Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొగాకు అనేది సొలనేసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని పొగచెట్టు అని కూడా పిలుస్తారు. ఈ ఆకుల నుండి పొగ విడుదల అవుతుంది. కాబట్టి దీనిని పొగచెట్టు లేదా పొగాకు అంటారు. పొగాకు చెట్టు ఆకుల నుండి చుట్టలు, సిగరెట్లు తయారు చేస్తారు. దీని శాస్త్రీయ నామం 'నికోటియానా లూబాకమ్' అంటారు. పూర్వం దీనిని వైద్యానికి, ఔషధాలలో వాడేవారు. తర్వాత ఇవి మత్తు పదార్థంగానే ఎక్కువ పేరు పొందింది. దక్షిణ అమెరికా ఆర్థిక వ్యవస్థ పొగాకు ఉత్పత్తి, మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ పొగాకుకు 'జీన్ నికోట్' అనే ఆయన గౌరవార్థంగా నికోటియానా అనే పేరు పెట్టారు. ఇతడు పోర్చుగల్‌లోని ఫ్రెంచి రాయబారి. పొగ తాగడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె వ్యాధులు ప్రధానంగా కలిగే నష్టాలు. దీన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికో రోజును పెట్టాలని నిర్ణయించింది. మే నెల 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా 1988లో ప్రకటించింది. పొగాకు వాడటం వల్ల వచ్చే సమస్యలను వివరించి దాని బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ఈ ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేసింది.
ప్రతి ఏటా ఇరవై నాలుగు గంటల పాటు పొగాకు వాడకుండా ఆపేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. మొదటగా 1987లో ఏప్రిల్ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవం జరపాలని నిర్ణయించారు. పొగాకు వినియోగదారులకు వాటి వలన కలిగే నష్టాలను వివరించారు. ఈ అవగాహనా కార్యక్రమాల వలన భారతదేశంలో మంచి ఫలితం కనిపించింది. అంతకుముందు పొగాకు తాగేవారి సంఖ్య 33.8 శాతం ఉండగా ఆ తర్వాత 23 శాతానికి తగ్గిపోయింది. 1988 నుంచి మే నెల 31వ తేదిన పొగాకు వ్యతిరేక దినోత్సవం జరపాలని తీర్మానించారు.
ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాలను రకరకాల థీమ్‌లతో నిర్వహిస్తారు. 2010లో 'బ్రేక్ఫీ' అనే నినాదంతో పొగ ప్రియులను పొగ శంఖలాల నుండి బయట పడేలా ప్రోత్సహించింది. 'వదిలేసే సమయం వచ్చిందా?' అనే థీమ్‌తో 2011లో పొగతాగే వారి ముందుకు ఈ దినోత్సవం వచ్చింది. పొగాకు అలవాటు కారణంగా ప్రతి 8 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. అమెరికాలో అంతర్యుద్ధం తరువాత సిగరెట్లు వాడకం ఎక్కువగా పెరిగింది. సిగరెట్ల వ్యామోహానికి పురుషులే కాక ఈ మధ్య మహిళలు కూడా మోజు పెంచుకుంటున్నారు. ఫలితంగా గర్భస్థ శిశువుల మీద పొగాకు ప్రభావం పడుతున్నది. పుట్టుకతోనే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నది. సినిమాల ప్రభావం వలన యువత పొగాకుకు జూనిసలవుతున్నారు.
సిగార్, సిగరెట్, బీడీ, తంబారు, గుట్కా ఏ పేరుతో ఏ రూపంలో పొగాకును తీసుకున్నా శరీరానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని సినిమా ప్రారంభంలో ట్రైలర్లు వేసినా, సిగరెట్లు మీద ముద్రించినా ఫలితం మాత్రం శూన్యం. సినిమాలలో హీరోలు స్టైలుగా సిగరెట్లు, సిగార్లు తాగడం చూసిన యువకులు వాటిపై మోజు పడుతున్నారు. నగరాలలో పబ్ కల్చర్లు, వీకెండ్ పార్టీలు పెరుగుతున్నాయి. ఫలితంగా హుక్కా సెంటర్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా యువత ఏదో రిలాక్స్ అవుతున్నామనుకుంటూ పొగాకుకు బానిసలవుతున్నారు. మొదట్లో సరదాగా మొదలుపెట్టిన సిగరెట్టు వాడకం, ఆ తర్వాత మానుకోలేని అలవాటుగా మారుతున్నది. పొగాకును నోటిలో పెట్టుకుని నమలడం ద్వారా నోరు పొక్కిపోయి పుండుగా మారుతుంది. ఆ తరువాత అది క్రమంగా నోటి క్యాన్సర్‌గా మారుతుంది. నోరు, దవడ, గొంతులోని కణజాలాలన్ని వ్యాధి పరమవుతాయి. మాట్లాడలేకపోవడం, మింగలేకపోవడం వంటి లక్షణాలలో క్యాన్సర్ పెరిగి పెద్దదవుతుంది.
సిగరెట్ పొగలో నికోటిన్ మాత్రమే కాకుండా నాలుగువేల రసాయనాలు ఉంటాయి. వీటిలో పందొమ్మిది రకాలు క్యాన్సర్ కారకాలు. సరదాగా మొదలు పెట్టిన ధూమపానం మానలేని వ్యసనంగా మార్చే శక్తి నికోటిన్‌కు ఉంది. ఈ వాస్తవాలను ప్రజల్లో వ్యాప్తి చేసిన తరువాత ధూమపాన శాతం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భారత దేశంలో దూమ పానీయుల సంఖ్య పదకొండు కోట్లు ఉండగా గుట్కా, పాన్ మసాలా వాడకం దారులకు అంతే లేకుండా ఉన్నది. పొగాకు వలన క్యాన్సర్లు, గుండె జబ్బులలో పాటుగా మధుమేహం, కీళ్ళవాతం, అంధత్యం వంటి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల వలన సంతానలేమి కూడా సంభవిస్తుందని తేలుతున్నది.
పొగ తాగే వారు మాత్రమే కాకుండా పోగ పేల్చేవారికీ ప్రమాదం సంభవిస్తున్నది. పొగ పీల్చేవారిలో సైతం 30శాతం నోటి క్యాన్సర్లు వస్తున్నాయి. దీని వలననే బహిరంగ ప్రదేశాలలో పొగతాగడం నిషేధమయింది. 2004లో కేంద్ర ప్రభుత్వం దీనిని చట్టంగా తీసుకు వచ్చింది. స్కూళ్ళ వద్ద నుంచి పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని కూడా నిషేధం విధించింది. అయినప్పటికీ ఈ చట్టాలు అమలవుతున్నట్లు కనిపించడం లేదు.
పొగాకు పంటను తగ్గించడం, సిగరెట్ల రేట్లను పెంచడం ద్వారా పొగరాయుళ్ళ సంఖ్యను తగ్గించాలని కొన్ని దేశాలు భావించాయి. పన్నుల రాబడిని పట్టించుకోనందువల్ల కెనడా మెక్సికో, ఐస్లాండ్ దేశాల్లో 60 శాతం వినియోగం తగ్గింది. పొగాకు వినియోగం, ఉత్పత్తుల్ని నిషేధించిన తొలి దేశంగా భూటాన్ చరిత్ర సష్టించింది. ఆరు కోట్ల మంది వ్యాపారులు, 60 లక్షల మంది పొగాకు రైతులు ఉన్నారు. వీరిని ప్రత్యామ్నాయ పంటల వ్యాపారాల దిశగా మళ్ళిస్తే నిషేధం అమలవుతుంది. పొగాకు ప్రమాదాల గురించి పాఠ్య పుస్తకాల ద్వారా బోధించాలి. తల్లిదండ్రులు జాగ్రత్త పడితే పిల్లలు దీని బారిన పడుకుండా కాపాడవచ్చు.
- డా. కందేపి రాణి పసాద్