోగ్యానికి బాటలు' అని పిల్లలకు చెబుతారు. 'మా బడి దేవాలయం / మకిది జ్ఞానాలయం / మా గురువులు దేవతలు / జ్ఞానమూర్తి రూపములు' అని ఎలుగెత్తి చాటుతారు. ఇలా పుస్తకం, శాంతిధూత, పండుగలు, పబ్బాలతో పాటు అనేక అంశాలపైన గేయాలు రాశారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548