Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథా రచయిత, శ్రీ కూర చిదంబరం మూడవ కథా సంకలనం నీటినీడలో, 26 కథానికలు ఉన్నాయి. సమాజంలో మన మధ్య తిరుగతూ ఉండే జీవితాలలోకి చూసి, కన్నవీ, విన్నవీ, అనుభూతీకరించి కథా వస్తు ఇతివృత్తాలుగా స్వీకరించి వాస్తవ చిత్రాలను కథలుగా రాయటంలో చిదంబరం ప్రతిభావంతమైన రచయితగా గుర్తింపు సాధించారు. కవిగా, కథకునిగా, సమీక్షకునిగా, పత్రికా సంపాదక వర్గ ప్రముఖునిగా చిదంబరం తెలుగు సాహితీ రంగంలో అభినందనీయమైన ఆదరణ పొందుతున్నారు. ఈ సంపుటిలో ప్రతి కథలో సామాజిక ప్రయోజనంతో అంతర్లీన సందేశంతో రచయిత చదువరులను పలకరిస్తారు. ఆలోచింపచేస్తారు. మానవత, పరోపకారం, సహృదయం వున్న మనుషులుగా జీవించాలని రచయిత కథారూపంలో అభిలషిస్తూ, అటువంటి వ్యక్తుల హృదయ చిత్రాలతో, చదువరులను ప్రభావితం చేస్తారు. వాయసన్యాసం, దాలిగుంత, కాకిబంగారం, మరీచిహ వంటి శీర్షికలతో కథలు రాయడంలో చిదంబరం విశేష ప్రజ్ఞ వ్యక్తమవుతోంది. 'పోరాటపు బ్రతుకు' తొలి కథలో సాహసికంగా పోరాడటం బ్రతుకును సజీవం చేస్తుందని, ఆఖరి కథ 'రేపటి వెలుగు' వైపు పడే అడుగులు ఆశావహ దృక్పథాన్ని వ్యక్తీకరిస్తున్నాయి. గంజిని లవణామృతంగా, చిట్టితల్లి ఆకలి తీర్చే అమ్మ ఆర్తికి ప్రతీకగా చిత్రీకరించారు. నీటినీడ కథా సంపుటి శీర్షిక కథలో రచయిత అద్భుతమైన ఊహా కాల్పనికత ప్రదర్శింపజేసారు. శ్రీరాముడు అద్దంలో చందమామ చూస్తే, పాపకి నీళ్ళ గోళెంలో చందమామని చూపించడం, చందమామ లేకపోతే వెన్నెల వెలుగు కోల్పోయే అద్భుత ఊహా కల్పనా వైచిత్రి, చదువరులను ఆశ్చర్యపరుస్తుంది. అత్యంత తేలికైన ఇతివృత్తంతో, కథను ప్రగాఢ నిర్మాణ భావ నైపుణ్యంతో ప్రతిభా వంతంగా కథా రచన చేయగల చిదంబరం, పాఠకుల హృదయాలలో చిరంతనంగా నిలిచే కథా రచయితగా గుర్తింపు పొందటం అభినందనీయం.
(నీటినీడ (కథా సంకలనం), రచయిత : శ్రీకూర చిదంబరం, వెల : రూ.150/-, ప్రతులకు : సౌమిత్రి ప్రచురణలు, 6 - 1- 118/19, పద్మారావు నగర్, సికింద్రాబాద్ - 500025)
- జయసూర్య