Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగులూరు గ్రామం పురాతన చారిత్రకప్రదేశం. కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, మఠం వినోద్ కుమార్, శ్రీరామోజు హరగోపాల్ గొంగులూరులో మట్టిదిబ్బ నుంచి తవ్వితీసిన మహా దేవాలయాన్ని దర్శించారు. వరంగల్లు కోటలో ఎల్పీగండి (లంజపాతర గండి)లో కాకతీయ దేవాలయాలను మట్టి దిబ్బల కింద దాచినట్లే గొంగులూరులో కూడా మహా దేవాలయం మట్టిదిబ్బ కింద రక్షించబడ్డది. కొంతకాలం కిందటనే ఈ గుడిని మట్టిదిబ్బ నుంచి బయటకు తీసామని చెప్పారు.
మహదేవాలయాన్ని చూడగానే ఆ దేవాలయవాస్తుశైలి రాష్ట్రకూట కాలానికి (9,10శ.) చెందింది అనిపించింది మాకు. సురవరం పురస్కారగ్రహీత, ప్రముఖ చరిత్ర కారులు, స్థపతి ఈమని శివనాగిరెడ్డి ఈ గుడి 'టిపికల్ రాష్ట్రకూట దేవాలయం' అన్నారు. ఈ 'దేవాలయ వాస్తుశైలి అరుదైంద'ని ఆలయ వాస్తు, ప్రతిమా లక్షణాల నిపుణుడు సుపర్ణ మహి అభిప్రాయపడ్డారు.
దేవాలయ ప్రవేశద్వారం మీద కీర్తిముఖాలతో నాలుగు కుడులు, కుడ్య స్తంభికలు గోడల మీద, 4 అంచుల ప్రస్తరం, లలాట బింబంగా గజలక్ష్మి, స్వస్తికభంగిమలో నిల్చున్న చతుర్భుజులైన శైవ ద్వారపాలకులున్నారు. దేవాలయం మీద ఎత్తైన విమానాలు లేవు. కేవలం రెండువైపుల జాలకాలు (కిటికీలు) తప్ప దేవాలయ పాదవర్గం మీద(గోడల మీద) ఎటువంటి శిల్పాలు లేవు,. దేవాలయానికి అంతరాళం లేదు, గర్భగుడి ఒకటే. అందులో క్షితిజ సమాంతరంగా చతురస్రాకారపు పానవట్టంలో బాణలింగం ప్రతిష్టించబడివుంది. మంటపం 3వైపుల మూసివుంది. గర్భగుడి ముందర నంది వుంది. మంటపంలో స్తంభాలు పూర్వ చాళుక్యశైలికి చెందినవి. స్తంభాల పైన ఉండే పోదికలు లేవు.
క్షేత్రపరిశీలన : మఠం వినోద్ కుమార్, వేముగంటి మురళీకష్ణ, శ్రీరామోజు హరగోపాల్, కొత్తతెలంగాణ చరిత్రబృందం
పరిశోధక వ్యాఖ్య : శ్రీరామోజు హరగోపాల్,
కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబందం