Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె సంఘసేవకు చిరునామా. ప్రజా చైతన్యానికి ప్రతీక. స్త్రీల అభ్యున్నతికై పాటుపడి పత్రికలలో వ్యాసాలు రచించింది. వక్ర మార్గంలో వెళ్తున్న సమాజాన్ని సక్రమంగా ఉంచేందుకు కథలను రచించింది. సామాజిక సమస్యలను కథా వస్తువులుగా గ్రహించి అందంగా, హద్యంగా తీర్చి దిద్దిన ఆ ఉపాధ్యాయురాలే సీతాకుమారి. సామాజిక సంస్కరణలో, స్వాతంత్య్ర సమరంలో వీరిని తెలంగాణ అనిబిసెంట్గా భావించవచ్చు.
జననం, బాల్యం
ఈమె పుట్టుక మూలాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని బాపట్ల పట్టణంలో జనవరి ఒకటి 1911లో జన్మించింది. సికింద్రాబాదులోని కీస్ బాలికా విద్యాలయంలో చదువుకుంది. ఆ పిదప విద్వాన్ పరీక్ష రాసింది. ఉత్తీర్ణత కావడంతో తెలుగు పండితురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించింది.
జాతీయోద్యమం
1926లో తన భర్తతో పాటు హైదరాబాదుకు వచ్చిన సీతాకుమారి జాతీయో ద్యమం గురించి తెలుసుకున్నది. రాష్ట్రంలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను విన్నది. చూసింది. ఈ అవగాహనతో ప్రభావితమై జాతీయోద్యమంలో పాల్గొన్నది. అందులో భాగంగా స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఖాదీ వస్త్రాల అమ్మకం చేపట్టింది. ఖాదీ గురించి ప్రచారం చేసింది. నిజామాంధ్ర మహాసభలు జరిగిన ప్రతీ సభలో మహిళల పక్షాన వాళ్ళ సమస్యల పరిష్కారాల కోసం ఈ సభలతో పాటే మహిళా సభ కూడా జరిగేది. అలా 1934లో ఖమ్మంలో జరిగిన ఆంధ్రమహాసభ మహిళా సభకు అధ్యక్షత వహించింది. 1943లో హైదరాబాదులో జరిగిన పదవ ఆంధ్ర మహిళా సభకు కూడా అధ్యక్షత వహించింది. ఈ మహాసభల తర్వాత స్టేటు కాంగ్రెసులో చేరింది. ఈవిడ పుట్టింది ఆంధ్ర ప్రాంతమైనా పరిస్థితుల ప్రభావాల దష్ట్యా హైదరాబాదు పట్టణంలో స్థిరపడి ఇక్కడి ప్రజల గురించి, ఇక్కడి స్వాతంత్రత గురించి ఆలోచింది. హైదరాబాదు సంఘసంస్కరణకు తన వంతుగా కషిచేస్తూ నిత్యం ప్రజా కార్యక్రమా లలో పాల్గొన్నది. హైదరాబాదులో 'ఆంధ్ర యువతి మండలి' స్థాపనలో ముఖ్యురాలు. నిజాం రాష్ట్రంలో అక్కిరెడ్డిపల్లి గ్రామంలో జరి గిన అమానుష కాండపై విచారణ చేసేందుకు నియమించబడిన సంఘంలో ఈవిడ సభ్యురాలు.
సాహిత్యం
సీతాకుమారి ప్రజా ఉద్యమాలలో పాల్గొనడమే కాకుండా సాహిత్యం కూడా రచించింది. ప్రజాసమస్యలపై స్పందిస్తూ తన ధోరణిలో వాటి పరిష్కారానికి అనేక వ్యాసాలను గోల్కొండ పత్రికలో రాసింది. ''ఉజ్జ్వల నారి' అనే పేరుతో ఖండికలు రాసింది. ''కోడి కుంపటి, కొత్త బడి'' అనే నాటికలు, మంచు కొండల్లో మహాసభ, నేనూ-మా బాపూ రచనలు,1968 లో వెలువడిన ''మందారమాల'' అనే వ్యాస పుస్తకం వంటి వాటిని రచించింది. ఈమె కథానికలు కూడా రాసింది అవి: 'పునిస్త్రీ పునర్వివాహం' ఇది 1937 లో ఆంధ్ర పత్రికలో, 'ఈ రాధేనా' కథ 1938 లో భారతి పత్రికలో, 'ఆ వీణ' కథ 1940 లో ఆంధ్రకేసరి పత్రికలో ప్రచురితమయ్యాయి. కథలే కాకుండా రేడియో ప్రసంగాలు కూడా రాసింది. 'ఉత్తరాలు' పేరుతో రాసిన రచన ఒకటి గహలక్ష్మి పత్రికలో ప్రచురితమైంది. 'కులమా! ప్రేమా! అనే కథను 1933 లో ఆంధ్రపత్రికలో ప్రచురించింది. 'భారత స్త్రీ సంపూర్ణ స్వేచ్ఛ' అనే వ్యాసాన్ని 1936 జూలై నాటి గహలక్ష్మి పత్రికలో, 'భార్యలకు జీతాలా? ఇచ్చేవారు భర్తలా? అనే వ్యాసాన్ని 1937 లో ఫిబ్రవరి నాటి గహలక్ష్మిలో ప్రచురించింది.
రాజకీయం
స్వాతంత్య్రానంతరం 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్‌లోని బాన్సువాడ నియోజక వర్గం నుంచి ఏకగ్రీవంగా అసెంబ్లీకి ఎన్నికైంది.
తెలంగాణలో పుట్టకపోయినా హైదరాబాదుకు వచ్చి ఉద్యోగ రీత్యా స్థిరపడి సాంస్కతిక ఉద్యమాలలో పాల్గొని పేరు గడించిన సీతాకుమారి 1986 జనవరి 2న కాలం చేసింది.
- ఘనపురం సుదర్శన్,
9000470542