Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్లు స్వరాజ్యం... ఈవిడను తెలంగాణ ఉక్కు మహిళాగా అభివర్ణించవచ్చు. స్వాతంత్య్ర సమరంలో దూకడానికి పురుషులు సైతం ఒకానొక సమయంలో వెనకడుగు వేసిన పరిస్థితి అది. కాని ఒక సాధారణ స్త్రీ అయి ఉండి కరుడుగట్టిన నిజాం సైనికులకు, పోలీసులకు దొరకకుండా అడవినే ఆవాసంగా మలుచుకొని ఉద్యమం చేసిన స్త్రీ శక్తి మల్లు స్వరాజ్యం.
అవకాశం దొరికినప్పుడు అదే పోలీసులకు ఎదురుపడి తన ఉద్యమ ఆవేశాన్ని చూపించింది. అటువంటి ధీర వనిత అయిన మల్లు స్వరాజ్యం నల్గొండ జిల్లా సూర్యాపేట తాలుకా కొత్తగూడెంలో 1931లో జన్మించింది. వీరిది భూస్వామ్య కుటుంబం. ఆ రోజుల్లో బడులు కరువు కావడంతో తమ ఇంటి వద్దకే టీచర్ ని రప్పించి వీరికి చదువు చెప్పించారు.
స్వాతంత్య్రోద్యమం
మల్లు స్వరాజ్యం తెలంగాణ స్వరాజ్య సాధన కోసం పుట్టిన మరో ఝాన్సీ లక్ష్మీభాయి. భీకర సమయంలో కూడా నడుముకు కొంగు చుట్టి చేతిలో తుపాకి పట్టి అడవి వెంట అన్నల బాటలో నడిచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. నాటి కాలంలో స్త్రీలకు మానసిక పరమైన క్లాసులు జరిగేవి. వీటిని కొమర్రాజు అచ్చమాంబ 'ఆత్మరక్షణ శిక్షణ తరగతుల' పేరుతో బెజవాడలో నిర్వహించేది. ఈ శిక్షణా తరగతులకు తెలంగాణ స్త్రీలు కూడా వెళ్లి నైతిక ఆత్మస్థైర్యం పొందే వారు. ఇలా వెళ్ళిన వారిలో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి వారున్నారు. అయితే స్వరాజ్యం ఈ శిక్షణా తరగతుల కోసమని బెజవాడ వెళ్లి వాటిని శ్రద్ధగా విని, అటు నుంచి కోస్తా జిల్లాలను సందర్శించింది. ఆ తర్వాత అక్కడి నుండి మద్రాసు వెళ్లి స్వాతంత్య్రోద్య మాన్ని ప్రచారం చేసింది. ఆ ప్రచారంలో ఆమె ప్రసంగంలో ఎటువంటి తోట్రుపాటు లేకుండా మాట్లాడుతుంటే తమిళ ప్రజలు చూసి నివ్వేరపోయేవారట. ఈ స్వాతంత్య్ర ప్రచారం చేపట్టే నాటికి తనకి పదహారు సంవత్సరాలు మాత్రమే.
మద్రాసు ప్రచారం ముగిశాక తెలంగాణ చేరుకుంది. అప్పటికే వెట్టి చేయలేక మైదాన ప్రజల, గిరిజన ప్రజల వంగిపోయిన నడుముల దశ్యాన్ని చూసి స్వరాజ్యం బాధపడ్డది. దీంతో వీరి బాధను చూడలేక వారందరినీ సమీకరించి తన మాటలతో ప్రభావితం చేయనారంభించింది.
తెలంగాణ స్వరాజ్యాన్ని సాధించాక కూడా కొన్నేళ్ళు అరణ్య ఉద్యమం కొనసాగించింది. కారణం సైనిక, పౌర ప్రభుత్వాలు పేద ప్రజలకు తిరిగి ఇస్తామన్న భూమిని ఇవ్వలేక పైగా జమీందారులకు రక్షణ కల్పించడంతో కమ్యూనిస్టు ఉద్యమకారులు అడవిలో ఉంటూ స్వాతంత్య్ర భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించారు. ఈ పోరాటంలో మల్లుస్వరాజ్యం కూడా ఉండి 1953లో తన అజ్ఞాత పోరాటాన్ని ఆపివేసింది.
సాహిత్యం
స్వరాజ్యం తను చూసిన అమానుష సంఘటనలకు చలించి పోయి ప్రజలను స్వాతంత్య్రోద్యమానికి సమాయత్తం చేయటానికి పాటనే ప్రధాన సాధనమని విశ్వసించింది. దాంతో ప్రజల కష్టాలను తన పాటలో ఇమిడ్చి 'యేలపాట' పేరుతో రచించింది. ఆమె స్వయంగా గాయని కావడంతో తనే పాడి వినిపించేది. గ్రామాలలో రాత్రిళ్ళు తిరిగి ప్రజల భాషలోనే దొరల, దేశ్ముఖ్ల దౌర్జన్యాలను 'ఉయ్యాల పాటల' రూపంలో పాడి జానపదులను చైతన్యం చేసేది. ఈ క్రమంలో తన అన్న, చెల్లితో కలిసి కొండల్లో, గుట్టల్లో ఉంటూ రహస్య ఉద్యమాన్ని చేపట్టింది. ఈమె తన పోరాట అనుభవాలను, ఆనాటి జ్ఞాపకాలను తన ''నా మాటే తుపాకి తూటా'' (2019) అన్న ఆత్మకథలో పేర్కొన్నది.
రాజకీయ సేవ
సాయుధపోరాటం ముగిశాక ఆమె కమ్యూనిస్టు పార్టీ సూర్యాపేట ఉపాధ్యక్షురాలిగా ఉండి, మానసిక ఆనందం కోసం, స్వయం ప్రతిపత్తి కోసం వ్యవ సాయం చేసింది. ఈమె రాజకీయా నికి దూరంగా ఉన్నా, పార్టీ పిలిచి మరీ తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆరు వేల మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత కూడా పలుమార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైంది. పోరాట తత్త్వాన్ని నమ్మి పేదల సంక్షేమ జీవనమే తన ప్రధాన కర్తవ్యమని భావించి చట్ట సభలలో పేదల పక్షాన వాదించేది. నిరంతరం బడుగు జీవితాల గురించి ఆలోచించి వారి ఉన్నతిని కాంక్షించేది.
నిజాం కాలంలో తీవ్రమైన ప్రాణ భయానక స్థితిలో ఉండి తెలంగాణ విముక్తియే ధ్యేయంగా అడవి బాట పట్టి ఉద్యమ జెండా ఎగురవేసి స్వాతంత్య్రాన్ని సాధించిన ఈ ధీరురాలు మార్చి 19, 2022 న కన్ను మూసింది.
- ఘనపురం సుదర్శన్, 9000470542