Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు బడికి పోకుండా గనుల్లో, పొలాల్లో, బట్టిల్లో, ఫ్యాక్టరీల్లో పనులు చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ చట్టం అమలులోకి వచ్చింది. బాలలు మన జాతీయ సంపద. వారు స్కూలుకు వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో పలుగు, పారలు చేతబట్టి పనుల్లోకి వెళ్ళటం వలన అభివద్ధి ఆగిపోతుంది. వారు బడులకు పోకపోవటం వలన సమాజంలో ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే విచక్షణా జ్ఞానం కొరవడుతుంది. ఫలితంగా వారు పెద్దవారయ్యాక మంచి నాయకుణ్ణి ఎన్నుకోలేకపోవడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటుంది. అందుకు నిర్బంధ విద్యను అమల్లోకి తెచ్చారు. దీని వల్ల దేశ అభివృద్ధికి బాటలు వేయవచ్చు. అందుకే బాలలు కార్మికులుగా ఉండకూడదనే ఉద్దేశంతో ఏర్పాటైందే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 12ను ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యల పట్ల అవగాహన ప్రజల్లో కల్పించటానికి అంతర్జాతీయ దినోత్సవాలను ఏర్పాటు చేసారు. ఐక్యరాజ్యసమితి ఏటా ఈ దినోత్సవాలు జరుపుకునే రోజును నిర్ణయిస్తుంది. సమస్యలను పరిష్కరించుకోవడానికి, కావలసిన వనరులను సమకూర్చుకోవడానికి, తద్వారా బలోపేతం చేసుకోవడానికి ఈ అంతర్జాతీయ దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఒకే సమస్య పలు దేశాలలో ఏ విధంగా ఆవిష్కతమవుతోందో దానికి వారు ఆచరిస్తున్న మార్గాలేమిటో కూడా చర్చల్లో తెలుస్తాయి. ఈ విధమైన అంతర్జాతీయ దినోత్సవాల ఏర్పాటు ఐక్యరాజ్యసమితి పుట్టక పూర్వం కూడా ఉంది. కానీ ఐక్యరాజ్యసమితి వలన అవి బలోపేతంగా నిర్వహిస్తున్నారు. పరిష్కార సాధన దిశగా వ్యక్తులు, దేశాలు మళ్ళేటట్లుగా అంతర్జాతీయ దినోత్సవాలు తోడ్పడుతున్నాయి.
బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా సమాజంలోని ప్రజలకు ఆ సమస్య లోటుపాట్లు వివరించడానికి, అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాలు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ఐక్య రాజ్య సమితి ప్రత్యేక విభాగము. 2002 నుంచి బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం ప్రారంభమయింది. ప్రపంచంలో ఉన్న బాల కార్మికులందర్ని గుర్తించాలనేది ఈ సంస్థ ముఖ్యోద్దేశ్యం. అలా గుర్తించిన బాల కార్మికులందరికీ మౌలిక మతులు కల్పించి బడి బాట పట్టించాలని ఈ దినోత్సవ లక్ష్యం.
1986లో బాల కార్మిక నిషేధ చట్టం అమల్లోకి తెచ్చారు. 14 సంవత్సరాల లోపు బాల కార్మికులు పనుల్లోకి వెళ్ళటం నిషేధం. బాధ్యతగా వారు బడికి వెళ్ళి చదువుకోవాలి. సాధారణంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో శారీరకంగా, మానసికంగా హాని కలిగించే చోట్ల పనిచేయడం. చట్ట ప్రకారం నేరం. పారిశ్రామిక వాడల్లో పని చేయడమంటే పిల్లల శారీరక ఆరోగ్యానికి తూట్లు పొడిచినట్టే. పిల్లల శ్రమ దోపిడీని బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేకిస్తుంది. పేద కుటుంబాల పిల్లలు గహ సంబంధ పనుల కోసం, పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోతున్నారు. 19, 20వ శతాబ్దాలలో 5 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు అనేక కర్మాగారాలలోనూ, మైనింగ్ వ్యవస్థల్లోనూ పనిచేయడం వలన చర్మ సంబంధ, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల బారిన పడ్డారు.
ప్రపంచమంతటా ఈ బాల కార్మికుల సమస్య ఉన్నది. అయితే పేద దేశాలలో నలుగురు బాలల్లో ఒకరు బాల కార్మికులుగా ఉంటున్నారు. పేదరికం, పాఠశాలలు లేకపోవడం, ఎక్కువ మంది సంతానం వల్ల చిన్న పిల్లలను చూసుకోవడంలోనూ బాలలు స్కూళ్ళకు పోకుండా పనుల్లోకి పోతున్నారు. వీరిని తల్లిదండ్రులే పనుల్లో నియమిస్తారు. అక్షరాస్యత లేని సమాజాలలో బాల కార్మిక వ్యవస్థ వూళ్ళూనికోని ఉన్నది. ప్రమాదకరమైన శ్రమ దోపిడి నుండి పిల్లలను రక్షించాలి. బాల కార్మికులు తయారవడానికి గల కారణాలను పరిష్కరించడం ద్వారా, జాతీయ సమర్థ్యాలను బలోపేతం చేయడం వల్లనూ బాల కార్మికుల సంఖ్యను తక్కువ చేయవచ్చు. పిల్లల ఆరోగ్యానికి, అభివద్ధికి హాని కలిగించి, వాటిని అత్యంత మేధో విజ్ఞానానికి అవకాశం కల్పించే పాఠశాలలకు పంపడం ద్వారా బాలలకు ఆలోచనా వికాసం కలుగుతుంది. మొదటిసారిగా బాలల హక్కులపై సమావేశం జరిగినపుడు 171 దేశాలు దీనిని ఆమోదించాయి. ఆ తరువాత ఈ బాల కార్మికుల వలన జాతికి కలిగే నష్టాన్ని గుర్తించిన అనేక దేశాలు ఆ దిశగా పయనించటం మొదలుపెట్టాయి. తర్వాతి సమావేశంలో 193 దేశాలు పాల్గొన్నాయి.
ప్రపంచంలో ఎక్కువ మంది బాల కార్మికులున్న దేశాలలో భారత్ కూడా ఒకటి. మన దేశంలో దాదాపు కోటి వరకూ బాల కార్మికులు ఉండవచ్చు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు తోడుగా నడవాలి. బాలలతో పనిచేయించుకునే యజమానులతో పాటుగా, వారిని పనిలోకి పంపించే తల్లి దండ్రులక్కూడా శిక్షలుండాలి. దీని కోసం బాలలకు ఉచిత విద్య, పౌష్టికాహారం అందించినట్లైతే తల్లిదండ్రులపై భారం పడకుండా ఉంటుంది. ఫలితంగా వారిని బడులకు పంపిస్తారు. తల్లిదండ్రులకు పనులు కల్పిస్తే వారు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఈ పరిస్థితికి కారణమైన వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కషి చేస్తే బాల కార్మిక వ్యవస్థ మాయమై పోతుంది. 14 ఏండ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే జైలు శిక్ష జరిమానాలు తప్పవు. పిల్లలు స్వేచ్ఛగా పెరగడానికి సమాజంలో అందరూ సహకరించాలి.
- డా|| కందేపి రాణీప్రసాద్