Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం, గ్రామం చారిత్రకమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రామ నామాల పరిశోధన, అన్వేషణ కోసం క్షేత్ర పర్యటనలో భాగంగా చారిత్రక స్థలాలను ఇటీవల పరిశీలించాం.
ఈ సంస్థానం చుట్టూ పురాతనమైన పెద్ద గోడలున్నవి. గోడ కింది భాగంలో కందకం తీయబడి అద్భుతంగా ఉంటుంది. ఈ కోట గోడల చుట్టూ నాలుగు ముఖ ద్వారాలు ఉన్నవి. గిర్ బంగ్లా, రాజ్ మహల్, స్నానాల బావి, ఊరికి తూర్పు దిశగానున్న గుట్ట మీద రెండు బురుజులు ఉన్నవి. ఈ బురుజులలో సైనికులు కాపలా కాస్తూ శత్రువుల కదలికలను పసిగట్టే వారట. ఫలక్నుమా ప్యాలస్ శిథిలమై ఉన్నది. ఊరికి ఉత్తరాన ఉన్న ఉమామహేశ్వర ఆలయం, దక్షిణంగా రెండు వందల మీటర్ల దూరంలో ప్రాచీన శివాలయం ఉన్నవి. ఇక్కడి శిల్ప కళా నైపుణ్యం చూస్తే 14 వ శతాబ్దికి చెందిన కాకతీయ రాజుల పరిపాలనా కాలం అయి ఉండవచ్చునని తెలుస్తుంది.
ఇక్కడి పురాతన కట్టడాలు రాజపేట సంస్థానంలోని కోట గోడల నిర్మాణ శైలి ఒకే విధంగా ఉంటాయనిపిస్తుంది. ''రాజపేట సంస్థాన్ నారాయణపురానికి చెందిన రాజా రాయన్న కట్టించిన కోట వున్న పట్టణం'' అని చరిత్రకారులు శ్రీ రామోజు హరగోపాల్ రాసిన పుస్తకంలో (ఆలేటి కంపణం - చరిత్ర, పేజీ - 80) ప్రస్తావించారు. అంటే సంస్థాన్ నారాయణపురానికి రాజపేట సంస్థానానికి ఏమైనా అనుబంధం ఉండి ఉండవచ్చును.
గ్రామ నామ చరిత్ర కోసం శాసన ఆధారాలు లభించలేదు కానీ ఒకరిద్దరిని అడిగినప్పుడు నవాబుల పరిపాలనా కాలంలో మద్ది నారాయణరెడ్డి అనే దొర సామాజిక సేవా తత్పరతతో పాలించడం వల్ల ఏనుగు అంబారీ, పగటి దివిటీలు, మరణదండన విధించే అధికారాలతో సంస్థాన్ హోదా పొందినందువల్ల మండల కేంద్రాన్ని సంస్థాన్ నారాయణపురంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ కథనానికి చారిత్రక ఆధారాలు లేవు.
గతమంతా ఘన కీర్తిని సొంతం చేసుకున్న ఈ కోట మరింత వద్ధిలోకి రావాలని కోరుకుందాం.
- డాక్టర్ మండల స్వామి,
9177607603