Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాభారతంలోని విరాటపర్వం ప్రకారం నకులుడు గోవులను మేపిన నేల... త్రికూటాలయం, వైష్ణవాలయం, సూర్య, బ్రహ్మ దేవాలయాలు నిత్యం పూజలందిన దైవ నేల... పిండారీలను వీరోచితంగా ఎదుర్కొన్న ధీర నేల... ఆచార్య వినోబభావే ప్రారంభించిన భూదానోద్యమంను స్వాగతించిన ఉదార నేల... తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో చైతన్యాన్ని ప్రదర్శించిన నేల... అదే మన పిల్లలమర్రి. ఈ నేలలో వెలసిన మరో విజ్ఞాన మందిరం అదే బేతిరెడ్డి గ్రంథాలయం.
క్రీ.శ. 1920 ప్రాంతంలో నాటి గ్రామ పోలీస్ పటేల్, ఆయుర్వేద వైద్యులు, కవి, రచయిత, సాహిత్య కారుడైన గవ్వా పిచ్చిరెడ్డి పిల్లలమర్రిలో ఉన్న యువకుల, మధ్యతరగతి మేధావుల సహాయ సహకారాలతో బేతిరెడ్డి గ్రంథాలయంను ఏర్పాటు చేశారు.
ఈ గ్రంథాలయానికి బేతి రెడ్డి గ్రంధాలయం అని నామకరణం చేయడానికి ప్రధాన కారణం రెండవ ప్రోలరాజు కాకతీయ రాజ్యం పరిపాలించిన సందర్భంలో వారి దగ్గర కామిరెడ్డి సైన్యాధిపతిగా ఉండేవారు. ఈ కామిరెడ్డికి కాట్ రెడ్డి బేతిరెడ్డి, నామిరెడ్డి అనే పుత్రులుండేవారు. బేతిరెడ్డి కాకతీయ రుద్రదేవునికి సమకాలికుడు. మంచి సాహసవంతుడుగా, ధైర్యవంతునిగా పేరు తెచ్చుకున్నారు. ఇతనిని 'పిల్లలమర్రి బేతి రెడ్డి' అని కూడా అంటారు. వారి భార్య ఎరుక సానమ్మ వేయించిన శాసనం ప్రకారం పిల్లలమర్రి గ్రామాన్ని బేతిరెడ్డి నిర్మించారని చెప్పారు. 1162 కాలంలో హనుమకొండలో వేయి స్తంభాల గుడి కట్టిన సందర్భంలోనే యథా రాజా తథా ప్రజా అన్నట్లు సైన్యాధిపతి ఉన్న బేతిరెడ్డి కూడా త్రిమూర్తుల ఆలయాలు కట్టించారు. అనేక సాంఘిక కార్యక్రమాలు చేపట్టి ప్రజా రంజకంగా పరిపాలించడం వల్ల ఆ గ్రంథాలయానికి బేతి రెడ్డి గ్రంథాలయం అని నామకరణం చేశారు.
ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అప్పటికే ఈ జిల్లాలో సూర్యాపేట ప్రాంతంలో విజ్ఞాన ప్రకాశిని, నల్లగొండలో మహబూబియా రీడింగ్ రూమ్, ఆంధ్ర సరస్వతి నిలయం గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వలన పిల్లలమర్రి ప్రాంత ప్రజలు ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి మేధావులు ఉత్తేజితులై ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
గవ్వా పిచ్చి రెడ్డికి కష్ణారెడ్డి, రాంరెడ్డి, అమతరెడ్డి జానకి రామ్ రెడ్డి, మురహరి రెడ్డి అనే ఏడుగురు కుమారులు ండేవారు. తొలుత ఈ గ్రంథాలయం 50 పుస్తకాలతో ఏర్పాటు చేశారు.
ఈ గ్రంథాలయంలో నాడు గవ్వా పిచ్చిరెడ్డి కవి కౌశిక యాగము సంరక్షణము అనే యక్షగాన పుస్తకాలు, జానకి రామ్ రెడ్డి రచించిన దేశబంధు, దాస కల్పద్రుమం, సుధాకరుడు, దైవచింతన పుస్తకాలు, మురహరి రెడ్డి రచించిన కళ్యాణి అల్లుళ్ళ సంత, హాలికుడు, గుంటుక పురాణం పుస్తకాలు, అమత రెడ్డి అమత గీతములు అనే పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉండేవి. వీటితో పాటు ఆనాడు అత్యధికంగా గరుడ పురాణం, పురాణాలు, భాగవతం, రామాయణం, భగవద్గీత, పురాతన తెలుగు సాహిత్యం, నిఘంటువులు, కొన్ని వేదాలు, తులసి రామాయణం వంటి పురాణ ఇతిహాసాలు అందుబాటులో ఉన్నాయి. 1943 నాటికి ఈ గ్రంథాలయంలో దాదాపు 9వేలు అందుబాటులో ఉండేవి. వీటితో పాటు గోల్కొండ, ఆంధ్ర పత్రిక, ఒక ఉర్దూ పత్రిక కూడా వచ్చేవి
1920 నుండి 1943 వరకు ఈ గ్రంథాలయం ఆ ప్రాంత ప్రజలకు అక్షరాస్యతను, సాంఘిక చైతన్యాన్ని నింపింది. నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను కార్యోన్ముఖులను చేసింది. తర్వాత కొన్ని ఆర్థిక కారణాల వల్ల, అనివార్య కారణాల వలన గ్రంథాలయ నిర్వహణ సరిగా జరగలేదు. తరువాత ఇదే ప్రాంతంలో శ్రీ ఉమ్మెత్తల అప్పారావు ''వివేక వికాసిని'' అనే గ్రంథాలjను స్థాపించారు. ఆ తరువాత ఈ గ్రంథాలయం ఆధ్వర్యాన సాయంత్రం పూట అనేక సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. అదే విధంగా హరికథలు, బుర్రకథలు నిర్వహించి ప్రజలకు స్వాతంత్య్రోద్యమం భావనను కాంక్షను రగిలించేవారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో టేకుమట్ల దగ్గర ఏర్పాటు చేసిన క్యాంపులకు, ఆ క్యాంప్‌లలో ఉన్న చదవడం, రాయడం వచ్చిన వారికి ఈ గ్రంథాలయం నుంచి పుస్తకాలు తీసుకెళ్లి చదివిన తర్వాత తిరిగి ఇచ్చేవారు.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత చూపిన తెగువ అనిర్వచనీయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో చదువురాని వారికి సాయంత్రం పూట పత్రికలు చదివి వినిపించే వారు. అంతేకాకుండా రేడియోలో వచ్చే ఇటువంటి వార్తలను కూడా వినిపించేవారట. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు చందాలు వేసుకుని పుస్తకాలు సేకరించేవారు, పుస్తకాలు కొనుగోలు చేసేవారు.
నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి 1952లో పిల్లలమర్రి గ్రామానికి వచ్చిపుడు రెడ్డి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. 1956లో విశాలాంధ్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పిల్లలమర్రి గ్రామానికి వచ్చినపుడు ఈ గ్రంథాలయాన్ని కూడా సందర్శించారట. తరువాత ఉమ్మెత్తల సీతారామారావు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఈ గ్రంథాలయ అభివద్ధికి ఉన్నతికి ఎనలేని సేవలందించారు. వారి తర్వాత ఉమ్మెత్తల శ్రీనివాసరావు, ఉమ్మెత్తల కిషన్‌రావు, ఉమ్మెత్తల కేశవరావు గ్రంథాలయ అభివద్ధికి కషి చేశారు.
రానురాను ఈ గ్రంథాలయంకు వచ్చే చదువరుల సంఖ్య పెరగడంతో గ్రంథాలయానికి పక్కా నిర్మాణం చేయాలని ప్రయత్నం చేశారు. ఈ గ్రంథాలయ భవనానికి స్థలాన్ని చిల్లంచర్ల మూర్తి, తుంగతుర్తి వెంకట రామారావు, ఉమ్మెత్త చక్రయ్యలు దానం చేశారు. చందాలు వసూలు చేసి అనంతుల మల్లారెడ్డి, జానకిరామ్, రామానుజరావు, బాలయ్య సౌడు మిద్దెతో భవనాన్ని నిర్మించారు. చదువరుల సంఖ్య పెరగడం, మౌలిక వసతుల కల్పన లేకపోవడం, ఆర్థిక వనరుల లేమి, గ్రంథాలయ నిర్వహణ కష్టం అవుతున్న సందర్భంలో 1978లో ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నది. 1990 ప్రాంతంలో జవహర్ రోజుగారి నిధుల నుండి ఈ గ్రంథాలయానికి పక్కా భవనంను నిర్మించారు.
నాడు ఈ గ్రంథాలయంలో వివిధ దేశాల చరిత్రల, రాజకీయ, ఆర్థిక, చారిత్రక, అంశాలకు సంబంధించిన పుస్తకాలు, తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, కథలు, నవలలు, వివిధ భాషల నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు, చందమామ, బాలమిత్ర, విక్రమార్క విజయం వంటి పుస్తకాలు దాదాపు 7000 అందుబాటులో ఉన్నాయి.
ఐదు తెలుగు దినపత్రికలు, రెండు వారపత్రికలు ,నాలుగు మాస పత్రికలు ,ఒక ఆంగ్ల పత్రిక, ఒక ఉర్దూ పత్రిక అందుబాటులో ఉండేవి. నాడు చదువరులను ఆకర్షించేందుకు అనేక సాహిత్య కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, చర్చలు గ్రంథాలయ పక్షంన నిర్వహించేవారు.
ప్రభుత్వాధీనంలో ఈ గ్రంథాలయం అనుకున్నంత స్థాయిలో సేవలు అందించలేకపోయింది. కారణం నేటి చదువరుల అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు లేకపోవడం, పత్రికలు లేకపోవడం మౌలిక వసతులు అనుకున్నంత స్థాయిలో అందుబాటులో లేకుండడం మొదలగు కారణాలు. అయినా నిత్యం పగటిపూట ఈ గ్రంథాలయానికి పదుల సంఖ్యలో చదువరులు వచ్చేసేవారు. సాయంత్రం పూట 50 మందికి తగ్గకుండా చదువరులు వచ్చేవారు.
2011 - 12 లో గ్రంథాలయానికి పునర్ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో సూర్యాపేటలో ఉన్న గ్రంధాలయం నుండి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి నెల రోజుల పాటు ఈ గ్రంథాలయంలో ఉంచి చదువరులు చదివిన తర్వాత మళ్లీ సూర్యాపేట గ్రంధాలయానికి తిరిగి ఇస్తున్నారు.
ఒకనాడు ముఖ్యమంత్రులు దేశ ప్రథమ పౌరులు, స్వాతంత్ర ఉద్యమ కారులు, గాంధేయవాదులు సందర్శించిన గ్రంథాలయం అనేక మందికి విద్యాబుద్ధులు, విజ్ఞానం నేర్పి చైతన్యవంతం చేసిన ఈ వటవక్షం తన వైభవాన్ని కోల్పోయింది.
ఇలాంటి చారిత్రక వారసత్వ సంపద కలిగిన గ్రంథాలయాను గుర్తించి వాటికి పునరుత్తేజం కల్పించి వాటిని పరిశోధన కేంద్రంగా చేయాలి. నేటి విద్యార్థులు, యువకులు, చదువరులకు అవసరమయ్యే పుస్తకాలను, శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి చదువరులకు సేవలందించే ప్రయత్నం చేసి మన ఘన చరిత్రను భవిష్యత్ తరాలకు అందజేయాలి.
పుస్తకం వర్ధిల్లాలి..!! గ్రంధాలయాల వెలుగొందాలి..!!
- డా|| రవి కుమార్ చేగొని, 9866928327