Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పొటాటో ఛిప్స్ చేస్తే కానీ మా బంగారు తల్లి ముద్ద తినదు.'' అంటూ మురుస్తుంది ముత్యాలమ్మ.''బంగాళాదుంప కూర ఉంటే డజన్ పూరీ లాగిస్తాడు మా పవన్ గాడు'' అని చెప్తూ ఆనందిస్తుంది అనంతమ్మ. ''చేమదుంప వేపుడు చేస్తే మా ఇంట్లో మరేమీ చేయక్కర్లేదు వదినా!,బద్ధకించిననాడు అదే చేస్తాను. నోరెత్తకుండా తినేస్తారు.'' తన తెలివికి మురుస్తుంది మాలతి.ఇలా దుంపకూరల వివిధ రుచుల గురించీ మహిళలు పీ.హెచ్.డీలు చేసి సంసారాలను నెట్టుకొస్తుంటారు.చెప్పకూడదుకానీ పూర్వం 'నీదుంపతెగ' అని తిట్టేవారు. దుంప అంటే 'డొంకిమొద్దు' అనే అర్థం ఉంది మరి. దుంప అంటే నేలలో పెరిగే గడ్డ. మొక్కలలోని కాండం, వేరు. వీనిని మన వంట గదిలో అనేకానేక పధ్ధతుల్లో రుచి కరమైన ఆహారంగా ఉపయోగిస్తాం. ఉదా-బంగాళాదుంప, కారట్, చిలగడ, పెండలము, చేమ, బీట్రూట్, ముల్లంగి మొదలైనవి.
చిలకడ దుంప
దీనిని ఆంధ్రులు గెనుసుగడ్ద, ఎర్ర దుంప, రత్నపూరి గడ్డ అనే పేర్లతో పిలుస్తారు. దీనిలో ఎర్ర దుంపలు, తెల్ల దుంపలు కూడా ఉంటాయి. తెల్ల గెనుసు గడ్డలు రుచి తీయగా ఉంటుంది. సాధారణంగా వీటిని, పులుసు అంటే సాంబారులో ముక్కలుగా వేసి అన్నంలోకి ఆధరువుగా తింటుంటారు. ఉడికించీ బెల్లపుగడ్డతో కలిపి ఉపాహారంగా కూడా తింటుంటారు. వెల తక్కువ, రుచి ఎక్కువ, పోషకాలు అధికం. చేయడం తేలిక, లాభం మాత్రం ఎక్కువే. అసలు ఈ దుంప సప్తసముద్రాలు దాటుకుని ఎలా మన దేశానికి వచ్చిందో చిత్రమే.
సెంట్రల్ అమెరికా ఈ చిలగడదుంప పుట్టిల్లు. ఈ దుంపలు చాలా ఆరోగ్యకరమైనవి.
చిలగడదుంప బీటా -కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్‌తో పుష్కల పోషకాలు కలిగి ఉంటుంది. ఇతర దుంపల కంటే వీటిలో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏమంటే దీనిలో 'గ్లైకేమిక్ ఇండెక్స్' తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహాన్ని తగ్గిస్తుందని, ఈ మధ్య బయల్పడింది. చిలగడ దుంపలు మన శరీరంలోని అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే 'స్పోరామిన్స్'ని ఉత్పత్తిచేసే ప్రత్యేక సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయిట. చిలగడదుంపల వల్ల కలిగే ఇతర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
చిలగడ దుంపలు శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ కలిగి ఉంది. ఇది అవయవాలలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గించి, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్తం గడ్డకట్ట కుండా చేస్తుంది. తక్కువ గ్లైకమిక్స్ ఇండెక్స్‌తో ఉండటాన షుగర్ వ్యాధి ఉండేవారికి చిలగడ దుంపలు ఒక వరం లాంటివి.
మధుమేహం అంటే షుగర్ ఉన్నవారు ఇతర దుంపల బదులుగా ఈ చిలగడ దుంపలు తినడం మంచిది.
వృద్ధులకు ఉపకరించే కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్ ఉండటాన ఇవి శరీరంలో విటమిన్ ఏ ని తయారు చేయును.
కంటి చూపును మెరుగుపరుస్తుంది. మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చిలగడ దుంప గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని 'పొటాషియం' హదయ స్పందన సక్రమంగా ఉండేలా చేస్తుంది.
శరీరంలోని కండరాలు, నరాలు సరిగా పనిచేసే శక్తినిస్తుంది. దీనిలోని మెగ్నీషియం ధమనులకు, గుండె కండరాలకు శక్తినిస్తుంది. రోగనిరోధక శక్తికి కలిగిస్తుంది. దీనిలో మనశరీరానికి అవసరమైన మినరల్ ఐరన్ ఎక్కువ శాతం ఉంది. రోగనిరోధక శక్తికి సిపాయిల్లాంటివైన తెల్ల రక్తకణాల ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఎముకల గట్టిదనానికి అవసరమైన 'విటమిన్ డి' ఎక్కువగా ఉండే చిలగడ దుంపలు ఎముకల గట్టిదనాన్నీ, ఆరోగ్యాన్నీ కూడా పెంచుతాయి. చిలగడ దుంపలో విటమిన్ 'సి' ఉండటాన చలికాలంలో తినడం ఉత్తమం. జలుబు, ఫ్లూ నుండీ రక్షణ కలిగిస్తుంది.
చిలకడ దుంపతినడం వలన మంచి చర్మం, ఆరోగ్యకరమైన ఒత్తైన జుట్టు కూడా కలుగుతుంది. చర్మ స్థితి స్థాపకతను పెంచి, చర్మం ముడతలు పడకుండా సహకరిస్తుంది.
మరి ఇన్ని పోషకాలున్న చిలకడదుంపను ఉడికించి మన పూర్వులు బెల్లంతో నంచుకుని తినను పిల్లలకూ పెద్దలకూ కూడా ఇవ్వండంలోని మర్మం మనకు తెలిసే సరికి ఇంతకాలం పట్టింది.
చిలకడ దుంప పేదల ఆహారమనీ, గ్రామస్థులు తినేదనే అపోహ వదలి మనశరీర ఆరోగ్యాన్ని కాపాడుకోను మార్కెట్ కేసి నడుద్దామా! నడకా మంచిదేగా!
పెండలము
తెలుగులో దీన్ని దుక్కపెండలం, గున్నపెండలం అంటారు. తియ్యపెందల, దురదపెండలం అని రెండు రకాలు.
పెద్ద పెండలాన్ని సంస్కతంలో ''ఆలూకం''- పిండ + ఆలు అంటారు.
దుంపలు ముదురు గోధుమ రంగుతో ఉంటుంది. లోపలి భాగం తెల్లగా, కొద్దిపాటి జిగటగా ఉంటుంది.
పెండలంలో 21 శాతం పిండి పదార్థాలు, 73 శాతం నీరు ఉంటుంది. రుచికి బంగాళా దుంపలతో పోటీ పడతాయి.
ఆయుర్వేదం ప్రకారం పెండలం దుంపలు చలవ చేస్తాయి. బలవర్థకము. మూత్రము సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. కడుపులో పురుగులను చంపుతుంది. దాహం ఎక్కువ కాకుండా చూస్తుంది. పైత్యహారి. చక్కెరవ్యాధి, కుష్టు, మూత్రమువ్యాధిని తగ్గిస్తుంది. కూర దేహ పుష్టిని, బలాన్నీ ఇస్తుంది.
తమాషా ఏమిటంటే పెద్ద పెండలం తీగ కుడి వైపుకి తిరుగుతూ అల్లుకు పోతుంది, చిన్న పెండలం తీగ ఎడమ వైపుకి తిరుగుతూ అల్లుకుపోతుంది. ఈ లక్షణాన్ని పురస్కరించుకుని పెండలాలని రెండు జాతులుగా విడగొట్టి అధ్యయనం చేస్తారు. ఒకదానికి ఒకటి అడ్డు రాకుండా సాయం చేయడం అనుకోవచ్చు.
చేమదుంప
దీనిని చామదుంప అనికూడ అంటారు. దురదదుంప అని చాలా మంది తాకరు, తినరు కూడా. పూర్వం వీటిని పై తోలు ఒలవను గోతం పట్టకేసి దుద్దేవారు, ఆ తర్వాత కడిగి ఉడికించి కూరచేసి నిమ్మకాయకానీ, చింతపండు పులుసు కానీ పోసి ముద్ద కూర చేసేవారు. పులుసులోనూ వేసే వారు. నేడు చాలా మంది వేపుడు కూర రుచిగా చేసి ఇంటిల్లి పాది మెప్పు పొందుతున్నారు. వీటిలో తల్లి దుంపలని కాస్త లావుగా ఉంటాయి, వేరు దుంపలు అల్లంలా పొడవుగా ఓమోస్తరు లావులో ఉంటాయి.
చేమ దుంప ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని తీపివ్యాధి ఉన్నవారు కూడా హాయిగా తినవచ్చు. చేమ దుంప కూర లేదా పులుసు రుచికి రుచీ ఎన్నో పోషకాలతో నిండి ఉంది కూడా. దీన్లో న్యూట్రిషనల్ విలువలు అధికం. ఐతే చాలా కాలంగా దీనిలోని పోషకాల గురించి సరైన ప్రచారం, అవగాహన లేనందున ఇది అరగదనే ఒక అపప్రధ ఉంది.
సాధారణంగాఎక్కువగా ఆంధ్రులు కూర లాగా మాత్రమే చేస్తారు.దీనిలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. చేమలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్‌ను తగ్గిస్తుంది కనుక, ఇన్సులిన్ విడుదలను నియంత్రించ గలుగుతుంది. రక్తంలో లో గ్లూకోజ్‌ను కూడా నియంత్రించగలదు.
చేమదుంపలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, మ్యాంగనీజ్, కాపర్, ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని సంరక్షించను సహకరిస్తాయి. ఆరోగ్యం కాపాడను ఇవన్నీ ఉపకరిస్తాయి.
చేమదుంపలో కాపర్, ఐరన్ ఉండటాన మినరల్స్, అనీమియాతో పాటు రక్తసంబంధమైన సమస్యను నివారిస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరగను సహకరిస్తుంది.
శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఎర్ర రక్త కణాల తయారీకి తగి నంత కాపర్, ఐరన్ తగినంత లభించదు. దీనివలన తలనొప్పి, నిస్సత్తువ, ఏకాగ్రత కుదరకపోడం జరుగుతుంది. 'చేమదుంపను తగినంత తిని దీన్ని నివారించు కోవచ్చు' అని నిపుణులు చెప్తున్నారు.
చేమదుంపల్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్ ఈ కూడ లభించటాన చర్మాన్ని కాపాడే శక్తి లభిస్తుది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడను విటమిన్ ఈ విటమిన్ ఏ లు బాగా పనిచేస్తాయి. చర్మం ముడతలు, బొబ్బలు, పొక్కులు, గాయాలు త్వరగా నయమవుతాయి.
నిదానంగా అరిగి మెల్లిగా ఇన్సులిన్ విడుదలను చేయడం వలన మధు మేహ వ్యాధి ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తం లో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
శరీరం పనితీరును నియంత్రించే పొటాషియం చేమ దుంపలో తగినంతగా లభిస్తుంది. నిదానంగా జీర్ణమవుతుంది కనుక త్వరగా ఆకలి కాదు.
చేమదుంపలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. చేమదుంపలో విటమిన్ ఏ ఉండటాన కంటి ఆరోగ్యాన్ని కాపాడ్డంలో సహకరిస్తుంది.
ఇన్ని పోషకాలున్న చేమదుంప చెకచెకా చేసుకుతిందామా!
కర్ర పెండలం
దీనితో సగ్గు బియ్యం చేస్తారు. దాని తోనే మనం పండు గలకు పాయసం, సగ్గు బియ్యం ఉప్మా, గారెలు నోరూ రేలా చేసుకుని తింటాం. సగ్గుబియ్యం ఒడియాల గురించీ చెప్పక్క రలేదు. ఉత్తి రసం, లేక సాంబారుతో ఈ ఒడియాలు నంజుకుని కడుపునిండా తినేయవచ్చు, పిల్లలకు సైతం మంచి పోషకాహారం.
దీనిలో ప్రధానంగ లభించేది పిండిపదార్ధం. ప్రతి 100 గ్రాములలో: శక్తి - 544 కేలరీలు, కొలెస్టిరాల్ - చాలా తక్కువ, సాచ్యురేటెడ్ కొవ్వులు - చాలా తక్కువ, సోడియం - చాలా తక్కువ, విటమిన్ B9 - 6.1 మి.గ్రా., ఇనుము - 2.4 మి.గ్రా., కాల్సియం - 30.4 మి.గ్రా., ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ - 1.5 మి.గ్రా., ఒమేగా 6 ఫాటీయాసిడ్స్ - 3.0 మి.గ్రా., పీచు పదార్ధము - 1000 మి.గ్రా (1 గ్రాము )
ముల్లంగి
దీన్ని రాడిషు అంటాం. ఎక్కువగా పచ్చివే తింటారు. తురిమి నిమ్మ, ఉప్పు కొద్దిగ కలిపి భేక్ ఫాస్ట్ Time లో ఒక కప్పు తింటే ఎంతోమంచిది .
ఇవి పొడవుగా గెనుసుగడ్డలాగా ఉంటాయి. రంగు తెలుపు. కండ కూడా తెల్లగా ఉంటుంది. వాసన తీవ్రంగ, ఘాటుగా ఉంటుంది.
తెల్లముల్లంగేకాక నేడు ఎరుపు, గులాబీ, బూడిద-నలుపు, పసుపు రంగుల ముల్లంగి వివిధ ఆకారాల్లో లభిస్తున్నది.
ముల్లంగిలో పోషకాలు
100 గ్రాముల ముల్లంగి 16 కేలరీలను ఇస్తుంది. విటమిన్ సి , 95శాతం నీరు, 3శాతం కార్బోహైడ్రేట్లు, 1శాతం ప్రోటీను అతి తక్కువగా కొవ్వు దీనిలో ఉంటుంది. ముల్లంగి పచ్చిగానే తింటారు.
గ్లూకోసినోలేట్సు, మైరోసినేసు అనే ఎంజైములవల్ల రుచిని కలిగి ఉంటుంది. ముల్లంగిని ఎక్కువగా సలాడ్లలో, బంగాళాదుంప సూపు వంటి వంటకాల్లో ఉపయోగిస్తారు. తెల్ల ముల్లంగి తిని చల్లగా ఉందామా!
బంగాళాదుంప
ఆలుగడ్డ ,అంగ్లంలో పొటాటో, ఉర్లగడ్డ లేక ఉల్లగడ్డ అని రాయలసీమ మాండలికంలో అంటారు.
17వ శ. వరకు బంగాళదుంప గురించీ దక్షిణ అమెరికాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఈ దుంప గురించి ముందు ఐరోపా వారికి, వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. మన దేశానికి ఈ దుంప కూర ఐరోపా నుండి వచ్చింది.
బంగాళదుంపతో రుచికరమైన వంటలు, కూరలు, ఫలహారాలు, ఇంకా చాలా తినుబండారాలు చేసుకుతినవచ్చు. ఉడకబెట్టి నిమ్మ, ఉల్లి, కరివేప వేసి చేసినకూర ఉంటే వదలకుండా తింటారు. వేపుడు, కుర్మా, పూరీకూర, పులుసులో, బజ్జీలో, ఇంకా అనేకానేక తిండి, పిండి వంటలు చేసుకుని పొట్ట నింపుకోవచ్చు. బంగాళదుంప చిప్స్ నేడు ప్యాకెట్స్‌లో అమ్మడం, కాలక్షేపానికి మనం తినడం అందరికీ తెలిసిందేకదా!
పోషకాలకు వస్తే దీన్లో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానంగా ఉంటాయి. కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడులు తగ్గిస్తుంది.
ఆలుగడ్డలో చాలా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే దుంపలో 27 మిల్లీ.గ్రా. విటమిన్-సి, 620 మి.గ్రా. పొటాషియం, 0.2 మి.గ్రా. విటమిన్- బి6 కొద్దిగా థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటివికూడా ఉంటాయి. కార్టినాయిడ్స్, పాలీఫి నాల్స్ వంటి ఫైటో రసాయనాలు కూడా ఉన్నాయి.
కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంచుతుంది. కళ్ల చుట్టూ నల్లటి రింగులు రావడం, కళ్లు ఉబ్బడం వంటి సమస్యలకు, బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూస్ చేసి, దాన్ని దూదిలో ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకుంటూ కొదిరోజులు చేస్తే ఆ నల్లని వలయాలు మటుమాయం.
ఈ దుంప రసంతో రోజూ ముఖాన్ని కడిగితే ముడతలు తగ్గుతాయి. ముఖంపై తెల్లమచ్చల్లాంటివి కూడా చెప్పకుండా నే పోతాయి. ఆంధ్రా ఎండలకు చర్మం కమిలిపోతే ,చర్మానికి బంగాళాదుంప రసం అమోఘంగా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది.
బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసి,దాన్ని ముఖానికి రాసి అర్థగంట ఉంచాలి. చర్మం మధుత్వం పెరిగి, రంగు కూడా వస్తుంది. చర్మంపై జిడ్డును కూడా తగ్గిస్తుంది
బీట్రూట్
దీని రూటే వేరు. ఇది చూట్టానికి ముదురు ఎరుపు రంగులో ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. సలాడ్, సూపు, కూర చేసుకుంటారు. దీన్ని కోసేప్పుడే దీని ఎర్ర రంగు చేతులకు అంటుకుంటుంది. ఏ వంటలో వాడినా దీని అస్థిత్వం మారదు.
రక్తపోటు తగ్గిస్తుంది, మల బధ్ధకం క్యాన్సర్లను నివారిస్తుంది. కాలేయాన్ని కాపాడుతుంది. మూత్రంద్వారా శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగి స్తుంది.
మ్యాంగనీస్, పోటాషియం, ఫాస్పరస్, పీచుపదార్థాలు, ఐరన్, బి.6 విటమిన్ ఉన్నాయి. జీర్ణశక్తి పెరిగి, వాతం తగ్గుతుంది. రక్తహీనత దరిచేరదు.
బీట్రూట్లో నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రిట్స్గా మార్చబడి, దాన్ని నైట్రిక్ ఆక్సైడ్ అంటాం. ఇది ధమనులను వెడల్పు చేసి, రక్తపోటును తగ్గింస్తుంది. పరిశోధకులు రోజూ 500 గ్రా. బీట్రూట్ ఏ రూపంలోనైనాసరే తీసుకొంటే ఆరు గంటల్లో ఆ వ్యక్తి రక్త పీడనం తగ్గిస్తుందని కనుగొన్నారు. పెద్దలు చెప్తే వినం, పరిశోధకులు చెప్తేనే చెవికెక్కేది మరి!
'చెడు' కొలెస్ట్రాల్ నుతగ్గిస్తుంది. బీట్రూట్లో కరిగే ఫైబర్లు, ఫ్లవానోఇడ్స్, బేటాచ్యనిన్ ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్ ఎర్రగా ఉండను బేటాచ్యనిన్ కారణం. కొలెస్ట్రాల్ ధమని గోడలపై నిల్వ ఉండకుండా చూస్తుంది. గుండెపోటు, స్ట్రోక్‌ల నుండి గుండెను రక్షిస్తుంది. బీట్రూట్లో సిలికా ఖనిజం ఉండటాన కాల్షియం ఉత్పత్తి జరుగుతుంది. ఎముకలు, దంతాల పెరుగుదలకు, గట్టిదనానికీ కూడా కాల్షియం అవసరం కదా!. ప్రతి రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే ఆస్టియోఫ్లోరోసిస్, పెళుసు ఎముక వ్యాధి వంటివి తగ్గిపోతాయి. భగవంతుడు ఇన్ని రకాల కాయకూరలు ఎందుకు సష్టించాడో తెలుసుకుంటే ఏ కూరగాయనూ వదలం. ఒక్కో శరీర భాగం బలానికి ఒక్కో కూరలో కావలసిన పోషకాలు నింపి మనకు భూమాత ద్వారా అందిస్తున్నాడు.
అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం బీట్రూట్ ఒక వ్యక్తి శక్తిని పెంచుతుంది. శరీర భాగాలకు ఆక్సిజన్‌ను అవసరం మేరకు అందిస్తుంది. ధమనులు కుంచించుకోకూండా చేయటాన రక్తపోటు రాదు. మరొక సిద్ధాంతం ప్రకారం బీట్రూట్లో ఐరన్ అధికంగా ఉండటాన సహనశక్తి మెరుగుపడుతుందని తేల్చారు.
బీట్రూట్లో పీచు ఉండటాన ఇది పెద్దప్రేగును శుభ్రపరచి ప్రేగు కదలికలకు సహాయంచేసి సుఖ విరోచనమై కడుపును శుభ్రపరుస్తుంది. మల బద్దకం మాయం.
బీట్రూట్ ఎలా వండినా రుచికరమే! బీట్ రూట్ ఆవకూర, ఫ్రైడ్ రైస్, చట్నీ, మిక్సెడ్ వెజిటబుల్ కూర ఎలా చేసినా తింటే చాలు ఎన్నో సమస్యలకు విరుగుడు!
కంద
కంద గడ్డ కొద్దిగా దురదతో కూడినపై తొక్కుతో ఉంటుంది. తెలుగు వారింత 'కందా బచ్చలి వండని, తినని కుటుంబాలే ఉండవు అనడం అతిశయోక్తికాదు. కూరగాయలలో కందకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అడవులలో తిరిగే మునులు ''కందమూలాలు'' తిని బతికేవారని చదివాం కదా! అంటే, అడవుల్లో నేలలో దొరికే దుంపలు, వేళ్లూ, తినేవారని అర్థం.
సంస్కతంలో కందని ''సూరణ'' అంటారు. మొలలు వ్యాధి ని పోగొడుతుందని దీనికి ''అర్శోఘ్న'' అన్న పేరు వచ్చింది. కంద గడ్డ చూడడానికి ఏనుగు పాదంలా ఉంటుందని దీనిని ఇంగ్లీషులో ఎలిఫెంట్ ఫుట్ యాం అంటారు. కంద దుంపకి ఒక నిర్దిష్టమైన ఆకారం లేకుండాపెరుగుతుంది.
కంద అనగానే గుర్తుకి వచ్చేది దురద. అందుకనే కందకు లేని దురద కత్తిపీటకెందుకో అనే సామెత వచ్చింది.
కందలో రెండు రకాలు ఉన్నాయి: (1) దురద కంద, (2) తియ్య కంద.
దురద కందని ముక్కలుగా కోసి, నీళ్లల్లో వండితే దురద పోతుంది.
కందను మజ్జిగలోనో, చింతపండు రసంలోనో ఉడికించి కూరచేస్తారు.
కంద దుంపలో ఉండే Calcium oxalate అనే రసాయనం కారణంగా కందకి ఆ దురద వచ్చింది.
క్యారెట్
తెలుగులో 'గాజరగడ్డ' అంటారు. కొన్ని ప్రాంతములలో క్యారట్, కారట్, క్యారట్ గడ్డ, ఎర్ర ముల్లంగి అని కూడా వ్యవహరిస్తారు.
నారింజ రంగులో ఉంటాయి. అయితే ఊదా, నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు రంగులలో కూడా ఇవినేడు లభ్యమవుతున్నాయి.
క్యారెట్ ఎక్కువ ఆల్ఫా- బీటా కెరోటిను కలిగి ఉంటుంది. విటమిన్ కె, విటమిన్ బి6 లు కూడా అందిస్తుంది. రేచీకటి తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.
తరిగి, ఉడికించి, వేయించి, సూప్ లాగానూ, పులుసు, సాంబారు, పాయసం, వడ, ఇడ్లీ, ఉప్మా, క్యారెట్ రైస్, దోసెవంటి వంటల్లో వాడుతాం. చిన్నపిల్లలకు కూడా క్యారెట్ సూపు మెత్తగా చేసి పట్టించవచ్చు.
పచ్చి క్యారెట్, ముల్లంగితో కలిపి తురిమి నిమ్మ, కొంచెం ఉప్పు కలిపి ఉదయాన్నే ఒక చిన్న కప్పు మొతాదు తింతే చాలా మంచిది.
సలాడ్లుగా, ఫ్రేడ్ రైస్ లోనూ మిక్సెడు వెజిటబుల్ కర్రీగానూ వండుతారు. క్యారెటు హల్వా తింటే తప్ప రుచి వర్ణించలేము. క్యాబేజీ క్యారెట్ కూర రుచే రుచి.
క్యారెట్లలో పోషకాల గురించీ
క్యారెట్లు 88 శాతం నీరు, 9 శాతం కార్బోహైడ్రేట్లు, 0.9 శాతం ప్రోటీన్, 2.8 శాతం డైటరీ ఫైబర్, 1 శాతం యాష్, 0.2 శాతం కొవ్వు వంటి పోషకాలు ఉంటాయి. క్యారెట్ డైటరీ ఫైబరు, సెల్యులోజు అధికం. హేమిసెల్యులోజ్, లిగ్నిన్, స్టార్చ్ తక్కువ నిష్పత్తిలో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెర పదార్ధాలు ఉంటాయి. కారెట్ రసం తాగడం వలన శరీరం మీది మచ్చలు తగ్గుతాయి.
కారెట్ ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ తగ్గించడములో సహకరిస్తుంది.
క్యారెట్ వివిధ రకల పోషకాలు, అనామ్లజనకాలు, విటమిన్ సి కలిగి ఉండటాన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మానవుడికి భగవంతుడు ప్రకతి ద్వారా ప్రసాదించిన అపురూపమైన వరాలే ఈ దుంపలు. కేవలం అన్నంలో తినడమే కాక వివిధ రూపాల్లో తగినంతగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ తగుపాళ్ళలో లభిస్తాయి. ఇదే అసలైన ఉత్తమ జీవన విధానమని పకతి వైద్యుల నమ్మకం. మన పూర్వులు, ముఖ్యంగా అడవుల్లో తపస్సు చేసుకునే మునులు కేవలం ఈ దుంపలను మాత్రమే తిని వందల సంవత్సరాలు భగవధ్యానంలో జీవిచండంలోని అంతరార్థం ఇదే మరి. మనం మునుల్లా, ఋషుల్లా కాకపోయినా మాన్య జనుల్లా ఆదర్శంగా ఆరోగ్యంగా సుఖ జీవనం సాగిద్దామా!
- ఆదూరి హైమావతి
9632503483